కోహీర్ రైల్వేస్టేషన్
- ఎక్స్‌ప్రెస్ రైళ్లు కోసం ఎదురుచూపు
- ‘లూజ్‌టైమ్’ ఉన్నా ఆపని వైనం
- ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలని వినతి
కోహీర్: దేశంలో చాలా తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశం ఉన్న ఏకైనా రవాణా వ్యవస్థ రైల్వే శాఖ మాత్రమే. దేశ జనాభాలో ఎక్కువ శాతం దూరప్రయాణాలు చేసేది కూడా రైలులోనే. భద్రతతోపాటు అలసట చెందకుండా గమ్యస్థానాలకు చేరుకోవడం ఒక్క రైలులోనే సాధ్యం. అయితే కొన్ని స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్‌రైళ్లు ఆపకపోవడంతో ప్రజలు నిరాశ చెందుతున్నారు. తమకు కూడా రైల్వే సేవలను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. అటువంటి రైల్వేస్టేషన్లలో ఒకటి కోహీర్ దక్కన్.
కోహీర్ రైల్వేస్టేషన్ అతిపురాతనమైన రైల్వేస్టేషన్. రైల్వేస్టేషన్‌ను దేశానికి స్వాతంత్య్రం రాక ముందు నిర్మించారు. అప్పట్లో కేవలం రోజుకు రెండు ప్యాసింజర్ రైళ్లు మాత్రమే నడిచేవి. కోహీర్ ప్రాంతంలో భూగర్భ జలాల్లో లవణాలు, క్యాల్షియం శాతం తక్కువగా ఉండడంతో రైలుకు అవసరమైన నీటిని ఇక్కడే తీసుకునేవారు. దాని కోసం స్టేషన్‌లో అరగంటపాటు రైలును నిలిపేవారు.
అయితే సాంకేతిక పరిజ్ఞానం వృద్ధితో బొగ్గుతో నడిచే స్టీమ్ ఇంజన్లకు బదులుగా, డిజిల్ ఇంజన్‌లను ప్రవేశపెట్టారు. దీంతో నీటితో అవసరం లేకుండా పోయింది. కోహీర్ రైల్వేస్టేషన్‌లో రైలు ఆగే సమయాన్ని పూర్తిగా తగ్గించి వేశారు. ప్రస్తుతం నాలుగు ప్యాసింజర్ రైళ్లతో పాటు 14 ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి.
అయితే నాలుగు ప్యాసింజర్ రైళ్లు, ఇంటర్ సీటీ ఎక్స్‌ప్రెస్ మినహా మిగతా ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగడం లేదు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగకపోవడంతో 65 వేల జనాభా ఉన్న కోహీర్ మండల ప్రజలు ఎక్స్ ప్రెస్ సేవలు పొందలేకపోతున్నారు. దూరప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న జహీరాబాద్ లేదా 40 కిలోమీటర్ల దూరం ఉన్న వికారాబాద్‌కు వెళ్లాల్సి వస్తుంది.
కర్ణాటక సరిహద్దులో ఉన్న కోహీర్ మండల ప్రజలకు ఆ రాష్ట్రంలోని బీదర్, గుల్బర్గా, హుమ్నాబాద్ తదితర ప్రాంతాల ప్రజలతో సంబంధ భాందవ్యాలు ఉన్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తోపాటు వ్యవసాయ మార్కెట్ కేంద్రాలైన మర్పల్లి, వికారాబాద్‌కు రైతులు, ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. పుణ్యక్షేత్రాలైన షిర్డీ, తిరుపతికి ఎక్కువగా వెళుతుంటారు. అయితే కాకినాడ-షిర్డీ, విజయవాడ-షిర్డీ, సికింద్రాబాద్-షిర్డీ, నాందేడ్-బెంగుళూరు, యశ్వంత్‌పూర్-బీదర్, ఔరంగబాద్-రేణిగుంట రైళ్లు కోహీర్ రైల్వేస్టేషన్ గుండానే వెళ్లుతుంటాయి.
ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ హాల్ట్
ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ గతంలో కోహీర్‌లో ఆగేదికాదు. కోహీర్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని మండల ప్రజలు, నాయకులు చేపట్టిన ఆందోళన ఫలితంగా రెండేళ్ల క్రితం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు కోహీర్‌లో నిలిపే అవకాశాన్ని కల్పించారు. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్యను బట్టి మిగతా రైళ్లను ఆపే ప్రయత్నం చేస్తామని రైల్వే అధికారులు అప్పట్లో హామి ఇచ్చారు.
ప్రయాణికుల సంఖ్య అధికారుల అంచనాలకు తగ్గట్టుగాఉన్నా కోహీర్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపడంలేదు. ఈ రూట్లో ప్రయాణిస్తున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ‘లూజ్‌టైమ్’ ఉన్నప్పటికీ రైళ్లను ఆపకపోవడం విడ్డూరంగా ఉందని స్థానికులు మండిపడుతున్నారు. కోహీర్ రైల్లేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపడానికి కృషి చేయాలని ప్రజాప్రతినిధులను, రైల్వే అధికారులను కోరుతున్నారు.
ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపక ఇబ్బందులు
కోహీర్ రైల్వేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న జహీరాబాద్, 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు కోసం చేపట్టిన ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీ ఇంతవరకు అమలు చేయాలేదు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలి. - చందునాయక్, లాల్‌సింగ్‌తండా
రైలు సౌకర్యాన్ని కోల్పోతున్నాము
కోహీర్ రైల్వేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపకపోవడంతో హైదరాబాద్‌తోపాటు షర్డీ, తిరుపతి, హుమ్నాబాద్ వంటి పుణ్య క్షేత్రాలకు వెళ్లడానికి వీలు లేకుండా ఉంది. వ్యాపార కేంద్రాలైన మర్పల్లి, వికారాబాద్, బీదర్ ప్రాంతాలకు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయలేక పోతున్నాం. స్థానికంగా సరైన మార్కెట్ సౌకర్యాలు అందుబాటులో లేక తీవ్రంగా నష్టపోతున్నాం. కోహీర్ రైల్వేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలి. - మొగులయ్య, రైతు నాగిరెడ్డిపల్లి.
ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపడానికి అర్హత ఉంది
కోహీర్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఇక్కడ ప్యాసింజరు రైళ్ల కంటే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు. ఇంటర్‌సిటీలో రోజుకు సరాసరి 80 మంది ప్రయాణిస్తారు. ప్రస్తుతం కోహీర్ రైల్వేస్టేషన్‌కు ఇంటర్ సిటీ ద్వారానే ఎక్కువ ఆదాయం లభిస్తోంది. ఇక్కడ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగితే మరింత ఆదాయం లభించే అవకాశం ఉంది.
- అరుణ్‌కుమార్, స్టేషన్‌మాస్టర్