బైక్ కోసం విద్యార్థి హత్య | Murdered for bike | Sakshi
Sakshi News home page

బైక్ కోసం విద్యార్థి హత్య

Published Sat, Nov 2 2013 1:25 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM

Murdered for bike

 కోహీర్, న్యూస్‌లైన్ :  పైసాపైసా కూడబెట్టి ఎంతో ఇష్టంగా కొన్న మోటార్ సైకిల్‌పై మోజు తీరకనే ఓ విద్యార్థి హత్యకు గురయ్యాడు. పుల్‌కల్ ఎస్‌ఐ రమేష్ కథనం మేరకు.. పుల్‌కల్ మండలం శివంపేటకు చెందిన కిష్టయ్య, శివమ్మ దంపతుల రెండో కుమారుడైన శ్రావణ్‌కుమార్ (19) సంగారె డ్డిలోని శ్రీనిధి కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. పేదవారైన తన తల్లిదండ్రులను కష్టపెట్టకుండా కష్టపడి సంపాదించి 15 రోజుల క్రితం టీవీఎస్ స్పోర్ట్స్ మోటారు సైకిల్‌ను కొన్నాడు. ఇదిలా ఉండగా అవసరం నిమిత్తం కొండాపురం మండలం హరిదాస్‌పూర్‌కు చెందిన మిత్రుడు దశరథ్‌సింగ్‌ను  డబ్బు అడిగాడు. అయితే తన వద్ద డబ్బులు లేవని తన అన్న వరసకు అయిన బానో త్ రాందాస్ వద్ద ఇప్పిస్తానని చెప్పడంతో ఇద్దరూ కలిసి బైక్‌పై హరిదాస్‌పూర్ వెళ్లారు. అక్కడ కూడా వారికి డబ్బు దొరకలేదు.  కర్ణాటక రాష్ట్రం బోనస్‌పూర్ తండాలోని తన బంధువుల వద్ద డబ్బులు ఇప్పిస్తానని రాందాస్ శ్రావణ్‌కుమార్‌కు చెప్పాడు. దీంతో ముగ్గురూ కలిసి గత శనివారం బైక్‌పై బోనస్‌పూర్ వెళ్లారు. అక్కడ కూడా వారికి డబ్బులు దొరకలేదు. దీంతో బోనస్‌పుర్‌లో మద్యం సేవించి సాయంత్రం అదే మోటార్ సైకిల్‌పై తిరుగు ప్రయాణమయ్యారు.

మార్గమధ్యలో రాందాస్‌కు శ్రావణ్‌కుమార్‌ను చంపి బైక్‌ను అమ్మి సొమ్ము చేసుకోవాలని దుర్బుద్ధి కలిగింది. ఈ విషయాన్ని వరుసకు తమ్ముడైన దశరథ్‌సింగ్‌కు తెలిపాడు. ఇందుకు దశరథ్ ఒప్పుకోలేదు. రాందాస్ ఒత్తిడి చేయడంతో సరేనన్నాడు. దీంతో శ్రావణ్‌ను మాటల్లో పెట్టి రోడ్డుకు దూరంగా అడవిలోకి తీసుకెళ్లారు. అనంతరం ఇరువురూ కలిసి శ్రావణ్‌కుమార్ గొంతు నొక్కి చంపేశారు. అనంతరం బైక్‌ను బోనస్‌పూర్‌కు తీసుకెళ్లి విక్రయించే ప్రయత్నంచేశారు. వారి ప్రయత్నం విఫలమైంది. దీంతో చేసేది లేక ఆదివారం స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో కోహ ర్ మండలంలోని కవేలి క్రాస్ రోడ్డు వద్ద  పోలీసుల కంట పడ్డారు. వారు బైక్‌కు సంబంధించిన పత్రాలు అడగడంతో చూపించలేకపోయారు.

దీంతో పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. శ్రావణ్‌కుమార్ బైక్‌ను తమ వద్ద ఉంచి ఎటో వెళ్లాడని వాహనం పత్రాలు కావాలని శ్రావణ్‌కుమార్ అన్న శ్రీశైలానికి దశరథ్ ఫోన్ చేశాడు. అనుమానంతో శ్రీశైలం పుల్‌కల్ పోలీసులను ఆశ్రయించాడు. దశరథ్‌ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా హత్య చేసిన విషయం బయటికి వచ్చింది. నిందితుల సమాచారం మేరకు.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement