ఐక్యరాజ్యసమితి: కరోనా మహమ్మారి విసిరిన పంజాతో విలవిలలాడిన ప్రపంచ దేశాలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కుదేలైపోయాయి. రెండేళ్ల పాటు విజృంభించిన ఈ వైరస్‌తో మానవాభివృద్ధి అయిదేళ్లు వెనక్కి వెళ్లినట్టు ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. ప్రజల సగటు ఆయుర్దాయం, విద్యా స్థాయి, జీవన ప్రమాణాల ఆధారంగా తయారు చేసే మానవాభివృద్ధి సూచిలో ప్రపంచదేశాలు వరసగా రెండేళ్లు 2020, 2021లో వెనక్కి పయనిస్తున్నట్టుగా ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) వెల్లడించింది.
‘‘అనిశ్చిత సమయాలు, అస్థిరమైన జీవితాలు’’ పేరుతో రూపొందించిన ఈ నివేదిక ప్రకారం ‘‘ప్రజలు ఆయుష్షు తగ్గిపోతుంది, ఉన్నత స్థాయి విద్యలు అభ్యసించలేరు, ఆదాయాలు పడిపోతాయి. గతంలో ఎన్నో సంక్షోభాలు చూసి ఇప్పుడున్న పరిస్థితులు గట్టి ఎదురుదెబ్బ’’ అని యూఎన్‌డీపీ చీఫ్ అచిమ్ స్టెనియర్ తెలిపారు. 32 ఏళ్లలో ప్రపంచ దేశాల్లో మానవాభివృద్ధి క్షీణించడం ఇదే మొదటిసారి.
కోవిడ్–19తో మొదలైన మానవాభివృద్ధి తిరోగమనం, వివిధ దేశాల్లో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభాలతో పాటు వాతావరణ మార్పులు కూడా ప్రపంచ దేశాలను కోలుకోనివ్వకుండా చేశాయని ఆ నివేదిక వెల్లడించింది. కరోనాతో పాటు ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రభావంతో చాలా దేశాలు కోలుకోవడం లేదని ఆ నివేదిక వివరించింది. తక్కువ కార్బన్ వినియోగం, అసమానతల కట్టడి , సుస్థిరత సాధించడం ద్వారా ప్రపంచ దేశాలు తిరిగి మానవాభివృద్ధిలో ముందుకు వెళ్లవచ్చునని నివేదిక రచయిత పెడ్రో కాన్సీకావో అభిప్రాయపడ్డారు. పునరుత్పాదక ఇంధనం, భవిష్యత్‌లో వచ్చే వ్యాధుల్ని ఎదుర్కొనే సన్నద్ధత, భవిష్యత్ సంక్షోభాల నుంచి బయటపడే సామర్థ్యం పెంపు వంటివి చేస్తే మానవాభివృద్ధి సూచి మెరుగుపడుతుందని తెలిపారు.
132వ స్థానంలో భారత్
2021 సంవత్సరానికి గాను మానవాభివృద్ధి సూచిలో మొత్తం 191 దేశాలకు గాను భారత్ 132వ స్థానంలో నిలిచింది. భారత మానవాభివృద్ధి విలువ 0.633గా నిలిచింది. అంటే మన దేశంలో మానవాభివృద్ధి మధ్యస్తంగా ఉందని చెప్పొచ్చు. 2020 సంవత్సరంలో 0.645గా ఉన్న విలువ ఏడాదిలో కాస్త తగ్గింది. అదే ఏడాది 189 దేశాలకు గాను ఇండియా ర్యాంక్ 131 ఉండేది. ఇక భారత్‌లో సగటు ఆయుర్దాయం 69.7 ఏళ్ల నుంచి 67.2 ఏళ్లకి తగ్గింది. 2019తో పోల్చి చూస్తే మన దేశ మానవాభివృద్ధిలో అసమానలు తగ్గుముఖం పట్టాయని అదొక శుభపరిణామమని భారత్‌లో యూఎన్‌డీపీ ప్రతినిధి షోకో నోడా చెప్పారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చి చూస్తే పురుషుల, మహిళల అభివృద్ధిలో ఉన్న తేడా చాలా వేగంగా తొలగిపోతోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment