రుణమాఫీ పథకంలో స్పష్టత కొరవడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యువరైతు ప్రభాకర్ బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ ఎక్కారు.
కోహీర్ : రుణమాఫీ పథకంలో స్పష్టత కొరవడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యువరైతు ప్రభాకర్ బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ ఎక్కారు. ఈ సంఘటన మండలంలోని బిలాల్‌పూర్ గ్రామం లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. రెండు గంటల పాటు ఉత్కంఠ రేపిన సంఘటన చివరికి పోలీసుల జోక్యంతో ప్రశాంతంగా ముగిసింది. వివరాలు యువ రైతు ప్రభాకర్ మాటల్లోనే.. ‘నాపేరు కాసుబాగుల ప్రభాకర్. తల్లి పేరు మాణ్యమ్మ. నా తల్లి పేరిట 340 సర్వే నంబరులో 2.20 ఎకరాల పొలం ఉంది.
పొలంపై తీసుకున్న పంట రుణం రూ. 50 వేలు గత మార్చి నెలలో తీర్చా. రుణాలు కట్టిన వారికి సైతం రుణ మాఫీ వర్తింప చేస్తామని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినా.. ప్రస్తుతం విడుదల చేసిన రుణమాఫీ జాబితాలో నా తల్లి పేరు లేదు. సకాలంలో రుణం చెల్లించినప్పటికీ రీషెడ్యూల్ చేయడం లేదు. రుణ మాఫీ జాబితాలో పేర్లున్న రైతులను సైతం బ్యాంకు అధికారులు పట్టించుకోవడం లేదు. రుణమాఫీ పథకంపై ప్ర భుత్వం స్పష్టమైన ప్రకటన చేయా లి. గ్రామంలో ఉపాధి పథకం, ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణంలో అనేక అక్రమాలు జరిగాయి.. విచారణకు చర్యలు తీసుకోవాలి.
ఉన్నత చదువులు చదవిన యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు, తక్కువ చదువు చదవిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి’ అని డిమాండ్ చేశారు. అంతకు ముందు సమాచారం అందుకున్న కోహీర్ ఏఎస్‌ఐ యూసుఫ్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మైకు ద్వారా టవర్‌పైన ఉన్న ప్రభాకర్ తో మంతనాలు జరిపారు. డిమాండ్లు అధికారుల దృష్టికి తీసికెళ్లి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని ఇచ్చిన హామీ మేరకు ప్రభాకర్ టవర్ దిగారు.