రైల్వే 'డబ్లింగ్'... | no funds released for Railway doubling | Sakshi
Sakshi News home page

రైల్వే 'డబ్లింగ్'...

Published Tue, Oct 7 2014 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM

no funds released for Railway doubling

మచిలీపట్నం : రాష్ట్ర విభజన జరిగిన అనంతరమయినా మన ప్రాంతంలోని రైలు మార్గాలు  అభివృద్ధి చెందుతాయనుకుంటున్న ప్రజల ఆశలు అడియాసలుగానే మిగిలిపోతాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దిశగా పాలకులు పెద్దగా దృష్టి పెట్టకపోవడమే దీనికి కారణం. మచిలీపట్నం - విజయవాడ  మధ్య 80 కిలోమీటర్ల మేర రైల్వే డబ్లింగ్ చేస్తామని ఎన్నాళ్లుగానో పాలకులు చెబుతూ వస్తుండగా.. ఎట్టకేలకు  మూడు సంవత్సరాల క్రితం సర్వే నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం 50శాతం, కేంద్ర ప్రభుత్వం 50శాతం నిధులతో ఈ పనులను చేస్తామని గతంలో ప్రకటించారు.

2012 ఫిబ్రవరిలో రైల్వే డబ్లింగ్ పనులకు సంబంధించి సర్వే నిర్వహించారు. కోస్తా ప్రాంతం వెంబడి ఉన్న మచిలీపట్నం, నర్సాపురం, గుడివాడ, విజయవాడ, భీమవరం వరకు 221 కిలోమీటర్ల మేర రైల్వే లైన్లను డబ్లింగ్ చేసేందుకు రూ.1020 కోట్లు అవసరమవుతాయని అప్పట్లో అంచనా వేశారు. అయితే భీమవరం - గుడివాడ, విజయవాడ - గుడివాడ మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు 2012 సెప్టెంబరు 7వ తేదీన టెండర్లు పిలిచారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కోస్తా తీరం వెంబడి రైలు మార్గాల అభివృద్ధికి నిధులే మంజూరు చేయలేదు.దీంతో ఈప్రాంత ప్రజలకు ఈ పనులపై తీవ్ర అయోమయం నెలకొంది.

నిధుల కేటాయింపు జరిగేనా?
కోస్తా తీరం వెంబడి ఉన్న రైల్వే లైన్‌ను అభివృద్ధి చేస్తామని పాలకులు చెబుతూ వస్తున్నారు.  అయితే రాష్ట్ర విభజన  జరగడంతో ప్రభుత్వం ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నం - గుడివాడ - విజయవాడ  మధ్య డబ్లింగ్ పనులు జరిగే అవకాశం లేదని అధికారులు సూచనప్రాయంగా చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం నిధులను ఈ పనులకు కేటాయిస్తేనే కేంద్ర ప్రభుత్వం మరో 50శాతం నిధులను కేటాయిస్తుందని అప్పుడే డబ్లింగ్ పనులను చేసేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.  

గుడివాడ - మచిలీపట్నం  మధ్య రైల్వేలైను అభివృద్ధికి నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి  తీసుకొచ్చేందుకు  జిల్లాకు చెందిన పాలకులు ఎంతమేర స్పందిస్తారనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. బ్రిటీష్ పరిపాలనా కాలంలో కోస్తా ప్రాంతంలో వ్యాపార కేంద్రంగా వెలుగొందిన మచిలీపట్నం రైల్వేస్టేషన్ స్వదేశీ పాలనలో చిన్నపాటి స్టేషను స్థాయిలో సేవలందిస్తోంది. బ్రిటీష్ పరిపాలనా కాలంలో మార్మగోవా నుంచి మచిలీపట్నం వరకు రైల్వేలైను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి రైలు మార్గం ద్వారా సరుకులను ఇక్కడికి తరలించి బందరు పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేసేవారు. ఇతర దేశాల నుంచి వచ్చిన సరుకులను దిగుమతి చేసుకుని రైలు మార్గం ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించేవారు. బ్రిటీష్ పాలకులు  100 సంవత్సరాలకు  పూర్వం ఈ రైల్వే ట్రాక్ నిర్మించారు. బ్రిటీష్ పాలకులు నిర్మించిన రైల్వే ట్రాక్ మినహా ఈ ప్రాంతంలో రైల్వేశాఖ ఎటువంటి అభివృద్ధి  చేయకపోవడం గమనార్హం. అధికారంలోకి రావడానికి రైల్వేలైను డబ్లింగ్ పనులు చేపడతామని అన్ని రాజకీయ పార్టీల నాయకులు చెబుతూ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ విషయాన్ని మరచిపోవడం రివాజుగా మారింది.
 
డబ్లింగ్ ప్రతిపాదనలు ఇలా..
విజయవాడ- గుడివాడ మధ్య 43 కిలోమీటర్లు, గుడివాడ - మచిలీపట్నం మధ్య 37 కిలోమీటర్లు , గుడివాడ - భీమవరం మధ్య 66 కిలోమీటర్లు, భీమవరం - నర్సాపూర్ మధ్య 30 కిలోమీటర్లు, భీమవరం - నిడదవోలు మధ్య 46 కిలోమీటర్లుకు రైల్వే లైన్ డంబ్లింగ్, విద్యుధీకరణ, సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు సర్వే నిర్వహించారు. 221కిలోమీటర్లకు ఈ పనులను చేసేందుకు రూ. 1020 కోట్లు అవసరమని 2012వ సంవత్సరంలో అంచనా  రూపొందించారు. 221 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ డంబ్లింగ్‌లో భాగంగా 747 చోట్ల మైనర్ వంతెనలు, కల్వర్టులు నిర్మించాల్సి ఉంటుందని నిర్ణయించారు. 18 మీటర్లు లేదా 60 అడుగులకు పైబడిన డ్రెయిన్‌లు, కాలువలు 27 ఉన్నాయని ఈ ప్రాంతాల్లో మేజర్ వంతెనలను నిర్మించేందుకు అంచనాలు తయారు చేశారు.

మార్కెట్‌లో మెటీరియల్ ధరలను దృష్టిలో ఉంచుకుని మూడు సంవత్సరాల క్రితం ఒక కిలోమీటరు రైల్వేలైను, సిగ్నల్ వ్యవస్థ, విద్యుదీకరణ పనులకు రూ.4.50 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని నిర్ణయించారు. ప్రస్తుతం అన్ని ధరలు పెరగడంతో ఈ అంచనా వ్యయం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.  ఆరు సంవత్సరాలుగా మచిలీపట్నం నుంచి వివిధ ప్రాంతాలకు ఒక్క నూతన రైలు సర్వీసునూ మంజూరు చేయలేదు. దీంతో పాటు మచిలీపట్నం - రేపల్లె  మధ్య 47 కిలోమీటర్లు మేర నూతన రైల్వేలైను  ఏర్పాటు చేసేందుకు ఏడు సంవత్సరాల క్రితం సర్వే చేశారు. ఈ సర్వే ప్రతిపాదన ఎక్కడ ఉందో ఎవరికి తెలియని దుస్థితి. మచిలీపట్నం - రేపల్లె  మధ్య రైల్వే లైను నిర్మిస్తే కలకత్తా నుంచి చెన్నైకు దాదాపు 80 కిలోమీటర్ల మేర దూరం తగ్గే అవకాశం ఉంది. ప్రయాణ సమయం కలిసి వస్తుంది. కోస్తా తీరం వెంబడి లభించే మత్స్యసంపదను కలకత్తా, చెన్నైలకు తక్కువ ఖర్చుతో తరలించేందుకు అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement