జీఎస్‌కే ఫార్మా, సనోఫిలపై రూ.64 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: ఔషధ తయారీ కంపెనీలైన గ్లాక్సోస్మిత్‌క్లెయిన్ ఫార్మా (జీఎస్‌కే ఫార్మా), సనోఫిలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూ.64 కోట్ల జరిమానా విధించింది. ఈ రెండు ఫార్మా కంపెనీలు హజ్ యాత్రికుల కోసం ప్రభుత్వానికి సరఫరా చేయాల్సిన మెనింజైటీస్ వాక్సిన్ బిడ్డింగ్ విషయంలో అక్రమాలకు పాల్పడినందుకు సీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రూ.64 కోట్ల జరిమానాలో రూ.61 కోట్లను జీఎస్‌కే, రూ.3 కోట్లను సనోఫి చెల్లించనున్నాయి. కంపెనీల మూడేళ్లలో సగటు టర్నోవర్‌ను పరిగణలోకి తీసుకొని జరిమానాను విధించడం జరిగింది. మెనింజైటీస్ వాక్సిన్ సరఫరాకు సంబంధించిన ఈ అంశంపై బయో-మెడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ రెండు ఫార్మా కంపెనీలతోపాటు కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖలపై సీసీఐకు ఫిర్యాదు చేసింది. ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మెనింజైటీస్ వాక్సిన్ కొనుగోలుకు టెండర్లను ఆహ్వానిస్తుంది.