కరుడుగట్టిన దొంగ బత్తుల ప్రభాకర్ స్కెచ్‌లు
రెండు భారీ దోపిడీలకు ప్రణాళిక
పట్టుకోబోయిన పోలీసులపై ప్రిజం పబ్ వద్ద కాల్పులు
ప్రభాకర్ నుంచి 3 పిస్టళ్లు, 451 తూటాలు స్వాధీనం
ఇంజనీరింగ్ కాలేజీల్లోనే చోరీలు చేస్తున్న ప్రభాకర్
మాదాపూర్ డీసీపీ వినీత్, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ నర్సింహ వెల్లడి
గచ్చిబౌలి: పోలీసులపై కాల్పులు జరిపిన కరడుగట్టిన నేరస్తుడు బత్తుల ప్రభాకర్ (28) త్వరలో మరో రెండు భారీ దోపిడీలకు ప్రణాళిక వేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ మధ్యకాలంలో అతడు ఇంజనీరింగ్ కాలేజీల్లో మాత్రమే చోరీలు చేస్తున్నట్లు చెప్పారు. గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌లో శనివారం రాత్రి సీసీఎస్ కానిస్టేబుళ్లపై కాల్పులు జరిపిన అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి నుంచి మూడు దేశీయంగా తయారైన పిస్టళ్లు, 451 తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు మాదాపూర్ డీసీపీ వినీత్, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ నర్సింహ తెలిపారు. ఆదివారం మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ‘రెండు తెలుగు రాష్ట్రాల్లో వాంటెడ్ నేరస్తుడిగా ఉన్న బత్తుల ప్రభాకర్ ప్రిజం పబ్‌కు శనివారం రాత్రి 7.30 గంటలకు వచ్చినట్లు సీసీఎస్ పోలీసులకు సమాచారం అందింది.
దీంతో హెడ్ కానిస్టేబుళ్లు వెంకట్ రెడ్డి, వీరస్వామి, ప్రదీప్‌రెడ్డిలు అక్కడికి వెళ్లి అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అంతలోనే ప్రభాకర్ తన జేబులోని పిస్టల్ తీసి రెండు రౌండ్లు కాల్పులు జరపగా, వెంకట్‌రెడ్డి పాదానికి బుల్లెట్ గాయమైంది. ప్రభాకర్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా ప్రదీప్‌రెడ్డి, వీరస్వామిలతోపాటు పబ్ బౌన్సర్లు కలిసి అతి కష్టంమీద పట్టుకున్నారు. ఆ సమయంలో అతడి నుంచి రెండు కంట్రీ మేడ్ పిస్టల్స్, 23 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నార్సింగిలోని అతడి నివాసం నుంచి మరో కంట్రీ మేడ్ పిస్టల్‌తో పాటు 7.6 ఎంఎం 451 బుల్లెట్లు, రూ.62 వేల నగదు, సెల్ ఫోన్, దోపిడీకి ఉపయోగించే పరికరాలు స్వాధీనం చేసుకున్నాం’ అని వివరించారు.
ఇంజనీరింగ్ కాలేజీలలోనే చోరీలు
ఏపీలోని పశ్చిమగోదావరి, వైజాగ్ ప్రాంతాలలో 2013 నుంచి ప్రభాకర్ చోరీలు చేస్తుండేవాడు. 66 కేసుల్లో జైలుకు వెళ్లాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో 23 కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. 21 చోరీల్లో రూ.2.5 కోట్లు కొల్లగొట్టాడు. జైలు నుంచి వచ్చిన తరువాత ఇంజనీరింగ్ కాలేజీల్లో మాత్రమే చోరీ చేస్తున్నాడు. గత డిసెంబర్‌లో మొయినాబాద్ పీఎస్ పరిధిలోని కేజీ ఇంజనీరింగ్ కాలేజీలో రూ.8 లక్షలు చోరీ చేశాడు. జనవరిలో వీజేఐటీలో రూ.16 లక్షలు దోచుకున్నాడు అని పోలీసులు తెలిపారు.
శత్రువును చంపేందుకు పిస్టల్స్ కొనుగోలు
వైజాగ్ సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు ఓ ఖైదీ బత్తుల ప్రభాకర్‌ను అవమానించటంతో అతడిని చంపేందుకు పిస్టల్స్‌ను కొన్నట్లు పోలీసులు తెలిపారు. అతడు త్వరలో రెండు పెద్ద దోపిడీలు చేసే ప్లాన్‌లో ఉన్నాడని చెప్పారు. బిహార్‌కు చెందిన అన్షు అనే వ్యక్తి ద్వారా పిస్టళ్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. నిందితుడిని పట్టుకున్న హెడ్ కానిస్టేబుళ్లను డీసీపీలు అభినందించారు. ప్రభాకర్‌కు సహకరించినవారి కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment