న్యూఢిల్లీ: కాంపిటేషన్ కమీషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ప్రభుత‍్వ రంగ బొగ్గు సంస్థ కోల్ ఇండియాకు మరోసారి భారీ జరిమానా విధించింది. ఇంధన సరఫరాలో అక్రమాల నేపథ్యంలో రూ. 591 కోట్ల పెనాల్టీ విధించింది. మరోవైపు పోటీ వ్యతిరేక విధానాలనుంచి దూరంగా ఉండాలని ఫెయిర్ ట్రేడ్ రెగ్యులేటర్ ఆదేశించింది. 56 పేజీల ఆదేశాల్లో సీసీఐ కోల్ ఇండియా వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోల్ ఇండియా దాని మూడు అనుబంధ సంస్థలపై ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం సీసీఐ ఈ ఆదేశాలు జారీ చేసింది. మూడు సం.రాల (2009-10, 2011-12) కాలానికిగాను సంస్థ సగటు టర్నోవర్ పై 1 శాతం చొప్పున రూ.591.01కోట్ల జరిమానా విధించినట్టు పేర్కొంది.
నాన్-కోకింగ్ కోల్ ఉత్పత్తి, సరఫరాల విషయంలో స్వతంత్రంగా వ్యవహరిస్తున్న కోల్ ఇండియా.. మార్కెట్లో గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని సీసీఐ వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ, గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ లు దాఖలు చేసిన పిటిషన్‌లను విచారించిన సీసీఐ ఈ మేరకు తీర్పునిచ్చింది. కోల్‌ఇండియాతోపాటు దాని అనుబంధ సంస్థలైన మహానది కోల్‌ఫీల్డ్స్, వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్, సౌత్‌ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్... ఇంధన సరఫరా ఒప్పందాల(ఎఫ్‌ఎస్‌ఏ) విషయంలో అన్యాయంగా/అసంబద్ధ నిబంధనలను విధిస్తోందనేది సీసీఐ తేల్చింది.
ముఖ్యంగా ఇంధన సరఫరాలో న్యాయమైన , సమాన నమూనా, పరీక్ష ప్రక్రియ విధానంలో తగిన మార్పులు చేపట్టాలని కోల్ ఇండియాను ఆదేశించింది. ఇంధన సరఫరా ఒప్పందాల్లో మార్పులు చేయాలని కోరింది. అలాగే పాత, కొత్త పవర్ ప్రొడ్యూసర్స్‌కి, ప్రైవేట్, ప్రభుత్వ రంగ ప్రొడ్యూసర్స్ మధ్య ఏకరూపత ఉందో లేదో నిర్ధారించుకోవాలని తెలిపింది. అంతర్జాతీయ ఉత్తమ విధానాలతో పాటు, సాంప్లింగ్ సాధ్యత పై పవర్ ప్రొడ్యూసర్స్‌తో సంప్రదించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.