సాక్షి, జహీరాబాద్: ఐక్యరాజ్య సమితి ఎంపిక చేసిన ‘ఈక్వేటారి’ అవార్డును అందుకునే అవకాశం దూరం కావడం పట్ల డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ మహిళా సంఘం(చిరు ధాన్యాల చెల్లెండ్ల సమాఖ్య) సభ్యులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈనెల 19 నుంచి 26వ తేదీ వరకు అమెరికాలోని న్యూయార్కులో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ కార్యక్రమం (యూఎన్‌డీపీ) ప్రతిష్టాత్మక ఈక్వేటారి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇదే వేదిక నుంచి డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ(డీడీఎస్) మహిళా సంఘం సభ్యులు అవార్డును అందుకోవాల్సి ఉంది. ఇందు కోసం ఐక్యరాజ్య సమితి నుంచి సంస్థ సభ్యులకు ఆహ్వానం సైతం లభించింది. అయినా అవార్డును అందుకునేందు కోసం వెళ్లే మహిళలు వీసా కోసం దరఖాస్తు చేసుకోగా తిరస్కరణకు గురి అయింది. ఇది సంఘం సభ్యులను ఎంతో నిరాశ పర్చింది.
ప్రపంచ వ్యాప్తంగా పనిచేసే పర్యావరణ వేత్తలు, వారి సంస్థలకు ఐక్యరాజ్య సమితి ఈక్వేటారి అవార్డులను ఇస్తూ వస్తోంది. 2019 సంవత్సరానికి గాను జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్‌లో గల డీడీఎస్ మహిళా సంఘానికి ఈ అవార్డుకు చోటు దక్కింది. గత 30 సంవత్సరాల కాలంగా అవిశ్రాంతంగా పర్యావరణ మేలు కోసం డీడీఎస్ మహిళా సంఘాలు చేస్తున్న కృషి, పనులను గుర్తించిన ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం డీడీఎస్ మహిళా సంఘానికి అవార్డుకు ఎంపిక చేసింది. డీడీఎస్ మహిళా సంఘానికి వచ్చిన అవార్డును అందుకునేందుకు గాను పస్తాపూర్ గ్రామానికి చెందిన అనుసూయమ్మ, పొట్‌పల్లి గ్రామానికి చెందిన మొగులమ్మలను సంస్థ ఎంపిక చేసింది. వారికి ట్రాన్స్‌లేటర్లుగా జయశ్రీ, మయూరిలను ఎంపిక చేశారు. గత 17 సంవత్సరాల కాలంగా యూఎన్‌డీపీ ప్రతి సంవత్సరం ప్రపంచ స్థాయిలో అందజేస్తున్న అవార్డులకు గాను ఇప్పటి వరకు భారత దేశంలో 9 సంస్థలు మాత్రమే ఈ అవార్డుకు ఎంపికయ్యాయి. ఈ సారి డీడీఎస్ మహిళా సంఘం 10వ అవార్డుకు ఎంపికైంది.
గత మూడు దశబ్దాల కాలంగా అవిశ్రాంతంగా పర్యావరణ మేలు కోసం డీడీఎస్ సంఘాలు చేస్తున్న పనిలో సామాజిక అటవుల కమ్యూనిటీ నియంత్రిత పీడీఎస్ ద్వారా బీడు భూములకు పచ్చ దుప్పటి కప్పడం, గ్రామల పక్కన ఉండే ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి హరిత వనాలను పెంచడం, కనుమరుగవుతున్న మందు చెట్లను కాపాడి వాటిని అభయారణ్యం లాంటి స్థావరాలుగా రూపుదిద్దడం, అంతరించి పోతున్న చిరు ధాన్యాలను పరిరక్షించి విస్తరింప జేయడం, కమ్యూనిటీ విత్తనాల బ్యాంకులను స్థాపించడం లాంటి కార్యక్రమాలను డీడీఎస్ మహిళా సంఘాల సభ్యులు తీసుకుని విజయం సాధించడంలాంటి అద్భుతమైన పనులకు గుర్తింపుగా ఈక్వేటారి అవార్డు దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా 127 దేశాలకు చెందిన 847 నామినేషన్లు ఐక్యరాజ్య సమితి అవార్డుకోసం దాఖలయ్యాయి. వీటన్నింటిని పరిశీలించిన అనంతరం 20 మంది విజేతలను యూఎన్‌డీపీ ఎంపిక చేసింది. వీటిలో డీడీఎస్ మహిళా సంఘానికి అరుదైన చోటు దక్కింది. ఈ అవార్డును అందుకునేందుకు గాను వెళ్లేందుకు ఎంపికైన మహిళా సంఘం సభ్యులు అనుసూమ్మ, మొగులమ్మలతో పాటు ట్రాన్స్‌లేటర్లుగా జయశ్రీ, మయూరిలను పంపేందుకు నిర్ణయించారు. ఈ మేరకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురికావడంతో మహిళా సంఘం సభ్యులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
మేము చేసిన పనులు చెప్పుకోవాలనుకున్నా
గత మూడు దశాబ్దాల కాలంగా డీడీఎస్ మహిళా సంఘాల సభ్యులు పర్యావరణాన్ని కాపాడేందుకు చేస్తున్న కా>ర్యక్రమాలను చెప్పుకోవాలనుకున్నా. ఇందు కోసం పూర్తిగా సిద్ధం అయ్యా. అవార్డును అందుకునేందుకు చేసుకున్న వీసా దరఖాస్తు తరస్కరణకు గురు కావడం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. మే ం సాధించిన విషయాలను ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రపంచ వ్యాప్తంగా వచ్చే పర్యావరణ పరిరక్షకులకు వినిపించి మరింత విస్తరింపజేసేలా వివరించాలనుకున్నా. వీసా రాక పోవడం ఎంతో బాధను కలిగించింది.
–అనుసూయమ్మ, మహిళా సంఘం సభ్యురాలు
వీసా తిరస్కరణ తీవ్ర నిరాశకు గురి చేసింది
ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం(యూఎన్‌డీపీ) ప్రతిష్టాత్మక ఈక్వేటారి అవార్డు పొందేందుకు గాను నూయార్కు వెళ్లేందుకు అవసరమైన వీసా లభించక పోవడం తీవ్ర నిరాశకు గురి చేసింది. పర్యావరణ పరిరక్షణతో పాటు అంతరించి పోతున్న పాత పంటల సాగు విస్తరణ కోసం తాము చేస్తున్న కృషి ఎనలేనిది. మహిళా రైతులకు లభించిన అవకాశం వీసా తరస్కరణ రూపంలో దక్కక పోవడం తీవ్ర మానసిక వేదనకు గురి చేసింది.
– మొగులమ్మ, మహిళా రైతు, చిరు ధాన్యాల చెళ్లెళ్ల సమాఖ్య అధ్యక్షురాలు, పొట్‌పల్లి
చదవండి: ఆహ్వానం అందినా..వీసా ఇవ్వలేదు
Comments
Please login to add a commentAdd a comment