development of railways
-
రైలు పట్టాలపై జీవితం ఆరంభించా: ప్రధాని మోదీ
అహ్మదాబాద్/పోఖ్రాన్: రైలు పట్టాలపైనే తన జీవితాన్ని ప్రారంభించానని, రైల్వే శాఖకు సంబంధించిన కష్టాలు, ప్రయాణికుల ఇబ్బందులన్నీ తనకు తెలుసని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. నరకం లాంటి పరిస్థితి నుంచి రైల్వేలను బయటకు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రైల్వే రంగం అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వాలు రైల్వేశాఖ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని, సొంత రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చాయని విమర్శించారు. 21వ శతాబ్దంలో రైల్వేల ప్రగతిని దృష్టిని పెట్టుకొని రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్లో విలీనం చేశామని వెల్లడించారు. తద్వారా రైల్వేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ మంగళవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పర్యటించారు. సబర్మతి ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.1,06,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. కొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఇందులో రూ.85,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి. పది నూతన వందేభారత్ రైళ్లను ప్రధానమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. ఇందులో సికింద్రాబాద్–విశాఖపట్నం, పూరీ–విశాఖపట్నం వందేభారత్ రైళ్లు కూడా ఉన్నాయి. తిరుపతి–కొల్లాం స్టేషన్ల మధ్య కొత్త రైలుకు పచ్చజెండా ఊపారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ఎన్నికల్లో లబ్ధి కోసం కాదు 2004–2014తో పోలిస్తే గత పదేళ్లలో తమ ప్రభుత్వం రైల్వేల అభివృద్ధికి 6 రెట్లు అధికంగా ఖర్చు చేసిందని ప్రధానమంత్రి అన్నారు. గతంలో రైళ్లు ఆలస్యంగా నడవడం అనేది సాధారణ వ్యవహారంగా ఉండేదన్నారు. 2014 వరకు దేశంలో కేవలం 35 శాతం రైల్వే లైన్లు విద్యుదీకరణకు నోచుకున్నాయని గుర్తుచేశారు. రైళ్లలో ప్రయాణానికి రిజర్వేషన్ దొరకడం చాలా కష్టంగా ఉండేదని, టికెట్ల కోసం ప్రయాణికులు గంటల తరబడి క్యూలో నిల్చునేవారని, ఏజెంట్లు కమీషన్లు వసూలు చేసేవారని చెప్పారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పేర్కొన్నారు. దేశ ప్రగతి అనే మిషన్‌లో భాగంగానే అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు చేపడుతున్నామని, అంతేతప్ప కొందరు ఆరోపిస్తున్నట్లు ఎన్నికల్లో లబ్ధి కోసం ఎంతమాత్రం కాదని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వారసత్వ సంపదను కాపాడుకోవాలి సొంత వారసత్వ సంపదను కాపాడుకోని దేశానికి భవిష్యత్తు ఉండదని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. మన దేశ వారసత్వ సంపదను కాపాడే విషయంలో గత ప్రభుత్వాలు ఏమాత్రం నిబద్ధత చూపలేదని విమర్శించారు. మంగళవారం అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమంలో దండి యాత్ర వార్షికోత్సవంలో మోదీ పాల్గొన్నారు. రూ.1,200 కోట్లతో అమలు చేయనున్న గాంధీ ఆశ్రమ్ మెమోరియల్ మాస్టర్‌ప్లాన్‌ను ప్రారంభించారు. ఆధునీకరించిన కోచ్రాబ్ ఆశ్రమాన్ని ప్రారంభించారు. మహాత్మాగాంధీ ఆరంభించిన సబర్మతి ఆశ్రమం కేవలం మన దేశానికే కాదు, మొత్తం మానవాళికే వారసత్వ సంపద అని తేల్చిచెప్పారు. పోఖ్రాన్లో అబ్బురపర్చిన ‘భారత్ శక్తి’ భారతదేశ ఆత్మనిర్భరత, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవానికి పోఖ్రాన్ ఒక ఘనమైన సాక్షి అని ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యానించారు. రాజస్తాన్ రాష్ట్రం పోఖ్రాన్‌లోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో మంగళవారం భారత త్రివిధ దళాలు ‘భారత్ శక్తి’ పేరిట సైనిక విన్యాసాలు నిర్వహించారు. దాదాపు 50 నిమిషాల పాటు జరిగిన ఈ విన్యాసాలను మోదీ ప్రత్యక్షంగా తిలకించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాలు, రక్షణ పరికరాల విన్యాసాలు చూపరులను అబ్బురపర్చాయి. తేజస్, ఏఎల్ఎస్ ఎంకే–4 యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకులు అర్జున్, కె–9 వజ్ర, ధనుష్ వంటివి ఆకట్టుకున్నాయి. పినాకా ఉపగ్రహ వ్యవస్థతోపాటు డ్రోన్ల విన్యాసాలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. ఆకాశంలో మన యుద్ధ విమానాల గర్జనలు, నేలపై మన జవాన్ల సాహసాలు నవ భారత్(న్యూ ఇండియా)కు ఆహ్వానం పలుకుతున్నామని మోదీ పేర్కొన్నారు. -
ఏపీలో రైల్వే అభివృద్ధికి సహకరించండి
సాక్షి, ఢిల్లీ: రాష్ట్రంలో పలు రైల్వే అభివృద్ధి పనులకు సహకరించాలని కేంద్రాన్ని కోరామని వైఎస్సార్సీపీ ఎంపీ రెడ్డప్ప తెలిపారు. సోమవారం ఆయన రైల్వే స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కడప- బెంగుళూరు, చిత్తూరు-బెంగుళూరు మార్గాలకు ఇప్పటి వరకు నిధులు కేటాయించలేదని వెంటనే నిధులు కేటాయించాలని కోరినట్లు ఆయన తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో అండర్ బ్రిడ్జి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. వెంటనే బ్రిడ్జి నిర్మించాలని కోరామన్నారు. చిత్తూరు రైల్వేస్టేషన్లో అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. అమరావతి నుంచి ఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలును కేటాయించాలని అడిగామన్నారు. విశాఖ రైల్వే జోన్ పనులు వేగవంతం చేయాలని కూడా ప్రస్తావించామని ఎంపీ రెడ్డప్ప పేర్కొన్నారు. చదవండి: ఐటీ, నైపుణ్యాభివృద్ధిపై సీఎం కీలక నిర్ణయాలు -
రైల్వే 'డబ్లింగ్'...
మచిలీపట్నం : రాష్ట్ర విభజన జరిగిన అనంతరమయినా మన ప్రాంతంలోని రైలు మార్గాలు అభివృద్ధి చెందుతాయనుకుంటున్న ప్రజల ఆశలు అడియాసలుగానే మిగిలిపోతాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దిశగా పాలకులు పెద్దగా దృష్టి పెట్టకపోవడమే దీనికి కారణం. మచిలీపట్నం - విజయవాడ మధ్య 80 కిలోమీటర్ల మేర రైల్వే డబ్లింగ్ చేస్తామని ఎన్నాళ్లుగానో పాలకులు చెబుతూ వస్తుండగా.. ఎట్టకేలకు మూడు సంవత్సరాల క్రితం సర్వే నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం 50శాతం, కేంద్ర ప్రభుత్వం 50శాతం నిధులతో ఈ పనులను చేస్తామని గతంలో ప్రకటించారు. 2012 ఫిబ్రవరిలో రైల్వే డబ్లింగ్ పనులకు సంబంధించి సర్వే నిర్వహించారు. కోస్తా ప్రాంతం వెంబడి ఉన్న మచిలీపట్నం, నర్సాపురం, గుడివాడ, విజయవాడ, భీమవరం వరకు 221 కిలోమీటర్ల మేర రైల్వే లైన్లను డబ్లింగ్ చేసేందుకు రూ.1020 కోట్లు అవసరమవుతాయని అప్పట్లో అంచనా వేశారు. అయితే భీమవరం - గుడివాడ, విజయవాడ - గుడివాడ మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు 2012 సెప్టెంబరు 7వ తేదీన టెండర్లు పిలిచారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో కోస్తా తీరం వెంబడి రైలు మార్గాల అభివృద్ధికి నిధులే మంజూరు చేయలేదు.దీంతో ఈప్రాంత ప్రజలకు ఈ పనులపై తీవ్ర అయోమయం నెలకొంది. నిధుల కేటాయింపు జరిగేనా? కోస్తా తీరం వెంబడి ఉన్న రైల్వే లైన్‌ను అభివృద్ధి చేస్తామని పాలకులు చెబుతూ వస్తున్నారు. అయితే రాష్ట్ర విభజన జరగడంతో ప్రభుత్వం ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నం - గుడివాడ - విజయవాడ మధ్య డబ్లింగ్ పనులు జరిగే అవకాశం లేదని అధికారులు సూచనప్రాయంగా చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం నిధులను ఈ పనులకు కేటాయిస్తేనే కేంద్ర ప్రభుత్వం మరో 50శాతం నిధులను కేటాయిస్తుందని అప్పుడే డబ్లింగ్ పనులను చేసేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గుడివాడ - మచిలీపట్నం మధ్య రైల్వేలైను అభివృద్ధికి నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు జిల్లాకు చెందిన పాలకులు ఎంతమేర స్పందిస్తారనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. బ్రిటీష్ పరిపాలనా కాలంలో కోస్తా ప్రాంతంలో వ్యాపార కేంద్రంగా వెలుగొందిన మచిలీపట్నం రైల్వేస్టేషన్ స్వదేశీ పాలనలో చిన్నపాటి స్టేషను స్థాయిలో సేవలందిస్తోంది. బ్రిటీష్ పరిపాలనా కాలంలో మార్మగోవా నుంచి మచిలీపట్నం వరకు రైల్వేలైను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి రైలు మార్గం ద్వారా సరుకులను ఇక్కడికి తరలించి బందరు పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేసేవారు. ఇతర దేశాల నుంచి వచ్చిన సరుకులను దిగుమతి చేసుకుని రైలు మార్గం ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించేవారు. బ్రిటీష్ పాలకులు 100 సంవత్సరాలకు పూర్వం ఈ రైల్వే ట్రాక్ నిర్మించారు. బ్రిటీష్ పాలకులు నిర్మించిన రైల్వే ట్రాక్ మినహా ఈ ప్రాంతంలో రైల్వేశాఖ ఎటువంటి అభివృద్ధి చేయకపోవడం గమనార్హం. అధికారంలోకి రావడానికి రైల్వేలైను డబ్లింగ్ పనులు చేపడతామని అన్ని రాజకీయ పార్టీల నాయకులు చెబుతూ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ విషయాన్ని మరచిపోవడం రివాజుగా మారింది. డబ్లింగ్ ప్రతిపాదనలు ఇలా.. విజయవాడ- గుడివాడ మధ్య 43 కిలోమీటర్లు, గుడివాడ - మచిలీపట్నం మధ్య 37 కిలోమీటర్లు , గుడివాడ - భీమవరం మధ్య 66 కిలోమీటర్లు, భీమవరం - నర్సాపూర్ మధ్య 30 కిలోమీటర్లు, భీమవరం - నిడదవోలు మధ్య 46 కిలోమీటర్లుకు రైల్వే లైన్ డంబ్లింగ్, విద్యుధీకరణ, సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు సర్వే నిర్వహించారు. 221కిలోమీటర్లకు ఈ పనులను చేసేందుకు రూ. 1020 కోట్లు అవసరమని 2012వ సంవత్సరంలో అంచనా రూపొందించారు. 221 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ డంబ్లింగ్లో భాగంగా 747 చోట్ల మైనర్ వంతెనలు, కల్వర్టులు నిర్మించాల్సి ఉంటుందని నిర్ణయించారు. 18 మీటర్లు లేదా 60 అడుగులకు పైబడిన డ్రెయిన్లు, కాలువలు 27 ఉన్నాయని ఈ ప్రాంతాల్లో మేజర్ వంతెనలను నిర్మించేందుకు అంచనాలు తయారు చేశారు. మార్కెట్లో మెటీరియల్ ధరలను దృష్టిలో ఉంచుకుని మూడు సంవత్సరాల క్రితం ఒక కిలోమీటరు రైల్వేలైను, సిగ్నల్ వ్యవస్థ, విద్యుదీకరణ పనులకు రూ.4.50 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని నిర్ణయించారు. ప్రస్తుతం అన్ని ధరలు పెరగడంతో ఈ అంచనా వ్యయం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఆరు సంవత్సరాలుగా మచిలీపట్నం నుంచి వివిధ ప్రాంతాలకు ఒక్క నూతన రైలు సర్వీసునూ మంజూరు చేయలేదు. దీంతో పాటు మచిలీపట్నం - రేపల్లె మధ్య 47 కిలోమీటర్లు మేర నూతన రైల్వేలైను ఏర్పాటు చేసేందుకు ఏడు సంవత్సరాల క్రితం సర్వే చేశారు. ఈ సర్వే ప్రతిపాదన ఎక్కడ ఉందో ఎవరికి తెలియని దుస్థితి. మచిలీపట్నం - రేపల్లె మధ్య రైల్వే లైను నిర్మిస్తే కలకత్తా నుంచి చెన్నైకు దాదాపు 80 కిలోమీటర్ల మేర దూరం తగ్గే అవకాశం ఉంది. ప్రయాణ సమయం కలిసి వస్తుంది. కోస్తా తీరం వెంబడి లభించే మత్స్యసంపదను కలకత్తా, చెన్నైలకు తక్కువ ఖర్చుతో తరలించేందుకు అవకాశం ఉంది.