‘ఇంటి పక్కన మొబైల్ టవర్‌తో నాకు క్యాన్సర్’
న్యూఢిల్లీ: మొబైల్ టవర్ల విషయంలో తొలిసారి సామాన్యుడికి అనుకూలంగా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వెలువరించింది. ఓ బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ ద్వారా తాను తీవ్ర రేడియేషన్‌కు గురై క్యాన్సర్ బారిన పడ్డానంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన వ్యక్తికి న్యాయం జరిగింది. ఏడు వారాల్లోగా ఆ టవర్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ డీయాక్టివేట్ చేయాలంటూ సుప్రీం ఆదేశించింది. హరీశ్ చంద్ తివారీ అనే వ్యక్తి గ్వాలియర్‌లోని దాల్ బజార్‌లోగల ప్రకాశ్ శర్మ ఇంట్లో పనిచేస్తుంటాడు. అతడికి ఇటీవల క్యాన్సర్ లక్షణాలు బయటపడ్డాయి. రేడియేషన్ కారణంగా వచ్చినట్లు పరీక్షల్లో తేలింది.
దీంతో తమ ఇంటిపక్కనే ఉన్న ఓ ఇంటిపై భాగంలో బీఎస్‌ఎన్ఎల్ అక్రమంగా 2002లో టవర్‌ను ఏర్పాటుచేసిందని గత పద్నాలుగేళ్లుగా దాని నుంచి విడుదలయ్యే రేడియేషన్ కారణంగా తాను ప్రస్తుతం క్యాన్సర్ బారిన పడ్డానని గత ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఇకనైనా దానిని తొలగించేలా ఆదేశించాలంటూ కోరారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆ టవర్‌ను మూసేయాలంటూ ఆదేశించింది. దీంతో మరోసారి మొబైల్ టవర్ల వ్యవహారంపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంది. తాము ఏర్పాటుచేసే టవర్ల ద్వారా ఎలాంటి ప్రమాదం జరగదని గతంలో పలు మొబైల్ నెట్ వర్క్ సంస్థలు సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.