కోహీర్, న్యూస్‌లైన్: మండలంలోని కవేలి రాక్‌వూల్ కర్మాగారంలో పని చేస్తున్న ఓ కార్మికుడు విధి నిర్వహణలో అకస్మాత్తుగా మృతి చెందాడు. దీంతో బంధువులు, కుటుంబీకులు పరిహారం చెల్లించాలంటూ మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఆందోళన పోలీసుల చొరవతో రాత్రి 8 గంటలకు ముగిసింది. మృతుని బంధువులు, తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం...మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన పర్తుగారి సంగయ్య (55) కవేలి రాక్‌వూల్ కర్మాగారంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం రాత్రి విధులకు వెళ్లిన అతను తెల్లవారుజామున 3.30 గంటలకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన తోటి కార్మికులు అతన్ని జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.
అయితే విధి నిర్వహణలో చనిపోయిన సంగయ్య కుటుంబాన్ని యాజమాన్యం ఆదుకోవాలని బంధువులు ఆందోళనకు దిగారు. కర్మాగారంలోని అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట సంగయ్య మృతదేహాన్ని ఉంచి ధర్నాకు దిగారు. రూ.15 లక్షలు నష్ట పరిహారం, సంగయ్య కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బంధువుల తరఫున కార్మిక సంఘం నాయకులు కర్మాగారం అధికారులతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. అయితే మరోసారి కవేలి సర్పంచు మొగులయ్య, వెంకటాపూర్ సర్పంచు మల్లికార్జున్, మాజీ ఎంపీటీసీ మణ్యయ్యగౌడ్‌ల ఆధ్వర్యంలో కార్మిక సంఘం నాయకులు కర్మాగారం అధికారులు అడ్మినిస్ట్రేషన్ జనరల్ మేనేజర్ ర త్నాకర్, ఆపరేషన్ జనరల్ మేనేజర్ సతీష్ గుప్తలతో చర్చలు జరిపారు. అయితే యాజమాన్యం స్థానికంగా లేనందున వారితో మాట్లాడేంతవరకూ తాము ఏమీ చెప్పలేమని కర్మాగారం అధికారులు చెప్పారు.
దీంతో ఆగ్రహించన కార్మికులు కూడా మృతుడు సంగయ్య బంధువులతో కలిసి కర్మాగారం ఆవరణలో బైఠాయించారు. కర్మాగార యాజమాన్యానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న జహీరాబాద్ సీఐ నరేందర్ సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నించారు. అయితే పరిహారం చెల్లించేందుకు కర్మాగారం అధికారులు ఒప్పుకోకపోవడంతో సీఐ కూడా ఏమీ చేయలేకపోయారు. మరోవైపు పలువురు కార్మిక, రాజకీయ పార్టీల నేతలు మృతుని కుటుంబ సభ్యులకు నష్ట పరిహారం కోసం ఇప్పించేందుకు కర్మాగారం అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో రాత్రి 8 గంటల సమయంలో సీఐ నరేందర్ మరోసారి కార్మాగారం అధికారులు, మృతుని కుటుంబీకులతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి తక్షణ అవసరం కింద రూ.50 వేలు చెల్లిస్తామని ఒప్పుకున్న కర్మాగారం అధికారులు, పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు 10 రోజుల అనంతరం యాజమాన్యంతో చర్చలు జరుపుతామని వెల్లడించారు. ఇందుకు సంగయ్య కుటుంబీకులు ఒప్పుకోవడంతో పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు జహీరాబాద్ ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
రాక్‌వూల్ పరిశ్రమలో కార్మికుడి మృతి
Published Tue, Oct 29 2013 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 AM
Advertisement