The loan waiver scheme
-
రుణమాఫీ కోరుతూ టవరెక్కిన యువరైతు
కోహీర్ : రుణమాఫీ పథకంలో స్పష్టత కొరవడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యువరైతు ప్రభాకర్ బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కారు. ఈ సంఘటన మండలంలోని బిలాల్పూర్ గ్రామం లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. రెండు గంటల పాటు ఉత్కంఠ రేపిన సంఘటన చివరికి పోలీసుల జోక్యంతో ప్రశాంతంగా ముగిసింది. వివరాలు యువ రైతు ప్రభాకర్ మాటల్లోనే.. ‘నాపేరు కాసుబాగుల ప్రభాకర్. తల్లి పేరు మాణ్యమ్మ. నా తల్లి పేరిట 340 సర్వే నంబరులో 2.20 ఎకరాల పొలం ఉంది. పొలంపై తీసుకున్న పంట రుణం రూ. 50 వేలు గత మార్చి నెలలో తీర్చా. రుణాలు కట్టిన వారికి సైతం రుణ మాఫీ వర్తింప చేస్తామని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినా.. ప్రస్తుతం విడుదల చేసిన రుణమాఫీ జాబితాలో నా తల్లి పేరు లేదు. సకాలంలో రుణం చెల్లించినప్పటికీ రీషెడ్యూల్ చేయడం లేదు. రుణ మాఫీ జాబితాలో పేర్లున్న రైతులను సైతం బ్యాంకు అధికారులు పట్టించుకోవడం లేదు. రుణమాఫీ పథకంపై ప్ర భుత్వం స్పష్టమైన ప్రకటన చేయా లి. గ్రామంలో ఉపాధి పథకం, ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణంలో అనేక అక్రమాలు జరిగాయి.. విచారణకు చర్యలు తీసుకోవాలి. ఉన్నత చదువులు చదవిన యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు, తక్కువ చదువు చదవిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి’ అని డిమాండ్ చేశారు. అంతకు ముందు సమాచారం అందుకున్న కోహీర్ ఏఎస్ఐ యూసుఫ్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మైకు ద్వారా టవర్‌పైన ఉన్న ప్రభాకర్ తో మంతనాలు జరిపారు. డిమాండ్లు అధికారుల దృష్టికి తీసికెళ్లి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని ఇచ్చిన హామీ మేరకు ప్రభాకర్ టవర్ దిగారు. -
రుణమాఫీకి ‘ఆధార్’ తప్పనిసరి
ఖమ్మం జెడ్పీసెంటర్: బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న రుణాలను ప్రభుత్వం తిరిగి చెల్లిం చేందుకు బ్యాంకుఖాతాలకు ఆధార్‌నంబర్‌ను అనుసంధానం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి తెలిపారు. రుణమాఫీ పథకం లబ్ధిదారుల జాబితా, ఈజీఎస్ కూలీల వేతనాలు, పెన్షన్ తదితర వివరాలపై ఆర్డీవోలు, ఎంపీడీవోలు, బ్యాంక్ మేనేజర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పది రోజు ల్లో రైతుల ఖాతాలకు ఆధార్ సీడింగ్ పూర్తి చేయాలని సూచించారు. ఆధార్ అనుసంధానం అయితేనే రైతులకు రుణమాఫీ వర్తిస్తుందని చెప్పారు. అర్హులైన రైతులందరికీ ప్రయోజనం కలగాలనే ఉద్దేశంతోనే ఆధార్‌ను అనుసంధానం చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈజీ ఎస్ వేతనాలు, పెన్షన్లను ఆన్లైన్లోనే చెల్లిం చేందుకు ఆధార్‌ను అనుసంధానించాలన్నారు. బ్యాంక్ అకౌంట్ నెంబర్‌తోపాటు ఐఎఫ్ఎస్సీ కోడ్‌ను ఆధార్‌కు అనుసంధానం చేయాలన్నారు. సమగ్ర సర్వే మాదిరిగా పీఎం జన్‌ధన్ యోజన డ్రైవ్ చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లాలో బ్యాంకు ఖాతాలు లేని ప్రజలకు జీరో బ్యాలెన్స్‌తో అకౌంట్లు తెరుస్తారన్నారు. పంచాయతీల వారీగా ఆధార్ ఉన్నవారు లేనివారిని వేర్వేరుగా విభజించి ఆధార్‌కార్డులు కలిగిన వారికి బ్యాంకు ఖాతాలు తెరిపిస్తామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జేడీఏ భాస్కర్‌రావు, ఎల్డీఎం శ్రీనివాస్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసనాయక్ పాల్గొన్నారు. -
ఏమిటీ రుణమాఫీ విషయంలో మెలిక!
సాక్షి, ఏలూరు : అనుకున్నట్టే అయ్యింది. చంద్రబాబు మరోసారి రైతులను నమ్మించి నిలువునా ముంచేశారు. రుణమాఫీ పథకంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లారు. పంట రుణాలు, బంగారంపై తీసుకున్న వ్యవసాయ రుణాలలో ఏదో ఒకదానినే మాఫీ చేస్తామని.. అదికూడా రూ.లక్షన్నర వరకే మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం చేసిన ప్రకటనపై జిల్లాలోని అన్నదాతలు మండిపడుతున్నారు. అదికూడా ఎప్పటిలోగా చేస్తామనే విషయూన్ని చెప్పకపోవడంపై నిప్పులు చెరుగుతున్నారు. వనరులు సమకూరాక చేస్తామనడం ద్వారా ఇప్పట్లో రుణమాఫీ చేసే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని రైతులు 21 లక్షల 300 అకౌంట్ల ద్వారా దాదాపు రూ.12,773.85 కోట్లను వ్యవసాయ రుణాలుగా తీసుకున్నారు. అవి మాఫీ అయ్యేరోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు సోమవారం చేసిన ప్రకటనతో అన్నదాతలు కన్నీటిపర్యంతం అవుతున్నారు. మాఫీ కాని రుణంపై వడ్డీ భారం వ్యవసాయ రుణాలు చెల్లించాల్సిన గడువు ముగిసిపోయింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలు అందవు. 9 శాతం వడ్డీకి బ్యాం కులు రైతులకు రుణాలిస్తున్నాయి. గడువు ముగియడం వల్ల కేంద్రం ఇచ్చే 2శాతం తప్ప మిగిలిన 7శాతం వడ్డీని రైతులే భరించాలి. అదికూడా గడువు మీరితే 10.50 శాతం వడ్డీ పడుతుంది. లక్షన్నర వరకే మాఫీ చేయడం వల్ల మిగతా రుణంపై ఈ వడ్డీ భారం పడుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీనిపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. అయోమయంలో డ్వాక్రా రైతులను నట్టేట ముంచిన చంద్రబాబు డ్వాక్రా మహిళలను అయోమయంలో పడేశారు. ‘ఒక కుటుంబంలో ఎన్ని రుణాలున్నా ఒక్కదానికే మాఫీ’ అని చెబుతున్న చంద్రబాబు వ్యవసాయ రుణం మాఫీచేస్తే డ్వాక్రా రుణం మాఫీ చేస్తారో లేదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 6.45 లక్షల మంది సభ్యులతో 61,120 డ్వాక్రా సంఘాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకుల నుంచి డ్వాక్రా మహిళలు రూ.925 కోట్ల రుణాలు తీసుకున్నారు. వీరి పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. ఎన్నికల ముందు ఇలా చెప్పలేదే? వరి సాగు కోసం బంగారాన్ని బ్యాంక్‌లో పెట్టి రుణాలు తెచ్చుకున్నాం. రుణమాఫీ పథకం అమలైతే బంగారం చేతికి వస్తుందని ఆశించాం. కానీ ఇప్పుడు ఇంటికి ఒక్క రుణమే మాఫీ అంటున్నారు. బంగారంపై తీసుకున్న రుణానికి అధిక వడ్డీ చెల్లించక తప్పదేమో. ఎన్నికల ముందు చంద్రబాబు ఇలా చెప్పలేదు. పరిమితి విధించడం అన్యాయం తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చినట్టుగా రైతులు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేయాలి. రూ.లక్షన్నర పరిమితి విధించడం అన్యాయం. కొత్త రుణాలు పొందాలంటే పాత రుణాలు తిరిగి చెల్లించాలంటున్నారు. ప్రభుత్వం తక్షణమే రుణమాఫీ అమలుకు చర్యలు చేపట్టాలి. -జక్కం వెంకటేశ్వరరావు, కొఠాలపర్రు