రామచంద్రనాయక్‌ను కిందికి దింపుతున్న పోలీసులు
సెల్ టవరెక్కి ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతిబాయి తండ్రి, చిన్నాన్న
♦ నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్
♦ డీఎస్పీ హామీతో దిగొచ్చిన వైనం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) :
కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి ప్రీతిబాయ్ కేసులో నిందితులను అరెస్టు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆమె తండ్రి, చిన్నాన్న కలెక్టరేట్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ టవరెక్కి ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి..ప్రీతిబాయ్ మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కలెక్టరేట్ ఎదుట మంత్రి గంటా శ్రీనివాసరావు దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రీతిబాయ్ న్యాయ పోరాట కమిటీ, ఆమె తండ్రి రాజునాయక్, తల్లి పార్వతీదేవి, చిన్నాన్న రామచంద్రనాయక్‌తోపాటు పలువురు బంధువులు వచ్చారు.
ఈసందర్భంగా కలెక్టరేట్‌లో జరిగే ఓ సమావేశంలో పాల్గొనేందుకు కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ గోపీనాథ్ జట్టీ వచ్చారు. గమనించిన ఆందోళనకారులు రోడ్డుకు అడ్డంగా పండుకొని వారిని అడ్డుకున్నారు. న్యాయం చేస్తామని కలెక్టర్, ఎస్పీ ఎంత చెప్పినా వినకపోవడంతో చేసేదేమి లేక వెనక్కి వెళ్లి వెనుక వైపు నుంచి సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఆందోళనకారులు మంత్రి గంటా శ్రీనివాసరావు దిష్టిబొమ్మను దహనం చేశారు.
నిందితుల అరెస్టులో నిర్లక్ష్యం..
ఇంతలోనే ఉన్నట్లు ఉండి ప్రీతిబాయ్ నాన్న రాజునాయక్, చిన్నాన్న రామచంద్రనాయక్ హఠాత్తుగా కలెక్టరేట్‌లోని సెల్ టవర్ ఎక్కారు. తమ బిడ్డకు అన్యాయం జరిగినా నిందితులను అరెస్టు చేయడంతో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, తాము దూకి చనిపోతామని, జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరగదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంతలోనే కర్నూలు డీఎస్పీ రమణకుమార్, జేసీ–2రామస్వామి అక్కడి చేరుకొని కిందకు దిగాలని కోరారు. ప్రీతిబాయ్ చిన్నాన్న రామచంద్రనాయక్ వెంట తీసుకెళ్లిన పెట్రోల్ పొసుకొని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
చివరకు ప్రీతిబాయ్ మృతికి కారకులైన నిందితులను 24 గంటల్లో అరెస్టు చేస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. కాగా, రామచంద్రనాయక్ ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతో టవర్‌పైనే పడిపోయాడు. అగ్నిమాపక సిబ్బంది అతడిని తాళ్లు, వలల సాయంతో కిందకు దించారు. కార్యక్రమంలో ప్రీతిబాయ్ న్యాయ పోరాట కమిటీ సభ్యులు పట్నం రాజేశ్వరి, యాట ఓబులేషు, లక్ష్మీనరసింహా, వెంకటేష్, బాలసుందరం, గిరి, చంద్రప్ప పాల్గొన్నారు.