సెటిల్‌మెంట్లకు అడ్డాలుగా పోలీస్‌ స్టేషన్లు | Telangana High Court fires on police behavior | Sakshi
Sakshi News home page

సెటిల్‌మెంట్లకు అడ్డాలుగా పోలీస్‌ స్టేషన్లు

Jul 2 2025 6:07 AM | Updated on Jul 2 2025 6:07 AM

Telangana High Court fires on police behavior

పోలీసుల తీరుపై మరోసారి హైకోర్టు ఫైర్‌ 

కమిషనర్లు నెలకోసారైనా ఈ అంశంపై సమావేశం నిర్వహించాలి 

చట్టవిరుద్ధంగా వ్యవహరించే వారిపై తీవ్ర చర్యలు తీసుకోవాల్సిందే 

ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ వినోద్‌కుమార్‌ మండిపాటు

సాక్షి, హైదరాబాద్‌: సెటిల్‌మెంట్లకు అడ్డాలుగా పోలీస్‌స్టేషన్లు మారాయని.. సివిల్‌ పంచాయితీలకు కేంద్రాలుగా వాటిని మార్చారని పోలీసుల తీరుపై హైకోర్టు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. సివిల్‌ వివాదాల్లో తలదూర్చొద్దని చెప్పినా బెదిరింపులకు దిగుతూ ఏదో ఒక క్రిమినల్‌ కేసు నమోదు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మంగళవారం ఓ కేసు విచారణ సందర్భంగా మండిపడింది. సివిల్‌ వివాదాల్లో తలదూరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, అవి ఇతరులకు తెలిసేలా నెలకోసారి సమావేశాలు నిర్వహించి చెప్పాలని ఉన్నతాధికారులు, పోలీస్‌ కమిషనర్లను ఆదేశించింది. 

ఇదీ నేపథ్యం.. 
మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా నాగోల్‌ బండ్లగూడలోని తన ఇంటి విషయంలో పోలీసులు జోక్యం  చేసుకుంటున్నారని.. స్టేషన్‌కు పిలిపించి నకిలీ కేసులు సృష్టించారని.. రూ. 55 లక్షలు చెల్లించి ఇంటిపై ఉన్న సివిల్, క్రిమినల్‌ కేసులను పరిష్కరించుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని పి. సుదర్శనం అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తెల్లవారుజాము నుంచి రాత్రి 9:30 వరకు స్టేషన్‌లో ఉంచి భయబ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. సమస్యను పరిష్కరించుకోకుంటే జైలుకు పంపాల్సి వస్తుందని హెచ్చరించారని పిటిషన్‌ పేర్కొన్నారు.

సివిల్‌ కోర్టులో పెండింగ్‌లో ఉన్న వివాదంలో పోలీసులు జోక్యం చేసుకోవడం చట్టవిరుద్ధమని.. దీనిపై పోలీసులకు తగిన ఆదేశాలివ్వాలని కోరారు. గత విచారణ సందర్భంగా కోర్టుకు హాజరుకావాలని రాచకొండ సీపీ జి.సు«దీర్‌బాబు, నాగోల్‌ సీఐని ఆదేశించడంతో మంగళవారం సీపీ ఆన్‌లైన్‌లో, సీఐ నేరుగా విచారణకు హాజరయ్యారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ తడకమల్ల వినోద్‌కుమార్‌ మరోసారి విచారణ చేపట్టారు. 

సీపీకి కోర్టు సూచనలు 
ఈ సందర్భంగా సీపీకి న్యాయమూర్తి పలు సూచనలు చేశారు. ఇకపై సివిల్‌ వివాదాల్లో పోలీసులు తలదూర్చకుండా నెలవారీగా సమావేశం నిర్వహించాలని.. ఎవరైనా అలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సందేశం ఇవ్వాలని సూచించారు. కోర్టులో వివాదం పెండింగ్‌లో ఉన్నా.. ఇంజక్షన్‌ ఉత్తర్వులు ఉన్నా పోలీసుల జోక్యంతో పిటిషన్లు హైకోర్టుకు వస్తున్నాయన్నారు. మూడు రోజుల క్రితం ఓ పోలీసు నడిరోడ్డుపై ఒకరిని కొట్టడం చూశానని.. కానీ ప్రొటోకాల్‌ కారణంగా తాను కారులోంచి కిందకు దిగలేకపోయానని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. వ్యక్తులను కొట్టే అధికారం ఏ చట్టంలో ఉందని ప్రశ్నించారు. అలాంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సీపీకి స్పష్టం చేశారు.

సివిల్‌ వివాదాల్లో పోలీసుల జోక్యానికి సంబంధించి న్యాయస్థానాల ఆదేశాలను పోలీసుల స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌వోపీ)లో చేర్చడంతోపాటు ఎస్‌వోపీలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని డీజీపీకి సూచించారు. దీంతో న్యాయస్థానం సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని సుధీర్‌బాబు చెప్పారు. అనంతరం ప్రభుత్వం తరఫున జీపీ మహేశ్‌రాజే వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జూన్‌ 19న తనను నిర్బంధించారని పిటిషనర్‌ చెబుతున్నందున.. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సీసీ టీవీ ఫుటేజీని కోర్టుకు అందజేయాలని పోలీసులను ఆదేశించారు. అప్పుడే పిటిషనర్‌ను రోజంతా స్టేషన్‌లో ఉంచారా? లేదా? అనేది తేటతెల్లమవుతుందన్నారు. సీసీ ఫుటేజీ సమర్పణపై వివరాలు తెలుసుకొని చెప్పేందుకు ఒకరోజు సమయం కావాలన్న జీపీ విజ్ఞప్తిని న్యాయమూర్తి తోసిపుచ్చుతూ విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement