United Nations Development Project
-
Human Development Index: మానవాభివృద్ధి ఐదేళ్లు వెనక్కి
ఐక్యరాజ్యసమితి: కరోనా మహమ్మారి విసిరిన పంజాతో విలవిలలాడిన ప్రపంచ దేశాలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కుదేలైపోయాయి. రెండేళ్ల పాటు విజృంభించిన ఈ వైరస్‌తో మానవాభివృద్ధి అయిదేళ్లు వెనక్కి వెళ్లినట్టు ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. ప్రజల సగటు ఆయుర్దాయం, విద్యా స్థాయి, జీవన ప్రమాణాల ఆధారంగా తయారు చేసే మానవాభివృద్ధి సూచిలో ప్రపంచదేశాలు వరసగా రెండేళ్లు 2020, 2021లో వెనక్కి పయనిస్తున్నట్టుగా ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) వెల్లడించింది. ‘‘అనిశ్చిత సమయాలు, అస్థిరమైన జీవితాలు’’ పేరుతో రూపొందించిన ఈ నివేదిక ప్రకారం ‘‘ప్రజలు ఆయుష్షు తగ్గిపోతుంది, ఉన్నత స్థాయి విద్యలు అభ్యసించలేరు, ఆదాయాలు పడిపోతాయి. గతంలో ఎన్నో సంక్షోభాలు చూసి ఇప్పుడున్న పరిస్థితులు గట్టి ఎదురుదెబ్బ’’ అని యూఎన్డీపీ చీఫ్ అచిమ్ స్టెనియర్ తెలిపారు. 32 ఏళ్లలో ప్రపంచ దేశాల్లో మానవాభివృద్ధి క్షీణించడం ఇదే మొదటిసారి. కోవిడ్–19తో మొదలైన మానవాభివృద్ధి తిరోగమనం, వివిధ దేశాల్లో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభాలతో పాటు వాతావరణ మార్పులు కూడా ప్రపంచ దేశాలను కోలుకోనివ్వకుండా చేశాయని ఆ నివేదిక వెల్లడించింది. కరోనాతో పాటు ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రభావంతో చాలా దేశాలు కోలుకోవడం లేదని ఆ నివేదిక వివరించింది. తక్కువ కార్బన్ వినియోగం, అసమానతల కట్టడి , సుస్థిరత సాధించడం ద్వారా ప్రపంచ దేశాలు తిరిగి మానవాభివృద్ధిలో ముందుకు వెళ్లవచ్చునని నివేదిక రచయిత పెడ్రో కాన్సీకావో అభిప్రాయపడ్డారు. పునరుత్పాదక ఇంధనం, భవిష్యత్‌లో వచ్చే వ్యాధుల్ని ఎదుర్కొనే సన్నద్ధత, భవిష్యత్ సంక్షోభాల నుంచి బయటపడే సామర్థ్యం పెంపు వంటివి చేస్తే మానవాభివృద్ధి సూచి మెరుగుపడుతుందని తెలిపారు. 132వ స్థానంలో భారత్ 2021 సంవత్సరానికి గాను మానవాభివృద్ధి సూచిలో మొత్తం 191 దేశాలకు గాను భారత్ 132వ స్థానంలో నిలిచింది. భారత మానవాభివృద్ధి విలువ 0.633గా నిలిచింది. అంటే మన దేశంలో మానవాభివృద్ధి మధ్యస్తంగా ఉందని చెప్పొచ్చు. 2020 సంవత్సరంలో 0.645గా ఉన్న విలువ ఏడాదిలో కాస్త తగ్గింది. అదే ఏడాది 189 దేశాలకు గాను ఇండియా ర్యాంక్ 131 ఉండేది. ఇక భారత్‌లో సగటు ఆయుర్దాయం 69.7 ఏళ్ల నుంచి 67.2 ఏళ్లకి తగ్గింది. 2019తో పోల్చి చూస్తే మన దేశ మానవాభివృద్ధిలో అసమానలు తగ్గుముఖం పట్టాయని అదొక శుభపరిణామమని భారత్‌లో యూఎన్డీపీ ప్రతినిధి షోకో నోడా చెప్పారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చి చూస్తే పురుషుల, మహిళల అభివృద్ధిలో ఉన్న తేడా చాలా వేగంగా తొలగిపోతోందని తెలిపారు. -
'అరుదైన' అవకాశానికి అవరోధం
సాక్షి, జహీరాబాద్: ఐక్యరాజ్య సమితి ఎంపిక చేసిన ‘ఈక్వేటారి’ అవార్డును అందుకునే అవకాశం దూరం కావడం పట్ల డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ మహిళా సంఘం(చిరు ధాన్యాల చెల్లెండ్ల సమాఖ్య) సభ్యులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈనెల 19 నుంచి 26వ తేదీ వరకు అమెరికాలోని న్యూయార్కులో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ కార్యక్రమం (యూఎన్డీపీ) ప్రతిష్టాత్మక ఈక్వేటారి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇదే వేదిక నుంచి డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) మహిళా సంఘం సభ్యులు అవార్డును అందుకోవాల్సి ఉంది. ఇందు కోసం ఐక్యరాజ్య సమితి నుంచి సంస్థ సభ్యులకు ఆహ్వానం సైతం లభించింది. అయినా అవార్డును అందుకునేందు కోసం వెళ్లే మహిళలు వీసా కోసం దరఖాస్తు చేసుకోగా తిరస్కరణకు గురి అయింది. ఇది సంఘం సభ్యులను ఎంతో నిరాశ పర్చింది. ప్రపంచ వ్యాప్తంగా పనిచేసే పర్యావరణ వేత్తలు, వారి సంస్థలకు ఐక్యరాజ్య సమితి ఈక్వేటారి అవార్డులను ఇస్తూ వస్తోంది. 2019 సంవత్సరానికి గాను జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్‌లో గల డీడీఎస్ మహిళా సంఘానికి ఈ అవార్డుకు చోటు దక్కింది. గత 30 సంవత్సరాల కాలంగా అవిశ్రాంతంగా పర్యావరణ మేలు కోసం డీడీఎస్ మహిళా సంఘాలు చేస్తున్న కృషి, పనులను గుర్తించిన ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం డీడీఎస్ మహిళా సంఘానికి అవార్డుకు ఎంపిక చేసింది. డీడీఎస్ మహిళా సంఘానికి వచ్చిన అవార్డును అందుకునేందుకు గాను పస్తాపూర్ గ్రామానికి చెందిన అనుసూయమ్మ, పొట్పల్లి గ్రామానికి చెందిన మొగులమ్మలను సంస్థ ఎంపిక చేసింది. వారికి ట్రాన్స్లేటర్లుగా జయశ్రీ, మయూరిలను ఎంపిక చేశారు. గత 17 సంవత్సరాల కాలంగా యూఎన్డీపీ ప్రతి సంవత్సరం ప్రపంచ స్థాయిలో అందజేస్తున్న అవార్డులకు గాను ఇప్పటి వరకు భారత దేశంలో 9 సంస్థలు మాత్రమే ఈ అవార్డుకు ఎంపికయ్యాయి. ఈ సారి డీడీఎస్ మహిళా సంఘం 10వ అవార్డుకు ఎంపికైంది. గత మూడు దశబ్దాల కాలంగా అవిశ్రాంతంగా పర్యావరణ మేలు కోసం డీడీఎస్ సంఘాలు చేస్తున్న పనిలో సామాజిక అటవుల కమ్యూనిటీ నియంత్రిత పీడీఎస్ ద్వారా బీడు భూములకు పచ్చ దుప్పటి కప్పడం, గ్రామల పక్కన ఉండే ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి హరిత వనాలను పెంచడం, కనుమరుగవుతున్న మందు చెట్లను కాపాడి వాటిని అభయారణ్యం లాంటి స్థావరాలుగా రూపుదిద్దడం, అంతరించి పోతున్న చిరు ధాన్యాలను పరిరక్షించి విస్తరింప జేయడం, కమ్యూనిటీ విత్తనాల బ్యాంకులను స్థాపించడం లాంటి కార్యక్రమాలను డీడీఎస్ మహిళా సంఘాల సభ్యులు తీసుకుని విజయం సాధించడంలాంటి అద్భుతమైన పనులకు గుర్తింపుగా ఈక్వేటారి అవార్డు దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా 127 దేశాలకు చెందిన 847 నామినేషన్లు ఐక్యరాజ్య సమితి అవార్డుకోసం దాఖలయ్యాయి. వీటన్నింటిని పరిశీలించిన అనంతరం 20 మంది విజేతలను యూఎన్డీపీ ఎంపిక చేసింది. వీటిలో డీడీఎస్ మహిళా సంఘానికి అరుదైన చోటు దక్కింది. ఈ అవార్డును అందుకునేందుకు గాను వెళ్లేందుకు ఎంపికైన మహిళా సంఘం సభ్యులు అనుసూమ్మ, మొగులమ్మలతో పాటు ట్రాన్స్లేటర్లుగా జయశ్రీ, మయూరిలను పంపేందుకు నిర్ణయించారు. ఈ మేరకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురికావడంతో మహిళా సంఘం సభ్యులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మేము చేసిన పనులు చెప్పుకోవాలనుకున్నా గత మూడు దశాబ్దాల కాలంగా డీడీఎస్ మహిళా సంఘాల సభ్యులు పర్యావరణాన్ని కాపాడేందుకు చేస్తున్న కా>ర్యక్రమాలను చెప్పుకోవాలనుకున్నా. ఇందు కోసం పూర్తిగా సిద్ధం అయ్యా. అవార్డును అందుకునేందుకు చేసుకున్న వీసా దరఖాస్తు తరస్కరణకు గురు కావడం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. మే ం సాధించిన విషయాలను ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రపంచ వ్యాప్తంగా వచ్చే పర్యావరణ పరిరక్షకులకు వినిపించి మరింత విస్తరింపజేసేలా వివరించాలనుకున్నా. వీసా రాక పోవడం ఎంతో బాధను కలిగించింది. –అనుసూయమ్మ, మహిళా సంఘం సభ్యురాలు వీసా తిరస్కరణ తీవ్ర నిరాశకు గురి చేసింది ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(యూఎన్డీపీ) ప్రతిష్టాత్మక ఈక్వేటారి అవార్డు పొందేందుకు గాను నూయార్కు వెళ్లేందుకు అవసరమైన వీసా లభించక పోవడం తీవ్ర నిరాశకు గురి చేసింది. పర్యావరణ పరిరక్షణతో పాటు అంతరించి పోతున్న పాత పంటల సాగు విస్తరణ కోసం తాము చేస్తున్న కృషి ఎనలేనిది. మహిళా రైతులకు లభించిన అవకాశం వీసా తరస్కరణ రూపంలో దక్కక పోవడం తీవ్ర మానసిక వేదనకు గురి చేసింది. – మొగులమ్మ, మహిళా రైతు, చిరు ధాన్యాల చెళ్లెళ్ల సమాఖ్య అధ్యక్షురాలు, పొట్పల్లి చదవండి: ఆహ్వానం అందినా..వీసా ఇవ్వలేదు -
అట్టడుగున సీఎం జిల్లా!
♦ మానవాభివృద్ధి సూచీలో మెదక్‌కు చివరిస్థానం ♦ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో హైదరాబాద్, రంగారెడ్డి ♦ మానవాభివృద్ధి సూచీ అంచనాలు విడుదల చేసిన ప్రణాళికా విభాగం, సెస్ సాక్షి, హైదరాబాద్: ప్రజల నాణ్యమైన జీవన పరిస్థితులకు అద్దంపట్టే మానవాభివృద్ధి సూచికలో ముఖ్యమంత్రి సొంత జిల్లా మెదక్ రాష్ట్రంలో అట్టడుగు స్థానంలో నిలిచింది. వృద్ధి రేటులో ఈ జిల్లా కొంత ముందున్నా.. ఇతర జిల్లాలతో పోలిస్తే వెనుకబడిపోతోంది. సాధారణంగానే ఎన్నో అనుకూలతలు ఉన్న హైదరాబాద్ ఈ సూచీలో తొలి స్థానంలో నిలిచింది. అయితే పదేళ్ల కిందటి గణాంకాలతో పోలిస్తే అన్ని జిల్లాల్లోనూ మానవాభివృద్ధి సూచీ గణనీయంగా పెరిగింది. ప్రణాళికా విభాగం, ‘సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్)’ సంయుక్తంగా రూపొందించిన ‘హ్యుమన్ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ స్టేట్: డిస్ట్రిక్ట్ ప్రొఫైల్స్’ నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ 98వ వార్షికోత్సవం ముగింపు కార్యక్రమంలో ఈ నివేదికను విడుదల చేశారు. తొలి ప్రతిని ఆర్థిక రంగ నిపుణుడు సీహెచ్ హనుమంతరావుకు అందజేశారు. గతంలో తయారు చేసిన మానవాభివృద్ధి సూచీలకు భిన్నంగా ఈసారి జిల్లాల వారీగా వివరాలను కూడా పొందుపరిచారు. ‘‘దేశంలో తెలంగాణ 29వ రాష్ట్రం గా ఆవిర్భవించింది. ఉద్యమ సందర్భంగా ప్రజలు ఆర్థికాభివృద్ధిలో వికేంద్రీకరణ నమూనాను ఆకాం క్షించారు. జీవన ప్రమాణాల పెంపు, అక్షరాస్యత, అసమానతల తొలగింపునకు అది దోహదపడుతుందని భావించారు. ఆరోగ్యంగా ఉండడంతోపాటు దీర్ఘకాలం, సృజనాత్మకంగా జీవించడమే మానవాభివృద్ధి. ఆరోగ్యకరజీవితం, అక్షరాస్యత, మెరుగైన జీవన ప్రమాణాలపైనే మానవాభివృద్ధి సూచిక తయారవుతుంది. ఈ మూడింటినే ప్రమాణాలుగా తీసుకుని యుఎన్‌డీపీ (యునెటైడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రాజెక్టు) అనుసరించిన పద్ధతిలోనే ఈ నివేదిక తయారైంది.’’ అని సెస్ వెల్లడిం చింది. ఈ నివేదికను బట్టి సమగ్రంగా తెలంగాణ మానవాభివృద్ధి సూచికను రూపొందిస్తారు. ఇందుకు మూడు నెలలు పట్టే అవకాశముంది. కార్యక్రమంలో ‘మిలీని యం డెవలప్మెంట్ గోల్స్ ఇన్ తెలంగాణ’ నివేదిక ను కూడా ఈటల ఆవిష్కరించి తొలి ప్రతిని ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి బి.పి.ఆచార్యకు అందజేశారు. సగటు వృద్ధి 8.3 శాతం రాష్ట్రంలోని పది జిల్లాలను విశ్లేషిస్తే 2004-05 నుంచి 2011-12 వరకు అభివృద్ధి సూచీ ఏటా సగటున 8.3 శాతం వృద్ధి సాధించింది. జిల్లాలవారీగా చూస్తే నిజామాబాద్, ఖమ్మంలలో అత్యధికంగా.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లలో తక్కువగా వృద్ధి రేటు నమోదైంది. గతంలోని వృద్ధి రేటు ఆధారంగా 2015-16 సంవత్సరానికి మానవ అభివృద్ధి సూచీ విలువలను ‘సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్’ అంచనా వేసింది. తలసరి ఆదాయం, ఆయుర్దాయం, అక్షరాస్యత, సామాజిక భద్రత, పేదరికం, అసమానతలను ప్రామాణికాలుగా తీసుకుని మానవాభివృద్ధి సూచీని లెక్కిస్తారు. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ఈ సూచీలో తొలి స్థానంలో నిలిచింది. ప్రభుత్వ ప్రైవేటు రంగంలో భారీ పరిశ్రమలకు నెలవైన మెదక్ జిల్లా ఈ సూచీలో చివరి స్థానంలో ఉండటం విస్మయకర అంశం. మారిన ర్యాంకులు 2015-16లో హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలు తొలి ఐదు స్థానాల్లో ఉండగా... ఈసారి మధ్యలో ఉన్న జిల్లాల స్థానాలు మారిపోయాయి. ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు కొంత ముందడగు వేశాయి. వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాలు వెనుకబడ్డాయి. ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న మూడు జిల్లాలు తొలి ఐదు స్థానాల్లో ఉండడం చెప్పుకోదగ్గ పరిణామం. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో పట్టణ జనాభా వేగంగా పెరుగుతోంది. ఈ రెండు జిల్లాల్లో 28 శాతం జనాభా పట్టణాల్లో నివసిస్తున్నారు. ఇక 1993-94లో 44.2 శాతంగా ఉన్న పేదరికస్థాయి 2011-12 నాటికి 8.8 శాతానికి తగ్గడం గమనార్హం. ఐక్యరాజ్యసమితి సూచించిన సుస్థిరాభివృద్ధికి సంబంధించిన 17 లక్ష్యాలు, మరో 169 సాధారణ లక్ష్యాలను వాతావరణంతోపాటు సామాజిక, ఆర్థిక రంగాల్లో సాధించేందుకు కనీసం 15 ఏళ్లు పడుతుందని నివేదికల్లో పేర్కొన్నారు. లక్ష్య ఛేదనలో ముందడుగు ‘‘తెలంగాణ రాష్ట్రం సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల ఛేదనలో గణనీయ పురోగతి సాధించింది. అభివృద్ధి విషయంలో జిల్లాల మధ్య, జాతి సమూహాల మధ్య అం తరాలు ఇంకా కనుమరుగు కాలేదు. నిస్సహాయ సమూహాలపై ప్రత్యేకదృష్టి సారించాల్సి ఉంది..’’ అని ‘సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్)’ స్పష్టం చేసింది. ఈ సహస్రాబ్దిలో తెలంగాణ సాధించాల్సిన 8 లక్ష్యాలను నివేదికలో నిర్దేశించింది. పేదరికం, ఆకలి నిర్మూలన: పేదరికాన్ని తగ్గించడం లో ప్రభుత్వం విజయవంతమైంది. 1993-94లో 44.2 శాతం ఉన్న పేదరికం 2011-12 నాటికి 8.8 శాతానికి తగ్గింది. వినియోగంలో అసమానతలు తగ్గడంతో.. కొన్నేళ్లుగా పేదరిక అంతరాల నిష్పత్తిలో తగ్గుదల నమోదైంది. చిన్న నగరాల్లో సవాలుగా మారిన పోషకాహారలోపాన్ని అధిగమించాల్సి ఉంది. ప్రాథమిక విద్య సార్వజనీకరణ: రాష్ట్రం ప్రాథమిక విద్యలో 100 శాతం విద్యార్థుల నమోదును సాధిం చేందుకు రెండేళ్ల సమయం పట్టే అవకాశముంది. సెకండరీ విద్యను సైతం సార్వజనీకరించాల్సి ఉంది. లింగ సమానత్వం, మహిళా సాధికారతకు ప్రోత్సాహం: ప్రాథమిక స్థాయిలో లింగ సమానత్వం కనిపిస్తున్నా, సామాజికంగా బలహీన సమూహాల్లో అంతరాలు అలాగే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. శిశు మరణాల నిర్మూలన: రోగ నిరోధక టీకాలను అందించడంలో విశేష కృషి జరిగింది. ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా అమలు చేయడం 2015 తర్వాత మన ముందు ఉండే పెద్ద సవాలు. శిశు మరణాల రేటు, ఐదేళ్లలోపు బాలల మరణాల రేటును తగ్గించడంపై దృష్టి పెట్టాలి. గర్భిణుల ఆరోగ్యం: ప్రసూతి మరణాల రేటు తగ్గింపులో రాష్ట్రం మరో 5 నుంచి 8 ఏళ్లలో ఆశించిన ఫలితాలను సాధించగలదు. 2015 తర్వాత రాష్ట్రం సాధించాల్సిన పెద్ద సవాళ్లలో ఇదీ ఒకటి. హెచ్ఐవీ/ఎయిడ్స్, మలేరియా, ఇతర రోగాలపై యుద్ధం: హెచ్ఐవీ/ఎయిడ్స్ నిర్మూలనకు రాష్ట్రం విశేష కృషి చేసింది. 2015 తర్వాత ఎయిడ్స్, టీబీల నుంచి ప్రజలను రక్షించే చర్యలు తీసుకోవాలి. పర్యావరణ సుస్థిరత: జనాభాలో సగం మందికి సురక్షిత తాగునీరు, పారిశుద్ధ్య సేవలు అందడం లేదు. అడవుల అభివృద్ధి, జీవ వైవిధ్యం, పారిశుద్ధ్యం, మురికివాడల్లో అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సి ఉంది. అభివృద్ధి కోసం విశ్వ భాగస్వామ్యం: ప్రజలకు టెలిఫోన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే విషయంలో రాష్ట్రం గణనీయ ప్రగతిని సాధించింది. విశ్వ భాగస్వామ్యంతో కమ్యూనికేషన్ రంగాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలి.