రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుకే..
రిటైరైన కింజరాపు ప్రభాకర్ గతంలోనే ఓఎస్డీగా నియామకం
రీజనల్ విజిలెన్స్ –ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిగా ప్రాధాన్యత పోస్టింగ్
నిబంధనలకు విరుద్ధంగా విశాఖలోనే నియామకం
విశాఖలో ప్రత్యర్థులే లక్ష్యమంటున్న పోలీసు వర్గాలు
సాక్షి, అమరావతి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్న ప్రభాకర్‌కు రెడ్ బుక్ రాజ్యాంగం కీలకమైన పోస్టింగ్ ఇచ్చింది. అదీ నిబంధనలకు విరుద్ధంగా విశాఖలోనే పోస్టింగ్ వచ్చేసింది. వడ్డించేవాడు మనవాడే కాబట్టి నిబంధనలు అంగీకరించకపోయినా పోస్టింగు వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్‌లో డీఎస్పీ స్థాయి అధికారిగా ఉన్న కింజరాపు ప్రభాకర్‌కు ఆయన రిటైర్మెంట్‌కు ఒక రోజు ముందు అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించింది.
అంటే డీఎస్పీకంటే పెద్ద స్థాయిలో మరునాడే రిటైరయ్యారు. రిటైరైన తరువాత ఆయనకు ప్రభుత్వం విజిలెన్స్ – ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో ప్రత్యేక అధికారి (ఓఎస్డీ)గా ఇటీవల పోస్టింగు ఇచ్చింది. ప్రభుత్వం శుక్రవారం ఇచ్చిన ఉత్తర్వుల్లో అసలు కుట్ర బయటపడింది. అచ్చెన్నాయుడు అన్నకు అత్యంత ప్రాధాన్యత ఉన్న పోస్టు కట్టబెట్టింది. సాధారణంగా ఓఎస్డీ అంటే ప్రధాన కార్యాలయంలో శాఖాధిపతి వద్ద పోస్టింగు ఇస్తారు. శాఖాధిపతి పనుల ఒత్తిడిని తగ్గించేందుకు ఇలా ఎవర్నైనా ప్రత్యేకంగా నియమిస్తారు.
కానీ కింజరాపు ప్రభాకర్‌కు మాత్రం విజయవాడలోని విజిలెన్స్–ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కేంద్ర కార్యాలయంలో పోస్టింగు ఇవ్వలేదు. ఏకంగా విశాఖపట్నం ప్రాంతీయ విజిలెన్స్ – ఎన్‌పోర్స్‌మెంట్ అధికారి (ఆర్‌వీఈవో)గా పోస్టింగు ఇచ్చింది. విశాఖపట్నం ఆర్‌వీఈవోగా ఉన్న జి.శ్రీనివాసరావును ఒంగోలు ఆర్‌ఈవీవోగా బదిలీ చేసింది. ఒంగోలు ఆర్‌వీఈవోగా ఉన్న జె. కులశేఖర్‌ను ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఆర్‌వీఈవో పోస్టుల్లో సర్వీసులో ఉన్న అదనపు ఎస్పీ స్థాయి అధికారులనే నియమిస్తూ వచ్చారు. అందుకు విరుద్ధంగా రిటైరైన అధికారిని టీడీపీ కూటమి ప్రభుత్వం నియమించడం గమనార్హం. కేవలం చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా సాగిస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగం వేధింపు చర్యలను వేగవంతం చేసేందుకు కింజరాపు ప్రభాకర్‌ను విశాఖపట్నం ఆర్‌వీఈవోగా నియమించినట్టు తెలుస్తోంది.
విశాఖపట్నంలో అధికార పార్టీ నేతలు లక్ష్యంగా చేసుకున్న రాజకీయ ప్రత్యర్థుల వ్యాపార సంస్థలపై విజిలెన్స్ శాఖ ద్వారా తప్పుడు నివేదికలు ఇప్పించి, అక్రమ కేసులతో వేధించడమే ప్రభుత్వ ఉద్దేశమని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇందుకోసమే కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యుడైన ప్రభాకర్‌కు ప్రత్యేకంగా పోస్టింగు ఇచ్చినట్టు ఆ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment