
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ యాత్రా మార్గంలో హెలికాప్టర్ క్రాష్‌లు లేదా అత్యవసర ల్యాండింగ్‌ల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం(జూన్ 15) జరిగిన బెల్ 407 హెలికాప్టర్ క్రాష్ ఏడుగురు ప్రాణాలను బలిగొంది. ఆర్యన్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఈ హెలికాప్టర్ గౌరీకుండ్- త్రియుగినారాయణ్ మధ్య గౌరీ మై ఖార్క్ అడవులలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి, పైలట్‌తో సహా ఏడుగురు దుర్మరణం పాలయ్యారు.
కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి పుణ్యక్షేత్రాలకు వెళ్లే చార్ ధామ్ యాత్రా మార్గంలో హెలికాప్టర్ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. గడచిన ఆరు వారాల్లో ఐదు హెలికాప్టర్ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్ 30న యాత్ర ప్రారంభమైనప్పటి నుండి యాత్రా మార్గంలో ఐదు హెలికాప్టర్ ప్రమాదాలు సంభవించాయి.
పైలట్‌కు గాయాలు
జూన్ 7న కేదార్‌నాథ్‌కు వెళ్తున్న హెలికాప్టర్ టేకాఫ్ అయిన వెంటనే సాంకేతిక లోపం కారణంగా రోడ్డుపై అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో పైలట్ గాయపడ్డారు. విమానంలోని ఐదుగురు భక్తులకు ఎటువంటి గాయాలు కాలేదు. జనావాసాలకు దగ్గరగా ఉన్న రోడ్డుపై హెలికాప్టర్ హార్డ్ ల్యాండింగ్ చేయడంతో అది అక్కడ నిలిపివుంచిన కారును ఢీకొంది.
ఆరుగురు మృతి
మే 8న ఉత్తరకాశీ జిల్లాలో గంగోత్రి ధామ్‌కు వెళ్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. ఉత్తరకాశీ జిల్లాలోని గంగ్నాని సమీపంలో గంగోత్రి ఆలయానికి వెళుతుండగా ఈ హెలికాప్టర్ కూలిపోయింది.
ఆట స్థలంలో అత్యవసర ల్యాండింగ్
మే 12న, బద్రీనాథ్ నుండి సెర్సికి యాత్రికులతో వస్తున్న హెలికాప్టర్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. దృశ్యమానత తక్కువగా ఉన్న కారణంగా ఈ హెలికాప్టర్‌ను ఉఖిమత్‌లోని ఒక పాఠశాల ఆట స్థలంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో యాత్రికులకు ఎటువంటి ముప్పు వాటిల్లలేదు. వాతావరణం మెరుగుపడ్డాక, ఒక గంట అనంతరం హెలికాప్టర్ తిరిగి బయలుదేరింది.
వెనుక భాగం దెబ్బతినడంతో..
మే 17న ఎయిమ్స్ రిషికేశ్ నుండి వచ్చిన హెలి అంబులెన్స్ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ హెలిప్యాడ్ సమీపంలో కూలిపోయింది. హెలికాప్టర్ వెనుక భాగం దెబ్బతినడంతో ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్‌లోని వైద్యుడు, పైలట్, మరో వ్యక్తి ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
రిస్కీ సర్క్యూట్ కారణంగా..
ఉత్తరాఖండ్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) లేదని, వాతావరణ కేంద్రం, అత్యవసర ల్యాండింగ్ సైట్ కూడా లేదని, దీంతో ఉత్తరాఖండ్ రిస్కీ సర్క్యూట్‌లో పైలట్లు అతి తక్కువ రియల్ టైమ్ వాతావరణ మధ్య హెలికాప్టర్ నడుపుతారని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ ప్రాంతంలో వాతావరణం అనూహ్యంగా మారుతుందని ఒక పైలట్ పేర్కొన్నారు. ఏటీసీ ఏర్పాటుతోపాటు పలు సమస్యలను పరిష్కరించే వరకు ఈ ప్రాంతంలో హెలికాప్టర్ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆయన కోరారు.
ఇది కూడా చదవండి: ‘వాటర్ మెట్రో’లో బీహార్ రాజకీయాలు