సమర సన్నాహాలు | Chandrababu Naidu Cheating On Farmers Loan Waiver | Sakshi
Sakshi News home page

సమర సన్నాహాలు

Published Tue, Dec 2 2014 12:48 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

సమర సన్నాహాలు - Sakshi

సమర సన్నాహాలు

 ఏలూరు (ఆర్‌ఆర్ పేట) :రైతులు తీసుకున్న పంట రుణాలు, మహిళల డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు పూటకో మాట చెబు తూ.. రోజుకో నిబంధన విధిస్తూ వారిని మోసగించడం అన్యాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు ఆళ్ల నాని ధ్వజమెత్తారు. రుణాలు మాఫీ చేయడానికి జోలె పట్టాలన్న ముఖ్యమంత్రి రైతులు, మహిళల ఆత్మ గౌరవాన్ని కించపరిచారని విమర్శించారు. ఈ నెల 5న పార్టీ ఆధ్వర్యంలో ఏలూరులో నిర్వహించనున్న మహా దర్నా కార్యక్రమానికి సమాయత్తంగా పార్టీ ముఖ్య నాయకులతో సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో నాని మాట్లాడుతూ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేయడానికైనా నిధులు లేవని.. నిధుల కోసం ఎర్ర చందనం అమ్ముతామని ప్రకటించి ప్రజల దృష్టి మరల్చుతోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేతిలో రైతులు, డ్వాక్రా మహిళలు దారుణంగా మోసపోయారన్నారు.
 
 జిల్లాలో మొత్తం అసెంబ్లీ, పార్లమెంటరీ స్థానాలను టీడీపీకి కట్టబెట్టిన ‘పశ్చిమ’ ప్రజల రుణం తీర్చుకోలేనని చంద్రబాబు చెబితే ప్రజలు ఏదో మాటవరుసకు అంటున్నాడనుకున్నారని, రుణమాఫీ చేయలేక ఈ మాట అన్నాడని ఇప్పుడు అర్థం చేసుకున్నారన్నారు. గత ఎన్నికల్లో అసత్య ప్రచారం, అబద్ధపు వాగ్దానాల వల్లే టీడీపీ గెలిచింది తప్ప, చంద్రబాబుపై నమ్మకంతో ప్రజలెవరూ ఆ పార్టీకి ఓటు వేయలేదని నాని గుర్తు చేశారు. ఇటీవల నియోజకవర్గ, మండల స్థాయిల్లో పార్టీ సమావేశాలు నిర్వహిస్తే రైతులు, మహిళలు అధిక సంఖ్యలో తరలి వచ్చి తమకు అండగా నిలవాలని కోరారని పేర్కొన్నారు. వారికోసమే ప్రభుత్వాన్ని నిలదాయడానికి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 5న ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారన్నారు. దొంగ నిద్ర నటిస్తున్న చంద్రబాబును నిద్రలేపి, మెడలు వంచడానికి నిర్వహించే ఈ ధర్నాకు రైతులు, మహిళలు, నిరుద్యోగులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.
 
 దీర్ఘకాలిక రుణాలను మాఫీ చేయలేనని ఒకసారి, కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ అని ఇంకోసారి, ఆధార్ కార్డులతో ఒకసారి, రేషన్ కార్డులతో అని మరోసారి లింకులు పెడుతూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు రుణాలు, వాటికి వడ్డీలు చెల్లించవద్దని చెప్పిన చంద్రబాబు బ్యాంకర్ల ద్వారా వారికి నోటీసులు పంపడాన్ని చూస్తే రైతులు, మహిళలపై న్న ఆయనకు గల ప్రేమను తెలియజేస్తోందన్నారు. కాగా, ఇటీవల ఏడాదికి ఒకసారి 20 శాతం చొప్పున రుణమాఫీ చేస్తామని ప్రక టించి రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారన్నారు. పంటలు వేసుకోవడానికి బ్యాంకర్లు కొత్త రుణాలివ్వడం లేదని, రుణాల రీ షెడ్యూల్ కూడా జరగకపోవడంతో ఎటూ పాలుపోలేని స్థితిలో రైతులంతా ఉన్నారన్నారు. ఇటువంటి విదానాలను ప్రజలు ఎల్లకాలం భరించే పరిస్థితి లేదన్నారు.
 
 ఎన్నికల వాగ్దానాల్లో ఒకటైన నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం హామీలపై ఇప్పటివరకూ చంద్రబాబు నాయుడు నోరెత్తకపోవడం, దానిపై ప్రణాళిక కూడా ప్రకటించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వచ్చే నెలలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జిల్లాలో పెద్దఎత్తున ఆందోళనా కార్యక్రమం నిర్వహించనున్నారన్నారు. రాష్ట్రాన్ని సింగపూర్‌గానో, జపాన్‌గానో మార్చాల్సిన అవసరం లేదని.. సరైన రాజధాని నిర్మిస్తే చాలని అన్నారు. అవసరమైతే రాజధాని నిర్మించడానికి తమ పార్టీకూడా సహకరిస్తుందన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు, మహిళలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండకోసం ఎదురు చూస్తున్నారని, వారికోసమే తమ పార్టీ అధినేత ధర్నా కార్యక్రమాన్ని రూపొందించారన్నాని అరు. పై-లీన్ తుపాను ప్రభావంతో నష్టపోయిన వారికి రూ.140 కోట్ల బీమా విడుదల కాగా, అందులో ఒక్కపైసా కూడా రైతులకు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
 
 ప్రస్తుతం రైతులకు బ్యాంకుల్లో రుణాలు లభించకపోవడంతో అధిక వడ్డీలకు ప్రైవేటు అప్పులు తెచ్చి పంటలు వేసుకుంటున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశా. రైతులు లేకపోతే ప్రజలు లేరనే విషయాన్ని చంద్రబాబు గుర్తించాలన్నారు. రైతులను మట్టి పిసుక్కోవాలని ఎగతాళి చేయడం చంద్రబాబుకు తగదని హితవు పలికారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ జిల్లా సహకార బ్యాంక్ రూ.40 కోట్ల లోటులో కూరుకుపోరుు రుణాలిచ్చే స్థితిలో లేదన్నారు.
 
 గతంలో ప్రభుత్వాలన్నీ 75 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం 25 శాతం మాత్రమే కొనుగోలు చేస్తోందన్నారు. రుణమాఫీ హామీలు అమలుకు నోచుకోకపోగా, పంటల బీమా సొమ్ము కూడా అందక పోవడంతో రైతులు పాలుపోని స్థితిలో ఉన్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం జిల్లాలో ఎన్ని గృహాలు మంజూరు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు ఇందుకూరి రామకృష్ణంరాజు, తోట గోపీ, ఘంటా మురళీ రామకృష్ణ, తానేటి వనిత, ఘంటా ప్రసాదరావు, పుప్పాల వాసుబాబు, చీర్ల రాధయ్య, తలారి వెంకట్రావు, పార్టీ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ధర్నాకు సంబంధించిన కరపత్రాలను పార్టీ నాయకులు విడుదల చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement