Competition Commission
-
క్విక్ కామర్స్ విధానాలపై సీసీఐకు ఫిర్యాదు
న్యూఢిల్లీ: క్విక్ కామర్స్ సంస్థలు అసమంజసమైన వ్యాపార విధానాలు పాటిస్తున్నాయంటూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖకు వినియోగ ఉత్పత్తుల పంపిణీదారుల సమాఖ్య (ఏఐసీపీడీఎఫ్) ఫిర్యాదు చేసింది. దీన్ని పరిశీలించాలంటూ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ)కి పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) పంపించినట్లు సమాచారం. సీసీఐ ఇప్పటికే ఈ–కామర్స్ సంస్థల మీద వచి్చన ఫిర్యాదులపై విచారణ చేస్తోంది. క్విక్ కామర్స్ కంపెనీలు (క్యూసీసీ) పోటీవ్యాపారాలను దెబ్బతీసే విధానాలు పాటిస్తున్నాయంటూ తాము సీసీఐకి అధికారికంగా కూడా ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు ఏఐసీపీడీఎఫ్ ప్రెసిడెంట్ దర్శిల్ పాటిల్ తెలిపారు. 10 నుంచి 30 నిమిషాల్లో సరుకులను డెలివర్ చేసే క్యూసీసీ విభాగంలో బ్లింకిట్, జెప్టో తదితర సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దీనితో తమ వ్యాపారాలపై ప్రభావం పడుతోందంటూ చిన్న వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశీయంగా క్యూసీసీ మార్కెట్ విలువ సుమారు 5 బిలియన్ డాలర్లుగా ఉంది. -
ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్‌కు సీసీఐ ఓకే
న్యూఢిల్లీ: సింగపూర్ నిధుల సమీకరణ సంస్థ ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ(క్యూఐఏ) ప్రతిపాదిత పెట్టుబడులకు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. క్యూఐఏ ఖతార్‌కు చెందిన సావరిన్ వెల్త్ ఫండ్‌కాగా.. మర్డోక్ సంస్థ లుపా సిస్టమ్స్(జపాన్)తోపాటు, స్టార్, డిస్నీ ఇండియా మాజీ చైర్మన్ ఉదయ్ శంకర్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ వెంచర్ సంస్థే బీటీఎస్1. అయితే బీటీ ఎస్1లో క్యూఐఏ పెట్టుబడులు పెట్టనుంది. వయాకామ్18లో పెట్టుబడుల కోసం బీటీఎస్1 వివిధ సంస్థల నుంచి నిధులు సమీకరిస్తోంది. క్యూఐఏ నుంచి 1.5 బిలియన్ డాలర్ల సమీకరణకు గతేడాది ఫిబ్రవరిలో మర్డోక్, ఉదయ్ శంకర్ బోధి ట్రీ సిస్టమ్స్(బీటీఎస్)ను ఏర్పాటు చేశారు. తదుపరి ఏప్రిల్‌లో బిలియనీర్ ముకేశ్ అంబానీతో భాగస్వా మ్యం ద్వారా బీటీఎస్.. వయాకామ్18లో రూ. 13,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలియజేసింది. ఈ త్రిముఖ ఒప్పందం ద్వారా దేశీయంగా భారీస్థాయిలో టీవీ, డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఆపై 2022 సెప్టెంబర్‌లో బీటీఎస్ ఇన్వెస్ట్మెంట్, రిలయన్స్ ప్రాజెక్ట్స్, ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ పెట్టుబడుల నేపథ్యంలో జియో సినిమా, వయాకామ్18 మీడియా విలీనానికి సీసీఐ అనుమతించింది. -
ఎయిరిండియా, విస్తారా విలీనానికి అనుమతులపై కసరత్తు
న్యూఢిల్లీ: విమానయాన సంస్థలు ఎయిరిండియా, విస్తారా విలీనంపై టాటా గ్రూప్ కసరత్తు కొనసాగిస్తోంది. ప్రస్తుతం కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) నుంచి అనుమతులు తీసుకునే ప్రక్రియ జరుగుతోందని ఎయిరిండియా చీఫ్ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. ఎయిరిండియాకు అంతర్జాతీయంగా కూడా ప్రాచుర్యం ఉన్న నేపథ్యంలో విలీనానంతరం ఏర్పడే సంస్థ అదే పేరుతో కొనసాగుతుందని ఆయన వివరించారు. అయితే, ’విస్తార’ వారసత్వంగా కొన్ని అంశాలను యథాతథంగా ఉంచేందుకు ప్రయత్నిస్తామని విల్సన్ చెప్పారు. ‘గ్రూప్‌లో ఒక ఫుల్–సర్వీస్ ఎయిర్‌లైన్, ఒక చౌక సర్వీసుల విమానయాన సంస్థ ఉండాలన్నది మా ఉద్దేశం. ఎయిరిండియా, విస్తార విలీనంతో ఫుల్ సర్వీస్ ఎయిర్‌లైన్ ఏర్పాటవుతుంది‘ అని ఆయన పేర్కొన్నారు. ఎయిరిండియాను టాటా గ్రూప్ గతేడాది టేకోవర్ చేసింది. అందులో విస్తారను, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో ఏఐఎక్స్ కనెక్ట్‌ను (గతంలో ఎయిరేషియా ఇండియా) విలీనం చేయాలని భావిస్తోంది. ఎయిరిండియా, విస్తార విలీనం 2024 మార్చి నాటికి పూర్తి కావచ్చని అంచనా. ప్రస్తుతం విస్తారలో టాటా గ్రూప్‌నకు 51 శాతం, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 49 శాతం వాటాలు ఉన్నాయి. -
వృద్ధి కోసం ఫైనాన్షియల్ రెగ్యులేటర్లు మారాలి
ముంబై: దేశంలో ఆర్థిక రంగానికి సంబంధించి పనిచేస్తున్న నియంత్రణ సంస్థలు (రెగ్యులేటర్లు) సోషలిస్ట్ యుగంలో రూపొందించినవని, వృద్ధి కోసం అవి మారాల్సిన అవసరం ఉందని జీ–20లో భారత్ షెర్పా (ప్రతినిధి), నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. ఎస్బీఐ కాంక్లేవ్‌లో భాగంగా కాంత్ మాట్లాడారు. ఆర్బీఐ, సెబీ, కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. మార్పు, అభివృద్ధి ఏజెంట్లుగా పనిచేయాలని సూచించారు. ఎప్పుడో సామ్యవాదం రోజుల్లో నియంత్రణ సంస్థలు ఏర్పాడ్డాయని, నేటి కాలానికి అనుగుణంగా వాటి ఆలోచనా విధానంలో మార్పు రావాలన్నది తన అభిప్రాయంగా పేర్కొన్నారు. దేశ అభివృద్ధి ఆవశ్యకత గురించి కాంపిటిషన్ కమిషన్ (సీసీఐ) ఉపోద్ఘాతంలో ప్రస్తావించారని చెబుతూ, ఇతర నియంత్రణ సంస్థలకు సైతం ఇదే విధమైన లక్ష్యం ఉండాలన్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ, రెన్యువబుల్ ఎనర్జీలో రానున్న అవకాశాలను భారత్ సొంతం చేసుకోలేకపోతే 7 శాతం వృద్ధి రేటును కూడా ఆశించలేమన్నారు. ఉచిత విద్యుత్ తదితర ఉచిత తాయిలాలతో కొంత మంది రాజకీయ నాయకులు దేశాన్ని నాశనం చేస్తున్నారని, ప్రత్యేకంగా ఎవరి పేరును ప్రస్తావించకుండా విమర్శించారు. ఈ ఏడాది జీ–20కి భారత్ నాయకత్వం వహిస్తుండడం తెలిసిందే. సర్క్యులర్ ఎకానమీపై దృష్టి అవశ్యం క్లైమేట్ చేంజ్ సమస్య పరిష్కారం కోసం (వాతావరణ సమతౌల్య పరిరక్షణ) సర్క్యులర్ ఎకానమీపై దృష్టి సారించాల్సిన తక్షణ అవసరం ఉందని ఒక వెర్చువల్ కార్యక్రమంలో భారత్ తరఫున జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ అనేది ఉత్పత్తి– వినియోగానికి సంబంధించిన ఒక నమూనా. వినియోగ ఉత్పత్తుల రీసైక్లింగ్ ఇందులో ప్రధాన భాగం. డిసెంబర్ 1 నుంచి జీ–20 ప్రెసిడెన్సీ బాధ్యతలు స్వీకరిస్తున్న భారత్, సర్క్యులర్ ఎకానమీ పురోగతికి తన వంతు ప్రయత్నం చేస్తుందన్నారు. -
మారుతీ సుజుకీకి ఎన్సీఎల్ఏటీలో ఊరట!
న్యూఢిల్లీ: ఆటో దిగ్గజ సంస్థ– మారుతీ సుజుకీపై కాంపిటీషన్ కమిషన్ విధించిన రూ. 200 కోట్ల జరిమానాపై అప్పిలేట్ ట్రిబ్యునల్ ఎన్‌సీఏఎల్‌టీ సోమవారం స్టే విధించింది. అయితే జరిమానా మొత్తంలో 10 శాతం (రూ.20 కోట్లు) మూడు వారాల్లోగా డిపాజిట్ చేయాలని కార్ల తయారీ సంస్థను ఆదేశించింది. ఇదే షరతుగా కారు తయారీదారుకు అక్టోబర్ 27న జారీ చేసిన డిమాండ్ నోటీసుపై ముగ్గురు సభ్యుల ధర్మాసనం స్టే విధించింది. కేసు తదుపరి విచారణను డిసెంబర్ 15వ తేదీకి వాయిదా వేసింది. డీలర్ల కార్ల అమ్మకం ధర విషయంలో కంపెనీ గుత్తాధిపత్య ధోరణితో వ్యవహరిస్తోందన్నది మారుతీ సుజుకీపై ఆరోపణ. దీనిని సమర్థిస్తూ, ఆగస్టు 23న కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీఐఐ) కంపెనీపై రూ.200 కోట్ల జరిమానా విధించింది. దీనిని సవాలు చేస్తూ మారుతీ సుజుకీ అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. -
హ్యుందాయ్ ఇండియాకి భారీ జరిమానా
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీదారు హ్యుందాయ్ కంపెనీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. వాహన విక్రయాల్లో, వ్యాపార నిర్వహణలో హ్యుందాయ్ ఇండియా తప్పుడు విధానాలను అనుసరించిందని ఆరోపిస్తూ కాంపిటీషన్ కమీషన్ భారీ జరిమానా విధించింది. అక్రమ విధానాలు, కార్లపై అక్రమ డిస్కౌంట్లు అందించినందుకు గాను రూ. 87 కోట్ల జరిమానా విధించింది. 44 పేజీల లిఖితపూర్వక ఆర్డర్లో కొరియా కార్ మేకర్ పోటీ-వ్యతిరేక విధానాలను అవలంబించిందని సీసీఐ పేర్కొంది. ఈ ఉల్లంఘన ద్వారా సంబంధిత టర్నోవర్‌ని నిర్ణయించే ప్రయోజనాలతోపాటు, ఈ వాహనాల అమ్మకం నుంచి వచ్చే ఆదాయం పరిగణనలోకి తీసుకోవాలని వ్యాఖ్యానించింది. అయితే దీనిపై హ్యుందాయ్ ఇండియా స్పందించింది. ఈ ఆర్డర్‌తో తాము తీవ్ర ఆశ్చర్యంలో మునిగిపోయామని ప్రకటించింది. దీన్ని నిశితంగా అధ్యయనం చేస్తున్నామని చెప్పింది. తమ వినియోగదారులు, ఇతర ఛానెల్ పార్టనర్ల ప్రయోజనాలను కాపాడడానికి తగిన స్థాయిలో ఆర్డర్ ను సవాలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని తెలిపింది. -
కార్వీ -ఎంఫసిస్ డీల్‌కు ఆమోదం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీపీవో సేవలను అందిస్తున్న ఎంఫసిస్‌లో కార్వీ డేటా మేనేజ్మెంట్ సర్వీసెస్ కొనుగోలు చేయనున్న వాటాకు కాంపిటీషన్ కమిషన్ ఆమోదం తెలిపింది. నిబంధనలకు అనుగుణంగానే ఈ ఒప్పందం ఉందని పేర్కొంది. దీంతో బీపివో వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలిగినట్లు ఎంఫసిస్ తెలిపింది. మూడింట్ ఒకవంతు వాటాను రూ. 2.75 కోట్లకు కార్వీ డేటా మేనేజ్మెంట్ కొనుగులు చేయడానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. -
సన్, ర్యాన్‌బాక్సీ విలీనానికి షరతులతో ఓకే
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ దిగ్గజాలు సన్ ఫార్మా, ర్యాన్‌బాక్సీల మధ్య విలీనానికి ఎట్టకేలకు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 4 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 24,000 కోట్లు) విలువైన ఈ విలీనానికి సీసీఐ కొన్ని షరతులు విధించింది. వీటి ప్రకారం కొన్ని రకాల ఉత్పత్తులను ఇతర సంస్థలకు విక్రయించడమేకాకుండా, పోటీ నివారణ వంటి అంశాలకు సంబంధించి ఒప్పందంలో మార్పులను సైతం చేపట్టవలసి ఉంటుంది. రెండు దిగ్గజాలు విలీనమైతే దేశీయంగా అతిపెద్ద ఫార్మా సంస్థ ఆవిర్భవించడంతోపాటు, ప్రపంచంలోనే ఐదో పెద్ద కంపెనీగా సన్-ర్యాన్‌బాక్సీ నిలుస్తుంది. వివాద పరిష్కారం ప్రకారం ‘టామ్సులోసిన్ప్లస్ టోల్టరోడిన్’ సంబంధిత మొత్తం ఉత్పత్తులను సన్ ఫార్మా ఇతర సంస్థలకు విక్రయించాల్సి ఉంటుంది. వీటిని ప్రస్తుతం టామ్లెట్ బ్రాండ్‌తో కంపెనీ మార్కెట్లో విక్రయిస్తోంది. ఇదే విధంగా ర్యాన్‌బాక్సీ కూడా లియుప్రోలిన్ సంబంధ ఉత్పత్తులన్నింటినీ ఇతర సంస్థకు అమ్మేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వీటిని ఎలిగార్డ్ బ్రాండ్‌తో మార్కెట్లో విక్రయిస్తోంది. దీంతోపాటు ర్యాన్‌బాక్సీ టెర్లిబాక్స్, రోసువాస్ ఈజెడ్, ఒలానెక్స్ ఎఫ్, రేసిపర్ ఎల్, ట్రిలోవాన్స్లను సైతం విక్రయించాలి. వెరసి సన్ ఫార్మా ఒకటి, ర్యాన్‌బాక్సీ ఆరు చొప్పున ఉత్పత్తులను వొదులుకోవలసి ఉంటుంది. ఇందుకు ఆరు నెలల గడువును సీసీఐ విధించింది. తద్వారా మార్కెట్లో ప్రస్తుతం కొనసాగుతున్న పోటీ వాతావరణాన్ని కొనసాగించవచ్చునని సీసీఐ అభిప్రాయపడింది. -
సన్-ర్యాన్‌బాక్సీ డీల్‌పై సీసీఐ మరింత దృష్టి
న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజాలు సన్-ర్యాన్‌బాక్సీల మధ్య కుదిరిన మల్టీబిలియన్ డాలర్ ఒప్పందంపై కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) మరింత నిశిత పరిశీలన చేయనుంది. దీనిలో భాగంగా ప్రతిపాదిత విలీన వివరాలను పది రోజుల్లోగా బహిరంగ పరచాల్సిందిగా తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని అటు సన్ ఫార్మా, ఇటు ర్యాన్‌బాక్సీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేశాయి. పది పనిదినాల్లోగా విలీన వివరాలను నిర్ధారించిన రీతిలో బహిరంగపరుస్తూ ప్రచురించాల్సిందిగా సీసీఐ ఆదేశించినట్లు తెలిపాయి. కాగా, విలీనం, కొనుగోలు(ఎంఅండ్ఏ) ఒప్పందంపై బహిరంగ పరిశీలనకు వీలుగా సీసీఐ ఆదేశాలు జారీ చేయడం ఇదే తొలిసారికావడం గమనార్హం. తద్వారా సీసీఐ నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేయనుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సన్ ఫార్మా, ర్యాన్‌బాక్సీల మధ్య 4 బిలియన్ డాలర్ల విలువైన కొనుగోలు, విలీనం ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ విలీనం వల్ల పోటీ వాతావరణంలో తలెత్తే పరిస్థితులు, దానివల్ల ప్రభావితమయ్యే వ్యక్తులు, సంస్థలకు విలీన వివరాలు తెలిసేలా చేసే యోచనతో సీసీఐ తాజా ఆదేశాలు జారీ చేసింది. వీటిపై సలహాలు, సూచనలు, వ్యాఖ్యలను సీసీఐ ఆహ్వానించనుంది. ఇప్పటికే వివరణ కోరింది...: పూర్తి స్టాక్ రూపంలో ర్యాన్‌బాక్సీని కొనుగోలు చేసేందుకు సన్ ఫార్మా చేసిన ప్రతిపాదనపై గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడానికి ముందే సీసీఐ రెండు కంపెనీల నుంచి వివరణ కోరింది. ఫార్మా రంగంలోని అతిపెద్ద డీల్స్‌లో ఒకటైన ఈ ఒప్పందాన్ని అనుమతించడం ద్వారా దేశీ పరిశ్రమపై భారీ ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో సీసీఐ తాజా ఆదేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇది దేశీ ఫార్మా రంగంలో పోటీ వాతావరణాన్ని దెబ్బకొట్టే పక్షంలో విలీనానికి ముందు కొన్ని ఆస్తులను విడగొట్టమంటూ రెండు కంపెనీలకూ సీసీఐ సూచించే అవకాశముంది. రెండు కంపెనీల విలీనంవల్ల ప్రపంచంలోనే ఐదో పెద్ద స్పెషాలిటీ జనరిక్స్ ఫార్మా దిగ్గజంగా ఆవి ర్భవించనుంది. అంతేకాకుండా విలీన సంస్థ దేశీయ ఫార్మా రంగంలో నంబర్‌వన్ స్థానాన్ని పొందనుంది. -
కోల్‌ఇండియాపై సీసీఐ రూ.1,773 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: బొగ్గు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న కోల్ ఇండియా.. సరఫరాల విషయంలో గుత్తాధిపత్యానికి పాల్పడుతోందన్న ఆరోపణపై కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) ఆగ్రహానికి గురైంది. కంపెనీపై రూ.1,773 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు ఈ నెల 9న ఆదేశాలు జారీచేసినట్లు సీసీఐ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. కాగా, ఒక ప్రభుత్వరంగ కంపెనీపై సీసీఐ ఇప్పటిదాకా విధించిన అతిపెద్ద జరిమానా ఇదే కావడం గమనార్హం. నాన్-కోకింగ్ కోల్ ఉత్పత్తి, సరఫరాల విషయంలో స్వతంత్రంగా వ్యవహరిస్తున్న కోల్ ఇండియా.. మార్కెట్లో గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని సీసీఐ నిర్ధారించింది. మహారాష్ట్ర స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ, గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్లు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన సీసీఐ ఈ మేరకు తీర్పునిచ్చింది. కోల్‌ఇండియాతోపాటు దాని అనుబంధ సంస్థలైన మహానది కోల్‌ఫీల్డ్స్, వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్, సౌత్ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్... ఇంధన సరఫరా ఒప్పందాల(ఎఫ్ఎస్ఏ) విషయంలో అన్యాయంగా/అసంబద్ధ నిబంధనలను విధిస్తోందనేది సీసీఐ విచారణలో వెల్లడైంది. ఇటువంటివన్నీ నాయబద్ధమైన వ్యాపార నిబంధనలను ఉల్లంఘించడమేనని సీసీఐ తేల్చింది. జరిమానాతోపాటు అన్ని పక్షాల(విద్యుత్ ఉత్పత్తిదారులు)తో సంప్రదింపుల ద్వారా ఎఫ్ఎస్ఏల్లో తగిన మార్పులు చేయాలని కూడా సీసీఐ తన ఆదేశాల్లో పేర్కొంది. కాగా, ఈ అంశంపై వ్యాఖ్యానించేందుకు కోల్ఇండియా ప్రతినిధి నిరాకరించారు.