bsnl tower
-
ఫుల్‌గా తాగేసి.. పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు..!
ముంబై: అసలే కోతి, ఆపై కల్లు తాగినట్లు అనే నానుడి గుర్తుండే ఉంటుంది. మామూలుగానే కోతి చంచలమయిన జంతువు. ఇక అటుపై కల్లు తాగితే.. దాని ప్రవర్తన అత్యంత విచిత్రంగా, చుట్టు పక్కల విధ్వంసకరంగా ఉంటుంది. తాజాగా మద్యం తాగిన ఓ వ్యక్తి పోలీసులను ముని వేళ్లపై నిలబెట్టినంత పని చేశాడు. మద్యం మత్తులో ఏకంగా 300 అడుగుల ఎత్తున్న బీఎస్ఎన్ఎల్ టవర్‌పైకి ఎక్కేశాడు. వివారాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో సోమవారం సాయంత్రం సంజయ్ జాదవ్ అనే తాగుబోతు బీఎస్ఎన్ఎల్ 300 అడుగుల ఎత్తైన టవర్ పైకి ఎక్కాడు. అతను టవర్ ఎక్కినప్పుడు ఆ వ్యక్తిని ఎవరూ గమనించలేదు. కానీ అతను ఎత్తుకు చేరుకునే సమయానికి ఆ ప్రదేశంలో జనం గుమిగూడడం ప్రారంభించారు. కొంతమంది అతడిని క్రిందికి దించడానికి ప్రయత్నించారు. కానీ అతను వారి అభ్యర్థనలను పట్టించుకోలేదు. పైగా ఓ వైర్‌ను మెడకు చుట్టుకుని, చొక్కా తీసేసి హల్చల్ చేశాడు. ఇక దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే సంజయ్ జాదవ్ బీఎస్ఎన్ల్ టవర్ పైకి ఎక్కేశాడు. అంత ఎత్తులో అతని ముఖం స్పష్టంగా కనిపించలేదు. దీంతో అతడిని గుర్తించడానికి పోలీసులు డ్రోన్ కెమెరాను ఉపయోగించారు. డ్రోన్ కెమెరా సహాయంతో.. కొంతమంది అతడిని మిలింద్ నగర్ నివాసి అయిన సంజయ్ జాదవ్‌గా గుర్తించారు. దాదాపు నాలుగున్నర గంటల తర్వాత అతడిని కిందకు దించడంలో పోలీసులు విజయం సాధించారు. సంజయ్ జాదవ్ కిందకు దిగిన తర్వాత అతడిని అరెస్టు చేసి, అతనిపై కేసు నమోదు చేశారు. కాగా తన తల్లితండ్రులు దురుసుగా ప్రవర్తించినందుకు అతను అసంతృప్తిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని తల్లిదండ్రులు అతన్ని వేధించడంతో టవర్ పైకి ఎక్కినట్లు తెలిపాడని పోలీసులు పేర్కొన్నారు. -
భారతీ ఎయిర్టెల్ దొంగ పని, తెలిస్తే షాక్
శ్రీనగర్ : టెలికాం దిగ్గజంగా భారతీ ఎయిర్‌టెల్‌కు మంచి పేరుంది. ఈ మధ్యన ఆ కంపెనీ చేసే పనులు దాని బ్రాండ్ విలువను అదే పోగొట్టుకుంటోంది. గత కొన్ని రోజుల క్రిందట ఖాతాదారులకు చెప్పా పెట్టకుండా.. వారి తరుఫున అకౌంట్లు తెరిచేసి, గ్యాస్ అకౌంట్ రాయితీలను తన పేమెంట్ బ్యాంక్‌లోకి జమ చేసుకోవడంతో ఆర్బీఐ ఆగ్రహానికి గురైంది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు రద్దు చేసి, భారీ జరిమానా కూడా విధించింది. తాజాగా మరో దొంగ పని చేసి, తన బ్రాండ్ ఇమేజ్ను మరోసారి దెబ్బతీసుకుంది. భారతీ ఎయిర్టెల్ తన ప్రత్యర్థి, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ నుంచి విద్యుత్‌ను దొంగతనం చేసింది. జమ్ముకశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాలో ఎయిర్టెల్ ఈ దొంగతనానికి పాల్పడిందని బీఎస్ఎన్ఎల్ ఫిర్యాదు నమోదు చేసింది. కార్గిల్‌లోని ఛానిగుండ్ వద్ద ఎక్స్‌క్లూజివ్‌గా బీఎస్ఎన్ఎల్ మొబైల్ టవర్‌కు మాత్రమే వాడే విద్యుత్‌ను ట్రాన్స్ఫార్మర్ నుంచి ఎయిర్టెల్ టవర్ దొంగతనం చేసిందని బీఎస్ఎన్ఎల్ అథారిటీలు 2018 ఆగస్టు 3న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు పోలీసు అధికారి చెప్పారు. దీని కోసం కార్గిల్ ఎస్ఎస్పీ టీ గ్యాల్పో, కార్గిల్ డిప్యూటీ ఎస్పీ ఇష్త్‌యాఖ్ ఏ కచో హెడ్‌గా ఎగ్జిక్యూటివ్ పీడీడీ కార్గిల్ మహమ్మద్ అల్టఫ్‌తో పాటు ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాన్ని సందర్శించిన టీమ్, ఎయిర్టెల్ టవర్ అక్రమంగా బీఎస్ఎన్ఎల్ ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ దొంగలించేందుకు ఓ కేబుల్‌ను ఏర్పాటు చేసిందని గుర్తించారు. ఛానిగుండ్‌లో బీఎస్ఎన్ఎల్ టవర్‌కు ప్రత్యేకంగా సరఫరా చేసే విద్యుత్‌ను ఎయిర్టెల్ అక్రమంగా వాడేస్తుందని టీమ్ తెలిపింది. ఎలక్ట్రిసిటీ యాక్ట్ సెక్షన్ 95 కింద కార్గిల్ పోలీసు స్టేషన్లో ఎయిర్‌టెల్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ చేపడుతున్నారు. అయితే ఆ టవర్ టెలికాం కంపెనీకి చెందినది కాదని, దాన్ని ఇన్ఫ్రాటెల్ ఆపరేట్ చేస్తుందని, అది భారతీ గ్రూప్‌లో భాగమని ఎయిర్టెల్ అధికార ప్రతినిధి చెబుతున్నారు. నిజనిజాలు తెలియకుండా తమ కంపెనీ పేరును ఫిర్యాదులో చేర్చారని ఎయిర్టెల్ మండిపడ్డారు. దీన్ని బీఎస్ఎన్ఎల్ అథారిటీల వద్దకు తీసుకెళ్తామని, ఇదే విషయాన్ని వారికి స్పష్టీకరిస్తామని పేర్కొన్నారు. -
వంద కిలోల గంజాయి స్వాధీనం
చీడికాడ(మాడుగుల) : మండలంలోని కోనాం బీఎస్ఎన్ఎల్ టవర్ వద్ద బుధవారం వంద కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, 14 మందిని అరెస్టు చేసినట్టు ఎస్ఐ ఎల్.శిరీష్‌కుమార్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. కోనాం బీఎస్ఎన్ఎల్ టవర్ సమీపంలో కొందరు అపరిచితులు బ్యాగులతో ఉన్నట్టు అందిన సమాచారం మేరకు ఎస్ఐ తన సిబ్బందితో దాడి చేశారు. అక్కడున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా తమిళనాడు రాష్ట్రం ఎన్నూరు జిల్లాకు చెందిన రాజకుమార్ చంద్రశేఖర్ అనే వ్యక్తి జి.మాడుగుల మండలం ఆగంపాడుకు చెందిన అన్నదమ్ములు గండేరి మత్య్సలింగం,గండేరి రవిబాబును గంజాయి కోసం సంప్రదించాడు. వంద కిలోల గంజాయిని సమకూర్చి, దానిని తరలించేందుకు జి.మాడుగుల సంతకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 11 మందిని ఏర్పాటు చేశాడు. ఒకొక్కరికీ రూ.వెయ్యి కూలి ఇచ్చేందుకు నిర్ణయించి, వారికి విద్యార్థులు వినియోగించే 13 బ్యాగుల్లో ఒక్కొక్కదానిలో ఆరు కిలోల చొప్పన ఉంచి ఇచ్చారు. మరో రెండు గోనే సంచుల్లో ఒక్కొక్క సంచిలో 17 కిలోలు చొప్పున 34 కిలోలు ఉంచి తరలిస్తున్నారు. ఈ గంజాయి విలువ రూ. రెండు లక్షలు ఉంటుందని ఎస్ఐ చెప్పారు. కేసునమోదు చేసి నిందుతులను రిమాండ్‌కు తరలించామని తెలిపారు. -
కలకలం!
సెల్ టవరెక్కి ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతిబాయి తండ్రి, చిన్నాన్న ♦ నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ ♦ డీఎస్పీ హామీతో దిగొచ్చిన వైనం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి ప్రీతిబాయ్ కేసులో నిందితులను అరెస్టు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆమె తండ్రి, చిన్నాన్న కలెక్టరేట్లోని బీఎస్ఎన్ఎల్ టవరెక్కి ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి..ప్రీతిబాయ్ మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కలెక్టరేట్ ఎదుట మంత్రి గంటా శ్రీనివాసరావు దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రీతిబాయ్ న్యాయ పోరాట కమిటీ, ఆమె తండ్రి రాజునాయక్, తల్లి పార్వతీదేవి, చిన్నాన్న రామచంద్రనాయక్‌తోపాటు పలువురు బంధువులు వచ్చారు. ఈసందర్భంగా కలెక్టరేట్లో జరిగే ఓ సమావేశంలో పాల్గొనేందుకు కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ గోపీనాథ్ జట్టీ వచ్చారు. గమనించిన ఆందోళనకారులు రోడ్డుకు అడ్డంగా పండుకొని వారిని అడ్డుకున్నారు. న్యాయం చేస్తామని కలెక్టర్, ఎస్పీ ఎంత చెప్పినా వినకపోవడంతో చేసేదేమి లేక వెనక్కి వెళ్లి వెనుక వైపు నుంచి సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఆందోళనకారులు మంత్రి గంటా శ్రీనివాసరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. నిందితుల అరెస్టులో నిర్లక్ష్యం.. ఇంతలోనే ఉన్నట్లు ఉండి ప్రీతిబాయ్ నాన్న రాజునాయక్, చిన్నాన్న రామచంద్రనాయక్ హఠాత్తుగా కలెక్టరేట్లోని సెల్ టవర్ ఎక్కారు. తమ బిడ్డకు అన్యాయం జరిగినా నిందితులను అరెస్టు చేయడంతో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, తాము దూకి చనిపోతామని, జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరగదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంతలోనే కర్నూలు డీఎస్పీ రమణకుమార్, జేసీ–2రామస్వామి అక్కడి చేరుకొని కిందకు దిగాలని కోరారు. ప్రీతిబాయ్ చిన్నాన్న రామచంద్రనాయక్ వెంట తీసుకెళ్లిన పెట్రోల్ పొసుకొని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరకు ప్రీతిబాయ్ మృతికి కారకులైన నిందితులను 24 గంటల్లో అరెస్టు చేస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. కాగా, రామచంద్రనాయక్ ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతో టవర్‌పైనే పడిపోయాడు. అగ్నిమాపక సిబ్బంది అతడిని తాళ్లు, వలల సాయంతో కిందకు దించారు. కార్యక్రమంలో ప్రీతిబాయ్ న్యాయ పోరాట కమిటీ సభ్యులు పట్నం రాజేశ్వరి, యాట ఓబులేషు, లక్ష్మీనరసింహా, వెంకటేష్, బాలసుందరం, గిరి, చంద్రప్ప పాల్గొన్నారు. -
‘ఇంటి పక్కన మొబైల్ టవర్‌తో నాకు క్యాన్సర్’
న్యూఢిల్లీ: మొబైల్ టవర్ల విషయంలో తొలిసారి సామాన్యుడికి అనుకూలంగా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వెలువరించింది. ఓ బీఎస్ఎన్ఎల్ టవర్ ద్వారా తాను తీవ్ర రేడియేషన్‌కు గురై క్యాన్సర్ బారిన పడ్డానంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన వ్యక్తికి న్యాయం జరిగింది. ఏడు వారాల్లోగా ఆ టవర్‌ను బీఎస్ఎన్ఎల్ డీయాక్టివేట్ చేయాలంటూ సుప్రీం ఆదేశించింది. హరీశ్ చంద్ తివారీ అనే వ్యక్తి గ్వాలియర్‌లోని దాల్ బజార్‌లోగల ప్రకాశ్ శర్మ ఇంట్లో పనిచేస్తుంటాడు. అతడికి ఇటీవల క్యాన్సర్ లక్షణాలు బయటపడ్డాయి. రేడియేషన్ కారణంగా వచ్చినట్లు పరీక్షల్లో తేలింది. దీంతో తమ ఇంటిపక్కనే ఉన్న ఓ ఇంటిపై భాగంలో బీఎస్ఎన్ఎల్ అక్రమంగా 2002లో టవర్‌ను ఏర్పాటుచేసిందని గత పద్నాలుగేళ్లుగా దాని నుంచి విడుదలయ్యే రేడియేషన్ కారణంగా తాను ప్రస్తుతం క్యాన్సర్ బారిన పడ్డానని గత ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఇకనైనా దానిని తొలగించేలా ఆదేశించాలంటూ కోరారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆ టవర్‌ను మూసేయాలంటూ ఆదేశించింది. దీంతో మరోసారి మొబైల్ టవర్ల వ్యవహారంపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంది. తాము ఏర్పాటుచేసే టవర్ల ద్వారా ఎలాంటి ప్రమాదం జరగదని గతంలో పలు మొబైల్ నెట్ వర్క్ సంస్థలు సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. -
సెల్ నంబర్ కోసం టవరెక్కిన యువకుడు
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన సలావుద్దీన్ తాను వినియోగించే సిమ్ నంబర్‌ను తన భార్య నుంచి ఇప్పించాలని డిమాండ్‌చేస్తూ సెల్ టవర్ ఎక్కి కలకలం సృష్టిం చాడు. సలావుద్దీన్, రిజ్వానాబేగం దంపతులు. భార్య చెల్లెలు షబానాబేగం పేరిట బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు తీసుకున్నాడు. కార్డు ఐడీ అడ్రస్‌లు ఉన్న సలావుద్దీన్ మరదలు షబానాబేగం గతేడాది మరణిం చింది. మరోవైపు అతని భార్య రిజ్వనాబేగంతో గొడవల కారణంగా వ్యవహారం కోర్టుకు చేరింది. దీంతో సలావుద్దీన్ బీఎస్ఎన్ఎల్ సిమ్‌కార్డును అతని భార్య తీసుకొని వెళ్లిపోయింది. సలావుద్దీన్ బ్యాంకు ఖాతాలకు, ఆధార్‌కార్డు, సిలిండర్ కనెక్షన్లకు అదే సెల్ నంబర్ ఇచ్చి ఉండటంతో సిమ్‌కార్డు డీ ఆక్టివేషన్ చేసి అదే నంబర్‌తో తనకు కొత్త కార్డు ఇవ్వాలంటూ ఆర్మూర్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. పాత ఐడీ ప్రూఫ్‌లు తీసుకు రావాలని బీఎస్ఎన్ఎల్ డీఈ శ్రీనివాస్ వివరించాడు. దీంతో సలావుద్దీన్ ఆగ్రహంతో శనివారం ఆర్మూర్‌లోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న సెల్ టవర్ ఎక్కాడు. ఐడీపార్టీ కానిస్టేబుళ్లు అతనితో ఫోన్లో మాట్లాడి బుజ్జగించారు. - ఆర్మూర్ -
టీఆర్ఎస్కే ఓటేస్తామని మాటివ్వాలి
కంగ్టి: ‘నారాయణఖేడ్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కే అందరూ ఓట్లు వేసి గెలిపించాలి. ఈ మేరకు గ్రామ పెద్దలు మాటివ్వాలి’ అంటూ ఓ వృద్ధుడు సెల్ టవర్ ఎక్కాడు. ఈ ఘటన మెదక్ జిల్లా కంగ్టి మండలం తడ్కల్‌లో గురువారం మధ్యాహ్నం కలకలం రేపింది. చౌకన్పల్లికి చెందిన పీరప్ప జై తెలంగాణ నినాదాలు చేస్తూ తడ్కల్‌లోని బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కాడు. అందరూ టీఆర్ఎస్కి ఓటేస్తామని మాటిచ్చే వరకు దిగనంటూ భీష్మించుకొని కూర్చున్నాడు. పోలీసులు అతడిని కిందకు దింపేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఐదున్నర గంటల హైడ్రామాతో పాటు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరకు అక్కడ గుమిగూడిన వందలాది మంది ప్రజలు ‘టీఆర్ఎస్కే ఓటేస్తాం’ అని మైక్‌లో చెప్పారు. దీంతో పీరప్ప కిందకు దిగాడు. అనంతరం పీరప్పను పోలీసులు అదుపులోకి తీసుకొని కంగ్టి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
బీఎస్ఎన్ఎల్ టవర్ వద్ద అగ్నిప్రమాదం
శ్రీకాకుళం: శ్రీకాకుళం పట్టణం సమీపంలోని బీఎస్ఎన్ఎల్ టవర్ స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టవర్ కంట్రోల్ రూం సమీపంలో ఉన్న కంప చెట్లను తొలగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మంటలు ఎగిసిపడి వంద కిలోమీటర్ల పొడవైన ఫైబర్ కేబుల్ నిల్వలు దహనమయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని ప్రథమికంగా అంచనా వేస్తున్నారు. -
సెల్ టవర్ తొలగించాలంటూ మహిళల ఆందోళన
గుంటూరు(ఎడ్లపాడు): జనావాసాల మధ్యలో ఉన్న సెల్ టవర్‌ను తొలగించాలంటూ స్థానిక మహిళలు గురువారం ఆందోళనకు దిగారు. గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండల కేంద్రంలోని జనావాసాల మధ్య ఉన్న బీఎస్ఎన్ఎల్ టవర్ ను తొలగించాలంటూ స్థానిక మహిళలు తహసీల్దార్ కార్యలయం ఎదుటు ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. -
రుణమాఫీ కోరుతూ టవరెక్కిన యువరైతు
కోహీర్ : రుణమాఫీ పథకంలో స్పష్టత కొరవడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యువరైతు ప్రభాకర్ బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కారు. ఈ సంఘటన మండలంలోని బిలాల్పూర్ గ్రామం లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. రెండు గంటల పాటు ఉత్కంఠ రేపిన సంఘటన చివరికి పోలీసుల జోక్యంతో ప్రశాంతంగా ముగిసింది. వివరాలు యువ రైతు ప్రభాకర్ మాటల్లోనే.. ‘నాపేరు కాసుబాగుల ప్రభాకర్. తల్లి పేరు మాణ్యమ్మ. నా తల్లి పేరిట 340 సర్వే నంబరులో 2.20 ఎకరాల పొలం ఉంది. పొలంపై తీసుకున్న పంట రుణం రూ. 50 వేలు గత మార్చి నెలలో తీర్చా. రుణాలు కట్టిన వారికి సైతం రుణ మాఫీ వర్తింప చేస్తామని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినా.. ప్రస్తుతం విడుదల చేసిన రుణమాఫీ జాబితాలో నా తల్లి పేరు లేదు. సకాలంలో రుణం చెల్లించినప్పటికీ రీషెడ్యూల్ చేయడం లేదు. రుణ మాఫీ జాబితాలో పేర్లున్న రైతులను సైతం బ్యాంకు అధికారులు పట్టించుకోవడం లేదు. రుణమాఫీ పథకంపై ప్ర భుత్వం స్పష్టమైన ప్రకటన చేయా లి. గ్రామంలో ఉపాధి పథకం, ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణంలో అనేక అక్రమాలు జరిగాయి.. విచారణకు చర్యలు తీసుకోవాలి. ఉన్నత చదువులు చదవిన యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు, తక్కువ చదువు చదవిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి’ అని డిమాండ్ చేశారు. అంతకు ముందు సమాచారం అందుకున్న కోహీర్ ఏఎస్ఐ యూసుఫ్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మైకు ద్వారా టవర్‌పైన ఉన్న ప్రభాకర్ తో మంతనాలు జరిపారు. డిమాండ్లు అధికారుల దృష్టికి తీసికెళ్లి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని ఇచ్చిన హామీ మేరకు ప్రభాకర్ టవర్ దిగారు.