Halting
-
దిగడం సరే.. ఎక్కడమెలా!
రాజంపేట: ఒక రైలుకు ఒక స్టేషన్లో హాల్టింగ్ ఇస్తే.. ఆ రైలు అప్, డౌన్లకు హాల్టింగ్ ఉన్నట్లే.. అయితే గుంతకల్లు డీవోఎం(కోచ్) పేరిట విడుదలైన ఉత్తర్వులలో హాల్టింగ్స్ పై వింతవైఖరి శనివారం బట్టబయలైంది. పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కన్ఫ్యూజ్ హాల్టింగ్ ఆర్డర్స్ జారీ చేసి ప్రయాణికులను గందరగోళంలోకి నెట్టేశాయి. మోదీ పాలనలో అడ్డగోలుగా అధికారులు తీసుకుంటున్న వింత నిర్ణయాలతో కేంద్రం పేద, మధ్యతరగతి వారి నుంచి చెడ్డపేరు మూటకట్టుకుందనే విమర్శలున్నాయి. ఈ పరిస్థితి ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో రైల్వేపరంగా గుర్తింపు కలిగిన నందలూరు రైల్వేకేంద్రంలో చోటుచేసుకుంది. కడప నుంచి విశాఖకు (17487) తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలుకు నందలూరులో హాల్టింగ్ ఎత్తివేశారు. అయితే విశాఖ నుంచి తిరుపతికి వచ్చే తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలుకు నందలూరులో హాల్టింగ్ ఇచ్చారు. ఎక్కేందుకు వీలులేకుండా, వచ్చేందుకు వీలు కల్పించే హాల్టింగ్ ఇచ్చారు. అలాగే 17415 నంబరుతో నడిపించే తిరుపతి నుంచి కోల్హాపూర్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలుకు హాల్టింగ్‌ను ఎత్తివేశారు. అయితే కోల్హాపూర్ నుంచి తిరుపతికి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌కు నందలూరు హాల్టింగ్‌ను ఇచ్చారు. ఈ విధంగా హాల్టింగ్స్ ఇవ్వడం విడ్డూరంగా ఉందని రైల్వే వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఓబులవారిపల్లె, రాజంపేటలో..ఓబులవారిపల్లెలో రైల్వే జంక్షన్లో నందలూరు రైల్వేకేంద్రం తరహాలోనే 17415 నంబరు గల తిరుపతి –కోల్హాపూర్, తిరుపతి–నిజాముద్దీన్, నిజాముద్దీన్–తిరుపతి మధ్య నడిచే (12793/12794) రైలుకు పూర్తిగా హాల్టింగ్ ఎత్తివేశారు. రాజంపేట రైల్వేస్టేషన్లో మధురై నుంచి లోకమాన్యతిలక్ (22102)కు హాల్టింగ్ ఎత్తేశారు. ఎక్కడానికి మాత్రమే హాల్టింగ్, దిగడానికి హాల్టింగ్ లేకుండా చేశారు. రాజంపేట పరిసర ప్రాంతాల నుంచి అనేక మంది కంటి ఆపరేషన్లకు మధురైకు వెళుతుంటారు. అదే రైల్లో తిరిగి తమ గమ్యాలకు చేరుకుంటున్నారు. వారు రైల్వే అధికారులు తీసుకున్న వింత నిర్ణయాలపై పెదవి విరిస్తున్నారు. ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్లో కాచిగూడ నుంచి చెంగల్పట్టుకు వెళ్లే (17652)రైలుకు హాల్టింగ్ ఎత్తివేశారు. -
జడ్జిగారూ.. వందే భారత్ ఆగేలా ఆదేశించండి
ఢిల్లీ: భారత సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ గురించి దేశంలో ఎక్కువ చర్చ నడుస్తోంది. ఒకదాని తర్వాత మరో సర్వీస్ పట్టాలెక్కుతుండడంతో.. ఇతర రైళ్లపైనా ఈ ప్రభావం పడుతోంది. అయితే.. తాజాగా సుప్రీం కోర్టులో వందేభారత్ గురించి ఓ పిటిషన్ దాఖలు అయ్యింది. వందేభారత్ రైలును తమ ఊరి స్టేషన్లో ఆగేలా రైల్వే శాఖకు ఆదేశాలు జారీ చేయాలంటూ కేరళకు చెందిన ఓ యువ లాయర్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో పిటిషనర్ పీటీ షీజీష్‌ను సుప్రీం కోర్టు మందలించగా.. కనీసం ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలించేలా ఆదేశాలివ్వాలని కోరగా.. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ మండిపడింది. ఇది అసాధారణమైన విజ్ఞప్తి.. దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని పోస్టాఫీసుగా భావించొద్దంటూ ధర్మాసనం మండిపడింది. వందేభారత్ రైలు ఎక్కడ ఆగాలో నిర్ణయించాలని మమ్మల్ని కోరుతున్నావ్?.. తర్వాత ఢిల్లీ-ముంబై రాజధానిని ఆపాలని అడుగుతావా?.. ఇది విధానాలకు సంబంధించిన విషయం కాబట్టి అధికారులకు దగ్గరకు వెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూనే పిటిషనర్‌కు బెంచ్ సూచించింది. ఇక పరిశీలనకు పంపాలన్న అభ్యర్థనకు సైతం అభ్యంతరం వ్యక్తం చేసిన సీజేఐ.. ఇందులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. వందేభారత్ రైలు.. తిరువనంతపురం నుంచి కాసర్గోడ్ మధ్య నడుస్తోంది. అత్యధిక జన సాంద్రత.. పైగా ప్రయాణికుల రద్దీతో ఉండే మలప్పురం స్టేషన్‌కు మాత్రం వందేభారత్ స్టాప్ కేటాయించలేదు. బదులుగా.. తిరూర్ రైల్వేస్టేషన్లో వందేభారత్‌కు స్టాప్‌ను కేటాయించించింది రైల్వేశాఖ. అయితే.. ఆ తర్వాత ఆ ప్రతిపాదనను విస్మరించిందని.. చుట్టుపక్కల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంట్నునారంటూ పిటిషనర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. బదులుగా 60 కిలోమీటర్ల దూరంలోని పలక్కాడ్ షోర్నూర్‌కు స్టాప్ మంజూరు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు పిటిషనర్. అయితే.. వందే భారత్ రైలు వంటి హై స్పీడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు వ్యక్తిగత లేదంటే స్వార్థ ప్రయోజనాల ఆధారంగా డిమాండ్‌పై స్టాప్‌లు కేటాయించబడవు. ప్రజల డిమాండ్ మేరకు స్టాప్‌లు ఏర్పాటు చేస్తే, ఎక్స్‌ప్రెస్ రైలు అనే పదం తప్పుగా మారుతుంది అని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అంతకు ముందు పిటిషనర్ కేరళ హైకోర్టులోనూ ఓ పిటిషన్ వేయగా.. అది రైల్వే పరిధిలోకి వస్తుందంటూ ఉన్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. -
నాడు ఘనం .. నేడు కనం..!
చిన్నశంకరంపేట : సికింద్రాబాద్-నిజామాబాద్ రైల్వే మార్గంలో ఉన్న మిర్జాపల్లి రైల్వే స్టేషన్‌ది ఒకప్పుడు ఘనమైనే చరిత్రే. కానీ నేడు రైల్వే అధికారులు మిర్జాపల్లి రైల్వేస్టేషన్‌పై చిన్నచూపు చూస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఈ మార్గంలో వెళ్లే రైలు ఏదైనా ఇక్కడ ఆగాల్సిందే. అజ్మీర్, అజంత, జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇక్కడ హాల్టింగ్ ఉండేది. సికింద్రాబాద్-నిజామాబాద్ రైలు మార్గంలో బొల్లారం, కామరెడ్డి రైల్వే స్టేషన్లకు ఉన్న ప్రాధాన్యం మిర్జాపల్లి రైల్వేస్టేషన్‌కు ఉండేది. కానీ నేడు ఈ మార్గంలో వెళుతున్న రైళ్లలో హాల్టింగ్ లేనివే ఎక్కువ. ఒకప్పుడు ఇక్కడ హాల్టింగ్ ఉన్న అజంత, జైపూర్, అజ్మీర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు సైతం ఇక్కడ ఆగడంలేదు. మరో వైపు సాయినగర్ (షిర్డీ), అమరావతి, ఒకా, నాందేడ్, ఇండోర్, నర్సాపూర్, చెన్నై ఎక్స్‌ప్రెస్‌లు వెళుతున్నా ఇక్కడ హాల్టింగ్ లేదు. ప్రస్తుతం చెప్పుకోదగిన ఎక్స్‌ప్రెస్ దేవగిరి (ముంబాయి), కృష్ణా (తిరుపతి), బాసర ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-నిజామాబాద్ మధ్యన నడిచే పాస్ట్ పాసింజర్లతో పాటు నిజామాబాద్-మిర్జాపల్లి లోకల్, సికింద్రాబాద్-మిర్జాపల్లి లోకల్ రైళ్లు మాత్రమే ఉన్నాయి. మిర్జాపల్లి రైల్వే స్టేషన్ నార్సింగి జాతీయ రహదారికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో పాటు చిన్నశంకరంపేట, శేరిపల్లి, మడూర్ పరిసర గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అధికారులు స్పందించి గతంలో ఉన్న ప్రాధాన్యతను మిర్జాపల్లి రైల్వేస్టేషన్‌కు ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. అదనపు ప్లాట్ఫారం అవసరం.. మిర్జాపల్లి రైల్వేస్టేషన్లో అదనపు ప్లాట్ఫారం లేకపోవడంతో చిన్నారులు, వృద్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మిర్జాపల్లి రైల్వే స్టేషన్లో మూడు ట్రాక్‌లు ఉన్నాయి. అవసరమైతే మూడు రైళ్లు కూడా స్టేషన్లో ఏకకాలంలో హాల్టింగ్ చేసే ఏర్పాటు ఉంది. కానీ ప్రయాణికులు బోగీలోకి వెళ్లేందుకు అవసరమైన అదనపు ప్లాట్ఫారం లేకపోవడంతో సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఒకే సమయంలో రెండు రైళ్లు స్టేషన్లో క్రాసింగ్ అవుతున్న సమయంలో రెండో లైన్‌పైకి వచ్చే రైలు బోగిలోకి వెళ్లేందుకు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఇక లగేజి ఉన్న వాళ్ల అవస్థలు చెప్పనలవికాదు. రైల్వే నిబంధనల ప్రకారం రైల్వే ట్రాక్‌ను దాటడం నేరం. కానీ ఇక్కడ అన్నీ తెలిసీ రైల్వే అధికారులు ప్రయాణికులు ట్రాక్ దాటేలా చేస్తున్నారు. మరో సారి వినతి పత్రం అందిస్తాం... మిర్జాపల్లిలో గతంలో హాల్టింగ్ ఉన్న అజంత, జైపూర్, అజ్మీర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని వినతి పత్రం అందించాం. అలాగే రైల్వే స్టేషన్లో అదనపు ప్లాట్ ఫారం ఏర్పాటు చేయాలని కోరామని చిన్నశంకరంపేట ఎంపీపీ అధ్యక్షురాలు కృపావతి, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మిర్జాపల్లి సర్పంచ్ నర్సమ్మ, ఉపసర్పంచ్ మనోజ్ తెలిపారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ద్వారా ఈనెల 5న అక్కన్నపేటకు వస్తున్న దక్షిణ మధ్య రైల్వే జీఎం దృష్టికి సమస్య తీసుకవెళతామన్నారు. -
జిల్లా మీదుగా మరో రైలు
♦ సికింద్రాబాద్- నిజామాబాద్ మార్గంలో స్పెషల్ డెమో ♦ అక్కన్నపేట, శ్రీనివాస్‌నగర్ రైల్వేస్టేషన్లలో హాల్టింగ్ చిన్నశంకరంపేట: సికింద్రాబాద్-నిజామాబాద్ రైలు మార్గంలో శుక్రవారం మరో రైలు ప్రారంభమైంది. 07277 నంబర్ స్పెషల్ డెమో రైలు మల్కాజిగిరి, బొల్లారం, మేడ్చల్, శ్రీనివాస్‌నగర్, అక్కన్నపేట, కామారెడ్డి, డిచ్పల్లి, నిజామాబాద్ స్టేషన్లలో ఆగుతుంది. ఇది వారంలో ఐదు రోజులే నడవనుంది. దీనిని మీర్జాపల్లి, వడియారం రైల్వే స్టేషన్లలోనూ ఆపాలని ప్రయాణికులు కోరుతున్నారు. వేళలు ఇలా... ♦ ఉదయం 07.26కి నిజామాబాద్‌లో ప్రారంభమై మెదక్ జిల్లా అక్కన్నపేటకు 08.31కి చేరుతుంది. ♦ ఇక్కడ నుంచి మాసాయిపేట శ్రీనివాస్ నగర్ రైల్వేస్టేషన్‌కు 09-08కు, మల్కాజిగిరికి 10.21 నిమిషాలకు చేరుకుంటుంది. ♦ తిరిగి సాయంత్రం 4.01కి మల్కాజిగిరి నుంచి ప్రారంభమై శ్రీనివాస్‌నగర్‌కు 5కి, అక్కన్నపేట 5.39కి చేరుతుంది. -
సెప్టెంబర్ 1 నుంచి కొత్త రైల్వే టైమ్‌టేబుల్
హైదరాబాద్ : వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి కొత్త సదరన్ రైల్వే టైమ్‌టేబుల్ అమల్లోకి రానుంది. ఈ మేరకు పలు రైళ్ల వేళల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొన్ని రైళ్ల నంబర్లలోనూ, అదనపు హాల్టింగ్ సదుపాయాలలోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రతి సంవత్సరం జూలై మొదటి వారంలోనే కొత్త రైల్వే టైమ్‌టేబుల్‌ను ప్రవేశపెడతారు. కానీ ఈ ఏడాది నూతన ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలో ఆలస్యమైంది. ఈ టైమ్‌టేబుల్ పుస్తకంలో దక్షిణ రైల్వే, దక్షిణమధ్యరైల్వే, దక్షిణపశ్చిమ రైల్వే, కొంకణ్ రైల్వేస్‌కు సంబంధించిన రైళ్ల రాకపోకల వేళలు, నంబర్లు, రైళ్ల పొడిగింపు వంటి వివరాలుంటాయి. నాలుగు జోన్ల రైళ్ల వివరాల రూపకల్పనలో యంత్రాంగం నిమగ్నమై ఉన్నట్లు సీపీఆర్వో కె.సాంబశివరావు చెప్పారు.