ఏలూరు సిటీ : ‘నవ్యాంధ్ర నయవంచకుడు చంద్రబాబు పాలనలో అభి వృద్ధి పడకేసింది. రైతులు, మహిళలు, అన్నివర్గాల ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. రుణాలు అందక, విత్తనాలు దొరక్క రైతులు ఆందోళనలో ఉన్నారు. మహిళలకు రుణాలు అందే పరిస్థితి లేదు. పింఛన్లు అందవు. విద్యార్థులకు ఫీజు పథకం అమలు కావటం లేదు. నిరుద్యోగ భృతి ఇస్తారని ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులు నిరాశ, నిస్పృహలో ఉన్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అభద్రతతో రాజధానిలో ఉండలేక విమానాల్లో తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారు’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ధ్వజమెత్తారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, పేదల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేపట్టారు.
నాయకులు, కార్యకర్తలు పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ఫైర్‌స్టేషన్ సెంటర్ వరకు ఎడ్లబళ్లపై ర్యాలీ చేశారు. అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టరేట్‌కు వెళ్లి ధర్నా చేశారు. ‘చంద్రబాబు తొలి సంతకం రైతన్నకే.. తొలి వంచన రైతన్నకే’, ‘అవినీతి సీఎంను తక్షణమే అరెస్ట్ చేయాలి’, ‘పట్టిసీమ వద్దు.. పోలవరం ముద్దు’, ‘రైతులకు విత్తనాలు.. ఎరువులు అందించి ఆదుకోవాలి’, ‘నిరుద్యోగులకు భృతి కల్పించాలి’ అని నినదిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు సొమ్ములిచ్చి వారిని కొనుగోలు చేసేం దుకు ప్రయత్నించిన టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అడ్డంగా దొరికిపోయారు.
ఫోన్‌లో మాట్లాడి సీఎం చంద్రబాబు ఇరుక్కున్నారు. తప్పులు మీరు చేసి మా నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై బురదచల్లేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోం. ఓటుకు నోటు వ్యవహారమంతా సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకే జరిగినట్టు రుజువైంది. ఫోన్ సంబాషణలు నావి కావు అని చెప్పే ధైర్యం మీకుందా చంద్రబాబూ’ అని నిలదీశారు. చంద్రబాబు తన సమస్యను రెండు రాష్ట్రాల సమస్యగా చిత్రీకరించి లబ్ధి పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని కొత్తపల్లి అన్నారు. ఖరీఫ్‌లో రైతులకు రుణాలు అందటం లేదని, డ్వాక్రా మహిళలకు రుణాలు ఇచ్చేం దుకు బ్యాంకులు నిరాకరిస్తున్నాయని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అంద డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ వంక రవీంద్ర మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ప్రత్యక్షంగా లంచం ఇస్తూ దొరికిపోతే ఏపీ ప్రభుత్వం సమర్థిస్తుందా అని ప్రశ్నించారు. కేంద్రం లోని ఎన్‌డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో ఉంటూ బీజేపీతో దోస్తీ చేస్తూ అన్యా యం జరిగిపోతోందని చంద్రబాబు రాద్ధాంతం చేయటం ఎంతవరకు న్యాయమో చెప్పాలన్నారు.
ప్రజలకు తాను జవాబుదారీగా ఉంటానని, ప్రభుత్వం తప్పుచేస్తే ప్రశ్నిస్తానని ఎన్నికల్లో చెప్పిన పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నారో తెలియటం లేదని, ఆయన ఎక్కడున్నా వచ్చి ప్రజల పక్షాన ప్రశ్నించాలని కోరారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ ఉద్యోగాలు, ఉపాధి లేక యువత ఇబ్బంది పడుతోందన్నారు. విద్యార్థులకు ఫీజు పథకం అమలు కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులోనూ సీఎం చంద్రబాబు ప్రమేయం ఉన్నట్టు స్పష్టమైనా.. తాను నిప్పులాంటి మనిషినని చెప్పుకునేందుకు సిగ్గులేదా అని ప్రశ్నించారు. చంద్రబాబును అరెస్ట్ చేసి అండమాన్ జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. కొవ్వూరు నియోజకవర్గ కన్వీనర్ తానేటి వనిత మాట్లాడుతూ దొంగే దొంగ దొంగ అని అరిచి నట్టుగా చంద్రబాబు, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు అవినీతి ఊబిలో కూరుకుపోయి ప్రతిపక్షాన్ని విమర్శించటం హాస్యాస్పదమన్నారు.
పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా రుణం తీర్చుకోలేనంటూ సీఎం చంద్రబాబు జిల్లాకు అవినీతి మంత్రిని బహుమతిగా ఇచ్చారని ధ్వజమెత్తారు. మంత్రి ఇంట్లోనే రూ.10 లక్షలు దొరికితే అవి వేరే మహిళవని చెప్పి తప్పించారన్నారు. విజయవాడలో మంత్రి శాఖలో పనిచేస్తున్న ఉద్యోగిని స్వయంగా మంత్రి కోసమే లంచాలు తీసుకుంటున్నానని ఏసీబీకి చెప్పిందని గుర్తు చేశారు. ప్రజల సమస్యలు, వారి బాధలు వదిలేసి డబ్బు ఎలా సంపాదించాలో చంద్రబాబు తన కేబినెట్‌లోని మంత్రులకు నేర్పుతున్నారు. గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు మాట్లాడుతూ పంటకు గిట్టుబాటు ధరలేక, రుణాలు అందక అవస్థలు పడుతున్న రైతుల్ని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రైతులను పట్టించుకోకుంటే తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరిం చారు.
దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ కొఠారు రామచంద్రరావు మాట్లాడుతూ టీడీపీ నాయకులు నీరు-చెట్టు కార్యక్రమం పేరుతో మట్టిని అమ్ముకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. మట్టి, ఇసుక అక్రమ రవాణాతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కోట్లు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ఘంటా మురళీ రామకృష్ణ మాట్లాడుతూ రుణమాఫీ హామీ అమలుకాకపోవడంతో రైతులు తీసుకున్న సున్నా వడ్డీ రుణాలపై 13 శాతం వడ్డీ పెరిగిపోయిందన్నారు. పామాయిల్, వర్జీనియా పొగాకు రైతులు కష్టాల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం డీఆర్‌వో కె.ప్రభాకరరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్రి విశ్వనాథరెడ్డి (కాశిరెడ్డి), ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు, భీమవరం నియోజకవర్గ కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి కారుమంచి రమేష్, విద్యార్థి విబాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకలపల్లి డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు నవ్యాంధ్ర నయవంచకుడు
Published Fri, Jun 26 2015 2:52 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement