నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ (పాత చిత్రం)
సాక్షి, న్యూఢిల్లీ ; నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్, యూపీ, ఛత్తీస్‌గఢ్ లాంటి రాష్ట్రాలు దేశ అభివృద్ధికి ఆటంకాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. సోమవారం జమియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ వ్యాఖ్యలు చేశారు.
‘బిహార్, యూపీ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు భారత ఆర్థికాభివృద్ధికి ఆటంకాలుగా మారాయి. ముఖ్యంగా సామాజిక సూచీలో ఆయా రాష్ట్రాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. విద్యా-ఆరోగ్య వ్యవస్థలు ఆయా ప్రాంతాల్లో ప్రమాదకరమైన పరిస్థితికి చేరుకున్నాయి. ఐదో తరగతి పిల్లాడికి చదువుల్లో కనీస పరిజ్ఞానం లేకుండా పోతోంది. చదువుతోపాటు పిల్లల ఆరోగ్య స్థితులను అక్కడి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. మహిళల విషయంలో కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఓవైపు మేము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను పెంపొందించేందుకు కృషి చేస్తుంటే.. మానవాభివృద్ధి సూచిక కలవరపెడుతోంది.
..మానవాభివృద్ధి సూచీ(హెచ్‌డీఐ)లో మొత్తం 188 దేశాలకు గానూ భారత్ 131వ స్థానంలో ఉంది. అయితే దక్షిణ భారతంలో, ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రం చాలా వేగవంతంగా అభివృద్ధి జరుగుతోంది. హెచ్‌డీఐలో భారత్ స్థితి మెరుగుపడితేనే.. సామాజిక సూచీ విషయంలో మేం ఏమైనా చేయగలుగుతాం. అప్పటిదాకా పరిస్థితి ఇంతే’ అని కాంత్ వెల్లడించారు. అయితే పరిస్థితిని మెరుగుపరిచేందుకు నీతి ఆయోగ్ తరపున కొన్ని జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మహిళా సాధికారకత పెంపొందించే దిశగా విధివిధానాలను ప్రభుత్వాలు రూపొందించినప్పుడే దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment