lalsingh tanda
-
సండే సినిమా: వెండితెరపై జై జవాన్
సైనికులు అంటే యుద్ధం. దేశభక్తి. ప్రేమ. వియోగం. గెలుపు. మరణం. అందుకే ప్రపంచ సినిమాతో పాటు భారతీయ సినిమాలో తెలుగు సినిమాలో కూడా సైనికుడు కథానాయకుడు అవుతాడు. ‘సీతా రామమ్’లో హీరో సైనికుడు. ప్రేక్షకులు ఆ పాత్రను మెచ్చుకున్నారు. గతంలోనూ ఇలాగే మెచ్చారు. కాని నిజం చెప్పాలంటే తెలుగు సినిమాకు సైనికుడు అంతగా అచ్చి రాలేదు. ‘సండే సినిమా’లో ఈవారం ‘సైనిక సినిమా’. తెలుగు సినిమాల్లో సైనికుణ్ణి ఎక్కువగా తీసుకోరు. సైనికుడు అంటే ప్రేక్షకులు ఒక రకంగా ప్రిపేర్ అవుతారు... ఏ వీరమరణం పొందుతాడోనని. అదీగాక ఉత్తరాది వారితో పోలిస్తే దక్షిణాది వారికి సైనికులతో మానసిక అటాచ్మెంట్ తక్కువ. ఉత్తరాది వారే ఎక్కువగా సైన్యంలో భర్తీ కావడం ఇందుకు కారణం. అయినప్పటికీ మనవాళ్లు సైనిక నేపథ్యం ఉన్న పూర్తి సబ్జెక్ట్‌లను లేదా ఫ్లాష్‌బ్యాక్ కోసం కథ మలుపు కోసం సైనికుల సినిమాలు తీశారు. ‘నా జన్మభూమి ఎంత అందమైన దేశము’ అని ఏ.ఎన్.ఆర్ ‘సిపాయి చిన్నయ్య’ చేశారు. అది ఒక మోస్తరుగా ఆడింది. అదే అక్కినేని ‘జై జవాన్’లో నటిస్తే ప్రేక్షకులు మెచ్చలేదు. ఎన్.టి.ఆర్. ‘రాము’లో మిలట్రీ జవాను. హిట్ అయ్యింది. కాని అదే ఎన్.టి.ఆర్ నటించిన ‘బొబ్బిలిపులి’ సైనిక సినిమాల్లోకెల్లా పెద్ద హిట్‌గా ఇప్పటికీ నిలిచి ఉంది. అందులోని ‘జననీ జన్మభూమిశ్చ’ పాట దేశభక్తి గీతంగా మార్మోగుతూ ఉంది. కృష్ణ ‘ఏది ధర్మం ఏది న్యాయం’లో మిలట్రీ కేరెక్టర్ చేస్తే ఆడలేదు. కృష్ణ మరో సినిమా ‘చీకటి వెలుగులు’ కూడా అంతే. శోభన్ బాబు ‘బంగారు కలలు’ (ఆరాధన రీమేక్)లో ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. చిరంజీవి సైనికుడిగా నటించిన భారీ చిత్రం ‘యుద్ధభూమి’ సినీ సైనిక సెంటిమెంట్ ప్రకారం ఫ్లాప్ అయ్యింది. దీనికి దర్శకత్వం కె.రాఘవేంద్రరావు. అదే రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి ఎయిర్‌ఫోర్స్ కస్టమ్స్ ఆఫీసర్‌గా ‘చాణక్య శపథం’లో నటించినా ఫలితం అదే వచ్చింది. బాలకృష్ణ ‘విజయేంద్ర వర్మ’, ‘పరమవీర చక్ర’ తగిన ఫలితాలు రాబట్టలేదు. కాని ‘మంగమ్మ గారి మనవడు’లో చిన్న సైనిక నేపథ్యం ఉంటుంది. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. రాజశేఖర్ నటించిన ‘మగాడు’ పెద్ద హిట్ అయితే ‘అంగరక్షకుడు’, ‘ఆగ్రహం’ విఫలం అయ్యాయి. నాగార్జున ‘నిన్నే ప్రేమిస్తా’లో సైనికుడిగా కనిపిస్తాడు. సుమంత్ ‘యువకుడు’, ‘స్నేహమంటే ఇదేరా’లో సైనిక పాత్రలు చేశాడు. ఈ కాలం సినిమాలలో మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సూపర్‌హిట్ కొట్టింది. సరిహద్దులో రాయలసీమలో మహేశ్ ప్రతాపం చూపగలిగాడు. కామెడీ ట్రాక్ లాభించింది. అడవి శేష్ ‘మేజర్’ తెలుగులో అమర సైనికుల బయోపిక్‌ను నమోదు చేసింది. అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ మిశ్రమ ఫలితాలు సాధించింది. రానా ‘ది ఘాజీ అటాక్’ హిట్. నాగ చైతన్య ‘లాల్‌సింగ్ చడ్డా’లో తెలుగు సైనికుడిగా కనిపిస్తాడు. ఈ సైనిక సెంటిమెంట్ గండాన్ని దాటి ‘సీతా రామమ్’ పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇందులో రామ్ అనే సైనికుడు నూర్జహాన్ అలియాస్ సీతామహాలక్ష్మి అనే యువరాణితో ప్రేమలో పడటమే కథ. దుల్కర్ సల్మాన్, మృణాల్ పాత్రలు తెర మీద మంచి కెమిస్ట్రీని సాధించాయి. పాటలు మనసును తాకాయి. హిమాలయ సానువులు, మంచు మైదానాలు కూడా ఈ కథలో భాగమయ్యి కంటికి నచ్చాయి. గొప్ప ప్రేమకథలు విషాదాంతం అవుతాయి అన్నట్టుగా ఈ కథ కూడా విషాదాంతం అవుతుంది. అందుకే ప్రేక్షకులకు నచ్చింది. బాంధవ్యాలను, కుటుంబాలను వదిలి దేశం కోసం పహారా కాసే వీరుడు సైనికుడు. అతని చుట్టూ ఎన్నో కథలు. ఆ కథలు సరిగా చెప్తే ఆదరిస్తామని ప్రేక్షకుడు అంటున్నాడు. మున్ముందు ఎలాంటి కథలు వస్తాయో చూద్దాం. -
అమీర్‌తో ఖాన్‌కు ఫ్రెండ్‌గా నాగ చైతన్య..
గురువారం నుంచి నాగచైతన్య హిందీ సంభాషణలు పలుకుతున్నారు. అలాగే యుద్ధం కూడా చేస్తున్నారు. హిందీ చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’ కోసమే ఇదంతా. ఇందులో చైతూ స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఆమిర్ ఖాన్ లీడ్ రోల్లో హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. లాల్‌సింగ్ చద్దా (ఆమిర్ పాత్ర పేరు) ఆర్మీలో ఉన్నప్పుడు అతని స్నేహితుడి పాత్రలో నాగచైతన్య కనిపిస్తారని తెలిసింది. చైతూది కూడా ఆర్మీ మ్యాన్ పాత్ర అని టాక్. అందుకే ప్రత్యేకంగా ట్రైనర్‌ని పెట్టుకుని, మేకోవర్ అయ్యారని తెలిసింది. గురువారం లడఖ్‌లో ఆరంభమైన ఈ సినిమా సెట్స్‌లోకి ఆమిర్ ఖాన్, నాగచైతన్య తదితరులు ఎంటరయ్యారు. కొన్ని టాకీ సీన్స్‌తో పాటు యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. ఈ సీన్స్‌ని హాలీ వుడ్ స్టంట్ మాస్టర్స్ డిజైన్ చేస్తున్నారట. దాదాపు 20 రోజులు ఈ చిత్రీకరణలో పాల్గొంటారట నాగచైతన్య. -
కరోనా... కరీనా... బోలెడన్ని జాగ్రత్తలు!
కంటికి కనిపించని కరోనాతో ప్రపంచం పోరాడుతోంది. ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూనే కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నాం. ముఖ్యంగా సినిమా షూటింగ్ అంటే చాలామంది ఉంటారు కాబట్టి జాగ్రత్తలు కూడా భారీగానే ఉంటాయి. ఇదే విషయం గురించి ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ –‘‘కరోనా లాక్డౌన్ తర్వాత మా ‘లాల్‌సింగ్ చద్దా’ షూటింగ్ ఆరంభించాం. కరోనా నిబంధనలు పాటిస్తూ, జాగ్రత్తగా షూటింగ్ చేశాం. అదే సమయంలో చిత్రకథానాయిక కరీనా కపూర్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ప్రపంచం మొత్తం కరోనాను మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే మేం కరోనాతో పాటు కరీనా కోసం కూడా బోలెడన్ని జాగ్రత్తలు తీసుకున్నాం (నవ్వుతూ)’’ అన్నారు. ఇదిలా ఉంటే గత ఏడాది డిసెంబర్లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా లాక్డౌన్ వల్ల చిత్రీకరణ పూర్తి చేసుకోలేకపోయింది. ఇప్పుడు ఈ ఏడాది క్రిస్మస్కి విడుదల చేయాలనుకుంటున్నారు. హాలీవుడ్ సినిమా ‘ఫారెస్ట్ గంప్’కి రీమేక్ ‘లాల్‌సింగ్ చద్దా’. -
తప్పుకున్నారు
అన్నీ అనుకున్నట్లే జరిగితే తమిళ నటుడు విజయ్ సేతుపతి హిందీ తెరకు కూడా పరిచయం అయ్యేవారు. కానీ తేదీలు తారమారు కావడంతో ప్లాన్ తారుమారైంది. అసలు విషయంలోకి వస్తే.. ఆమిర్ ఖాన్ నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’లో విజయ్ సేతుపతిని ఓ పాత్రకు తీసుకున్నారు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వంటి లెక్కలు వేయకుండా క్యారెక్టర్ నచ్చితే చేస్తారు సేతుపతి. ‘లాల్..’లో పాత్ర బాగా నచ్చి, ఒప్పుకున్నారు. కానీ కరోనా వల్ల షూటింగులకు బ్రేక్ పడటంతో ఈ సినిమా నుంచి ఆయన తప్పుకుంటున్నారని టాక్. ఈ ఏడాది అక్టోబర్‌లో సేతుపతి ఈ చిత్రం షూటింగ్లో పాల్గొనాల్సింది. అయితే అప్పటికి షూటింగ్ ఆరంభం కాకపోవడంతో ఇప్పుడు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారట. ఆమిర్, చిత్రదర్శకుడు అద్వైత్ చందన్, సేతుపతి కూర్చుని మాట్లాడుకుని, ఒక సానుకూల వాతావరణంలో చర్చించుకున్నారట. భవిష్యత్తులో వేరే ప్రాజెక్ట్‌కి కలసి పని చేద్దాం అని కూడా మాట్లాడుకున్నారని బాలీవుడ్ టాక్. ప్రస్తుతం సేతుపతి చేతిలో అరడజను సినిమాల వరకూ ఉన్నాయి. -
దటీజ్ ఆమిర్
హాలీవుడ్ సినిమా ‘ఫారెస్ట్‌గంప్’ ఆధారంగా ఆమిర్ ఖాన్ హీరోగా హిందీలో రీమేక్ అవుతోన్న చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతోంది. ఈ సినిమాలోని కీలక సన్నివేశాల్లో ఒకటైన పరిగెత్తే సీన్లో నటిస్తున్నప్పుడు ఆమిర్ ఖాన్ కొంచెం ఇబ్బందిపడ్డారట. ఇప్పుడు ఈ షూటింగ్లో ఆమిర్ పక్కటెములకు గాయమయిందని సమాచారం. అయినా కూడా సినిమా షెడ్యూల్‌కి ఇబ్బంది కలగకుండా పెయిన్ కిల్లర్స్ వేసుకుని నటిస్తున్నారట. లాక్డౌన్ బ్రేక్ తర్వాత ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఇప్పుడు విశ్రాంతి అంటే మొత్తం షెడ్యూల్ అప్సెట్ అవుతుందని, నొప్పిని భరిస్తూ షూటింగ్ కొనసాగించాలని ఆమిర్ అనుకున్నారట. యూనిట్ అంతా ‘దటీజ్ ఆమిర్’ అని ఆయన్ను కొనియాడుతున్నారు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్‌తో కలిసి ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు. -
లాల్‌సింగ్ వాయిదా పడ్డాడు
ఆమిర్‌ఖాన్, కరీనా కపూర్ జంటగా నటిస్తోన్న కామెడీ ఎంటర్టైనర్ ‘లాల్‌సింగ్ చద్దా’. టామ్‌హ్యాంక్స్ ముఖ్యపాత్రలో నటించిన హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్‌గంప్’ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. అద్వైత్ చందన్ దర్శకత్వంలో వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 25న సినిమాను విడుదల చేస్తామని చిత్రబృందం మొదట ప్రకటించింది. కరోనా కారణంగా ఏర్పడిన బ్రేక్ కారణంగా సినిమా షూటింగ్ జరగలేదు. అందువల్ల ఈ సినిమాను ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తున్నట్లు సోమవారం చిత్రబృందం పేర్కొంది. ‘లాల్‌సింగ్ చద్దా’ చిత్రం షూటింగ్ త్వరలో మళ్లీ ఆరంభం కానుంది. ఈ షెడ్యూల్‌ను టర్కీలో ప్లాన్ చేశారు. ఈ చిత్రం ద్వారా తమిళ నటుడు విజయ్ సేతుపతి బాలీవుడ్‌కి పరిచయం కానున్నారు. -
లాల్ సింగ్ టైమ్‌కి రాడా?
ఈ ఏడాది చివర్లో థియేటర్స్‌లోకి రావాలన్నది లాల్ సింగ్ చద్దా ప్లాన్. కానీ ఆ ప్లాన్‌లో మార్పు ఉండబోతోందని బాలీవుడ్ టాక్. ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. కరీనా కపూర్ కథానాయిక. హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’కి హిందీ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను క్రిస్మస్ సీజన్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు ఆమిర్ ఖాన్. అయితే కరోనా వైరస్ కారణంగా షూటింగ్స్‌కి బ్రేక్ పడటంతో ‘లాల్ సింగ్ చద్దా’ను క్రిస్మస్ సీజన్లో రిలీజ్ చేయడం కష్టం అంటున్నారు. మరి లాల్ సింగ్ అనుకున్న టైమ్‌కి వస్తాడా? రాడా? చూడాలి. -
25 కిలోలు కట్!
విలక్షణమైన సినిమాలు, పాత్రలు, నటనతో అన్ని ఇండస్ట్రీల దృష్టిని ఆకర్షిస్తున్న తమిళ నటుడు విజయ్ సేతుపతి. తన ప్రతీ సినిమాతోనూ ప్రేక్షకులను ఏదో విధంగా ఆశ్చర్యపరుస్తున్నారాయన. ప్రస్తుతం అల్లు అర్జున్–సుకుమార్ సినిమా, వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’, తమిళ సూపర్‌స్టార్ విజయ్ సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నారాయన. అలాగే హిందీ వైపు కూడా వెళుతున్నారు. ఆమిర్‌ఖాన్ టైటిల్ రోల్ చేస్తున్న ‘లాల్‌సింగ్ చద్దా’లో విజయ్ సేతుపతి ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్నారు. ఈ పాత్ర కోసం సుమారు 25కిలోలు తగ్గనున్నారని టాక్. ఈ సినిమాలో సేతుపతి, ఆమిర్ మిలటరీ జవానులుగా కనిపిస్తారట. ఈ పాత్రలో ఫిట్‌గా కనిపించడానికే ఈ బరువు తగ్గడం. ఆల్రెడీ అమిర్ 20 కిలోలు తగ్గిన సంగతి తెలిసిందే. -
ప్రతి సినిమా నీతోనే...
‘‘కరీనా... వీలుంటే ప్రతీ సినిమాలో నీతో రొమాన్స్ చేయాలనుంది. నీతో యాక్ట్ చేస్తుంటే రొమాన్స్ చాలా సులువుగా వస్తుంది’’ అంటున్నారు ఆమిర్ ఖాన్. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హిందీ చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’. హాలీవుడ్ హిట్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’కి ఇది హిందీ రీమేక్. కరీనా కపూర్ కథానాయిక. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కరీనా కపూర్ లుక్‌ను వేలంటైన్స్ డే సందర్భంగా విడుదల చేశారు. ఈ ఏడాది క్రిస్మస్కి ‘లాల్ సింగ్ చద్దా’ విడుదల కానుంది. -
నో క్లాష్
పండగ సీజన్లో రెండుమూడు సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకోవడం సహజం. పండగ సెలవులను క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు భావిస్తారు. అలా ఈ ఏడాది క్రిస్మస్కి ఆమిర్‌ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’, అక్షయ్ కుమార్ ‘బచ్చన్ పాండే’ విడుదలకు సిద్ధమయ్యాయి. దాంతో బాక్సాఫీస్ దగ్గర భారీ క్లాష్ ఉంటుందని ఊహించారందరూ. అయితే ఈ క్లాష్ తప్పింది. ‘బచ్చన్ పాండే’ టీమ్‌ను ఆమిర్‌ఖాన్ రిక్వెస్ట్ చేయడంతో అక్షయ్ తన సినిమాను జనవరిలో రిలీజ్ చేయాలని నిశ్చయించుకున్నారు. ‘‘కొన్నిసార్లు ఒక్క సంభాషణ చాలు పరిష్కరించుకోవడానికి. నా విన్నపాన్ని మన్నించి వాళ్ల సినిమా విడుదల తేదీ మార్చుకుంటున్నందుకు అక్షయ్ కుమార్, నిర్మాత సాజిద్ నడియాడ్వాలాకి థ్యాంక్స్. వాళ్ల సినిమాకు ఆల్ ది బెస్ట్’’ అని ట్వీట్ చేశారు ఆమిర్. ‘‘నీ కోసం ఎప్పుడైనా ఏమైనా చేయడానికి రెడీ ఆమిర్. మనం స్నేహితులం’’ అని సమాధానం ఇచ్చారు అక్షయ్. అలాగే ‘బచ్చన్ పాండే’ను 2021 జనవరి 22న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. విశేషం ఏంటంటే అదే రోజు అక్షయ్ కుమార్ డిటెక్టివ్ థ్రిల్లర్ ‘బెల్ బాటమ్’ విడుదల కావాల్సింది. ‘‘నేను నటించిన రెండు సినిమాలు ఒకేరోజు విడుదలవుతాయని జోక్స్ చేసుకుంటున్నారా? ‘బచ్చన్ పాండే’ కోసం ‘బెల్ బాటమ్’ను 2021 ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు అక్షయ్. -
నా పేరు లాల్
‘నమస్కారం. నా పేరు లాల్.. లాల్‌సింగ్ చద్దా’ అని పరిచయం చేసుకుంటున్నారు ఆమిర్ ఖాన్. ప్రస్తుతం చేస్తున్న ‘లాల్‌సింగ్ చద్దా’ కోసం పంజాబీ సర్దార్‌గా ఆమిర్ ఖాన్ మారిపోయిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘ఫారెస్ట్ గంప్’ సినిమాకు ‘లాల్‌సింగ్ చద్దా’ హిందీ రీమేక్. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కరీనా కపూర్ కథానాయిక. వయాకామ్ స్టూడియోస్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను సోమవారం విడుదల చేశారు ఆమిర్‌ఖాన్. వచ్చే ఏడాది క్రిస్మస్కు ఈ సినిమా రిలీజ్ కానుంది. -
త్రీఇన్ వన్
బాలీవుడ్ బాక్సాఫీస్ త్రిమూర్తులు ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్. ఈ ఖాన్స్ త్రయమే బాలీవుడ్‌ను చాలా ఏళ్లుగా ఏలుతోంది. ఒకరి సినిమాల్లో ఒకరు అతిథి పాత్రల్లో మెరిసిన వీరు ఒకేసారి స్క్రీన్‌పై మాత్రం కలసి కనిపించలేదు. అయితే త్వరలోనే ఖాన్స్ ముగ్గుర్నీ స్క్రీన్‌పై చూడొచ్చు అని బాలీవుడ్ టాక్. ఆమీర్ తాజా చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’. హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’కి హిందీ రీమేక్ ఇది. ఈ సినిమాలో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ కీలక పాత్రల్లో నటించనున్నారని తెలిసింది. ఈ ముగ్గురూ ఒకేసారి ఫ్రేమ్‌లో కనిపిస్తే ఖాన్ ఫ్యాన్స్‌కు ఖుషీఖుషీయే. -
అమ్మ దీవెనతో...
కొత్త సినిమా కోసం కొత్త ప్రయాణం మొదలు పెట్టారు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్. ఆయన హీరోగా నటించనున్న తాజా చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’ (1994)కి హిందీ రీమేక్ ఇది. ఇందులో కరీనా కపూర్ కథానాయికగా నటించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. తొలి సన్నివేశానికి ఆమిర్ ఖాన్ తల్లి జీనత్ హుస్సేన్ క్లాప్ ఇచ్చారు. హిందీ చిత్రం ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ ఫేమ్ అద్వైత్ చందన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆమిర్ ఖాన్ దాదాపు 20కేజీల బరువు తగ్గిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది క్రిస్మస్ సందర్భంగా చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
ముచ్చటగా మూడోసారి...
... స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు ఆమిర్ ఖాన్, కరీనా కపూర్. అమిర్ హీరోగా ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ మూవీ ఫేమ్ అద్వైత్ చందన్ దర్శకత్వంలో ‘లాల్‌సింగ్ చద్దా’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అతుల్ కులకర్ణి స్టోరీ అందించారు. ఈ సినిమాలో హీరోయిన్గా కరీనా కపూర్‌ను అనుకుంటున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వార్తలే నిజమయ్యాయి. ఈ చిత్రంలో కరీనా కపూర్ హీరోయిన్గా నటించనునున్నారని చిత్రబృందం అధికారికంగా తెలిపింది. ఇంతకుముందు త్రీ ఇడియట్స్, తలాష్ సినిమాల్లో కలిసి నటించారు అమిర్ అండ్ కరీనా. ఇప్పుడు కమిట్ అయిన ‘లాల్‌సింగ్ చద్దా’ మూడో సినిమా. హాలీవుడ్ ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కి ఇది హిందీ రీమేక్. ఈ సినిమా కాకుండా ‘అంగ్రేజీ మీడియం’ చిత్రంలో నటిస్తున్నారు కరీనా కపూర్. -
కరీనా సరేనా?
దాదాపు పదేళ్ల తర్వాత ఆమిర్ ఖాన్–కరీనా కపూర్ జంటగా నటించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’తో ప్రేక్షకులను నిరాశపరిచిన ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కి ఇది హిందీ రీమేక్. ఈ సినిమాలో కథానాయికగా కరీనాను సంప్రదించారట. కరీనా ఓకే చెబితే దాదాపు పదేళ్ల తర్వాత ఆమిర్–కరీనా జోడీ కట్టినట్లే. 2009లో వచ్చిన హిట్ మూవీ ‘త్రీ ఇడియట్స్’ తర్వాత ఈ ఇద్దరూ జంటగా నటించలేదు. మరోవైపు ‘గుడ్‌న్యూస్’ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసిన కరీనా ప్రస్తుతం ఇర్ఫాన్ ఖాన్ ‘అంగ్రేజీ మీడియం’ (హిందీ మీడియం సీక్వెల్) సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే కరీనా ఓ టెలివిజన్ షోకు కమిటైన సంగతి తెలిసిందే. -
పదేళ్లుగా నిర్లక్ష్యం
కోహీర్, న్యూస్‌లైన్: అధికారుల అలసత్వం.. పట్టించుకోని పాలకులు..ఫలితంగా రోడ్డు పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతోంది. దీంతో ప్రజలు కష్టాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. రంగారెడ్డి జిల్లాలో ని వాణిజ్య కేంద్రమైన మర్పల్లి నుంచి కోహీర్ మండలంలోని మనియార్‌పల్లి వరకు సుమారు పది కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రంగారెడ్డి జిల్లా ఇంజనీరింగ్ విభాగం అధికారులు పదేళ్ల క్రితం శ్రీకారం చుట్టారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని జాజిగుబ్బడి తండాకు వెళ్లాలంటే కోహీర్ మండలంలోని లాల్‌సింగ్ తండా సమీపం నుంచి వెళ్లాల్సిఉంది. ఈ నేపథ్యంలో కోహీర్ మండలంలో కొంత దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే 10 కిలోమీటర్ల రోడ్డులో సుమారు 3 కిలో మీటర్లు రంగారెడ్డి జిల్లా పరిధిలో 7 కిలోమీటర్లు రోడ్డు మెదక్ జిల్లా పరిధిలో ఉంది. కేవలం ఏడు ఇళ్లున్న జాజిగుబ్బడి తండా ప్రజల సౌకర్యార్థం రంగారెడ్డి జిల్లా ఇంజనీరింగ్ విభాగం అధికారులు పదేళ్ల క్రితం రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. రోడ్డు ఫార్మేషన్ చేసి బీటీ రోడ్డు వేశారు. తమ పరిధిలో లేకపోయినా రంగారెడ్డి జిల్లా అధికారులు జాజిగుబ్బడి తండా ప్రజల కోసం 5 కిలోమీటర్ల రోడ్డు నిర్మించారు. అంటే మెదక్ జిల్లాలో అదనంగా రెండు కిలోమీటర్ల రోడ్డు నిర్మించారు. అయితే కోహీర్ మండల పరిధిలో మరో 5 కిలోమీటర్ల రోడ్డు నిర్మించాల్సి ఉంది. ఒక కిలోమీటరు రోడ్డు నిర్మిస్తే 120 ఇళ్లున్న కోహీర్ మండలంలోని లాల్‌సింగ్ తండా వాసులకు, మరో 4 కిలోమీటర్లు రోడ్డు నిర్మిస్తే మనియార్‌పల్లి వాసులకు నేరుగా రంగారెడ్డి జిల్లాకు రోడ్డు సౌకర్యం ఏర్పడుతుంది. రోడ్డు సౌకర్యం లేక పోవడంతో ఆయా గ్రామాల ప్రజలు అదనంగా పది కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తోంది. మెదక్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. మండల ప్రజల విన్నపాలను పట్టించుకోవడంలేదు. తద్వారా మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా లాల్‌సింగ్ తండా వాసు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో తండాకు కాలినడకన వెళ్లడం కూడా కష్టంగా ఉంది. ఇదిలా ఉండగా మెదక్ జిల్లా పరిధిలోని రోడ్డుపై కల్వర్టు నిర్మాణం కోసం రంగారెడ్డి జిల్లా అధికారులు పైపులు తెచ్చారు. ఏ కారణం చేతనో గత పదేళ్లుగా పనులు మాత్రం చేపట్టడం లేదు. అటు రంగారెడ్డి జిల్లా అధికారులు, ఇటు మెదక్ జిల్లా అధికారులు కల్వర్టు నిర్మాణం గురించి పట్టించు కోవడంలేదు. కల్వర్టు నిర్మించక పోవడంతో భారీ వర్షాలు కురిస్తే తండాకు వెళ్లడం కష్టమైపోతోంది. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పం్దంచి కల్వర్టుతో పాటు రోడ్డు నిర్మించాలని మండల ప్రజలు అధికారులను కోరుతున్నారు.