పదేళ్లుగా నిర్లక్ష్యం | neglect from ten years | Sakshi
Sakshi News home page

పదేళ్లుగా నిర్లక్ష్యం

Published Thu, Jan 16 2014 11:48 PM | Last Updated on Thu, Aug 30 2018 5:49 PM

neglect from ten years

కోహీర్, న్యూస్‌లైన్:  అధికారుల అలసత్వం.. పట్టించుకోని పాలకులు..ఫలితంగా రోడ్డు పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతోంది. దీంతో ప్రజలు కష్టాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. రంగారెడ్డి జిల్లాలో ని వాణిజ్య కేంద్రమైన మర్పల్లి నుంచి కోహీర్ మండలంలోని మనియార్‌పల్లి వరకు సుమారు పది కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రంగారెడ్డి జిల్లా ఇంజనీరింగ్ విభాగం అధికారులు పదేళ్ల క్రితం శ్రీకారం చుట్టారు.

 రంగారెడ్డి జిల్లా పరిధిలోని జాజిగుబ్బడి తండాకు వెళ్లాలంటే కోహీర్ మండలంలోని లాల్‌సింగ్ తండా సమీపం నుంచి వెళ్లాల్సిఉంది. ఈ నేపథ్యంలో కోహీర్ మండలంలో కొంత దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే 10 కిలోమీటర్ల రోడ్డులో సుమారు 3 కిలో మీటర్లు రంగారెడ్డి జిల్లా పరిధిలో 7 కిలోమీటర్లు రోడ్డు మెదక్ జిల్లా పరిధిలో ఉంది. కేవలం ఏడు ఇళ్లున్న జాజిగుబ్బడి తండా ప్రజల సౌకర్యార్థం రంగారెడ్డి జిల్లా ఇంజనీరింగ్ విభాగం అధికారులు  పదేళ్ల క్రితం రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. రోడ్డు ఫార్మేషన్ చేసి బీటీ రోడ్డు వేశారు.

తమ పరిధిలో లేకపోయినా రంగారెడ్డి జిల్లా అధికారులు జాజిగుబ్బడి తండా ప్రజల కోసం 5 కిలోమీటర్ల రోడ్డు నిర్మించారు. అంటే మెదక్ జిల్లాలో అదనంగా రెండు కిలోమీటర్ల రోడ్డు నిర్మించారు. అయితే కోహీర్ మండల పరిధిలో మరో 5 కిలోమీటర్ల రోడ్డు నిర్మించాల్సి ఉంది. ఒక కిలోమీటరు రోడ్డు నిర్మిస్తే 120 ఇళ్లున్న కోహీర్ మండలంలోని లాల్‌సింగ్ తండా వాసులకు, మరో 4 కిలోమీటర్లు రోడ్డు నిర్మిస్తే మనియార్‌పల్లి వాసులకు నేరుగా రంగారెడ్డి జిల్లాకు రోడ్డు సౌకర్యం ఏర్పడుతుంది. రోడ్డు సౌకర్యం లేక పోవడంతో ఆయా గ్రామాల ప్రజలు అదనంగా పది కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తోంది.

మెదక్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. మండల ప్రజల విన్నపాలను పట్టించుకోవడంలేదు. తద్వారా మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా లాల్‌సింగ్ తండా వాసు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో తండాకు కాలినడకన వెళ్లడం కూడా కష్టంగా ఉంది. ఇదిలా ఉండగా మెదక్ జిల్లా పరిధిలోని రోడ్డుపై కల్వర్టు నిర్మాణం కోసం రంగారెడ్డి జిల్లా అధికారులు పైపులు తెచ్చారు.

 ఏ కారణం చేతనో గత పదేళ్లుగా పనులు మాత్రం చేపట్టడం లేదు. అటు రంగారెడ్డి జిల్లా అధికారులు, ఇటు మెదక్ జిల్లా అధికారులు కల్వర్టు నిర్మాణం గురించి పట్టించు కోవడంలేదు. కల్వర్టు నిర్మించక పోవడంతో భారీ వర్షాలు కురిస్తే తండాకు వెళ్లడం కష్టమైపోతోంది. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పం్దంచి కల్వర్టుతో పాటు రోడ్డు నిర్మించాలని మండల ప్రజలు అధికారులను కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement