సాక్షి, ఏలూరు : అనుకున్నట్టే అయ్యింది. చంద్రబాబు మరోసారి రైతులను నమ్మించి నిలువునా ముంచేశారు. రుణమాఫీ పథకంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లారు. పంట రుణాలు, బంగారంపై తీసుకున్న వ్యవసాయ రుణాలలో ఏదో ఒకదానినే మాఫీ చేస్తామని.. అదికూడా రూ.లక్షన్నర వరకే మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం చేసిన ప్రకటనపై జిల్లాలోని అన్నదాతలు మండిపడుతున్నారు.
అదికూడా ఎప్పటిలోగా చేస్తామనే విషయూన్ని చెప్పకపోవడంపై నిప్పులు చెరుగుతున్నారు. వనరులు సమకూరాక చేస్తామనడం ద్వారా ఇప్పట్లో రుణమాఫీ చేసే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని రైతులు 21 లక్షల 300 అకౌంట్ల ద్వారా దాదాపు రూ.12,773.85 కోట్లను వ్యవసాయ రుణాలుగా తీసుకున్నారు. అవి మాఫీ అయ్యేరోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు సోమవారం చేసిన ప్రకటనతో అన్నదాతలు కన్నీటిపర్యంతం అవుతున్నారు.
మాఫీ కాని రుణంపై వడ్డీ భారం
వ్యవసాయ రుణాలు చెల్లించాల్సిన గడువు ముగిసిపోయింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలు అందవు. 9 శాతం వడ్డీకి బ్యాం కులు రైతులకు రుణాలిస్తున్నాయి. గడువు ముగియడం వల్ల కేంద్రం ఇచ్చే 2శాతం తప్ప మిగిలిన 7శాతం వడ్డీని రైతులే భరించాలి. అదికూడా గడువు మీరితే 10.50 శాతం వడ్డీ పడుతుంది. లక్షన్నర వరకే మాఫీ చేయడం వల్ల మిగతా రుణంపై ఈ వడ్డీ భారం పడుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీనిపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు.
అయోమయంలో డ్వాక్రా
రైతులను నట్టేట ముంచిన చంద్రబాబు డ్వాక్రా మహిళలను అయోమయంలో పడేశారు. ‘ఒక కుటుంబంలో ఎన్ని రుణాలున్నా ఒక్కదానికే మాఫీ’ అని చెబుతున్న చంద్రబాబు వ్యవసాయ రుణం మాఫీచేస్తే డ్వాక్రా రుణం మాఫీ చేస్తారో లేదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 6.45 లక్షల మంది సభ్యులతో 61,120 డ్వాక్రా సంఘాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకుల నుంచి డ్వాక్రా మహిళలు రూ.925 కోట్ల రుణాలు తీసుకున్నారు. వీరి పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు.
ఎన్నికల ముందు ఇలా చెప్పలేదే?
వరి సాగు కోసం బంగారాన్ని బ్యాంక్‌లో పెట్టి రుణాలు తెచ్చుకున్నాం. రుణమాఫీ పథకం అమలైతే బంగారం చేతికి వస్తుందని ఆశించాం. కానీ ఇప్పుడు ఇంటికి ఒక్క రుణమే మాఫీ అంటున్నారు. బంగారంపై తీసుకున్న రుణానికి అధిక వడ్డీ చెల్లించక తప్పదేమో. ఎన్నికల ముందు చంద్రబాబు ఇలా చెప్పలేదు.
పరిమితి విధించడం అన్యాయం
తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చినట్టుగా రైతులు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేయాలి. రూ.లక్షన్నర పరిమితి విధించడం అన్యాయం. కొత్త రుణాలు పొందాలంటే పాత రుణాలు తిరిగి చెల్లించాలంటున్నారు. ప్రభుత్వం తక్షణమే రుణమాఫీ అమలుకు చర్యలు చేపట్టాలి. -జక్కం వెంకటేశ్వరరావు, కొఠాలపర్రు
ఏమిటీ రుణమాఫీ విషయంలో మెలిక!
Published Tue, Jul 22 2014 1:47 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement