రుణమాఫీ చేయాలి : తాతినేని
పెనమలూరు : రైతుల రుణమాఫీపై సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్‌చేశారు. ఖరీఫ్ సాగుకు చేతిలో రూపాయి లేక రైతులు అల్లాడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. వర్షాలు కురుస్తుండటంతో ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారని, ప్రభుత్వం స్పందించి రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
రైతులు సాగు ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక ముందే ప్రభుత్వం స్పందించి రుణమాఫీ చేసి కొత్త రుణాలు మంజూరుచేయించాలని కోరారు. సాగునీటి విడుదలపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన చేయకపోవడం సరికాదని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముందు చెప్పినట్లుగానే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేసి వెంటనే అమల్లోకి తీసుకొచ్చారని ఆమె గుర్తుచేశారు.
చంద్రబాబు రుణమాఫీపై సంతకం చేసి కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీ సాధ్యం కాదని తెలిసే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. తాను ఆర్థిక శాస్త్రం చదివానని చెప్పుకునే చంద్రబాబు తన ఆర్థిక చతురతతో వెంటనే రుణమాఫీ చేయాలని పద్మావతి డిమాండ్‌చేశారు.