ఆస్ట్రేలియన్ ఐఎస్‌ఐఎస్., అపోలో ఇజ్రాయెలీ కూడా..
32 రకాల డ్రాగన్‌ఫ్రూట్ వెరైటీలతో ప్రదర్శన
వడియాలు, సబ్బులు, సౌందర్య ఉత్పత్తులు సైతం..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: డ్రాగన్ ఫ్రూట్ అంటే సాధారణంగా గుర్తొచ్చేది.. పింక్, వైట్ రకాలు. కానీ ఏకంగా 32 రకాల డ్రాగన్‌ఫ్రూట్ వెరైటీలతో సంగారెడ్డిలో మేళా నిర్వహించారు. తైవాన్ పింక్.. వియత్నాం వైట్.. ఆస్ట్రేలియన్ ఐఎస్‌ఐఎస్.. అపోలో ఇజ్రాయెలీ.. వివిధ దేశాల్లో సాగయ్యే వెరైటీలతో పాటు, ఆసుంట.. బ్లడ్‌మేరీ.. బేబీ సెరడో.. వంటి చిన్న రకాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. పెద్ద సైజులో ఉండే జంబోరెడ్, కాన్‌డార్, ఓరిజోన వంటి ప్రత్యేక రకాలు.. మెక్సికో, సెంట్రల్ అమెరికా వంటి దేశాల్లో సాగయ్యే సాన్ వంటి వెరైటీని సైతం ఈ మేళాలో ప్రదర్శించారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డిలోని ఫల పరిశోధన స్థానంలో డ్రాగన్‌పూట్ మేళా జరిగింది. ఈ పంట పట్ల రైతుల్లో అవగాహన కలి్పంచేందుకు ఈ మేళా నిర్వహించినట్లు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా రంజోల్ గ్రామానికి చెందిన యువ రైతు రమేశ్‌రెడ్డి వ్యవసాయక్షేత్రం, సంగారెడ్డి ఫల పరిశోధన స్థానంలో సాగవుతున్న ఈ రకాలతో ఈ ప్రదర్శన నిర్వహించారు.
పోషక విలువలు పుష్కలం..
డ్రాగన్‌ఫ్రూట్‌తో కూడిన ప్రత్యేక ఉత్పత్తులను సైతం ఈ ప్రదర్శనలో ఉంచారు. డ్రాగన్‌ఫ్రూట్‌తో చేసిన చిప్స్, వడియాలు, కుక్కీస్ (బిస్కెట్లు), చాక్లెట్‌లు, డ్రైపౌడర్ వంటివాటితో పాటు, ఈ ఫ్రూట్‌తో చేసిన సబ్బులు, ఫేస్‌ప్యాక్ వంటి సౌందర్య సాధనాలు ప్రదర్శనలో సందడి చేశాయి. ఈ ఉత్పత్తులు ఆశ్చర్యానికి గురి చేశాయి. ఎడారి మొక్కగా పేరున్న డ్రాగన్‌ఫ్రూట్‌లో పోషక విలువలు మెండుగా ఉంటాయి. పీచుపదార్థాలతో కూడిన బలవర్థకమైన ఫలం కావడంతో దీన్ని నిత్యం తీసుకుంటే కేన్సర్ వంటి రోగాల బారిన పడకుండా ఉండవచ్చు. సమశీతోష్ణ వాతావరణానికి తట్టుకునే ఈ పంటను చౌడు నేలల్లోనూ సాగుచేసేందుకు వీలుంది. ఈ పంట ఈదురు గాలుల వంటి ప్రకృతి వైపరీత్యాలను సైతం తట్టుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అన్ని నేలలూ అనుకూలమే..
ఈ పంట సాగుకు అన్ని నేలలూ అనుకూలమే. కొంత జాగ్రత్తలు తీసుకుని పంట సాగు చేస్తే మంచి లాభాలను ఆర్జించవచ్చు. కమర్షియల్ వెరైటీలతో పాటు మరో 30 వరకు వెరైటీలను పండిస్తున్నా ను. ఇతర రైతులు కూడా ఈ పంట సాగు చేస్తే బాగుంటుంది. ప్రస్తుతం వియత్నాం నుంచి ఈ పండ్లు దిగుమతి అవుతున్నాయి.
–రమేశ్‌రెడ్డి, డ్రాగన్‌ఫ్రూట్ రైతు, రంజోల్, సంగారెడ్డి జిల్లా
ఉద్యానవన రైతులకు ప్రోత్సాహం
ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం అన్ని ప్రోత్సాహకాలు ఇస్తోంది. మా యూనివర్సిటీ ద్వారా రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నాము. డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తీర్ణం రాష్ట్రంలో పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాము.
–బి.నీరజ, వీసీ, ఉద్యానవన విశ్వవిద్యాలయం.
Comments
Please login to add a commentAdd a comment