Human Development Index (HDI)
-
ర్యాంకులు పోనాయండీ!
ప్రపంచవ్యాప్తంగా ఇది ఆందోళనకర అంశం, తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన విషయం. ఐరాస లెక్క ప్రకారం వరుసగా రెండో ఏడాదీ పలు దేశాల ‘మానవాభివృద్ధి సూచిక’ (హెచ్‌డీఐ) స్కోరు కిందకు పడింది. మన దేశపు ర్యాంకు మునుపటితో పోలిస్తే రెండు స్థానాలు కిందకు పడింది. ఐరాస అభివృద్ధి సంస్థ (యూఎన్డీపీ) 2021–22 మానవాభివృద్ధి నివేదిక (హెచ్డీఆర్) ‘అనిశ్చిత పరిస్థితులు, అస్థిర జీవితాలు – మారుతున్న ప్రపంచంలో భవిష్యత్ రూప కల్పన’ ఈ చేదునిజాన్ని బయటపెట్టింది. తొంభై శాతానికి పైగా దేశాలు 2020లో కానీ, 2021లో కానీ హెచ్‌డీఐ స్కోరులో వెనకబడ్డాయి. నలభై శాతానికి పైగా దేశాలైతే ఆ రెండేళ్ళూ ర్యాంకుల్లో కిందికి వచ్చేశాయి. గత వారం విడుదలైన ఈ నివేదిక ప్రకారం మానవాభివృద్ధిలో మొత్తం 191 దేశాల్లో మన దేశం రెండు స్థానాలు కిందకొచ్చి, 132వ ర్యాంకుకు చేరింది. గడచిన 32 ఏళ్ళలో ఇలా వరుసగా రెండేళ్ళు సూచికలో దిగజారడం ఇదే తొలిసారి. మానవాభివృద్ధి పరామితుల ప్రకారం బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంకల కన్నా మనం వెనకబడే ఉన్నాం. దేశం సుభిక్షంగా ఉంది, స్థూల జాతీయోత్పత్తిలో బ్రిటన్ను దాటేశాం లాంటి కబుర్లతో కాలక్షేపం చేస్తున్న వారికి ఇది కనువిప్పు. హెచ్డీఐలో వివిధ దేశాల ర్యాంకులు పడిపోవడానికి కనివిని ఎరుగని సంక్షోభాలు కారణం. గత పదేళ్ళలో ఆర్థికపతనాలు, వాతావరణ సంక్షోభాలు, కరోనా, యుద్ధం లాంటి గడ్డు సమస్యల్ని ప్రపంచం ఎదుర్కొంది. ప్రతి సంక్షోభం ప్రపంచాభివృద్ధిపై ప్రభావం చూపింది. అయితే, అందులో కరోనాది అతి పెద్ద పాత్ర అని ఐరాస నివేదిక సారాంశం. ప్రపంచాన్ని వణికించిన ఈ మహమ్మారితో మానవ పురోగతి కనీసం అయిదేళ్ళు వెనక్కి వెళ్ళింది. అంతటా అనిశ్చితి ప్రబలింది. హెచ్‌డీఐకి లెక్కలోకి తీసుకుంటున్న అంశాల్లో లోపాలున్నాయని కొన్ని విమర్శలు లేకపోలేదు. అయితే, మరే సూచికా లేని వేళ ప్రతి దేశపు సగటు విజయాన్నీ లెక్కించడానికి ఉన్నంతలో ఇదే మెరుగైనదని ఒప్పుకోక తప్పదు. ఆర్థిక అసమానత్వం, లైంగిక అసమానత్వం, బహుముఖ దారిద్య్రం లాంటి ఆరు వేర్వేరు మానవాభివృద్ధి సూచీల ద్వారా ఈ ర్యాంకులు లెక్కకట్టారు. స్విట్జర్లాండ్ 0.962 స్కోరుతో ప్రథమ ర్యాంకు దక్కించుకుంది. భారత్ కేవలం 0.633 స్కోరుతో అగ్రశ్రేణికి సుదూరంగా నిలిచిపోయింది. విషాదమేమిటంటే, మానవాభివృద్ధిలో మన స్కోరు ప్రపంచ సగటు 0.732 కన్నా తక్కువ. పొరుగున ఉన్న చైనా హెచ్‌డీఐ స్కోర్ 1990 నుంచి ఏటా పెరుగుతుంటే, మన పరిస్థితి తద్భిన్నంగా ఉంది. మన దేశంలో ఆర్థిక అసమానతలూ ఎక్కువే. జనాభాలో అతి సంపన్నులైన 1 శాతం మంది ఆదాయ వాటా, నిరుపేదలైన 40 శాతం మంది వాటా కన్నా ఎక్కువని తాజా లెక్క. ఇంతటి అసమానత చైనా, స్విట్జర్లాండ్లలో లేదు. లింగపరంగా చూస్తే, మన దేశ తలసరి ఆదాయంలో పురుషుల కన్నా స్త్రీలు చాలా వెనుకబడి ఉన్నారు. విద్య, వైద్యం, జీవన ప్రమాణాల ప్రాతిపదికన లెక్కకట్టే బహుముఖ దారిద్య్రం లోనూ భారత్ పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. 2019 నాటి యూఎన్డీపీ అంచనాల ప్రకారం... ప్రపంచంలో అత్యధిక జనాభా గల చైనాలో 5.4 కోట్ల మంది బహుముఖ దారిద్య్రంలో ఉంటే, రెండో అత్యధిక జనాభా ఉన్న భారత్‌లో ఆ సంఖ్య 38.1 కోట్ల పైచిలుకే. అయితే, 2019 – 2020 మధ్య మన దేశంలో లింగ అసమానత దారుణంగా పెరగగా, తాజా నివేదికలో ఆ కోణంలో కొద్దిగా మెరుగుదల సాధించడం ఉపశమనం. మొత్తానికి, అన్నీ కలిపి చూస్తే మానవాభివృద్ధిలో మన స్కోరునూ, దరిమిలా ఇతర దేశాల మధ్య మన ర్యాంకునూ కిందకు గుంజాయి. అయితే, సంతోషించదగ్గ అంశం ఏమంటే – కరోనాలో ఏడాది లోపలే భారత్ టీకాను అభివృద్ధి చేయడం, ధనిక దేశాలకు సైతం కరోనా నిరోధానికి సహకరించడం! ఇది మన మానవ సామర్థ్యమే! అదే సమయంలో కనీస ఆదాయ హామీకై దేశంలో జరుగుతున్న ప్రయత్నాలూ యూఎన్డీపీ ప్రశంసలు అందుకున్నాయి. అలాగే కరోనా అనంతరం ఆర్థికంగా మన దేశపు పనితీరు పొరుగు దేశాల కన్నా మెరుగ్గా ఉండడం ఆశాకిరణం. అభివృద్ధి అజెండా అమలుకు నిధులు వెచ్చించే వీలుంటుంది. అయినా, ఇప్పటికీ అనేక అంశాల్లో ఇతర దేశాలు మెరుగ్గా ఉన్నాయనేది నిష్ఠురసత్యం. పౌష్టికలోప జనాభా, బాలల మరణాల రేటు తదితర అంశాలతో లెక్కించే ‘ప్రపంచ ఆకలి సూచి’ (2020) ప్రకారం కూడా 107 దేశాల్లో మనది 94వ స్థానం. వీటికి తోడు ఇప్పుడు ఉక్రెయిన్‌లో యుద్ధం, ప్రపంచాన్ని పూర్తిగా వదిలిపోని కరోనా, భూతాపోన్నతి ముప్పేటదాడి చేస్తున్నాయి. అన్నీ కలసి ప్రపంచ ఆహార సంక్షోభానికి దారి తీయవచ్చని ఐరాస హెచ్చరిస్తోంది. నిలకడైన అభివృద్ధి, సామాజిక భద్రత, సత్వర సాంకేతిక ఆవిష్కరణలపై దృష్టి పెడితేనే అనిశ్చితి నుంచి బయటపడగలమంటోంది. ఐరాస మాట చద్దిమూట. పాలకులు దీన్ని పరిగణనలోకి తీసుకొని, పకడ్బందీగా మానవాభివృద్ధి ప్రణాళికలు రచించాలి. పర్యావరణ సంక్షోభ నివారణ లక్ష్యాలను చేరుకొనేందుకూ కృషి చేయాలి. ద్రవ్యోల్బణం, ధరలు పెరుగుతూ, ఉపాధి హామీ తగ్గుతున్న సమయంలో ఎన్నికల వ్యూహాలు కాస్త ఆపి, నిలకడగా చేతల్లోకి దిగాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతరాలు తగ్గించుకొని, సమన్వయంతో సాగాలి. కానీ, పైచేయి కోసం ప్రయత్నాలతో ఢిల్లీ నుంచి గల్లీ దాకా సహకార స్ఫూర్తి కొరవడుతున్న వేళ ప్రగతి బాటలో కలసి సాగడానికి మన పాలకులు సిద్ధమేనా? -
Human Development Index: మానవాభివృద్ధి ఐదేళ్లు వెనక్కి
ఐక్యరాజ్యసమితి: కరోనా మహమ్మారి విసిరిన పంజాతో విలవిలలాడిన ప్రపంచ దేశాలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కుదేలైపోయాయి. రెండేళ్ల పాటు విజృంభించిన ఈ వైరస్‌తో మానవాభివృద్ధి అయిదేళ్లు వెనక్కి వెళ్లినట్టు ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. ప్రజల సగటు ఆయుర్దాయం, విద్యా స్థాయి, జీవన ప్రమాణాల ఆధారంగా తయారు చేసే మానవాభివృద్ధి సూచిలో ప్రపంచదేశాలు వరసగా రెండేళ్లు 2020, 2021లో వెనక్కి పయనిస్తున్నట్టుగా ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) వెల్లడించింది. ‘‘అనిశ్చిత సమయాలు, అస్థిరమైన జీవితాలు’’ పేరుతో రూపొందించిన ఈ నివేదిక ప్రకారం ‘‘ప్రజలు ఆయుష్షు తగ్గిపోతుంది, ఉన్నత స్థాయి విద్యలు అభ్యసించలేరు, ఆదాయాలు పడిపోతాయి. గతంలో ఎన్నో సంక్షోభాలు చూసి ఇప్పుడున్న పరిస్థితులు గట్టి ఎదురుదెబ్బ’’ అని యూఎన్డీపీ చీఫ్ అచిమ్ స్టెనియర్ తెలిపారు. 32 ఏళ్లలో ప్రపంచ దేశాల్లో మానవాభివృద్ధి క్షీణించడం ఇదే మొదటిసారి. కోవిడ్–19తో మొదలైన మానవాభివృద్ధి తిరోగమనం, వివిధ దేశాల్లో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభాలతో పాటు వాతావరణ మార్పులు కూడా ప్రపంచ దేశాలను కోలుకోనివ్వకుండా చేశాయని ఆ నివేదిక వెల్లడించింది. కరోనాతో పాటు ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రభావంతో చాలా దేశాలు కోలుకోవడం లేదని ఆ నివేదిక వివరించింది. తక్కువ కార్బన్ వినియోగం, అసమానతల కట్టడి , సుస్థిరత సాధించడం ద్వారా ప్రపంచ దేశాలు తిరిగి మానవాభివృద్ధిలో ముందుకు వెళ్లవచ్చునని నివేదిక రచయిత పెడ్రో కాన్సీకావో అభిప్రాయపడ్డారు. పునరుత్పాదక ఇంధనం, భవిష్యత్‌లో వచ్చే వ్యాధుల్ని ఎదుర్కొనే సన్నద్ధత, భవిష్యత్ సంక్షోభాల నుంచి బయటపడే సామర్థ్యం పెంపు వంటివి చేస్తే మానవాభివృద్ధి సూచి మెరుగుపడుతుందని తెలిపారు. 132వ స్థానంలో భారత్ 2021 సంవత్సరానికి గాను మానవాభివృద్ధి సూచిలో మొత్తం 191 దేశాలకు గాను భారత్ 132వ స్థానంలో నిలిచింది. భారత మానవాభివృద్ధి విలువ 0.633గా నిలిచింది. అంటే మన దేశంలో మానవాభివృద్ధి మధ్యస్తంగా ఉందని చెప్పొచ్చు. 2020 సంవత్సరంలో 0.645గా ఉన్న విలువ ఏడాదిలో కాస్త తగ్గింది. అదే ఏడాది 189 దేశాలకు గాను ఇండియా ర్యాంక్ 131 ఉండేది. ఇక భారత్‌లో సగటు ఆయుర్దాయం 69.7 ఏళ్ల నుంచి 67.2 ఏళ్లకి తగ్గింది. 2019తో పోల్చి చూస్తే మన దేశ మానవాభివృద్ధిలో అసమానలు తగ్గుముఖం పట్టాయని అదొక శుభపరిణామమని భారత్‌లో యూఎన్డీపీ ప్రతినిధి షోకో నోడా చెప్పారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చి చూస్తే పురుషుల, మహిళల అభివృద్ధిలో ఉన్న తేడా చాలా వేగంగా తొలగిపోతోందని తెలిపారు. -
మానవాభివృద్ధి సూచీలో భారత్ @ 129
న్యూఢిల్లీ: ప్రపంచ మానవాభివృద్ధి సూచీలో భారత్ 129వ స్థానంలో ఉంది. ఐక్యరాజ్యసమితి సోమ వారం ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) నివేదిక–2019ను విడుదల చేసింది. తొలి మూడు స్థానాల్లో నార్వే, స్విట్జర్లాండ్, ఐర్లాండ్ నిలిచాయి. పాకిస్తాన్ 152వ స్థానంలో ఉంది. అట్టడుగున 189 స్థానంలో నైగర్ ఉంది. 189 దేశాలతో జాబితా రూపొందించింది. 2005–06 నుంచి 2015–16 వరకు 27.1 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడినట్టు యూఎన్డీపీ ఇండియా ప్రతినిధి షోకో నోడా వెల్లడించారు. 2018లో భారత్ 130వ స్థానంలో ఉంది. మూడు దశాబ్దాలుగా జరుగుతున్న అభివృద్ధి కారణంగా పేదరికంలోనూ, భారతీయుల ఆయుర్దాయంలోనూ, విద్య, వైద్య సదుపాయాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని రిపోర్టు వెల్లడించింది. ► 1.3 బిలియన్ల మంది నిరుపేదల్లో 28 శాతం మంది భారత్‌లో ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకా స్త్రీలు, బాలికలు అసమానతల సవాళ్ళను ఎదుర్కొంటూనే ఉన్నారు. హా భర్తల చేతిలో హింసకు గురౌతున్న మహిళలు సింగపూర్‌లో అతి తక్కువ. ► దక్షిణాసియాలో 31 శాతం మంది మహిళలు భర్తల చేతిలో హింసకు గురౌతున్నారు. ► లింగ అభివృద్ధి సూచీలో దక్షిణాసియా దేశాల సగటు కంటే భారత్ కొద్దిగా మెరుగైన స్థితిలో ఉంది. -
తల్లి చదివితేనే పిల్లాడికి పెళ్లి..!
2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో కులాంతర వివాహాలు 5.82 శాతం మాత్రమే. అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం గత నలభయ్యేళ్ళుగా కులాంతర వివాహాల శాతం అదేమాదిరిగా కొనసాగడం. భారత దేశ వివాహ వ్యవస్థలో కుటుంబ నిర్ణయాలే ప్రధానం. మనదేశంలో జరుగుతోన్న పెళ్ళిళ్లలో వ్యక్తిగత ఇష్టాయిష్టాలకంటే కుటుంబ నిర్ణయాలకే ప్రాధాన్యత ఎక్కువ. 2011 లెక్కల ప్రకారమే మన దేశంలో 73 శాతం పెళ్ళిళ్ళు పెద్దలు కుదిర్చినవే. వీరిలో అతి కొద్దిమందికి మాత్రమే తాము చేసుకోబోయే వారితో కనీస పరిచయం ఉంటోంది. 63 శాతం మంది పెళ్లి రోజు వరకూ ఒకరినొకరు చూసుకోనివారే ఉన్నారు. అయితే తాజా అధ్యయనం మాత్రం తల్లి చదువు కులాంతర వివాహాలకు ఊతమిస్తోందని తేల్చి చెప్పింది. తల్లి చదువు కులాంతర వివాహాలకు ప్రోత్సాహం... భారత్‌లో కులాంతర వివాహాలను అమితంగా ప్రభావితం చేస్తోన్న అంశం చదువేనని తాజా అధ్యయనం తేల్చి చెప్పింది. అయితే కులాంతర వివాహాల సానుకూలతను సృష్టిస్తోంది పెళ్ళికొడుకు చదువో, పెళ్ళికూతురు చదువో అనుకుంటే పొరబడ్డట్టే. పెళ్ళి కుమారుడి తల్లి విద్యావంతురాలైతే కులాంతర వివాహాలకు కుటుంబాల్లో సానుకూలత ఏర్పడుతున్నట్టు ఢిల్లీకి చెందిన ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ తాజా అధ్యయనం తేల్చి చెప్పింది. 2011-12 ఇండియన్ హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే-2 గణాంకాల ఆధారంగా 2017లో చేసిన ఈ అధ్యయనం మనదేశంలోని కులవ్యవస్థ కు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తెచ్చింది. అందులో వరుడి తల్లి విద్యాస్థితి కులాంతర వివాహాలపై ప్రభావితం చూపుతోందని వెల్లడించింది. అందుకు కారణం కుటుంబ బాధ్యతలు మోస్తోన్న చదువుకున్న తల్లులు కులాల కట్టుబాట్ల విషయంలో మరింత చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నట్టు ఈ అధ్యయన వెల్లడించింది. వరుడి తల్లి విద్యాధికురాలైతే కులాంతర వివాహాల్లో దేశం పదేళ్ళ ముందుంటుందని ఈ సర్వే తేల్చింది. పెళ్ళికొడుకు తల్లి చదువుకున్న కుటుంబాల్లో 1.8 శాతం కులాంతర వివాహాలు జరిగినట్టు వెల్లడయ్యింది. అయితే పెళ్ళి కూతురి తల్లి చదువు కులాంతర వివాహాలను ప్రభావితం చేయడం లేదన్నది గమనార్హం. కుటుంబాల మధ్యనా, దగ్గరి బంధువుల మధ్యనా, సంబంధీకుల మధ్య వివాహాల్లో మన దేశానికీ ఇతర దేశాలకీ పోలిక లేదని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. దీనికి కారణం మనదేశంలో కుటుంబ వ్యవస్థ పునాదులు బలీయమైనవి కావడమేననీ, కుటుంబాల్లో వ్యక్తిగత స్వేచ్ఛకు అంత ప్రాధాన్యత లేకపోవడం కూడా ప్రధాన కారణంగా ఈ సర్వే వెల్లడించింది. సహజంగా పారిశ్రామికీకరణ, విద్యాభివృద్ధీ, పట్టణీకరణ, సామాజిక చైతన్యం వల్ల దగ్గరి సంబంధాల వివాహాలు తగ్గి, కులాంతర, వర్గాంతర వివాహాలు పెరుగుతాయని భావిస్తారు. కానీ వీటన్నింటిలో అభివృద్ధి కనబడుతున్నా 1970 నుంచి 2012 వరకు సుదీర్ఘకాలంలో కులాంతర వివాహాలు మాత్రం పెరగకపోవడాన్ని బట్టి మోడర్నైజేషన్ థియరీ తప్పని తేలింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలకంటే మెట్రోపాలిటన్ సిటీస్‌లో కులాంతర వివాహాలు తక్కువని కూడా స్పష్టమైంది. పెళ్ళి కొడుకు, పెళ్ళికూతురి తరఫు ఆర్థిక స్థోమత సైతం కులాంతర వివాహాలను ప్రభావితం చేయడంలేదు. పైగా ఆర్థిక స్థోమత పెరిగే కొద్దీ కులాంతర వివాహాలు తగ్గుతున్నాయి. దళితుల్లో ఆర్థిక స్థోమత పెరిగే కొద్దీ కులాంతర వివాహాలు పెరుగుతున్నాయి. అగ్రకులాల్లో ఆర్థిక స్థోమత పెరిగే కొద్దీ కులాంతర వివాహాలు తగ్గుతున్నట్టు అధ్యయనం తేల్చి చెప్పింది. -
నీతి ఆయోగ్ సీఈవో సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ ; నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్, యూపీ, ఛత్తీస్‌గఢ్ లాంటి రాష్ట్రాలు దేశ అభివృద్ధికి ఆటంకాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. సోమవారం జమియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ వ్యాఖ్యలు చేశారు. ‘బిహార్, యూపీ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు భారత ఆర్థికాభివృద్ధికి ఆటంకాలుగా మారాయి. ముఖ్యంగా సామాజిక సూచీలో ఆయా రాష్ట్రాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. విద్యా-ఆరోగ్య వ్యవస్థలు ఆయా ప్రాంతాల్లో ప్రమాదకరమైన పరిస్థితికి చేరుకున్నాయి. ఐదో తరగతి పిల్లాడికి చదువుల్లో కనీస పరిజ్ఞానం లేకుండా పోతోంది. చదువుతోపాటు పిల్లల ఆరోగ్య స్థితులను అక్కడి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. మహిళల విషయంలో కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఓవైపు మేము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను పెంపొందించేందుకు కృషి చేస్తుంటే.. మానవాభివృద్ధి సూచిక కలవరపెడుతోంది. ..మానవాభివృద్ధి సూచీ(హెచ్‌డీఐ)లో మొత్తం 188 దేశాలకు గానూ భారత్ 131వ స్థానంలో ఉంది. అయితే దక్షిణ భారతంలో, ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రం చాలా వేగవంతంగా అభివృద్ధి జరుగుతోంది. హెచ్డీఐలో భారత్ స్థితి మెరుగుపడితేనే.. సామాజిక సూచీ విషయంలో మేం ఏమైనా చేయగలుగుతాం. అప్పటిదాకా పరిస్థితి ఇంతే’ అని కాంత్ వెల్లడించారు. అయితే పరిస్థితిని మెరుగుపరిచేందుకు నీతి ఆయోగ్ తరపున కొన్ని జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మహిళా సాధికారకత పెంపొందించే దిశగా విధివిధానాలను ప్రభుత్వాలు రూపొందించినప్పుడే దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
మానవాభివృద్ధి సూచీలో 135వ స్థానంలో భారత్
మానవ ప్రమాణాల్లో గతం కన్నా కాస్త మెరుగని యూఎన్డీపీ వ్యాఖ్య బ్రిక్స్ దేశాల్లో అట్టడుగున ఇండియా న్యూఢిల్లీ: మానవాభివృద్ధి సూచిక(హెచ్‌డీఐ)లో భారత్ 135వ స్థానంలో నిలిచింది. ఐక్యరాజ్యసమితికి చెందిన యునెటైడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(యూఎన్డీపీ) గురువారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2013 సంవత్సరానికి గానూ మొత్తం 187 దేశాల్లో భారత్ 135వ స్థానం సాధించింది. అంతకుముందు సంవత్సరం 136వ స్థానం సాధించిన భారత్.. ప్రజల జీవన ప్రమాణాల్లో కాస్త మెరుగుదలను సాధించి 135వ స్థానానికి చేరిందని యూఎన్డీపీ పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. హెచ్డీఐలో 0.586 (0-1 సూచీలో) విలువతో ‘సాధారణ అభివృద్ధి’ని చూపే కేటగిరీ లో భారత్ నిలిచింది. 1980 నుంచి 2013 మధ్య భారతహెచ్డీఐ విలువ 0.369 నుంచి 0.586కు పెరిగింది. 2013లో హెచ్‌డీఐ సూచీలో తొలి మూడు స్థానాల్లో నార్వే(0.944), ఆస్ట్రేలియా(0.933), స్విట్జర్లాండ్(0.917)లు ఉండగా.. ఆరోగ్యకరమైన, దీర్ఘ ఆయుఃప్రమాణం; జ్ఞాన సముపార్జనకు అవకాశాలు; మెరుగైన జీవన ప్రమాణం.. ఈ మూడు కీలకాంశాల్లో ఆయా దేశాల దీర్ఘకాలిక అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుని యూఎన్డీపీ మానవాభివృద్ధి సూచికను రూపొందిస్తుంది. నివేదికలోని ఇతర వివరాలు.. * భారత్ సహా బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలేవీ అధికఅభివృద్ధి సాధించిన దేశాల జాబితాలో లేవు. బ్రిక్స్ దేశాల్లో కూడా భారత్ చివరన ఉంది. బ్రిక్స్దేశాల్లో రష్యా 57వ ర్యాంక్‌తో తొలిస్థానంలో ఉంది. బ్రెజిల్ 79, చైనా 91లో ఉన్నాయి. * కొన్ని దేశాలు మినహా దాదాపు అన్ని దేశాలు గత సంవత్సర ర్యాంకుల వద్దే నిలిచాయి. * భారత్‌లో 1980 - 2013 మధ్య జనన సమయంలో ఆయుఃప్రమాణం 11 ఏళ్లు పెరిగింది. * సాధారణ అభివృద్ధి కేటగిరీలో ఉన్న దేశాల సగటు కూడా భారత్ కన్నా ఎక్కువగా 0.614గా ఉంది. దక్షిణాసియా దేశాల సగటైన 0.588 కన్నా కూడా భారత్ హెచ్‌డీఐ విలువ తక్కువగానే ఉండటం గమనార్హం. * మన పొరుగుదేశాల్లో మనకన్నా తక్కువగా పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు వరుసగా 142, 146 స్థానాల్లో ఉన్నాయి. * లింగ అసమానత సూచీలో(జీఐఐ)నూ భారత్ దిగువలోనే ఉండిపోయింది. జీఐఐని పరిగణనలోకి తీసుకున్న 152 దేశాలకుగానూ 127వ స్థానంలో భారత్ నిలిచింది. * కొత్తగా ప్రారంభించిన ‘స్త్రీ- పురుష అభివృద్ధి(జీడీఐ)’ సూచీలో భారత్‌లోని మహిళల విలువ 0.519 కాగా, పురుషుల విలువ 0.627గా ఉంది. దేశంలోని స్త్రీ, పురుష నిష్పత్తిని తెలిపే సూచీ ఇది.