ముంబై: దేశంలో ఆర్థిక రంగానికి సంబంధించి పనిచేస్తున్న నియంత్రణ సంస్థలు (రెగ్యులేటర్లు) సోషలిస్ట్ యుగంలో రూపొందించినవని, వృద్ధి కోసం అవి మారాల్సిన అవసరం ఉందని జీ–20లో భారత్ షెర్పా (ప్రతినిధి), నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. ఎస్‌బీఐ కాంక్లేవ్‌లో భాగంగా కాంత్ మాట్లాడారు. ఆర్‌బీఐ, సెబీ, కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. మార్పు, అభివృద్ధి ఏజెంట్లుగా పనిచేయాలని సూచించారు.
ఎప్పుడో సామ్యవాదం రోజుల్లో నియంత్రణ సంస్థలు ఏర్పాడ్డాయని, నేటి కాలానికి అనుగుణంగా వాటి ఆలోచనా విధానంలో మార్పు రావాలన్నది తన అభిప్రాయంగా పేర్కొన్నారు. దేశ అభివృద్ధి ఆవశ్యకత గురించి కాంపిటిషన్ కమిషన్ (సీసీఐ) ఉపోద్ఘాతంలో ప్రస్తావించారని చెబుతూ, ఇతర నియంత్రణ సంస్థలకు సైతం ఇదే విధమైన లక్ష్యం ఉండాలన్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ, రెన్యువబుల్ ఎనర్జీలో రానున్న అవకాశాలను భారత్ సొంతం చేసుకోలేకపోతే 7 శాతం వృద్ధి రేటును కూడా ఆశించలేమన్నారు. ఉచిత విద్యుత్ తదితర ఉచిత తాయిలాలతో కొంత మంది రాజకీయ నాయకులు దేశాన్ని నాశనం చేస్తున్నారని, ప్రత్యేకంగా ఎవరి పేరును ప్రస్తావించకుండా విమర్శించారు. ఈ ఏడాది జీ–20కి భారత్ నాయకత్వం వహిస్తుండడం తెలిసిందే.
సర్క్యులర్ ఎకానమీపై దృష్టి అవశ్యం
క్లైమేట్ చేంజ్ సమస్య పరిష్కారం కోసం (వాతావరణ సమతౌల్య పరిరక్షణ) సర్క్యులర్ ఎకానమీపై దృష్టి సారించాల్సిన తక్షణ అవసరం ఉందని ఒక వెర్చువల్ కార్యక్రమంలో భారత్ తరఫున జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ అనేది ఉత్పత్తి– వినియోగానికి సంబంధించిన ఒక నమూనా. వినియోగ ఉత్పత్తుల రీసైక్లింగ్ ఇందులో ప్రధాన భాగం. డిసెంబర్ 1 నుంచి జీ–20 ప్రెసిడెన్సీ బాధ్యతలు స్వీకరిస్తున్న భారత్, సర్క్యులర్ ఎకానమీ పురోగతికి తన వంతు ప్రయత్నం చేస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment