దిగడం సరే.. ఎక్కడమెలా!
కన్ఫ్యూజ్ హాల్టింగ్ ఆర్డర్స్
రైల్వే అధికారుల వింత వైఖరిపై విమర్శలు
ఆందోళనలో ప్రయాణికులు
రాజంపేట: ఒక రైలుకు ఒక స్టేషన్‌లో హాల్టింగ్ ఇస్తే.. ఆ రైలు అప్, డౌన్‌లకు హాల్టింగ్ ఉన్నట్లే.. అయితే గుంతకల్లు డీవోఎం(కోచ్) పేరిట విడుదలైన ఉత్తర్వులలో హాల్టింగ్స్ పై వింతవైఖరి శనివారం బట్టబయలైంది. పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కన్ఫ్యూజ్ హాల్టింగ్ ఆర్డర్స్ జారీ చేసి ప్రయాణికులను గందరగోళంలోకి నెట్టేశాయి. మోదీ పాలనలో అడ్డగోలుగా అధికారులు తీసుకుంటున్న వింత నిర్ణయాలతో కేంద్రం పేద, మధ్యతరగతి వారి నుంచి చెడ్డపేరు మూటకట్టుకుందనే విమర్శలున్నాయి. ఈ పరిస్థితి ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో రైల్వేపరంగా గుర్తింపు కలిగిన నందలూరు రైల్వేకేంద్రంలో చోటుచేసుకుంది.
కడప నుంచి విశాఖకు (17487) తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలుకు నందలూరులో హాల్టింగ్ ఎత్తివేశారు. అయితే విశాఖ నుంచి తిరుపతికి వచ్చే తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలుకు నందలూరులో హాల్టింగ్ ఇచ్చారు. ఎక్కేందుకు వీలులేకుండా, వచ్చేందుకు వీలు కల్పించే హాల్టింగ్ ఇచ్చారు. అలాగే 17415 నంబరుతో నడిపించే తిరుపతి నుంచి కోల్హాపూర్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలుకు హాల్టింగ్‌ను ఎత్తివేశారు. అయితే కోల్హాపూర్ నుంచి తిరుపతికి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌కు నందలూరు హాల్టింగ్‌ను ఇచ్చారు. ఈ విధంగా హాల్టింగ్స్ ఇవ్వడం విడ్డూరంగా ఉందని రైల్వే వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
ఓబులవారిపల్లె, రాజంపేటలో..
ఓబులవారిపల్లెలో రైల్వే జంక్షన్‌లో నందలూరు రైల్వేకేంద్రం తరహాలోనే 17415 నంబరు గల తిరుపతి –కోల్హాపూర్, తిరుపతి–నిజాముద్దీన్, నిజాముద్దీన్–తిరుపతి మధ్య నడిచే (12793/12794) రైలుకు పూర్తిగా హాల్టింగ్ ఎత్తివేశారు. రాజంపేట రైల్వేస్టేషన్‌లో మధురై నుంచి లోకమాన్యతిలక్ (22102)కు హాల్టింగ్ ఎత్తేశారు. ఎక్కడానికి మాత్రమే హాల్టింగ్, దిగడానికి హాల్టింగ్ లేకుండా చేశారు. రాజంపేట పరిసర ప్రాంతాల నుంచి అనేక మంది కంటి ఆపరేషన్లకు మధురైకు వెళుతుంటారు. అదే రైల్లో తిరిగి తమ గమ్యాలకు చేరుకుంటున్నారు. వారు రైల్వే అధికారులు తీసుకున్న వింత నిర్ణయాలపై పెదవి విరిస్తున్నారు. ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్‌లో కాచిగూడ నుంచి చెంగల్పట్టుకు వెళ్లే (17652)రైలుకు హాల్టింగ్ ఎత్తివేశారు.
Comments
Please login to add a commentAdd a comment