కోల్‌ఇండియాపై సీసీఐ రూ.1,773 కోట్ల జరిమానా | Competition Commission slaps Rs 1773 cr penalty on Coal India | Sakshi
Sakshi News home page

కోల్‌ఇండియాపై సీసీఐ రూ.1,773 కోట్ల జరిమానా

Published Wed, Dec 11 2013 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM

కోల్‌ఇండియాపై సీసీఐ రూ.1,773 కోట్ల జరిమానా

కోల్‌ఇండియాపై సీసీఐ రూ.1,773 కోట్ల జరిమానా

న్యూఢిల్లీ: బొగ్గు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న కోల్ ఇండియా.. సరఫరాల విషయంలో గుత్తాధిపత్యానికి పాల్పడుతోందన్న ఆరోపణపై కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) ఆగ్రహానికి గురైంది. కంపెనీపై రూ.1,773 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు ఈ నెల 9న ఆదేశాలు జారీచేసినట్లు సీసీఐ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. కాగా, ఒక ప్రభుత్వరంగ కంపెనీపై సీసీఐ ఇప్పటిదాకా విధించిన అతిపెద్ద జరిమానా ఇదే కావడం గమనార్హం. 
 
 నాన్-కోకింగ్ కోల్ ఉత్పత్తి, సరఫరాల విషయంలో స్వతంత్రంగా వ్యవహరిస్తున్న కోల్ ఇండియా.. మార్కెట్లో గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని సీసీఐ నిర్ధారించింది. మహారాష్ట్ర స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ, గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్‌లు దాఖలు చేసిన పిటిషన్‌లను విచారించిన సీసీఐ ఈ మేరకు తీర్పునిచ్చింది. కోల్‌ఇండియాతోపాటు దాని అనుబంధ సంస్థలైన మహానది కోల్‌ఫీల్డ్స్, వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్, సౌత్‌ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్... ఇంధన సరఫరా ఒప్పందాల(ఎఫ్‌ఎస్‌ఏ) విషయంలో అన్యాయంగా/అసంబద్ధ నిబంధనలను విధిస్తోందనేది సీసీఐ విచారణలో వెల్లడైంది. ఇటువంటివన్నీ నాయబద్ధమైన వ్యాపార నిబంధనలను ఉల్లంఘించడమేనని సీసీఐ తేల్చింది. జరిమానాతోపాటు అన్ని పక్షాల(విద్యుత్ ఉత్పత్తిదారులు)తో సంప్రదింపుల ద్వారా ఎఫ్‌ఎస్‌ఏల్లో తగిన మార్పులు చేయాలని కూడా సీసీఐ తన ఆదేశాల్లో పేర్కొంది. కాగా, ఈ అంశంపై వ్యాఖ్యానించేందుకు కోల్‌ఇండియా ప్రతినిధి నిరాకరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement