
ముంబై: అసలే కోతి, ఆపై కల్లు తాగినట్లు అనే నానుడి గుర్తుండే ఉంటుంది. మామూలుగానే కోతి చంచలమయిన జంతువు. ఇక అటుపై కల్లు తాగితే.. దాని ప్రవర్తన అత్యంత విచిత్రంగా, చుట్టు పక్కల విధ్వంసకరంగా ఉంటుంది. తాజాగా మద్యం తాగిన ఓ వ్యక్తి పోలీసులను ముని వేళ్లపై నిలబెట్టినంత పని చేశాడు. మద్యం మత్తులో ఏకంగా 300 అడుగుల ఎత్తున్న బీఎస్‌ఎన్‌ఎల్ టవర్‌పైకి ఎక్కేశాడు.
వివారాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో సోమవారం సాయంత్రం సంజయ్ జాదవ్ అనే తాగుబోతు బీఎస్‌ఎన్‌ఎల్ 300 అడుగుల ఎత్తైన టవర్ పైకి ఎక్కాడు. అతను టవర్ ఎక్కినప్పుడు ఆ వ్యక్తిని ఎవరూ గమనించలేదు. కానీ అతను ఎత్తుకు చేరుకునే సమయానికి ఆ ప్రదేశంలో జనం గుమిగూడడం ప్రారంభించారు. కొంతమంది అతడిని క్రిందికి దించడానికి ప్రయత్నించారు. కానీ అతను వారి అభ్యర్థనలను పట్టించుకోలేదు. పైగా ఓ వైర్‌ను మెడకు చుట్టుకుని, చొక్కా తీసేసి హల్‌చల్ చేశాడు.
ఇక దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే సంజయ్ జాదవ్ బీఎస్‌ఎన్‌ల్ టవర్ పైకి ఎక్కేశాడు. అంత ఎత్తులో అతని ముఖం స్పష్టంగా కనిపించలేదు. దీంతో అతడిని గుర్తించడానికి పోలీసులు డ్రోన్ కెమెరాను ఉపయోగించారు. డ్రోన్ కెమెరా సహాయంతో.. కొంతమంది అతడిని మిలింద్ నగర్ నివాసి అయిన సంజయ్ జాదవ్‌గా గుర్తించారు.
దాదాపు నాలుగున్నర గంటల తర్వాత అతడిని కిందకు దించడంలో పోలీసులు విజయం సాధించారు. సంజయ్ జాదవ్ కిందకు దిగిన తర్వాత అతడిని అరెస్టు చేసి, అతనిపై కేసు నమోదు చేశారు. కాగా తన తల్లితండ్రులు దురుసుగా ప్రవర్తించినందుకు అతను అసంతృప్తిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని తల్లిదండ్రులు అతన్ని వేధించడంతో టవర్ పైకి ఎక్కినట్లు తెలిపాడని పోలీసులు పేర్కొన్నారు.