చెట్టుకు వేలాడుతున్న ప్రభాకర్ మృతదేహం
కనిగిరి: ఓ విద్యార్థి చెట్టుకు ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం పాతపాడులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పాతపాడు ఎస్సీ కాలనీకి చెందిన రామచంద్రుని ఆదాం కుమారుడు ప్రభాకర్ (ఉరఫ్ నాని) (18)కి చిన్న వయసులోనే తల్లి చనిపోయింది. చిన్నాన్న ఇజ్రాయేల్.. ప్రభాకర్‌ను దత్తత తీసుకుని పెంచుకుంటున్నాడు. ఇజ్రాయేల్‌కు ప్రభాకర్ కాకుండా మరో నలుగురు పిల్లలు ఉన్నారు. ప్రభాకర్ అన్నలు ఉన్నత చదవులు చదివి ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రభాకర్ ఇంటర్ ఎంపీసీ గ్రూపును ఒంగోలు ఏకేవీకేలో చదువుతూ అక్కడే వేరే హాస్టల్‌లో ఉంటూ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఇంటర్ సెకండియర్‌లో మూడు సబ్జెక్టులు ఫైయిలయ్యాడు.
ఇంటర్‌లో ఫైయిలైన సబ్జెక్టులు తిరిగి రాసాడు. ఇంకా ఫలితాలు రాలేదు. 20 రోజుల నుంచి ప్రభాకర్ పాతపాడు వచ్చి ఉంటున్నాడు. రోజూ ప్రభాకర్ తన స్నేహితులతో కలిసి చర్చిలో నిద్రపోతుంటాడు. బుధవారం రాత్రి కూడా చర్చిలో నిద్రించేందుకు వెళ్లిన ప్రభాకర్ కేవలం 100 మీటర్ల దూరంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో చెట్టుకుని కరెంట్ వైరుతో ఉరేసుకున్నాడు. గురువారం ఉదయం విద్యార్థులు గమనించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. సీఐ మరవనేని సుబ్బారావు, ఎస్‌ఐ శ్రీనివాసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. తండ్రి ఆదాం ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.
ప్రేమ వ్యవహారమే కారణమా?
ప్రభాకర్ మృతికి ప్రేమ వ్యవహారమే కారణంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడి ఎడమ చేతిపై ఏ..అని అక్షరం రాసుకుని ఉన్నాడు. ఉరేసుకున్న చెట్టుకు కూడా లవ్ సింబల్‌తో ఏ..అనే అక్షరం చెక్కి ఉంది. అతడికి ఫోన్‌లు వచ్చినప్పుడు ఆ చెట్టు కిందకే వెళ్లి మాట్లాడుతుంటాడని పోలీసు విచారణలో తెల్సినట్లు సమాచారం. ప్రభాకర్ మృతికి ప్రేమ వ్యవహారమా..? ఆర్థిక సమస్యలా? ఇంకేమైనా ఇతర కారణాలున్నాయా.. అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment