- అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల మేరకు అర్హులందరికీ రుణమాఫీ చేస్తామని సీఎం చంద్రబాబు సోమవారం శాసనసభకు చెప్పారు. డ్వాక్రా సంఘాల్లోని మెంబర్‌కు రూ. 10 వేలు, ఉద్యానవన పంటలకు ఎకరాకు రూ.10 వేలు మాఫీ చేస్తామని ప్రకటించారు. మాఫీ చేసిన మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లిస్తుంటే రైతులు బాధపడుతున్నారని చెప్పారు. రూ. 50 వేల కంటే ఎక్కువ ఉన్న రుణాల విషయంలో పూర్తిగా చెల్లించడానికి రైతులు ముందుకొస్తే.. వన్‌టైం సెటిల్‌మెంట్ గురించి ఆలోచిస్తామన్నారు.
344 నిబంధన కింద రుణమాఫీపై జరిగిన చర్చలో సీఎం జోక్యం చేసుకుని మాట్లాడారు. విపక్ష నేత కేస్ స్టడీస్ చెప్పడంతో అధికార పక్షం ఉలిక్కిపడింది. ఈ సందర్భంగా సీఎం జోక్యం చేసుకుని, మాఫీ మార్గదర్శకాల్లో తప్పుంటే చెప్పాలని, కేస్ స్టడీస్ కాకుండా రియల్ స్టడీస్ చెప్పాలన్నారు. 2007 నుంచి 2013 డిసెంబర్ వరకు తీసుకున్న రుణాలను వడ్డీతో సహ మాఫీ చేస్తామని చెప్పారు.
ఇప్పటికే తొలి జాబితా ప్రకటించామని, రెండో జాబితా కూడా సిద్ధం చేశామన్నారు. ప్రతి రైతు వివరాలను కంప్యూటరీకరించామని, 5-6 బ్యాంకుల్లో రుణం తీసుకున్న రైతులకు రుణాలు మాఫీ చేయాలా? అని ప్రశ్నించారు. రూ. 50 వేల లోపు రుణం తీసుకున్న వారి రుణాలను మాఫీ చేశామన్నారు. రూ. 50 వేల కంటే ఎక్కువ రుణం తీసుకుంటనే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తిస్తుందని, అందువల్ల తక్కువ రుణం మాఫీ అవుతుందన్నారు.