సర్వే కోసం వెలసిన ఇళ్లు!
- ఒకే రోజులో 18 ఇళ్ల నిర్మాణం
- కర్ణాటకలోనూ వారికి ఇళ్లు
- ఇక్కడే ఉంటామంటున్న లబ్ధిదారులు
- దిక్కు తోచని అధికారులు
కోహీర్: సర్వే సమయంలో ఇంటి వద్ద లేకుంటే సంక్షేమ పథకాలు అందవేమోననే ఆందోళనతో ఇతర ప్రాంతాల్లో ఉన్న జిల్లా ప్రజలు స్వస్థలాలకు క్యూ కట్టారు. కర్ణాటక తదితర ప్రాంతాలకు వలస వెళ్లిన ప్రజలు భారీ సంఖ్యలో సర్వేలో పాల్గొన్నారు. కర్ణాటకలోని బోనస్‌పూర్ తండాలో నివాసముంటున్న 18 మంది రైతులకు కోహీర్ మండలంలోని సిద్దాపూర్ తండా శివారులో వ్యవసాయ పొలాలు ఉన్నాయి. ఈ రెండు తండాల మధ్య కేవలం నాలుగు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. వారు ప్రతి రోజూ ఇక్కడకు వచ్చి పొలం పనులు చూసుకొని సాయంత్రానికి స్వగ్రామానికి వెళుతుంటారు.
వారు నివాసముంటున్న బోనస్‌పురం తండాలోనూ, పొలం ఉన్న సిద్దాపురం తండాలోను ఓటు హక్కు, రేషన్ కార్డులను కలిగి ఉన్నారు. ఇరుప్రాంతాల్లోను వారు ప్రభుత్వ పథకాలను అనుభవిస్తున్నారు. ఎన్నికల సమయంలో కొందరు నాయకులు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ తంతు గత 25 ఏళ్లుగా జరుగుతున్నా ఇంత వరకు ఏలాంటి చర్యలు తీసుకొన్న దాఖలాలు లేవు. ఈ సారి ప్రభుత్వం చేపట్టిన సర్వేతో వారిలో చలనం మొదలైంది. దీంతో వారు ఒక్కరోజులోనే 18 పూరిళ్ల నిర్మాణం చేపట్టారు. చెట్ల కొమ్మలు, పైన రేకులతో ఇళ్లు తయారయ్యాయి.
డోరు నంబర్లు వేసే సమయంలో లేని ఇళ్లు ఎలా వచ్చాయబ్బా అంటూ అధికారులు తలలు పట్టుకొన్నారు. రేషన్, ఆధార్ కార్డులు ఉన్నందున తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందే నని రైతులు, డిమాండ్ చేశారు. ఒక్కరోజులో పచ్చి కొమ్మలతో కచ్చాగా నిర్మించిన ఇళ్లను పరిగణలోకి తీసుకోవాలో లేదో తెలియక అధికారులు అమోమయానికి గురయ్యారు. స్థానికులు సర్వే చేయాల్సిందేనని వారికి వంతపాడారు. దీంతో సర్వే పూర్తయింది. వారు ఇక్కడ ఎన్నాళ్లుంటారో వేచిచూసి నిర్ణయం తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. తాము ఇక్కడే ఇళ్లు నిర్మించుకొని ఉంటామని రైతులు పేర్కొన్నారు.