‘నెట్టే’ట్లో ముంచారు
ఏలూరు :తొలి విడతలో రూ.50 వేల లోపు రుణాలు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం ఆ వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచినట్టు బ్యాంకులకు సమాచారం అందించింది. రైతులంతా ఆశతో వెబ్‌సైట్‌లను వెతుకుతుంటే గుండెలు గుభేల్‌మంటున్నాయి. సోమ, మంగళవారాల్లో జాబితాలను చూసుకున్న రైతులు అందులోని సమాచారమంతా మాయాజాలంగా ఉందని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు రూ.50 వేల రుణమాఫీకి ఎంతమంది రైతులు అర్హులనేది తేల్చడం అధికారులకు చిక్కుముడిగానే ఉంది.
ఈ వివరాలను నిగ్గు తేల్చేందుకు మూడు రోజులుగా అధికారులు, బ్యాంకర్లు కుస్తీ పడుతూనే ఉన్నారు. మొదటి దఫాగా రూ.50వేల లోపు రుణమాఫీ అయ్యే వారి సంఖ్య తక్కువగానే ఉంటుందని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన గణాంకాలను బయటకు వెల్లడిస్తే ప్రతిపక్షాలు ఎదురు దాడికి దిగుతాయనే భయం సర్కారును వెంటాడుతోంది. ఈ దృష్ట్యా ఇందుకు సంబంధించిన వివరాలను బయటకు పొక్కనివ్వొద్దంటూ బ్యాంకర్లకు ఆదేశాలు అందాయని చెబుతున్నారు. దీంతో రైతులు ఎవరికి వారు ఇంటర్నెట్ సెంటర్లు, నెట్ కనెక్షన్ అందుబాటులో ఉన్న వ్యక్తుల వద్దకు వెళ్లి వ్యక్తిగతంగా రుణమాఫీ సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో ఏ ఒక్క బ్యాంకు, సొసైటీల వద్ద రుణమాఫీ జాబితాలను రైతుల పరిశీలన కోసం పెట్టిన దాఖలాలు లేవు.
ఖాతాలతో కుస్తీ పడుతున్న డీసీసీబీ
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) 32 శాఖలతోపాటు, వాటి పరిధిలో 257 సొసైటీలు ఉన్నారుు. సొసైటీలు, డీసీసీబీ శాఖల ద్వారా రూ.50 వేల లోపు రుణమాఫీకి ఎంతమంది రైతులు అర్హుల య్యూరు, ఎంతమంది రైతులకు 20 శాతం మేర రుణమాఫీ అవుతుందనే గణాంకాలను తేల్చే పనిలో డీసీసీబీ ఉద్యోగులు నిమగ్నమయ్యూరు. డీసీసీబీ సీఈవో వీవీఎన్ ఫణికుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తోంది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఇచ్చిన సమాచారాన్ని ఎక్సెల్ ఫార్మాట్‌లోకి మార్పు చేసి, రైతుల ఆధార్ నంబర్ వారీగా వివరాలను క్రోడీకరిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నానికి ఈ కార్యక్రమం కొలిక్కి వచ్చే అవకాశం ఉందని డీసీసీబీ వర్గాలు చెబుతున్నారుు. డీసీసీబీ పరిధిలో 2 లక్షల మంది ఖాతాదారులు ఉండగా, వారికి రూ.954 కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వానికి గతంలోనే నివేదించారు. కాగా, లీడ్ బ్యాంకు పరిధిలోని 510 వాణిజ్య శాఖల బ్రాంచిలలో రుణమాఫీ గణాంకాలను క్రోడీకరించే పని మొదలు కాలేదు.