మానవ ప్రమాణాల్లో గతం కన్నా కాస్త మెరుగని యూఎన్‌డీపీ వ్యాఖ్య
బ్రిక్స్ దేశాల్లో అట్టడుగున ఇండియా
న్యూఢిల్లీ: మానవాభివృద్ధి సూచిక(హెచ్‌డీఐ)లో భారత్ 135వ స్థానంలో నిలిచింది. ఐక్యరాజ్యసమితికి చెందిన యునెటైడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం(యూఎన్‌డీపీ) గురువారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2013 సంవత్సరానికి గానూ మొత్తం 187 దేశాల్లో భారత్ 135వ స్థానం సాధించింది. అంతకుముందు సంవత్సరం 136వ స్థానం సాధించిన భారత్.. ప్రజల జీవన ప్రమాణాల్లో కాస్త మెరుగుదలను సాధించి 135వ స్థానానికి చేరిందని యూఎన్‌డీపీ పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. హెచ్‌డీఐలో 0.586 (0-1 సూచీలో) విలువతో ‘సాధారణ అభివృద్ధి’ని చూపే కేటగిరీ లో భారత్ నిలిచింది.
1980 నుంచి 2013 మధ్య భారతహెచ్‌డీఐ విలువ 0.369 నుంచి 0.586కు పెరిగింది. 2013లో హెచ్‌డీఐ సూచీలో తొలి మూడు స్థానాల్లో నార్వే(0.944), ఆస్ట్రేలియా(0.933), స్విట్జర్లాండ్(0.917)లు ఉండగా.. ఆరోగ్యకరమైన, దీర్ఘ ఆయుఃప్రమాణం; జ్ఞాన సముపార్జనకు అవకాశాలు; మెరుగైన జీవన ప్రమాణం.. ఈ మూడు కీలకాంశాల్లో ఆయా దేశాల దీర్ఘకాలిక అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుని యూఎన్‌డీపీ మానవాభివృద్ధి సూచికను రూపొందిస్తుంది.
నివేదికలోని ఇతర వివరాలు..
* భారత్ సహా బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలేవీ అధికఅభివృద్ధి సాధించిన దేశాల జాబితాలో లేవు. బ్రిక్స్ దేశాల్లో కూడా భారత్ చివరన ఉంది. బ్రిక్స్‌దేశాల్లో రష్యా 57వ ర్యాంక్‌తో తొలిస్థానంలో ఉంది. బ్రెజిల్ 79, చైనా 91లో ఉన్నాయి.
* కొన్ని దేశాలు మినహా దాదాపు అన్ని దేశాలు గత సంవత్సర ర్యాంకుల వద్దే నిలిచాయి.
* భారత్‌లో 1980 - 2013 మధ్య జనన సమయంలో ఆయుఃప్రమాణం 11 ఏళ్లు పెరిగింది.
* సాధారణ అభివృద్ధి కేటగిరీలో ఉన్న దేశాల సగటు కూడా భారత్ కన్నా ఎక్కువగా 0.614గా ఉంది. దక్షిణాసియా దేశాల సగటైన 0.588 కన్నా కూడా భారత్ హెచ్‌డీఐ విలువ తక్కువగానే ఉండటం గమనార్హం.
* మన పొరుగుదేశాల్లో మనకన్నా తక్కువగా పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు వరుసగా 142, 146 స్థానాల్లో ఉన్నాయి.
* లింగ అసమానత సూచీలో(జీఐఐ)నూ భారత్ దిగువలోనే ఉండిపోయింది. జీఐఐని పరిగణనలోకి తీసుకున్న 152 దేశాలకుగానూ 127వ స్థానంలో భారత్ నిలిచింది.
* కొత్తగా ప్రారంభించిన ‘స్త్రీ- పురుష అభివృద్ధి(జీడీఐ)’ సూచీలో భారత్‌లోని మహిళల విలువ 0.519 కాగా, పురుషుల విలువ 0.627గా ఉంది. దేశంలోని స్త్రీ, పురుష నిష్పత్తిని తెలిపే సూచీ ఇది.
మానవాభివృద్ధి సూచీలో 135వ స్థానంలో భారత్
Published Fri, Jul 25 2014 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 10:49 AM
Advertisement
Advertisement