విన్యాసాలను తిలకిస్తున్న ప్రధాని మోదీ
రైల్వే శాఖ కష్టాలు, ప్రయాణికుల ఇబ్బందులు నాకు తెలుసు
తద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులు అందుబాటులోకి వచ్చాయి
గుజరాత్‌లో ప్రధాని మోదీ రూ.1,06,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభం..
10 నూతన వందేభారత్ రైళ్లకు పచ్చజెండా
అహ్మదాబాద్/పోఖ్రాన్: రైలు పట్టాలపైనే తన జీవితాన్ని ప్రారంభించానని, రైల్వే శాఖకు సంబంధించిన కష్టాలు, ప్రయాణికుల ఇబ్బందులన్నీ తనకు తెలుసని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. నరకం లాంటి పరిస్థితి నుంచి రైల్వేలను బయటకు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రైల్వే రంగం అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వాలు రైల్వేశాఖ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని, సొంత రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చాయని విమర్శించారు.
21వ శతాబ్దంలో రైల్వేల ప్రగతిని దృష్టిని పెట్టుకొని రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్‌లో విలీనం చేశామని వెల్లడించారు. తద్వారా రైల్వేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ మంగళవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పర్యటించారు. సబర్మతి ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.1,06,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. కొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఇందులో రూ.85,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి. పది నూతన వందేభారత్ రైళ్లను ప్రధానమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. ఇందులో సికింద్రాబాద్–విశాఖపట్నం, పూరీ–విశాఖపట్నం వందేభారత్ రైళ్లు కూడా ఉన్నాయి. తిరుపతి–కొల్లాం స్టేషన్ల మధ్య కొత్త రైలుకు పచ్చజెండా ఊపారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు.
ఎన్నికల్లో లబ్ధి కోసం కాదు
2004–2014తో పోలిస్తే గత పదేళ్లలో తమ ప్రభుత్వం రైల్వేల అభివృద్ధికి 6 రెట్లు అధికంగా ఖర్చు చేసిందని ప్రధానమంత్రి అన్నారు. గతంలో రైళ్లు ఆలస్యంగా నడవడం అనేది సాధారణ వ్యవహారంగా ఉండేదన్నారు. 2014 వరకు దేశంలో కేవలం 35 శాతం రైల్వే లైన్లు విద్యుదీకరణకు నోచుకున్నాయని గుర్తుచేశారు. రైళ్లలో ప్రయాణానికి రిజర్వేషన్ దొరకడం చాలా కష్టంగా ఉండేదని, టికెట్ల కోసం ప్రయాణికులు గంటల తరబడి క్యూలో నిల్చునేవారని, ఏజెంట్లు కమీషన్లు వసూలు చేసేవారని చెప్పారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పేర్కొన్నారు. దేశ ప్రగతి అనే మిషన్‌లో భాగంగానే అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు చేపడుతున్నామని, అంతేతప్ప కొందరు ఆరోపిస్తున్నట్లు ఎన్నికల్లో లబ్ధి కోసం ఎంతమాత్రం కాదని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
వారసత్వ సంపదను కాపాడుకోవాలి
సొంత వారసత్వ సంపదను కాపాడుకోని దేశానికి భవిష్యత్తు ఉండదని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. మన దేశ వారసత్వ సంపదను కాపాడే విషయంలో గత ప్రభుత్వాలు ఏమాత్రం నిబద్ధత చూపలేదని విమర్శించారు. మంగళవారం అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమంలో దండి యాత్ర వార్షికోత్సవంలో మోదీ పాల్గొన్నారు. రూ.1,200 కోట్లతో అమలు చేయనున్న గాంధీ ఆశ్రమ్ మెమోరియల్ మాస్టర్‌ప్లాన్‌ను ప్రారంభించారు. ఆధునీకరించిన కోచ్రాబ్ ఆశ్రమాన్ని ప్రారంభించారు. మహాత్మాగాంధీ ఆరంభించిన సబర్మతి ఆశ్రమం కేవలం మన దేశానికే కాదు, మొత్తం మానవాళికే వారసత్వ సంపద అని తేల్చిచెప్పారు.
పోఖ్రాన్‌లో అబ్బురపర్చిన ‘భారత్ శక్తి’
భారతదేశ ఆత్మనిర్భరత, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవానికి పోఖ్రాన్ ఒక ఘనమైన సాక్షి అని ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యానించారు. రాజస్తాన్ రాష్ట్రం పోఖ్రాన్‌లోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో మంగళవారం భారత త్రివిధ దళాలు ‘భారత్ శక్తి’ పేరిట సైనిక విన్యాసాలు నిర్వహించారు. దాదాపు 50 నిమిషాల పాటు జరిగిన ఈ విన్యాసాలను మోదీ ప్రత్యక్షంగా తిలకించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాలు, రక్షణ పరికరాల విన్యాసాలు చూపరులను అబ్బురపర్చాయి. తేజస్, ఏఎల్‌ఎస్ ఎంకే–4 యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకులు అర్జున్, కె–9 వజ్ర, ధనుష్ వంటివి ఆకట్టుకున్నాయి. పినాకా ఉపగ్రహ వ్యవస్థతోపాటు డ్రోన్ల విన్యాసాలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. ఆకాశంలో మన యుద్ధ విమానాల గర్జనలు, నేలపై మన జవాన్ల సాహసాలు నవ భారత్(న్యూ ఇండియా)కు ఆహ్వానం పలుకుతున్నామని మోదీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment