‘రేపురా' మాదిరి రుణమాఫీ హామీ
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ
పెనుకొండ: రైతులు, డ్వాక్రా రుణాలను రద్దు చేస్తానని చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో చేసిన హామీ అమలు తీరు.. క్షుద్ర శక్తులకు భయపడిఇళ్ల గోడలపై ప్రజలు ‘రేపురా’ అని రాసుకున్న చందంగా ఉందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ ఎద్దేవా చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీపై ముఖ్యమంత్రి తొలిసంతకం చేసినా ఇప్పటి వరకూ అమలుకు నోచుకోలేదన్నారు. 20 శాతం బ్యాంకుల్లో జమ చేస్తామని చెప్పిన ఆయన మళ్లీ నిర్ణయాన్ని వాయిదా వేయడం అంతుబట్టని రహస్యమన్నారు. కేవలం రైతులను, డ్వాక్రా మహిళలను, చేనేతలను దగా చేయడానికే ఆయన నాటకాలు ఆడుతున్నారన్నారు.
ఇప్పటికే రైతుల్లో సహనం నశించి, చంద్రబాబు పాలనపై ఏవగింపు కలిగిందన్నారు. మంత్రి వర్గ సభ్యులు చంద్రబాబు మాటలను భుజాలకు ఎత్తుకుని రుణమాఫీపై పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారన్నారు. వీరి తీరు మారకపోతే రైతులు, డ్వాక్రా మహిళలు రోడ్డు ఎక్కి ఆందోళనలు చేపట్టే సమయం త్వరలోనే రానుందన్నారు. పింఛన్ల పంపిణీలో అనేక అవకతవకలు జరిగాయన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇందుకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు.
త్వరలోనే దీనిపై పార్టీ తరపున చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తామన్నారు. సమావేశంలో నాయకులు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నాగలూరు బాబు, ఎంపీటీసీ రామ్మోహన్‌రెడ్డి, రహంతుల్లా, గుట్టూరు శ్రీరాములు, సర్పంచ్‌లు శ్రీకాంతరెడ్డి, సుధాకరరెడ్డి, చలపతి, యస్‌బి.శీనా, ఇలియాజ్, ఇర్షాద్, బోయ నరసింహ, మునిమడుగు శ్రీనివాసులు, అమర్, వెంకటరామిరెడ్డి, కొండలరాయుడు, పూజిరెడ్డి, వెంకటేశు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.