అట్టడుగున సీఎం జిల్లా! | bottom of the CM district | Sakshi
Sakshi News home page

అట్టడుగున సీఎం జిల్లా!

Published Wed, Dec 30 2015 3:42 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

అట్టడుగున సీఎం జిల్లా! - Sakshi

అట్టడుగున సీఎం జిల్లా!

♦ మానవాభివృద్ధి సూచీలో మెదక్‌కు చివరిస్థానం
♦ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో హైదరాబాద్, రంగారెడ్డి
♦ మానవాభివృద్ధి సూచీ అంచనాలు విడుదల చేసిన ప్రణాళికా విభాగం, సెస్
 
 సాక్షి, హైదరాబాద్: ప్రజల నాణ్యమైన జీవన పరిస్థితులకు అద్దంపట్టే మానవాభివృద్ధి సూచికలో ముఖ్యమంత్రి సొంత జిల్లా మెదక్ రాష్ట్రంలో అట్టడుగు స్థానంలో నిలిచింది. వృద్ధి రేటులో ఈ జిల్లా కొంత ముందున్నా.. ఇతర జిల్లాలతో పోలిస్తే వెనుకబడిపోతోంది. సాధారణంగానే ఎన్నో అనుకూలతలు ఉన్న హైదరాబాద్ ఈ సూచీలో తొలి స్థానంలో నిలిచింది. అయితే పదేళ్ల కిందటి గణాంకాలతో పోలిస్తే అన్ని జిల్లాల్లోనూ మానవాభివృద్ధి సూచీ గణనీయంగా పెరిగింది. ప్రణాళికా విభాగం, ‘సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్)’ సంయుక్తంగా రూపొందించిన ‘హ్యుమన్ డెవలప్‌మెంట్ ఇన్ తెలంగాణ స్టేట్: డిస్ట్రిక్ట్ ప్రొఫైల్స్’ నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ 98వ వార్షికోత్సవం ముగింపు కార్యక్రమంలో ఈ నివేదికను విడుదల చేశారు. తొలి ప్రతిని ఆర్థిక రంగ నిపుణుడు సీహెచ్ హనుమంతరావుకు అందజేశారు. గతంలో తయారు చేసిన మానవాభివృద్ధి సూచీలకు భిన్నంగా ఈసారి జిల్లాల వారీగా వివరాలను కూడా పొందుపరిచారు. ‘‘దేశంలో తెలంగాణ 29వ రాష్ట్రం గా ఆవిర్భవించింది. ఉద్యమ సందర్భంగా ప్రజలు ఆర్థికాభివృద్ధిలో వికేంద్రీకరణ నమూనాను ఆకాం క్షించారు. జీవన ప్రమాణాల పెంపు, అక్షరాస్యత, అసమానతల తొలగింపునకు అది దోహదపడుతుందని భావించారు.

ఆరోగ్యంగా ఉండడంతోపాటు దీర్ఘకాలం, సృజనాత్మకంగా జీవించడమే మానవాభివృద్ధి. ఆరోగ్యకరజీవితం, అక్షరాస్యత, మెరుగైన జీవన ప్రమాణాలపైనే మానవాభివృద్ధి సూచిక తయారవుతుంది. ఈ మూడింటినే ప్రమాణాలుగా తీసుకుని యుఎన్‌డీపీ (యునెటైడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు) అనుసరించిన పద్ధతిలోనే ఈ నివేదిక తయారైంది.’’ అని సెస్ వెల్లడిం చింది. ఈ నివేదికను బట్టి సమగ్రంగా తెలంగాణ మానవాభివృద్ధి సూచికను రూపొందిస్తారు. ఇందుకు మూడు నెలలు పట్టే అవకాశముంది. కార్యక్రమంలో ‘మిలీని యం డెవలప్‌మెంట్ గోల్స్ ఇన్ తెలంగాణ’ నివేదిక ను కూడా ఈటల ఆవిష్కరించి తొలి ప్రతిని ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి బి.పి.ఆచార్యకు అందజేశారు.

 సగటు వృద్ధి 8.3 శాతం
 రాష్ట్రంలోని పది జిల్లాలను విశ్లేషిస్తే 2004-05 నుంచి 2011-12 వరకు అభివృద్ధి సూచీ ఏటా సగటున 8.3 శాతం వృద్ధి సాధించింది. జిల్లాలవారీగా చూస్తే నిజామాబాద్, ఖమ్మంలలో అత్యధికంగా.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లలో తక్కువగా వృద్ధి రేటు నమోదైంది. గతంలోని వృద్ధి రేటు ఆధారంగా 2015-16 సంవత్సరానికి మానవ అభివృద్ధి సూచీ విలువలను ‘సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్’ అంచనా వేసింది. తలసరి ఆదాయం, ఆయుర్దాయం, అక్షరాస్యత, సామాజిక భద్రత, పేదరికం, అసమానతలను ప్రామాణికాలుగా తీసుకుని మానవాభివృద్ధి సూచీని లెక్కిస్తారు. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ఈ సూచీలో తొలి స్థానంలో నిలిచింది. ప్రభుత్వ ప్రైవేటు రంగంలో భారీ పరిశ్రమలకు నెలవైన మెదక్ జిల్లా ఈ సూచీలో చివరి స్థానంలో ఉండటం విస్మయకర అంశం.

 మారిన ర్యాంకులు
 2015-16లో హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలు తొలి ఐదు స్థానాల్లో ఉండగా... ఈసారి మధ్యలో ఉన్న జిల్లాల స్థానాలు మారిపోయాయి. ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు కొంత ముందడగు వేశాయి. వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాలు వెనుకబడ్డాయి. ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న మూడు జిల్లాలు తొలి ఐదు స్థానాల్లో ఉండడం చెప్పుకోదగ్గ పరిణామం. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో పట్టణ జనాభా వేగంగా పెరుగుతోంది. ఈ రెండు జిల్లాల్లో 28 శాతం జనాభా పట్టణాల్లో నివసిస్తున్నారు. ఇక 1993-94లో 44.2 శాతంగా ఉన్న పేదరికస్థాయి 2011-12 నాటికి 8.8 శాతానికి తగ్గడం గమనార్హం. ఐక్యరాజ్యసమితి సూచించిన సుస్థిరాభివృద్ధికి సంబంధించిన 17 లక్ష్యాలు, మరో 169 సాధారణ లక్ష్యాలను వాతావరణంతోపాటు సామాజిక, ఆర్థిక రంగాల్లో సాధించేందుకు కనీసం 15 ఏళ్లు పడుతుందని నివేదికల్లో పేర్కొన్నారు.

 లక్ష్య ఛేదనలో ముందడుగు
 ‘‘తెలంగాణ రాష్ట్రం సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల ఛేదనలో గణనీయ పురోగతి సాధించింది. అభివృద్ధి విషయంలో జిల్లాల మధ్య, జాతి సమూహాల మధ్య అం తరాలు ఇంకా కనుమరుగు కాలేదు. నిస్సహాయ సమూహాలపై ప్రత్యేకదృష్టి సారించాల్సి ఉంది..’’ అని ‘సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్)’ స్పష్టం చేసింది. ఈ సహస్రాబ్దిలో తెలంగాణ సాధించాల్సిన 8 లక్ష్యాలను నివేదికలో నిర్దేశించింది.

 పేదరికం, ఆకలి నిర్మూలన: పేదరికాన్ని తగ్గించడం లో ప్రభుత్వం విజయవంతమైంది. 1993-94లో 44.2 శాతం ఉన్న పేదరికం 2011-12 నాటికి 8.8 శాతానికి తగ్గింది. వినియోగంలో అసమానతలు తగ్గడంతో.. కొన్నేళ్లుగా పేదరిక అంతరాల నిష్పత్తిలో తగ్గుదల నమోదైంది. చిన్న నగరాల్లో సవాలుగా మారిన పోషకాహారలోపాన్ని అధిగమించాల్సి ఉంది.

 ప్రాథమిక విద్య సార్వజనీకరణ: రాష్ట్రం ప్రాథమిక విద్యలో 100 శాతం విద్యార్థుల నమోదును సాధిం చేందుకు రెండేళ్ల సమయం పట్టే అవకాశముంది.  సెకండరీ విద్యను సైతం సార్వజనీకరించాల్సి ఉంది.

 లింగ సమానత్వం, మహిళా సాధికారతకు ప్రోత్సాహం: ప్రాథమిక స్థాయిలో లింగ సమానత్వం కనిపిస్తున్నా, సామాజికంగా బలహీన సమూహాల్లో అంతరాలు అలాగే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి.

 శిశు మరణాల నిర్మూలన: రోగ నిరోధక టీకాలను అందించడంలో విశేష కృషి జరిగింది. ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా అమలు చేయడం 2015 తర్వాత మన ముందు ఉండే పెద్ద సవాలు. శిశు మరణాల రేటు, ఐదేళ్లలోపు బాలల మరణాల రేటును తగ్గించడంపై దృష్టి పెట్టాలి.

 గర్భిణుల ఆరోగ్యం: ప్రసూతి మరణాల రేటు తగ్గింపులో రాష్ట్రం మరో 5 నుంచి 8 ఏళ్లలో ఆశించిన ఫలితాలను సాధించగలదు. 2015 తర్వాత రాష్ట్రం సాధించాల్సిన పెద్ద సవాళ్లలో ఇదీ ఒకటి.

 హెచ్‌ఐవీ/ఎయిడ్స్, మలేరియా, ఇతర రోగాలపై యుద్ధం: హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నిర్మూలనకు రాష్ట్రం విశేష కృషి చేసింది. 2015 తర్వాత  ఎయిడ్స్, టీబీల నుంచి ప్రజలను రక్షించే చర్యలు తీసుకోవాలి.

 పర్యావరణ సుస్థిరత: జనాభాలో సగం మందికి సురక్షిత తాగునీరు, పారిశుద్ధ్య సేవలు అందడం లేదు.   అడవుల అభివృద్ధి, జీవ వైవిధ్యం, పారిశుద్ధ్యం, మురికివాడల్లో అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సి ఉంది.

 అభివృద్ధి కోసం విశ్వ భాగస్వామ్యం: ప్రజలకు టెలిఫోన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే విషయంలో రాష్ట్రం గణనీయ ప్రగతిని సాధించింది. విశ్వ భాగస్వామ్యంతో కమ్యూనికేషన్ రంగాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement