నిజాం షుగర్స్‌కు..చేదు ముగింపేనా? | Nizam Sugars | Sakshi
Sakshi News home page

నిజాం షుగర్స్‌కు..చేదు ముగింపేనా?

Published Sun, Nov 8 2015 3:11 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

నిజాం షుగర్స్‌కు..చేదు ముగింపేనా? - Sakshi

నిజాం షుగర్స్‌కు..చేదు ముగింపేనా?

తెలంగాణ ప్రాంతంలో చక్కెర పరిశ్రమకు పునాది వేస్తూ నిజాం పాలనా కాలంలో ఏర్పాటు చేసిన నిజాం షుగర్స్ లిమిటెడ్ మూసివేత అంచుకు చేరుకుంటోంది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అప్పగించడంపై దృష్టిపెట్టిన పాలకుల తెంపరితనం ఈ పరిశ్రమను కుదేలు చేసింది. మెల్లమెల్లగా నష్టాల బాట పట్టించి, ప్రైవేటుకు అప్పగించిన వైనం కళ్లముందే కనిపిస్తోంది. నిజాం షుగర్స్‌ను తిరిగి ప్రభుత్వ పరిధిలోకి తెస్తామన్న ప్రస్తుత పాలకుల మాటలూ నీటి మీద రాతలే అవుతున్నాయి. వెరసి పరిశ్రమ ఉద్యోగులు, రైతుల బతుకులు మాత్రం అతలాకుతలం అవుతున్నాయి.
 
 నిజాం కాలంలో..
 నిజాం పాలన కాలంలో 1934లో నిజామాబాద్ జిల్లా బోధన్ కేంద్రంగా ‘నిజాం షుగర్స్ లిమిటెడ్(ఎన్‌ఎస్‌ఎల్)’ను నెలకొల్పారు. పరిశ్రమకు అనుబంధంగా 17 వేల ఎకరాల్లో చెరకు సాగు చేసి ఈ పరిశ్రమ తన ప్రత్యేకతను చాటుకుంది. స్వాతంత్య్రానంతరం నిజాం షుగర్స్ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఎల్) ప్రభుత్వ రంగ సంస్థగా మారింది. తొమ్మిది చక్కెర తయారీ యూనిట్లు, శక్కర్‌నగర్ (నిజామాబాద్), మంభోజిపల్లి (మెదక్), చాగల్లు (పశ్చిమ గోదావరి)లో డిస్టిలరీలు, నాగార్జునసాగర్‌లో మెషినరీ డివిజన్‌తో అప్పట్లో దేశంలోనే పెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఇది పేరుగాంచింది. చక్కెర తయారీకే పరిమితం కాకుండా ఎన్‌ఎస్‌ఎల్ అనేక అనుబంధ పరిశ్రమలు నెలకొల్పింది.

బోధన్‌లో పశుదాణా కర్మాగారం, కార్బన్‌డయాక్సైడ్ యూనిట్, రైస్‌మిల్లులు, ఇథనాల్ తయారీ యూనిట్, హైదరాబాద్‌లో చాక్లెట్, పిప్పర్‌మింట్ తయారీ యూనిట్‌లను నెలకొల్పింది. సుమారు 10 వేల మందికి ప్రత్యక్షంగా, లక్షలాది మంది రైతులకు పరోక్షంగా ఉపాధి కల్పించింది. ఎన్‌ఎస్‌ఎల్ ఆలంబనగా రవాణా, హోటళ్లు తదితరాలపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవనం సాగించాయి. కాలక్రమంలో సంస్థ కార్యకాలాపాల్లో ప్రభుత్వ మితిమీరిన జోక్యం, అధికారుల అర్థం పర్థం లేని నిర్ణయాలు, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశ్రీత పక్షపాతం వెరసి ఎన్‌ఎస్‌ఎల్ ప్రైవేటీకరణకు దారి తీశాయి.

ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్య సంస్థగా ఆవిర్భవించినా... రైతు సంక్షేమం, ఫ్యాక్టరీ పునరుద్ధరణ దిశగా ఏనాడూ కార్యకలాపాలు జరగలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి నిజాం షుగర్స్‌ను తిరిగి టేకోవర్ చేసే ప్రయత్నం కొనసాగించినా... ఆయన మరణంతో అది నిలిచిపోయింది. కొద్దికాలం కింద సీఎం కేసీఆర్ ఎన్‌ఎస్‌ఎల్ పునరుద్ధరణకు హామీ ఇవ్వడంతో రైతులు ఆశతో ఉన్నారు. కానీ ప్రస్తుత సీజన్ (2015-16)లో చెరుకు క్రషింగ్ జరిగే పరిస్థితి లేకపోవడంతో తెలంగాణ వారసత్వ సంపదగా చెప్పుకునే నిజాం షుగర్స్ లిమిటెడ్ మూసివేత అంచున ఉన్నట్లు స్పష్టమవుతోంది.

 మితిమీరిన జోక్యం
 లాభాల బాటన పయనించిన నిజాం షుగర్స్ లిమిటెడ్ కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం పెరగడంతో క్రమంగా నష్టాల బాట పట్టిం ది. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు యూనిట్ల విస్తరణ, సామర్థ్యం పెంపు వంటివి చేపట్టి క్రమంగా నష్టాల ఊబిలో కూరుకుపోయిం ది. అనంతపురం జిల్లా హిందూపూర్‌లో చెరుకు సాగు లేని ప్రాంతంలో యూనిట్ స్థాపించడం... బొబ్బిలి, సీతానగరంలో నష్టాల్లో కూరుకుపోయిన ప్రైవేటు యూనిట్లను పునరుద్ధరించడం ఎన్‌ఎస్‌ఎల్ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసింది. అచ్చయ్యపేటలో కొత్త ప్లాంటు ఏర్పాటు, మెట్‌పల్లి, జహీరాబా ద్ యూనిట్ల సామర్థ్యం పెంపు వంటి నిర్ణయాలతో సంస్థ అప్పుల్లో కూరుకుపోయింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తెచ్చిన అప్పులపై వడ్డీలు, అధికారుల అర్థం లేని నిర్ణయాలు సంస్థను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయి. కాలక్రమంలో యూనిట్లు, డిస్టిలరీలు, మెషినరీ డివిజన్ ప్రైవేటుపరం అయ్యాయి.
 
 ఆస్తులు అన్యాక్రాంతం
 నిజామాబాద్ జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో 17 వేల ఎకరాల విస్తీర్ణంతో ఏర్పాటైన నిజాం షుగర్స్ ఆస్తులు హారతి కర్పూరంలా హరించుకు పోయాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వం సుమారు 14 వేల ఎకరాలు కేటాయించింది. మరికొంత భాగాన్ని ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం పేరిట స్వాధీనం చేసుకుంది. దీనికితోడు ఆక్రమణలు, అక్రమ అమ్మకాలతో ఇప్పుడు మిగిలింది సుమారు రూ.100 కోట్ల విలువ చేసే 200 ఎకరాలు మాత్రమే. ఇందులో బోధన్ పట్టణాన్ని ఆనుకుని ఉన్న భూమిని దక్కించుకునేందుకు కొందరు రాజకీయ నాయకులు, ప్రైవేటు వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
 
 ఆ పాపం చంద్రబాబుదే!
 నష్టాలను సాకుగా చూపుతూ అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్‌ఎస్‌ఎల్ ప్రైవేటీకరణ దిశగా పావులు కదిపారు. ఎన్‌ఎస్‌ఎల్‌ను గాడిన పెట్టేందుకు అవకాశముందంటూ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ ఇన్‌స్టిట్యూట్‌తో పాటు అధికారులు, నిపుణులు నివేదికలు సమర్పించినా.. రైతులు, పార్టీల నుంచి వ్యతిరేకత వచ్చినా ప్రైవేటీకరణకే మొగ్గు చూపారు. స్విస్ చాలెంజి పద్ధతిలో గోల్డ్‌స్టోన్ సంస్థ ఎన్‌ఎస్‌ఎల్‌ను నడిపేందుకు ఆసక్తి చూపింది. అయితే గణాంకాలను తారుమారు చేసి డెల్టా పేపర్ మిల్స్‌కు ఎన్‌ఎస్‌ఎల్‌ను అప్పగించేలా నాటి సీఎం చక్రం తిప్పారు.

చక్కెర రంగంలో పెద్దగా అనుభవం లేని సంస్థకు ఎన్‌ఎస్‌ఎల్‌ను కట్టబెట్టడం వెనుక చంద్రబాబుకు సొంత ప్రయోజనాలు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. చివరకు 51 శాతం ప్రైవేటు, 49 శాతం ప్రభుత్వ వాటాతో నిజాం షుగర్స్ లిమిటెడ్ కాస్తా... నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్‌డీఎస్‌ఎల్) పేరిట 2002 నవంబర్ ఒకటిన ప్రైవేటు- ప్రభుత్వ భాగస్వామ్య సంస్థగా అవతరించింది. శక్కర్‌నగర్ (బోధన్), ముత్యంపేట (మెట్‌పల్లి), మంభోజిపల్లి (మెదక్) యూనిట్లు ఎన్‌డీఎస్‌ఎల్ పరిధిలోకి వెళ్లాయి.

 నిబంధనలు తుంగలోకి
 పరిశ్రమను తిరిగి నిలబెడతామనే హామీతో ఎన్‌ఎస్‌ఎల్‌ను దక్కించుకున్న ప్రైవేటు భాగస్వామ్య సంస్థ డెల్టా పేపర్ మిల్స్ (డీపీఎం)... ఒప్పందంలో పేర్కొన్న అభివృద్ధి, వ్యాపార ప్రణాళికలను తుంగలో తొక్కింది. (ఎన్‌ఎస్‌ఎల్‌ను డీపీఎల్ ఏరకంగా మరింత నష్టాల్లోకి నెట్టిందనే వైనంపై సంస్థ విశ్రాంత ఉద్యోగులు కొందరు ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించినట్లు సమాచారం). రూ.187 కోట్లతో వ్యాపార ప్రణాళిక అమలు చేస్తామని పేర్కొన్నా అమలుకు నోచుకోలేదు. మెట్‌పల్లి, మంభోజిపల్లిలో రూ. 24 కోట్లతో డిస్టిలరీలను ఏర్పాటు చేస్తామని ప్రణాళికలో పేర్కొన్నారు. శక్కర్‌నగర్‌లో 20 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్‌ను నిర్మించినా మూలన పడింది. మంభోజిపల్లి, ముత్యంపేట (మెట్‌పల్లి)లో 15 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కో-జెన్ విద్యుత్ యూనిట్ల స్థాపన జరగలేదు. శక్కర్‌నగర్ (బోధన్), మంభోజిపల్లిలో క్రషింగ్ సామర్థ్యం పెంపునకు రూ. 22 కోట్లు వెచ్చించాల్సి ఉన్నా ఆ ఊసెత్తడం లేదు.

 బాగా తగ్గిన చెరకు సాగు
 ఎన్‌డీఎస్‌ఎల్‌కు 3 యూనిట్లను అప్పగించే నాటికి వాటి పరిధిలో 15 లక్షల టన్నుల చెరకు సాగవుతోంది. 13 ఏళ్ల పాటు ప్రైవేటు భాగస్వామ్య సంస్థ ఎన్‌డీఎస్‌ఎల్‌ను నడిపినా సాగు విస్తీర్ణంపై దృష్టి సారించలేదు. దీంతో ఆ 3 యూనిట్ల పరిధిలో చెరకు సాగు 2.13 లక్షల టన్నులకు తగ్గిపోయింది. అసలు చెరకు సాగును ప్రోత్సహించేందుకు రైతులకు రుణాలు, ప్రోత్సాహకాలు కల్పించకపోగా.. ఏకంగా రైతుల పేరిట ఐసీఐసీఐ బ్యాంకులో డీపీఎం బినామీ రుణాలు తీసుకుంది. ఈ విషయాన్ని ప్రభుత్వ విజిలెన్సు విభాగం ఆధారాలతో సహా బయట పెట్టింది.
 
 పునరుద్ధరణకు వైఎస్ చొరవ
 నిజాం షుగర్స్ ప్రైవేటీకరణలో చంద్రబాబు ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందన్న విషయాన్ని 12వ శాసనసభలో పలువురు సభ్యులు లేవనెత్తారు. దీంతో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దేవాదాయ మంత్రి రత్నాకర్‌రావు నేతృత్వంలో 17 మంది ఎమ్మెల్యేలతో కూడిన శాసనసభా సంఘాన్ని 2004లో ఏర్పాటు చేశారు. ఆ కమిటీ వివిధ వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించి విశ్లేషించింది. ఎన్‌ఎస్‌ఎల్‌ను క్రమపద్ధతిలో ఎలా ప్రైవేటుపరం చేశారనే అంశాన్ని 2006 ఆగస్టు 31న అసెంబ్లీకి సమర్పించిన నివేదికలో కళ్లకు కట్టింది. ఆ నివేదికను క్షుణ్ణం గా అధ్యయనం చేసిన నాటి సీఎం వైఎస్సార్ ఎన్‌ఎస్‌ఎల్‌ను తిరిగి ప్రభుత్వపరం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే వైఎస్ మరణం, ఆ తర్వాత రాజకీయ పరిణామాలు, రాష్ట్ర విభజన నేపథ్యంలో హౌజ్ కమిటీ సిఫారసులు నేటికీ అమలుకు నోచుకోలేదు.
 
 ‘ప్రైవేటు’కు చెరకు తరలింపు!
 ఎన్‌డీఎస్‌ఎల్ టేకోవర్ అంశం ఇప్పట్లో తేలే అవకాశం లేకపోవడంతో ఫ్యాక్టరీ పరిధిలోని చెరు కును సమీపంలోని ప్రైవేటు కర్మాగారాలకు తరలించేందుకు అధికారులు లోలోపల సన్నాహాలు చేస్తున్నారు. ధర విషయంలో ప్రైవేటు ఫ్యాక్టరీలు షరతులు విధిస్తుండటంతో చెరుకు తరలింపు ఆలస్యమవుతోంది. ఇన్నాళ్లూ ఎన్‌డీఎస్‌ఎల్ పరిధిలోని ఏదో ఒక యూనిట్ తెరుస్తామని, ప్రైవేటు ఫ్యాక్టరీలకు తాత్కాలికంగా లీజు పద్ధతిలో క్రషింగ్ చేస్తామని అధికార పార్టీ నేతలు, అధికారులు రకరకాల ప్రకటనలు చేస్తూ వచ్చారు. ఎన్‌డీఎస్‌ఎల్‌ను టేకోవర్ చేయాలంటూ ఆందోళన చేస్తున్న రైతులు, రైతు సంఘాలు ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయంపై ఆశతో ఎదురు చూస్తూ వచ్చారు. కానీ బకాయిల చెల్లింపు మినహా ఎన్‌డీఎస్‌ఎల్ టేకోవర్‌పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో తెలంగాణ వారసత్వ సంపద నిజాం షుగర్స్ లిమిటెడ్ శకం ముగిసినట్లే కనిపిస్తోంది.
 
 టేకోవర్‌పై మీనమేషాలు
 ఉమ్మడి రాష్ట్ర సీఎంలు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్‌డీఎస్‌ఎల్‌ను టేకోవర్ చేయడంపై పలు పర్యాయాలు హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదు. ఉద్యమంలో, 2014 ఎన్నికల సందర్భంగా నిజాం షుగర్స్‌ను ప్రభుత్వపరం చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ‘కమిటీ ఆఫ్ సెక్రటరీస్’ను ఏర్పాటు చేసి ఈ ఏడాది ఆగస్టులోగా నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. సంస్థ అప్పులు, ఆస్తుల మదింపు బాధ్యతను ఎస్‌బీఐ క్యాబ్స్ అనే ఏజెన్సీకి అప్పగించారు. ఎస్‌బీఐ క్యాబ్స్ నివేదిక సమర్పించిందా లేదా అనేదానిపై స్పష్టత లేదు. కార్యదర్శుల కమిటీ నివేదికపైనే ఎన్‌డీఎస్‌ఎల్ భవితవ్యం ఆధారపడి ఉందని మాత్రమే చెబుతున్నారు.
 
 చేతులెత్తేసిన భాగస్వామ్య సంస్థ
 ఒప్పందాలను తుంగలో తొక్కిన ప్రైవేటు భాగస్వామ్య సంస్థ డీపీఎం.. 2015-16 సీజన్‌లో చెరకు క్రషింగ్ చేయలేమంటూ చేతులెత్తేసింది. దీంతో ఎన్‌డీఎస్‌ఎల్ యూనిట్లను తాత్కాలికంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తూ చక్కెర శాఖ సర్కారుకు ప్రతిపాదనలు పంపింది. బ్యాంకులకు బాకీ పడిన రూ. 110 కోట్ల అప్పులపై ఎన్‌డీఎస్‌ఎల్ ప్రతి నెలా రూ.1.50 కోట్లు వడ్డీ చెల్లిస్తోంది. సరిగా చెల్లించకపోవడంతో వడ్డీ బకాయిలే రూ. 17 కోట్లకు చేరాయి. ఇక ఉద్యోగులకు రూ. 1.50 కోట్ల మేర వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంది. తక్షణమే ప్రభుత్వ ఆధీనంలో క్రషింగ్ ప్రారంభించేందుకు వడ్డీ, వేతన బకాయిలు, యంత్ర సామగ్రి ఓవర్ హాలింగ్, రైతులకు చెల్లించేందుకు సుమారు రూ.100 కోట్లు అవసరమవుతాయని అంచనా. ఢిల్లీకి చెందిన గ్లోబల్ షుగర్ కేన్ సర్వీసెస్‌కు కర్మాగారాల నిర్వహణ, చెరుకు సాగు విస్తీర్ణం పెంచే బాధ్యతను కమీషన్ ప్రాతిపదికన అప్పగించాలని చెక్కర శాఖ ప్రతిపాదించినా.. ప్రభుత్వం నుంచి స్పందన లేదు.           
- కల్వల మల్లికార్జున్‌రెడ్డి, సాక్షి ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement