undp
-
లింగ సమానత్వంలో భారత్ ముందడుగు
న్యూఢిల్లీ: లింగ సమానత్వంలో భారత్ సాధిస్తున్న పురోగతి స్ఫూర్తిదాయకమని ఐక్యరాజ్యసమితి కొనియాడింది. అయితే సామాజిక కట్టుబాట్లు, పరిమిత శ్రామిక భాగస్వామ్యం, సరైన భద్రత లేకపోవడం లింగ సమానత్వానికి ఇంకా ఆటంకం కలిగిస్తున్నాయని అభిప్రాయపడింది. ఈ అంతరాన్ని పూడ్చడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ప్రయత్నాలు అవసరమని సూచించింది. దేశంలో మహిళల పురోగతి, సవాళ్లపై ఐరాస మహిళా వ్యూహాత్మక భాగస్వామ్యాల డైరెక్టర్ డేనియల్ సీమౌర్, భారత్‌లో ఐరాస మహిళల కంట్రీ రిప్రజెంటేటివ్ సుసాన్ జేన్ ఫెర్గూసన్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మహిళల జీవితాలను మార్చడానికి, మహిళలు, బాలికల నిర్దిష్ట అవసరాలకు బడ్జెట్లో 6.8 శాతానికి నిధులు పెరిగాయన్నారు. ఆరోగ్యం, విద్య, ఆర్థిక రంగాల్లో అంతరాలను తొలగించడానికి బడ్జెట్ నిరంతర విస్తరణ అవసరమని నొక్కి చెప్పారు. ఈ లక్ష్యాలను పూర్తిగా చేరుకోవడానికి ప్రైవేట్ రంగ పెట్టుబడులు అవసరమని ఫెర్గూసన్ పేర్కొన్నారు. పంచాయతీలు, స్థానిక ప్రభుత్వ సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యంతో నాయకత్వంలో కూడా పురోగతి కనిపిస్తోందని చెప్పారు. పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఆమోదం పొందడం జాతీయ రాజకీయ ముఖచిత్రంపై ప్రభావాన్ని చూపుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే లింగ ఆధారిత హింస (జీబీవీ) దేశంలో నిరంతర సమస్యగా ఉందని, ఇది మహిళల భద్రత, స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తోందని అధికారులు ఎత్తిచూపారు. చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ సామాజిక కట్టుబాట్లు మహిళలను అడ్డంకిగా మారాయన్నారు. మహిళల భద్రతపై దృష్టి సారించే కమ్యూనిటీ పోలీసింగ్ ప్రయత్నాలను ప్రవేశపెట్టడానికి, పోలీసులకు శిక్షణ ఇవ్వడానికి మధ్యప్రదేశ్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలతో యూఎన్ ఉమెన్ సహకరిస్తోందని తెలిపారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022–23 ప్రకారం దేశంలో మహిళా కార్మిక శక్తి భాగస్వామ్య రేటు 37 శాతానికి పెరిగినప్పటికీ, సవాళ్లు ఉన్నాయని, పిల్లల సంరక్షణ, సురక్షిత రవాణా, పనిప్రాంతంలో భద్రతతో మహిళలు మరిన్ని ఆర్థిక అవకాశాలు పొందగలుగుతారని సూచించారు. -
పర్యావరణ హిత జీవనశైలి అవశ్యం
క్రమపద్ధతి లేని ఉష్ణోగ్రత, వర్షపాతాల రూపంలో వాతావరణ మార్పు పరిణామాలు అనుభవిస్తున్నాం. ఒక శతాబ్దానికి పైగా, మండుతున్న శిలాజ ఇంధనాలు, అసమానమైన, నిలకడలేని శక్తి, భూవినియోగాల వలన, యావత్ ప్రపంచం మితిమీరి వేడెక్కడానికి దారితీసిందని, వాతావరణ మార్పును పరిశీలించడానికి నియమింపబడిన ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ తన నివేదికలో నిర్ధారించింది. పర్యావరణాన్ని రక్షించడానికి సమగ్రమైన ప్రతిస్పందన, ప్రతి ఒక్కరికీ దానిని రక్షించాలనే భావన అనివార్యం. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ విపరీత పర్యావరణ సవాలును ఎలా ఎదుర్కోవాలనే విషయమై సతమతమవుతున్నాయి. పర్యావరణ రక్షణకు ఉపయోగపడే స్థిరమైన జీవనశైలి, ప్రతి వ్యక్తి తీసుకునే చర్యలు పెద్ద మార్పును తేగలవు. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడా నికి తక్షణ, నిశ్చయాత్మకమైన ప్రయత్నాల అవసరం ఎంతైనా ఉంది. దీనికి గాను వాతావరణ నిపుణులు, సర ఫరా, వినియోగ ప్రవర్తన వైపు పరిష్కారాలు ప్రతిపాదించారు.ఇందులో ఉద్గారాలు, వాటి నిర్వహణ, సాంకేతిక ఎంపికలు, జీవనశైలి మొదలైన వాటిని లక్ష్యంగా చేసుకుని, పరిష్కారాలు సూచించారు. వినియోగ నిర్వహణ అనునది, ఉత్పత్తి వ్యవస్థల నుండి వచ్చే ప్రతి కూల పర్యావరణ ప్రభావాలను తగ్గించడం కొరకే గానీ, నాణ్యమైన జీవితం కోల్పోవడానికి కాదనీ వక్కాణించారు. ఈ ప్రయత్నంలో, వ్యక్తిగత ప్రవర్తన ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మన దేశంలోని నీతి ఆయోగ్, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యూఎన్డీపీ) వారిచే సంయుక్తంగా ఒక కార్యాచరణ నివేదిక 2023లో విడుదల అయింది. భారతదేశంతో సహా అనేక దేశాలలో నిర్వహించిన అధ్య యనాల ఫలితాలను క్రోఢీకరించి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఉపయోగపడే ఏడు ముఖ్యమైన అంశాలు ఈ నివేదికలో పొందుపర చారు. వీటిలో నీటి పొదుపు, వ్యర్థాల నిర్వహణ, సుస్థిరమైన ఆహార వ్యవస్థ, ఇంధన సంరక్షణ, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, స్థిరమైన జీవన శైలి, ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ ఉన్నాయి. అన్ని అధ్యయనాలు భారతదేశంలో జరగనప్పటికీ, ఫలితాలు మాత్రం పర్యావరణాన్ని పరిరక్షించడానికి మనకు కూడా వర్తిస్తాయి. ఆహార రంగం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆహారాన్ని సక్రమంగా వినిగించు కొని, పంట నుండి వినియోగం వరకు వృథాను తగ్గించాలి. మొక్కల ఆధారిత ఆహారాలను ఎక్కువగా తిని, జంతు ఆధారిత ఉత్పత్తులను తక్కువగా తినడం అలవాటు చేసుకోవాలి. ‘ఆహారాన్ని ప్రేమించు – వ్యర్థాలను ద్వేషించు’ అను నినాదం, ఆహార వృథాను తగ్గించడానికి ఉపయోగపడటంతోపాటు, ఆహారం తయారీ యజమానులలోను, చిల్లర వ్యాపారులలోను, వినియోగదారులలోను గణనీయమైన సాను కూల ఫలితాలను అందించింది. గృహ స్థాయిలో వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించడం వల్ల కంపోస్ట్ తయారీకి దారితీసి, నేల సారాన్ని పెంపొందించడంలో సహాయపడింది. స్థానికంగా పండించిన, కాలానుగుణమైన, ప్రకృతి మరియు సేంద్రీయ పద్ధతిలో పండించిన ఆహారాన్ని వినియోగిస్తున్నవారు, శాకాహారులు, యితర వ్యక్తు లతో పోలిస్తే, తక్కువ తలసరి ప్రతికూల పర్యావరణ ప్రభావాన్ని కలిగిస్తున్నారని ఫలితాలు చూపించాయి. వ్యవసాయం, భూమి నిర్వహణ పద్ధతులు ఉత్పాదకతను పెంచడానికి పచ్చిక బయళ్లలో చెట్లను పెంచడం, వార్షిక పంటలతోపాటు చెట్లను పెంచడం, ప్రకృతి వ్యవసాయం పాటించడం, అనగా కంపోస్ట్ ఎరువు వాడకం, కలుపు అణచివేసే కవరు పంటలు వేయడం, రసాయన ఎరువుల వాడకం నిషేధించడం, యితర సహజ/సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు పాటించడం, సారం క్షీణించిన వ్యవసాయ భూమిని పునరుద్ధరించడం,పంట మార్పిడి చేయడం, పంట వేయడానికి నేలను తక్కువసార్లు దున్నడం, డ్రిప్ లేదా స్ప్రింక్లర్ పద్ధతుల ద్వారా పంటలకిచ్చే నీటి విని యోగాన్ని, వృథాను బాగా తగ్గించడం లాంటివన్నీ పర్యావరణ పరిరక్షణకు దారి తీస్తాయి. నీటికి సంబంధించిన లెక్కలు, తనిఖీ ప్రయోగం విజయవంతమైన వ్యూహంగా నిరూపితమైంది. నీటి విని యోగదారుల సంఘాలను ఏర్పాటు జేసుకోవడం, నీటి సంరక్షణ, వాతావరణ అంచనా కోసం అందుబాటులో ఉన్న సాంకేతికతను స్వీకరించడం వలన నీటి నిల్వను, వినియోగాన్ని మెరుగుపరచు కోవచ్చని ధ్రువీకరించడమై నది. ఆంధ్రప్రదేశ్‌లో, సహజ వ్యవసా యంతో బాటు, రుతుపవనా లకు ముందు అనగా వేసవి కాలంలో పంట వేయడం, స్థిరమైన వ్యవసాయం వైపు ప్రోత్సహించడం దీనికి ఒక ఉత్తమ ఉదాహరణ. ఈ పద్ధతులు నీటి సంరక్షణకు తోడ్పడుతూ, నేల నాణ్యతను సైతం మెరుగుపరుస్తున్నాయి. దీనికితోడు, రసాయన రహిత ఆహార ధాన్యాలను అందిస్తూ, భూమిలో 365 రోజుల పచ్చ దనాన్ని, చల్లటి వాతా వరణాన్ని యిస్తున్నాయి. రవాణా కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో రవాణా కీలక పాత్ర వహిస్తు న్నది. పట్టణాలు, నగరాల్లో ప్రయాణించడానికి, ప్రజలు వ్యక్తిగత వాహనాలను ఉపయోగించకుండా ప్రజా రవాణాను ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. బ్యాటరీతో నడిచే వాహనాలను ఉప యోగించడం, గమ్యస్థానాలు చేరుకోడానికి సైకిలు ఉపయోగించడం, సాధ్యమైన చోటల్లా నడవడం, ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది కలిసి వాహనాల్లో వెళ్ళడం, కార్‌పూలింగ్ పద్ధతులను పాటించడం, భౌతిక ఉనికికి బదులుగా వీడియో సాంకేతికతలను ఉపయోగించి టెలిప్రెసెన్స్ను పెంపొందించి రవాణా ఖర్చు తగ్గించడం వంటి చర్యలన్నీ కాలుష్యాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. రవాణాలో రద్దీని, ఖర్చును తగ్గించడానికి, సమర్థవంతమైన ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం సహాయపడుతున్నది. శక్తి సంబంధిత పదార్థాలు శక్తి వినియోగంలో, పొదుపు ప్రవర్తన పెద్ద సవాలుగా మారింది. భవనం పైకప్పులో సోలార్‌ను అమర్చడం, వేడి నీటి కోసం సోలార్ హీటర్లను అమర్చుకోవడం, ఇంట్లో వెలుతురు, వంట కోసం బయో గ్యాస్ ఏర్పాటు చేసుకోవడం, ఎల్ఈడీ బల్బులు ఉపయోగించడం, ఇంధన సమర్థవంతమైన వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలను వాడటం, పైకప్పులో తోటలను పెంచడం పర్యావరణ పరిరక్షణకు గణ నీయంగా దోహదపడతాయి. వంటకు మెరుగైన స్టవ్‌లు (పొయ్యిలు) వాడితే, పొగ స్థాయిలను 55 శాతం వరకు తగ్గించాయని మన దేశంలో చేసిన ప్రయోగాలు నిరూపించాయి. అవసరమైన వ్యూహాలు మీడియా ప్రసారాలు, ప్రకటనలు, వార్తాపత్రికలలో కథనాలు అవగాహన స్థాయిని పెంచడంలో సహాయపడతాయి. పర్యావరణ అనుకూల పద్ధతులను పాటిస్తున్న వినియోగదారులను, ప్రభుత్వాలు తగు రీతిలో ప్రోత్సహించి, ప్రశంసిస్తే ఇతరులు కూడా అనుసరిస్తారని పరిశోధనలలో తేలింది. వినియోగదారుల నిర్ణయం ప్రభావితం చేయ డానికి, వస్తువులపై ‘పర్యావరణ అనుకూలమైనది’ అని ముద్రించాలి. వ్యర్థాలు, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, ఆరోగ్యకరమైన జీవనము నకు, స్థిరమైన ఆహార పద్ధతులను స్వీకరించడానికి దోహదపడుతుంది. పల్చటి ప్లాస్టిక్ కలిగించే ప్రతికూల ప్రభావాలను పాఠశాల పిల్లలకు తెలియబరిచాక, వారిలో గణనీయమైన మార్పు వచ్చింది. ధూమపానం చేసేవారు, తమ సిగరెట్ పీకలను నిర్ణీత ప్రదేశంలో పడ వేసేలా అవగాహన కల్పించాలి. సిగరెట్ పీకలు పర్యావరణంలోకి హానికరమైన రసాయనాలను వెదజల్లి, మైక్రోప్లాస్టిక్లుగా విడ దీయడం వల్ల పర్యావరణం కలుషితమవుతున్నది. కుళాయిలలో నీటి ప్రవాహాన్ని తగ్గించడం, నీటి లీకేజీలను ఆపడం, పళ్ళు తోముకునే టప్పుడు కుళాయిని ఆపివేయడం వంటి చర్యల ద్వారా గృహాలలో నీటి ఆదా చేయవచ్చని అధ్యయనాలు వెల్లడించాయి. వ్యర్థాలను తగ్గించడానికి, చిన్న చిన్న మోతాదులలో వస్తువులను ప్యాకేజి చేయడం, ఒకసారి ఉపయోగించి పారవేయకుండా తిరిగి వాడటం అత్యంత ప్రభావవంతమైన మార్గాలు. సూట్‌కేసులు, ప్రింటర్లు, బూట్లు, వాషింగ్ మెషీన్లు సుదీర్ఘ కాలం ఉండేవి కొనుగోలు చేయ డానికి వినియోగదారులు ఇష్టపడతారు, కాబట్టి వీటి జీవితకాలాన్ని ప్రముఖంగా కనబడేటట్లు ముద్రించాలి. తద్వారా వీటి వ్యర్థాలను తగ్గించవచ్చు. మొబైల్, టెలివిజన్, కంప్యూటర్ తయారీదారులు, వాటి వ్యర్థాలను రీసైకిల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. పైన చెప్పినట్లుగా, వ్యక్తిగత స్థాయిలో ప్రవర్తన మార్పులు వచ్చి నచో, కచ్చితంగా పర్యావరణాన్ని రక్షించవచ్చు. డా‘‘ పి. పృథ్వీకర్ రెడ్డి వ్యాసకర్త హైదరాబాద్‌లోని ‘సెస్’(సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్) సీనియర్ పరిశోధకుడు ‘ prudhvikar@cess.ac.in -
గేమ్ ఛేంజర్.. ఆర్బీకే
ఆంధ్రప్రదేశ్‌లో రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయ రంగంలో విప్లవాత్మకం. రైతు కష్టాలన్నింటికీ వన్ స్టాప్ సొల్యూషన్‌గా నిలుస్తున్నాయి. విత్తనం మొదలు పంట కొనుగోలు వరకు అన్నదాతల చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి. నాణ్యమైన పురుగు మందులు, ఎరువుల సరఫరా.. పంటల సాగుపై అధునాతన శిక్షణ, సాంకేతికత వినియోగం, యాంత్రీకరణ.. తదితర విధానాలతో సాగు రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు ఆర్బీకేల పనితీరును స్వయంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించాయి. లక్షలాది మంది రైతులకు సాగును లాభసాటిగా మార్చడంలో ఆర్బీకేల పాత్ర కీలకం. ► సంయుక్త నివేదికలో నీతి ఆయోగ్, యూఎన్డీపీ సాక్షి,అమరావతి/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019లో ప్రారంభించిన డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకువస్తున్నాయని నీతి ఆయోగ్, యూఎన్డీపీ (యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్) ప్రశంసించాయి. అధిక దిగుబడులు సాధించేలా, రైతుల సాగు సమస్యలన్నింటికీ ఒకే చోట పరిష్కారం చూపిస్తూ ‘వ్యవసాయం’లో గేమ్ ఛేంజర్‌గా కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడాయి. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో సామాజిక రంగాల్లో అమలవుతున్న ఉత్తమ పద్ధతులను క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి.. నీతి ఆయోగ్, యూఎన్డీపీ తాజాగా ఓ సంయుక్త నివేదికను విడుదల చేశాయి. ప్రధానంగా రైతుల ఇబ్బందులు తీర్చడానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన ఆర్బీకేల ద్వారా అన్నదాతలకు సరైన సమయంలో సరైన సలహాలు అందుతున్నాయని.. ఇది ఆహ్వానించదగిన పరిణామమని ఈ నివేదిక కొనియాడింది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం అత్యంత ముఖ్యమైన రంగాల్లో ఒకటని, కొన్నేళ్ల క్రితం వరకు వ్యవసాయ రంగంలో సాంకేతిక పురోగతి ఉన్నప్పటికీ రైతుల వ్యవసాయ పద్ధతులు, వివిధ పంటల క్లిష్టమైన దశల గురించి పూర్తి స్థాయి అవగాహనలేని రైతులు డీలర్లపై ఆధారపడ్డారని తెలిపింది. విత్తనాలు, ఎరువులు, ఇతరత్రా ఇన్పుట్లకు అధికంగా చెల్లించాల్సి రావడంతో పంట చేతికొచ్చే సమయానికి రైతులకు కన్నీళ్లే మిగిలేవని వివరించింది. మరోవైపు.. నాసిరకం దిగుబడులు, దళారుల ఆగడాల కారణంగా గిట్టుబాటు ధరలేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని, ఆర్బీకేల ఏర్పాటుతో రైతులకు ఈ ఇబ్బందులన్నీ తప్పాయని తెలిపింది. ఈ నివేదికలో ఇంకా ఏముందంటే.. దేశంలోనే ఉత్తమ పద్ధతి ► రైతుల ఆదాయం, విజ్ఞానం పెంపొందించడానికి, సరికొత్త సాంకేతిక విజ్ఞానాన్ని బదిలీ చేయడంతోపాటు.. ముందుగా పరీక్షించి ధ్రువీకరించిన, నాణ్యమైన ఇన్పుట్లను గ్రామ స్థాయిలో అందుబాటు ధరలకు అందించడమే లక్ష్యంగా ఆర్బీకేలు పని చేస్తున్నాయి. విత్తనం నుంచి విక్రయం వరకు సేవలందిస్తున్న ఆర్బీకే వ్యవస్థ దేశంలోనే మొదటి ఉత్తమ పద్ధతి. ► ఆర్బీకేలు నాలుగు అంశాల్లో ప్రధానంగా పని చేస్తున్నాయి. ముందుగా.. పరీక్షించిన నాణ్యమైన ఇన్పుట్ల సరఫరా, నకిలీ విత్తన వ్యాప్తిని అరికట్టడం, ప్రైవేటు ఔట్లెట్లలో అధిక ధరలకు ఇన్పుట్ల అమ్మకాలు నిరోధించడం, విత్తన సీజన్‌కు ముందే ఇన్పుట్లు అందుబాటులో ఉంచడం లక్ష్యంగా పని చేస్తున్నాయి. పనితీరు నిజంగా అద్భుతం ► సేవల బట్వాడా, సామర్థ్యం పెంపుదల, విజ్ఞాన వ్యాప్తిలో ఆర్బీకేల పనితీరు నిజంగా అద్భుతం. రైతులకు అవసరమైన సేవలను అందించడమే కాకుండా సామర్థ్యం పెంపుదలకు అవసరమైన విజ్ఞానాన్నీ ఆర్బీకేలు రైతులకు పంచుతున్నాయి. ► వ్యవసాయ యాంత్రీకరణ, ఈక్రాప్.. ఉచిత పంటల బీమా నమోదు, సీడ్–టు–సీడ్ శిక్షణ కార్యక్రమం, శాస్త్రవేత్తల శిక్షణలు, ఫీల్డ్ డయాగ్నస్టిక్ సందర్శనలు, సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి పోస్టర్లు, కరపత్రాలను ఉపయోగించడం, పంటలపై సమాచార వ్యాప్తి కోసం పుస్తకాలు, వీడియో మెటీరియల్‌తో కూడిన లైబ్రరీలను నిర్వహిస్తుండటం విశేషం. కాల్ సెంటర్ ద్వారా సలహాలు ► వ్యవసాయ పద్ధతుల్లో కాల్‌సెంటర్ ద్వారా ఆర్బీకేలు రైతులకు సలహాలూ అందిస్తున్నాయి. ఇందుకోసం కాల్ సెంటర్ నిర్వహణతో ఉత్తమ పద్ధతులను అవలంబించడంలో సహాయం చేయడానికి, మద్దతు ప్యాకేజీ, దేశీయ డిమాండ్–సరఫరా అంతరాన్ని పరిష్కరించడం కోసం అగ్రి అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేశారు. ► తక్షణమే రైతుల సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యక్రమం. రైతులకు మద్దతు ధర, ప్రోత్సాహం అందించడానికి అన్ని ఆర్బీకేలను కొనుగోలు కేంద్రాలుగా ప్రభుత్వం ప్రకటించడం వల్ల రైతులకు ఎంతో లాభం. రవాణా ఖర్చులు తగ్గించడంలోనూ ఆర్బీకేల పాత్ర ప్రశంసనీయం. ► పంటల కొనుగోలు కేంద్రాలుగా ఆర్బీకేలను ప్రకటించిన తర్వాత రైతులు తమ పంటను గ్రామంలోనే విక్రయించుకోగలుతున్నారు. ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందుతున్నాయి. -
ర్యాంకులు పోనాయండీ!
ప్రపంచవ్యాప్తంగా ఇది ఆందోళనకర అంశం, తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన విషయం. ఐరాస లెక్క ప్రకారం వరుసగా రెండో ఏడాదీ పలు దేశాల ‘మానవాభివృద్ధి సూచిక’ (హెచ్‌డీఐ) స్కోరు కిందకు పడింది. మన దేశపు ర్యాంకు మునుపటితో పోలిస్తే రెండు స్థానాలు కిందకు పడింది. ఐరాస అభివృద్ధి సంస్థ (యూఎన్డీపీ) 2021–22 మానవాభివృద్ధి నివేదిక (హెచ్డీఆర్) ‘అనిశ్చిత పరిస్థితులు, అస్థిర జీవితాలు – మారుతున్న ప్రపంచంలో భవిష్యత్ రూప కల్పన’ ఈ చేదునిజాన్ని బయటపెట్టింది. తొంభై శాతానికి పైగా దేశాలు 2020లో కానీ, 2021లో కానీ హెచ్‌డీఐ స్కోరులో వెనకబడ్డాయి. నలభై శాతానికి పైగా దేశాలైతే ఆ రెండేళ్ళూ ర్యాంకుల్లో కిందికి వచ్చేశాయి. గత వారం విడుదలైన ఈ నివేదిక ప్రకారం మానవాభివృద్ధిలో మొత్తం 191 దేశాల్లో మన దేశం రెండు స్థానాలు కిందకొచ్చి, 132వ ర్యాంకుకు చేరింది. గడచిన 32 ఏళ్ళలో ఇలా వరుసగా రెండేళ్ళు సూచికలో దిగజారడం ఇదే తొలిసారి. మానవాభివృద్ధి పరామితుల ప్రకారం బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంకల కన్నా మనం వెనకబడే ఉన్నాం. దేశం సుభిక్షంగా ఉంది, స్థూల జాతీయోత్పత్తిలో బ్రిటన్ను దాటేశాం లాంటి కబుర్లతో కాలక్షేపం చేస్తున్న వారికి ఇది కనువిప్పు. హెచ్డీఐలో వివిధ దేశాల ర్యాంకులు పడిపోవడానికి కనివిని ఎరుగని సంక్షోభాలు కారణం. గత పదేళ్ళలో ఆర్థికపతనాలు, వాతావరణ సంక్షోభాలు, కరోనా, యుద్ధం లాంటి గడ్డు సమస్యల్ని ప్రపంచం ఎదుర్కొంది. ప్రతి సంక్షోభం ప్రపంచాభివృద్ధిపై ప్రభావం చూపింది. అయితే, అందులో కరోనాది అతి పెద్ద పాత్ర అని ఐరాస నివేదిక సారాంశం. ప్రపంచాన్ని వణికించిన ఈ మహమ్మారితో మానవ పురోగతి కనీసం అయిదేళ్ళు వెనక్కి వెళ్ళింది. అంతటా అనిశ్చితి ప్రబలింది. హెచ్‌డీఐకి లెక్కలోకి తీసుకుంటున్న అంశాల్లో లోపాలున్నాయని కొన్ని విమర్శలు లేకపోలేదు. అయితే, మరే సూచికా లేని వేళ ప్రతి దేశపు సగటు విజయాన్నీ లెక్కించడానికి ఉన్నంతలో ఇదే మెరుగైనదని ఒప్పుకోక తప్పదు. ఆర్థిక అసమానత్వం, లైంగిక అసమానత్వం, బహుముఖ దారిద్య్రం లాంటి ఆరు వేర్వేరు మానవాభివృద్ధి సూచీల ద్వారా ఈ ర్యాంకులు లెక్కకట్టారు. స్విట్జర్లాండ్ 0.962 స్కోరుతో ప్రథమ ర్యాంకు దక్కించుకుంది. భారత్ కేవలం 0.633 స్కోరుతో అగ్రశ్రేణికి సుదూరంగా నిలిచిపోయింది. విషాదమేమిటంటే, మానవాభివృద్ధిలో మన స్కోరు ప్రపంచ సగటు 0.732 కన్నా తక్కువ. పొరుగున ఉన్న చైనా హెచ్‌డీఐ స్కోర్ 1990 నుంచి ఏటా పెరుగుతుంటే, మన పరిస్థితి తద్భిన్నంగా ఉంది. మన దేశంలో ఆర్థిక అసమానతలూ ఎక్కువే. జనాభాలో అతి సంపన్నులైన 1 శాతం మంది ఆదాయ వాటా, నిరుపేదలైన 40 శాతం మంది వాటా కన్నా ఎక్కువని తాజా లెక్క. ఇంతటి అసమానత చైనా, స్విట్జర్లాండ్లలో లేదు. లింగపరంగా చూస్తే, మన దేశ తలసరి ఆదాయంలో పురుషుల కన్నా స్త్రీలు చాలా వెనుకబడి ఉన్నారు. విద్య, వైద్యం, జీవన ప్రమాణాల ప్రాతిపదికన లెక్కకట్టే బహుముఖ దారిద్య్రం లోనూ భారత్ పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. 2019 నాటి యూఎన్డీపీ అంచనాల ప్రకారం... ప్రపంచంలో అత్యధిక జనాభా గల చైనాలో 5.4 కోట్ల మంది బహుముఖ దారిద్య్రంలో ఉంటే, రెండో అత్యధిక జనాభా ఉన్న భారత్‌లో ఆ సంఖ్య 38.1 కోట్ల పైచిలుకే. అయితే, 2019 – 2020 మధ్య మన దేశంలో లింగ అసమానత దారుణంగా పెరగగా, తాజా నివేదికలో ఆ కోణంలో కొద్దిగా మెరుగుదల సాధించడం ఉపశమనం. మొత్తానికి, అన్నీ కలిపి చూస్తే మానవాభివృద్ధిలో మన స్కోరునూ, దరిమిలా ఇతర దేశాల మధ్య మన ర్యాంకునూ కిందకు గుంజాయి. అయితే, సంతోషించదగ్గ అంశం ఏమంటే – కరోనాలో ఏడాది లోపలే భారత్ టీకాను అభివృద్ధి చేయడం, ధనిక దేశాలకు సైతం కరోనా నిరోధానికి సహకరించడం! ఇది మన మానవ సామర్థ్యమే! అదే సమయంలో కనీస ఆదాయ హామీకై దేశంలో జరుగుతున్న ప్రయత్నాలూ యూఎన్డీపీ ప్రశంసలు అందుకున్నాయి. అలాగే కరోనా అనంతరం ఆర్థికంగా మన దేశపు పనితీరు పొరుగు దేశాల కన్నా మెరుగ్గా ఉండడం ఆశాకిరణం. అభివృద్ధి అజెండా అమలుకు నిధులు వెచ్చించే వీలుంటుంది. అయినా, ఇప్పటికీ అనేక అంశాల్లో ఇతర దేశాలు మెరుగ్గా ఉన్నాయనేది నిష్ఠురసత్యం. పౌష్టికలోప జనాభా, బాలల మరణాల రేటు తదితర అంశాలతో లెక్కించే ‘ప్రపంచ ఆకలి సూచి’ (2020) ప్రకారం కూడా 107 దేశాల్లో మనది 94వ స్థానం. వీటికి తోడు ఇప్పుడు ఉక్రెయిన్‌లో యుద్ధం, ప్రపంచాన్ని పూర్తిగా వదిలిపోని కరోనా, భూతాపోన్నతి ముప్పేటదాడి చేస్తున్నాయి. అన్నీ కలసి ప్రపంచ ఆహార సంక్షోభానికి దారి తీయవచ్చని ఐరాస హెచ్చరిస్తోంది. నిలకడైన అభివృద్ధి, సామాజిక భద్రత, సత్వర సాంకేతిక ఆవిష్కరణలపై దృష్టి పెడితేనే అనిశ్చితి నుంచి బయటపడగలమంటోంది. ఐరాస మాట చద్దిమూట. పాలకులు దీన్ని పరిగణనలోకి తీసుకొని, పకడ్బందీగా మానవాభివృద్ధి ప్రణాళికలు రచించాలి. పర్యావరణ సంక్షోభ నివారణ లక్ష్యాలను చేరుకొనేందుకూ కృషి చేయాలి. ద్రవ్యోల్బణం, ధరలు పెరుగుతూ, ఉపాధి హామీ తగ్గుతున్న సమయంలో ఎన్నికల వ్యూహాలు కాస్త ఆపి, నిలకడగా చేతల్లోకి దిగాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతరాలు తగ్గించుకొని, సమన్వయంతో సాగాలి. కానీ, పైచేయి కోసం ప్రయత్నాలతో ఢిల్లీ నుంచి గల్లీ దాకా సహకార స్ఫూర్తి కొరవడుతున్న వేళ ప్రగతి బాటలో కలసి సాగడానికి మన పాలకులు సిద్ధమేనా? -
సీఎం జగన్‌ను కలిసిన నీతి ఆయోగ్ బృందం
సాక్షి, అమరావతి: యూఎన్డీపీ భాగస్వామ్యంతో ప్రణాళికా విభాగంలో సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనపై మానిటరింగ్ సెల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ అంశంపై నీతి ఆయోగ్ సభ్యుల బృందం శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమై చర్చించింది. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సలహాదారు (ఎస్డీజీ) సాన్యుక్త సమద్దార్ (ఐఏఎస్), చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ, ప్రణాళికా శాఖ కార్యదర్శి జీఎస్ఆర్కే విజయ్‌కుమార్, యూఎన్డీపీ (ఇండియా) ముఖ్య సలహాదారు మీనాక్షి కతెల్, నీతి ఆయోగ్ ఎస్డీజీ ఆఫీసర్స్ అలెన్ జాన్, సౌమి గుహ, యూఎన్డీపీ డిప్యూటీ రెసిడెంట్ రిప్రజెంటేటివ్ డెన్నిస్ కర్రీ పాల్గొన్నారు. -
ఉత్త సక్సెస్ కాదు.. గొప్ప సక్సెస్ కావచ్చని నిరూపించింది!
యూట్యూబ్‌లో అందరూ వీడియోలు చేస్తారు. కాని ప్రాజక్తా కోలి సరదా వీడియోలతో పాటు బాధ్యత కలిగిన వీడియోలు చేసేది. ∙ఆడపిల్లల చదువు ∙బాడీ షేమింగ్ ∙మానసిక ఆరోగ్యం వీటి పట్ల చైతన్యం కలిగించే వీడియోలు పెద్ద హిట్. 65 లక్షల సబ్స్క్రయిబర్లు కలిగిన ఒక యువ యూట్యూబ్ స్టార్‌గా యువత మీద ఆమె ప్రభావాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించింది. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (యు.ఎన్.డి.పి)కి మన దేశ ‘తొలి యూత్ క్లయిమేట్ ఛాంపియన్’గా ఎంపిక చేసింది. యువత బాధ్యత చూపితేమరింత గుర్తింపు తెచ్చే బాధ్యత వస్తుందనడానికి ప్రాజక్తా ఒక ఉదాహరణ. గలగలమని పొంగే మాట, నిశితమైన గమనింపు, భళ్లుమనే వ్యంగ్యం, లక్ష్యాన్ని చేరుకునే చురుకుదనం ఉంటే సక్సెస్ కావచ్చా? ఉత్త సక్సెస్ కాదు గొప్ప సక్సెస్ కావచ్చు అని ప్రాజక్తా కోలి నిరూపించింది. తన సరదా వీడియోలతో వ్యక్తుల ప్రవర్తనను, లోకం పోకడలను ఎత్తి చూపే ప్రాజక్తా తొలితరం యూట్యూబ్ స్టార్లలో అందరి కంటే అందనంత ఎత్తుకు చేరుకుంది. అందుకే ఐక్యరాజ్య సమితి తన ‘డెవలప్మెంట్ ప్రోగ్రామ్’ కింద పర్యావరణ స్పృహ కలిగించే వివిధ దేశాల యూత్ క్లయిమెట్ ఛాంపియన్ల ఎంపికలో భాగంగా ప్రాజక్తాను మన దేశం నుంచి తొలిసారిగా ‘యూత్ క్లయిమేట్ ఛాంపియన్’గా ఎంపిక చేసింది. 28 ఏళ్ల ప్రాజక్తా ఇక మీదట మన దేశంలోని యువతలోనే కాదు అనేక దేశాల యువతలో కూడా పర్యావరణ స్పృహ కలిగించడానికి ఇప్పటికే ఐక్యరాజ్య సమితితో కలిసి పని చేస్తున్న లియొనార్డో డికాప్రియో వంటి హాలీవుడ్ స్టార్స్‌తో కలిసి పని చేయనుంది. ఒక భారతీయ యువతికి దక్కిన గొప్ప గుర్తింపు ఇది. ‘ఇది నాకు ఇష్టమైన పని. నేను బాగా పని చేయాలనుకుంటున్నాను’ అంది ప్రాజక్తా ఈ సందర్భంగా. మనం మార్చగలం ‘ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను మనమే తెచ్చాం. మనమే వాటిని పరిష్కరించగలం. నా దృష్టిలో యువత ఈ విషయంలో మొదటి వరుస సైనికులుగా ఉండాలి. యువత తలుచుకుంటే సాధ్యం కానిది లేదు. పర్యావరణ విధ్వంసం వల్ల భవిష్యత్తులో మానవజాతే అంతరించి పోయే పరిస్థితులు వస్తాయి. అలా జరక్కుండా ఉండటానికి మన దేశంలో యువత చైతన్యవంతం కావాలి. అందుకు నేను పని చేస్తాను. అలాగే ప్రపంచ యువత ఆలోచనలను పంచుకుంటాను’ అంది ప్రాజక్తా. (చదవండి: ఆరోజు ఆమె ముందు రెండు మార్గాలు.. చదువు, చావు!) థానే అమ్మాయి ప్రాజక్తా మహరాష్ట్రలోని థానేలో పుట్టి పెరిగింది. ముంబైలో చదువుకుంది. తండ్రి మనోజ్ కోలీ చిన్న సైజు రియల్టర్. తల్లి అర్చన కోలి టీచర్. ఈమెకు నిషాంత్ అనే తమ్ముడు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ప్రాజక్తా ఉత్త వాగుడుకాయ. స్కూల్లో ప్రతి పోటీలో పాల్గొని మాట్లాడేది. ప్రైజులు కొట్టేది. తమ అమ్మాయి ఇంట్లో, క్లాస్‌రూమ్‌లో వొదిగి ఉండటానికి పుట్టలేదని, స్టేజ్ మీద జనాన్ని అలరించడానికి పుట్టిందని అర్థం చేసుకున్న తల్లిదండ్రులు ప్రాజక్తాను బాగా ప్రోత్సహించారు. ఆరవ తరగతిలోనే రేడియో జాకీ అవ్వాలనుకున్న ప్రాజక్తా కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ చేసి ముంబై ‘ఫీవర్’ రేడియోలో ఒక సంవత్సరం ఇన్‌టర్న్‌గా చేసింది. కాని ఆ ఉద్యోగం ఆమెకు సంతృప్తి ఇవ్వలేదు. అయితే ఆ సమయంలో గెస్ట్‌గా వచ్చిన హృతిక్ రోషన్‌తో ప్రాజక్తా చేసిన ఒక చిన్న వీడియో చూసిన డిజిటల్ కంటెంట్ ఎక్స్పర్ట్ సుదీప్ లహరీ ‘నీ మాటలో మంచి విరుపు ఉంది. ఇది యూట్యూబ్ యుగం. యూ ట్యూబ్ చానల్ మొదలెట్టు’ అని సలహా ఇచ్చాడు. అలా 2015లో ప్రాజక్తా మొదలెట్టిన యూట్యూబ్ చానల్ ‘మోస్ట్‌లీసేన్’. మోస్ట్‌లీసేన్ ‘మోస్ట్‌లీసేన్’ చానల్లో అన్నీ తానుగా ప్రాజక్తా వీడియోలు చేసి రిలీజ్ చేస్తుంది. అంటే వీడియోలో ఆమె ఒక్కతే రకరకాల పాత్రలుగా కనిపిస్తుంది. అందుకు ఆమె తాను గమనించిన మనుషుల ప్రవర్తనలను ముడి సరుకుగా చేసుకుంటుంది. ‘మనకు తెలిసిన 10 రకాల టీవీ ప్రేక్షకులు’, ‘పది రకాల విద్యార్థులు’, ‘వీరండీ మన ఇరుగు పొరుగు’, ‘మన అమ్మలు... వారి చాదస్తాలు’... ఇలా టాపిక్ తీసుకుని ఆ పాత్రలన్నీ తానే ధరిస్తుంది. ఈ వీడియోల్లో తమను తాము చూసుకున్న ప్రేక్షకులు వెంటనే సబ్స్క్రయిబర్లుగా మారారు. ఒక్క సంవత్సరంలోనే లక్ష మంది సబ్స్క్రయిబర్లను పొందింది ప్రాజక్తా. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 65 లక్షలకు చేరింది. వారంలో మూడు వీడియోలు ఆమె విడుదల చేస్తే యూట్యూబ్ ద్వారా బోలెడు ఆదాయం వచ్చి పడుతోంది. మిషేల్ ఒబామాతో కాఫీ ప్రాజక్తా కేవలం ఈ వీడియోలే కాదు. ఆమె స్త్రీల పక్షపాతి. అమ్మాయిలు బాగా చదవాలని దాదాపుగా అన్ని వీడియోల్లో చూపుతూ చెబుతూ ఉంటుంది. హేట్ టాక్, బాడీ షేమింగ్, సైబర్ బుల్లీయింగ్ తదితర దుర్లక్షణాల మీద కటువైన వ్యంగ్యంతో చేసిన వీడియోలు ఆమెకు గౌరవం తెచ్చి పెట్టాయి. ‘ఐ ప్లెడ్జెడ్ టు బి మీ’ అనే పేరుతో ఆమె చేసిన కాంపెయిన్ చాలామంది అమ్మాయిలకు ఆత్మవిశ్వాసం ఇచ్చింది. ఇవన్నీ ఆమెకు అవార్డులు, పెద్ద పెద్ద సంస్థల సోషల్ కాంపెయిన్లో భాగస్వామ్యాలు తెచ్చి పెట్టాయి. న్యూఢిల్లీలో ఆమె మిషేల్ ఒబామాతో కాఫీ తాగి కబుర్లు చెప్పే స్థాయికి ఎదిగింది. అంతే కాదు యూట్యూబ్ సిఇఓ సుజేన్ వూను ఇంటర్వ్యూ చేయగలిగే ఏకైక భారతీయ యూట్యూబర్‌గా ఎదిగింది. ఇవన్నీ ఆమె తన ఆకర్షణీయమైన మాటతోనే సాధించింది. యువత తన కెరీర్ కోసం కష్టపడాలి. తప్పదు. దాంతో పాటు సామాజిక బాధ్యత చూపిస్తే ప్రాజక్తాలా గొప్ప గొప్ప బాధ్యతలు వరిస్తాయి. జీవితంలో సక్సెస్‌ను అలా కదా చూడాలి. -
మరో సంక్షోభం దిశగా అఫ్గన్! ఐరాస హెచ్చరిక
తాలిబన్ల ఆక్రమణ, అల్లకల్లోల పరిస్థితులు, బయటి దేశాలతో వర్తక వాణిజ్యాలు నిలిచిపోవడం.. తదితర కారణాలతో అఫ్గనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలుకు లోనైంది. ఈ తరుణంలో అఫ్గనిస్తాన్ పై మరో పిడుగు పడనుంది. ఊహించని స్థాయిలో ఆర్థిక సంక్షోభం అఫ్గన్‌ను ముంచెత్తే అవకాశాలున్నాయంటూ హెచ్చరించింది ఐక్యరాజ్య సమితి. యూఎన్ డెవలప్మెంట్ ప్రొగ్రాం(UNDP) సోమవారం మూడు పేజీలతో కూడిన ఒక నివేదికను రిలీజ్ చేసింది. బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలే పరిస్థితులు నెలకొన్నాయని, తద్వారా ఆర్థిక తలెత్తే అవకాశం ఉందని, ఆ ప్రతికూల ప్రభావం సొసైటీపై ఊహించని స్థాయిలో చూపించ్చొచ్చని అభిప్రాయపడింది ఐరాస. కిందటి ఏడాది 7 బిలియన్ డాలర్ల విలువైన గూడ్స్, ఉత్పత్తులను, సేవలను అందించింది అఫ్గనిస్తాన్. ఎలాంటి అవాంతరాలు లేకుండా లావాదేవీలు జరగడానికి కారణం.. అక్కడి బ్యాంకింగ్ వ్యవస్థే. అయితే చాలామంది లోన్లు తిరిగి చెల్లించకపోవడం, తాలిబన్ల ఆక్రమణ తర్వాత నగదు విత్‌డ్రా, అదే సమయంలో డిపాజిట్లు తక్కువగా వస్తుండడం, అవసరాలకు సరిపడా కరెన్సీ నిల్వలు లేకపోవడంతో.. కొద్దినెలల్లోపే ఈ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని ఐరాస యూఎన్డీపీ నివేదికలో పేర్కొంది. ఇప్పటికైనా తేరుకుని బ్యాంకింగ్ వ్యవస్థను బలపర్చాలని తాలిబన్ ప్రభుత్వానికి సూచించింది ఐక్యరాజ్య సమితి. ఇందుకోసం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు సైతం సహకరించాలని యూఎన్డీపీ అభిప్రాయపడింది. మరోవైపు కఠిన ఆంక్షల విధింపు, విదేశీ నిధులు నిలిచిపోవడం, తాలిబన్ల ఆక్రమణ టైంలో వర్తకవాణిజ్యాలు ఆగిపోవడంతో పాటు అఫ్గన్‌కు రావాల్సిన బకాయిలు నిలిచిపోవడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చాలావరకు దెబ్బతింది. ఈ తరుణంలో బ్యాంకింగ్, డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ వ్యవస్థలు సైతం దెబ్బతింటే గనుక.. ఆదుకోవడానికి ప్రపంచ దేశాలు ముందుకొచ్చినా ఆ సంక్షోభం నుంచి కోలుకోవడానికి దశాబ్దాల సమయం పట్టే అవకాశం ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
‘అరోరా ఆకాంక్ష’.. రికార్డు సృష్టించనుందా?!
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి అధ్యక్ష పదవి కోసం భారత సంతతికి చెందిన మహిళ బరిలో నిలిచారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) ఆడిట్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న అరోరా ఆకాంక్ష(34) అధ్యక్ష బరిలో నిలిచినట్లు వెల్లడించారు. ప్రస్తుత ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌గా వ్యవహరిస్తున్న ఆంటోనియో గుటెరస్ పదవీకాలం త్వరలో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యున్నత దౌత్యవేత్త పదవికి తాను పోటీ చేస్తున్నట్లు అరోరా గత నెలలోనే తెలిపారు. ఇందుకు సంబంధించి ఈ నెలలో ‘‘అరోరాఫర్ఎస్జీ’’ పేరిట ఆమె ప్రచారం సైతం ప్రారంభించారు. ఇక అధ్యక్ష బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించిన అరోరా ఆకాంక్ష ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. తాజాగా రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ప్రచార వీడియోను విడుదల చేశారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం లోపల నడుస్తూ అరోరా ఈ వీడియోను తీశారు. గడిచిన 75 సంవత్సరాలుగా ఐక్యరాజ్య సమితి ప్రపంచానికి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని.. శరణార్థులను రక్షించలేదని ఆమె ఆరోపించారు. అందుకే ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌గా తాను పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఒకవేళ అరోరా గనక ఈ పదవి చేపడితే.. ఐక్యరాజ్య సమితి 75 ఏళ్ల చరిత్రలో సెక్రటరీ జనరల్ పదవి చేపట్టిన మొదటి మహిళగా ఆమె రికార్డు సృష్టిస్తారు. కాగా, ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ మరోసారి అధ్యక్షుడిగా కొనసాగాలని భావిస్తున్నారు. ఆయన మొదటి విడత పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగుస్తుంది. కొత్త సెక్రటరీ జనరల్ 2022 జనవరి 1న బాధ్యతలు స్వీకరిస్తారు. 2017 జనవరి 1న గుటెరస్ సెక్రటరీ జనరల్‌గా ప్రమాణం చేశారు. మరోసారి అధ్యక్షుడిగా పని చేయాలని గుటెరస్ ఆశిస్తున్నారు. ఇక అరోరా ఆకాంక్ష విషయానికి వస్తే ఆమె టొరంటోలోని యార్క్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ స్టడీస్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు. కొలంబియా యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేశారు. భారతదేశంలో జన్మించిన అరోరా ఆకాంక్షకు ఓసీఐ కార్డ్ వుంది. అలాగే కెనడా పౌరురాలిగా ఆ దేశ పాస్‌పోర్ట్ కలిగివున్నారు. చదవండి: భారత్ సేవలకు సెల్యూట్: యూఎన్ చీఫ్ డ్యాషింగ్ అడ్వైజర్ -
సోనూసూద్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
సాక్షి, ముంబై: రియల్ హీరో, బాలీవుడ్ నటుడు సోనూసూద్‌ను ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూఎన్డీపీ (యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్) స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డును సోనూకు ప్రదానం చేసింది. ఇప్పటివరకు అద్భుత నటనకు అవార్డులు ప్రశంసలు గెలుచుకున్న సోనూ తన గొప్ప మనసుకు, మానవత్వానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రశంసలతోపాటు తాజాగా యూఎన్డీపీ అవార్డును అందుకున్నారు. బాలీవుడ్లో చాలాకొద్దిమందికి దక్కిన అరుదైన గౌరవాన్ని సోనూ అందుకోవడం విశేషం. (రియల్ హీరో సోనూ సూద్‌కు గ్రాండ్ వెల్కమ్) నిస్వార్ధంగా, అలుపెరగకుండా లక్షలాది వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చడం, వారిని ఆర్థికంగా ఆదుకున్న సోనూ సూద్ అక్కడితో ఆగిపోలేదు. విదేశాలలో చిక్కుకున్న వేలాదిమంది విద్యార్థులకు సహాయం, చిన్న పిల్లలకు ఉచిత విద్య, వైద్య సదుపాయాలు, కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో అవసరమైన వారికి ఉచిత ఉపాధి అవకాశాలను కల్పించడం లాంటి అనేక సేవలకుగాను ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. సోమవారం సాయంత్రం జరిగిన వర్చువల్ వేడుకలో ఈ అవార్డును ప్రదానం చేశారు. దీంతో ఆయనకు ట్విటర్ లో అభినందన వెల్లువ కురుస్తోంది. హాలీవుడ్ నటులు ఏంజెలీనా జోలీ, లియోనార్డో డికాప్రియో, ఎమ్మా వాట్సన్, లియామ్ నీసన్, నోబెల్ బహుమతి గ్రహీత ఫుట్ బాల్ లెజెండ్ డేవిడ్ బెక్హాం, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా లాంటి వారిని ఐక్యరాజ్యసమితి పలు అవార్డులతో సత్కరించింది. మరోవైపు ఇది అరుదైన గౌరవమనీ, యూఎన్ఓ గుర్తింపు తనకు చాలా ప్రత్యేకమైందంటూ సోనూ సూద్ సంతోషం వ్యక్తం చేశారు. తన దేశీయుల కోసం తనకున్న దాంట్లో తాను చేసిన చిన్న సాయమని పేర్కొన్నారు. 2030 నాటికి పేదరికం, ఆకలి, లింగ వివక్ష నిర్మూలన లాంటి 17 సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) సాధనలో యుఎన్‌డీపీకి తన మద్దతు పూర్తిగా ఉంటుందన్నారు. -
మానవాభివృద్ధి సూచీలో భారత్ @ 129
న్యూఢిల్లీ: ప్రపంచ మానవాభివృద్ధి సూచీలో భారత్ 129వ స్థానంలో ఉంది. ఐక్యరాజ్యసమితి సోమ వారం ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) నివేదిక–2019ను విడుదల చేసింది. తొలి మూడు స్థానాల్లో నార్వే, స్విట్జర్లాండ్, ఐర్లాండ్ నిలిచాయి. పాకిస్తాన్ 152వ స్థానంలో ఉంది. అట్టడుగున 189 స్థానంలో నైగర్ ఉంది. 189 దేశాలతో జాబితా రూపొందించింది. 2005–06 నుంచి 2015–16 వరకు 27.1 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడినట్టు యూఎన్డీపీ ఇండియా ప్రతినిధి షోకో నోడా వెల్లడించారు. 2018లో భారత్ 130వ స్థానంలో ఉంది. మూడు దశాబ్దాలుగా జరుగుతున్న అభివృద్ధి కారణంగా పేదరికంలోనూ, భారతీయుల ఆయుర్దాయంలోనూ, విద్య, వైద్య సదుపాయాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని రిపోర్టు వెల్లడించింది. ► 1.3 బిలియన్ల మంది నిరుపేదల్లో 28 శాతం మంది భారత్‌లో ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకా స్త్రీలు, బాలికలు అసమానతల సవాళ్ళను ఎదుర్కొంటూనే ఉన్నారు. హా భర్తల చేతిలో హింసకు గురౌతున్న మహిళలు సింగపూర్‌లో అతి తక్కువ. ► దక్షిణాసియాలో 31 శాతం మంది మహిళలు భర్తల చేతిలో హింసకు గురౌతున్నారు. ► లింగ అభివృద్ధి సూచీలో దక్షిణాసియా దేశాల సగటు కంటే భారత్ కొద్దిగా మెరుగైన స్థితిలో ఉంది. -
ఆహ్వానం అందినా..వీసా ఇవ్వలేదు
పంజగుట్ట: వారు అసాధారణ మహిళలని గుర్తించిన ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రొగ్రామ్ (యూఎన్డీపీ) ప్రతిష్టాత్మకమైన ఈక్వేటారి అవార్డుకు ఎంపిక చేసింది. ఈ నెల 19 నుండి 26 వరకు న్యూయార్క్‌లో జరిగే కార్యక్రమంలో అవార్డు అందుకునేందుకు రావాలని ఆహ్వానం పంపారు. అయితే న్యూయార్క్ వెళ్లేందుకు సిద్ధపడిన వారికి యూఎస్ కన్సోలేట్ కార్యాలయంలో అధికారులు వారి వీసాను తిరస్కరించారు. మహిళా రైతులుగా డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన తాము అవార్డు తీసుకునేందుకు వీసాకు దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తులపై వేలిముద్రలు తీసుకున్న అధికారులు బుధవారం రావాల్సిందిగా కోరారని, బుధవారం వెళ్లగా వీసా రిజెక్ట్ అయ్యిందని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీడీఎస్ కో–డైరెక్టర్ జయశ్రీ, సభ్యురాలు అనసూయమ్మ, అఖిల భారత చిరుధాన్యాల చెల్లెండ్ల సమాఖ్య అధ్యక్షురాలు మొగులమ్మ, బయోడైవర్సిటీ ఫిలిం మేకర్ అవార్డు గ్రహీత మసనగారి మయూరి మాట్లాడుతూ .. గత 30 ఏళ్లుగా స్థానికంగా ఉన్న వనరులతో పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా, వారి సమస్యలను పరిష్కరించుకుంటున్నారని గుర్తించి యూఎన్డీపీ ఈక్వెటారీ అవార్డుకు ఎంపిక చేసిందన్నారు. ఈ అవార్డుకు 127 దేశాలనుండి 847 మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 20 మందిని మాత్రమే ఎంపిక చేసిందని, అందులో తెలుగు రాష్ట్రాల నుండి డీడీఎస్ మాత్రమే ఎంపికయ్యిందన్నారు. అవార్డును అందుకునేందుకు మొగలమ్మ, అనసూయమ్మలను వారికి ట్రాన్సిలేటర్గా మయూరిని పంపేందుకు నిర్ణయించుకున్నట్లు జయశ్రీ తెలిపారు. గత 30 ఏళ్లగా డీడీఎస్లో పనిచేస్తున్నానని 24 గ్రామాల్లో 1200 బీడుపడిన పొలాల్లో 20 లక్షల చెట్లు నాటినట్లు అనసూయమ్మ తెలిపారు. దీనిని గుర్తించి అవార్డు ఇస్తానని పిలిస్తే ఇక్కడే ఆటంకాలు ఎదురుకావడం బాధగా ఉందన్నారు. అవార్డుకు ఎంపికైనట్లు ప్రకటించగానే జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు ఘనంగా సత్కరించారని గుర్తుచేశారు. పర్యావరణాన్ని కాపాడుతూ చిరుధాన్యాలను ప్రొత్సహిస్తున్నానని మొఘలమ్మ తెలిపారు. తన వద్ద 70 రకాల చిరుధాన్యాల విత్తనాలు ఉన్నాయని, సుమారు 30 రకాల పంటలు తానే పండిస్తున్నట్లు తెలిపారు. యూఎస్ నుంచి వచ్చిన ప్రతినిధులు సుమారు 15 రోజులు ఇక్కడే ఉండి తమ వ్యవసాయ విధానాలను పరిశీలించి డాక్యుమెంటరీ కూడా తీసుకున్నట్లు తెలిపారు. మొదటిసారి విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చిందని ఇప్పుడూ అడ్డంకులు సృష్టిస్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి వీసా వచ్చేలా చేయాలన్నారు. -
బతుకు చెట్టుకు తల్లి వేర్లు
ఆరుగురు మహిళలు. ఆరుగురూ సామాన్యులు. సామాన్యులే కానీ.. వీళ్ల చేతుల్లో బంజరు భూమి బంగారమైంది. వీళ్లు వేసిన విత్తనం అడవై మొలకెత్తింది. వీళ్లు నాటిన మొక్క డాక్టర్ అయి ప్రాక్టీస్ పెట్టింది. వీళ్లు నూర్పిన సిరిధాన్యాలు.. ఆధునిక మానవుడికి తినడమెలాగో నేర్పాయి. మనం నరుక్కుంటున్న కొమ్మల్ని తిరిగి భూమాతకు అంటుకడుతున్న ఈ తల్లులకు.. సహస్ర ప్రణామాలు. శతకోటి వందనాలు. వెనుకటి మనిషి ‘చెట్టు నరికి గోడ కట్టకూడదు’ అని చెబితే అతడిని వెనుకబడిన మనిషిగా చూసింది మోడరన్ సొసైటీ. అభివృద్ధి పేరుతో అడవులను విచక్షణా రహితంగా నరికేసింది కూడా అప్పుడే. అడవుల్లో స్థిరనివాసం ఏర్పరచుకునే రోజుల నుంచి తనను తాను సంఘజీవిగా మలుచుకుంటూ పరిణతి చెందే క్రమంలో మనిషి పెట్టుకున్న నియమావళే చెట్టును నరికి గోడ కట్టకూడదనేది. మైదానంలో ఇల్లు కట్టుకోవాలి తప్ప, ఇంటి నిర్మాణం కోసం చెట్టును నరికేయవద్దని చెప్పడంలోనే... మనిషి జీవిక చెట్టుతో ముడిపడి ఉందని పూర్వికులు గ్రహించినట్లు తెలుస్తోంది. అయితే ఈ మాటను ఒట్టి నానుడిగా విని వదిలేసి, వేలకు వేల ఎకరాల్లో వందల ఏళ్ల కిందట పుట్టి, ఆకాశాన్నంటే ఎత్తుకు ఎదిగిన చెట్లను సైతం మొదలు నరికేసి... అదే నేలలో ఆకాశాన్నంటే భవనాలను కట్టి ‘ఇదిగో ఇదే అభివృద్ధి’ అని మోడరన్ మేన్ అంటున్నాడు. రాళ్లూరప్పలకు జీవం ఇప్పుడా మోడరన్ మేన్‌కి కర్తవ్యాన్ని, మానవ ధర్మాన్ని గుర్తు చేస్తూ.. ‘మీరు కాంక్రీట్ జంగిల్ కడితే, మేము నేచురల్ జంగిల్‌ని నిర్మిస్తాం’ అని మట్టిని తవ్వి మొక్కను నాటారు ఓ ఆరుగురు గ్రామీణ మహిళలు. వందలు, వేలు కాదు.. లక్షల మొక్కలు నాటారు! రాళ్లు రప్పలతో నిండి ఉన్న బంజరు నేలను చదును చేశారు. చేతి సత్తువతో గుంటలు తవ్వి మొక్కను నాటారు. ఆ మొక్క బతకాలంటే నీళ్లు పోసేదెవరు? దగ్గరలో నది లేదు, కాలువ లేదు. నీటి ప్రాజెక్టులనేవి ఉంటాయని కూడా వాళ్లకు తెలియదు. కుండలతో నీళ్లు మోసుకొచ్చి మొక్కలకు పోశారు. కడవ భుజాన పెట్టుకుని కిలోమీటర్ల దూరం నీటిని మోసి మొక్కలను బతికించారు. ఆ మొక్కలు పెరిగి పెద్దయ్యాయి, దశాబ్దాల వాళ్ల కష్టం పచ్చటి అడవిగా కళ్ల ముందు నిలిచింది. ఇంతటి శ్రమకోర్చిన వాళ్లందరూ గ్రామీణ దళిత మహిళలే. చిరుధాన్యాలు సాగుచేసే మహిళా రైతులు కూడా. వారి శ్రమను గుర్తించిన ఐక్యరాజ్య సమితి ఆ ఆరుగురు మహిళలను గౌరవిస్తూ ఈ ఏడాది ‘ఈక్వేటర్ ప్రైజ్’ను ప్రకటించింది! నారూనీరు డీడీఎస్ ఈ ప్రైజ్‌కు ఎంపికైన మహిళలకు మార్గదర్శనం చేసిన స్వచ్ఛంద సంస్థ ‘డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ’ వాళ్లకు సన్మానం చేసింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ ఐదవ తేదీన మెదక్‌జిల్లా జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ మహిళలను శాలువాతో సత్కరించారు. కార్యక్రమానికి పుణెకి చెందిన పర్యావరణ వేత్త ఆశిశ్ కొఠారి హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా క్లైమేట్ చేంజ్ ఎక్స్పర్ట్, ఎన్ఐఆర్డి విజిటింగ్ ఫ్యాకల్టీ ఉత్కర్ష్ ఘాటే, ఐఏఎస్ అధికారి ఉషారాణి పాల్గొన్నారు. ఉత్కర్ష్ ఘాటే సిరిధాన్యాల సాగులో ఉన్న ప్రయోజనాలను వివరించారు. ‘‘పత్తి వంటి వాణిజ్య పంటలు వేసిన రైతుల ఆత్మహత్యలను చూస్తున్నాం. కానీ మిల్లెట్స్ (కొర్రలు, జొన్న, సజ్జ, అరికెల వంటి చిరుధాన్యాలు) రైతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఒక్కటీ లేదు. చిరుధాన్యాలు.. వాటిని తిన్న మనిషి ఆరోగ్యాన్ని కాపాడడంతోపాటు రైతును కూడా కాపాడతాయి’’ అని అన్నారు. మహిళలే వెన్నుదన్ను భూమి పుట్టి నాలుగన్నర కోట్ల ఏళ్లయిందని అంచనా. కాంస్య యుగం, లోహయుగం, మధ్యయుగం, ఆదిమ మానవ జాతి దశ నుంచి ఇప్పటి మోడరన్ పీరియడ్ వరకు ఎలా లెక్కేసుకున్నా సరే మనిషి ఒకచోట స్థిరంగా నివసించడం మొదలు పెట్టింది.. ఈ చివరి పదివేల నుంచి పదిహేను వేల ఏళ్ల మధ్యలోనే ఉంటుంది. అయితే కోట్ల ఏళ్ల భూమి మనుగడను ఆందోళనలో పడేయడానికి మనిషికి నిండా రెండువేల ఏళ్లు కూడా పట్టనే లేదు! ఆధునిక మానవుడు ప్రకృతి సమతుల్యతను దెబ్బతీశాడు. చివరికి అతడి మనుగడే దెబ్బతినే పరిస్థితులు ఏర్పడడంతో ‘దిద్దుబాటు’కోసం డి.డి.ఎస్. వంటి సంస్థలు మహిళల సహాయంతో నడుం బిగిస్తున్నాయి. – వాకా మంజులారెడ్డి విశ్వవిజేతలు ►నాగ్వార్ సునందమ్మది ఇందూరు గ్రామం. రాళ్లు రప్పలతో నిండి ఉన్న తొంభై ఎకరాల భూమిని చదును చేసి వేలాది మొక్కలను నాటింది. ఆమె కృషి... సామాజిక అడవులు విస్తరించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసింది. ►మైసనగారి రత్నమ్మ ఆల్గోల్ గ్రామంలో మహిళా సంఘం నాయకురాలు. ఆమె 72 గ్రామాలు తిరిగి ప్రతి గ్రామంలో మహిళాసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రామంలో యాభై ఎకరాలు, వంద ఎకరాలు, రెండు వందల ఎకరాల గుబ్బడి (మెట్ట నేల) ఉండేది. ఆ నేలల్లో వేప, మామిడి, చింత, రామచింత మొక్కలను నాటించారామె. ఫారెస్టు అధికారులు పర్యటనకు వస్తే చాలు... బీడు భూములను చూపించి మొక్కలిస్తే ఈ నేలలో కూడా నాటుతానని అడిగేదని, మొక్కలు ఏర్పాటు చేసే వరకు అధికారులను వెంటాడేదని చెబుతారు తోటి మహిళలు. ఆమె ఆ రకంగా చెట్లను నాటి సామాజిక అడవిని నాటి పరిరక్షించారు. అందుకు గాను భారత ప్రభుత్వం 1993లో ఆమెను ‘వృక్షమిత్ర’ పురస్కారంతో గౌరవించింది. రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న సంగతులను గుర్తు చేసుకున్నారామె. ►బేగరి తుల్జమ్మది పస్తాపూర్. ముప్పైకి పైగా మహిళా సంఘాల రూపకల్పనతోపాటు విత్తన సాగులో ఆమె విశేషంగా కృషి చేశారు. సిరిధాన్యాలను సాగు చేసే మహిళా రైతులకు అవసరమైన విత్తనాలను సరఫరా (32 గ్రామాలకు) చేస్తూ ప్రత్యామ్నాయ ప్రజాపంపిణీ వ్యవస్థను సమర్థంగా నిర్వహించారామె. ఆమె చొరవతో బీడుపడిపోయి ఉన్న ఐదువేల మూడు వందల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. ఆ నేలలో వాళ్లు చిరుధాన్యాలను పండిస్తున్నారు. ►చిల్కపల్లి అనుసూయమ్మ మారుమూల గ్రామాల మహిళలను నడిపించిన మార్గదర్శి. పడావు నేలలకు పచ్చటి దుప్పటి కప్పడానికి ఆమె తన జీవితాన్ని అంకితం చేసింది. వేలాది మంది మహిళలను చైతన్యవంతం చేయడంలో ఆమె దిట్ట. వారందరినీ కలుపుకుంటూ నిరుపయోగమైన భూమిలో లక్షలాది మొక్కలు నాటి అడవిని సృష్టించిన మహిళ. ►నడిమిదొడ్డి అంజమ్మది గంగ్వార్ గ్రామం. ఆమె పాతికేళ్లుగా మనదేశీయ సంప్రదాయ విత్తనాలను కాపాడుతోంది. ఈ విత్తనాలతో సాగు చేసిన పంటలకు చీడపీడలు ఆశించవు. ఆమె పర్యావరణ పరిరక్షణ పట్ల చైతన్యం కలిగిన మహిళ కూడా. ఈ రంగంలో అంజమ్మ సేవలకుగాను గతంలో అనేక ప్రాంతీయ, జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు. సిరిధాన్యాల సాగుతో జీవితాలను నిలబెట్టుకోవచ్చని, సిరిధాన్యాలతో తినడం వల్ల ఆరోగ్యంగా జీవించవచ్చని పాతికేళ్ల కిందటే జాతీయ వేదికల మీద చెప్పిన మహిళ కూడా. ►ఎర్రోళ్ల కనకమ్మది మచ్నూర్ గ్రామం. ఆమె పాతికేళ్లుగా బీడుభూములను సాగులోకి తీసుకువచ్చి, ఔషధ వనాన్ని పెంచారు. వనాన్ని పెంచడంతోపాటు ఏ చెట్టులో ఏ ఔషధ లక్షణం ఉందో తెలుసుకుని, గ్రామంలోని మహిళలను సంఘటిత పరిచి వారికి తెలియచేసింది. ఆధునిక వైద్యం అందుబాటులో లేని తమ గ్రామాల్లో ప్రత్యామ్నాయ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారామె. యూఎన్డీపీ ఈక్వేటర్ అవార్డు ఐక్యరాజ్యసమితికి అనుబంధ సంస్థ యూఎన్డీపీ (యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్). ఈ సంస్థ ఏటా పేదరిక నిర్మూలన, జీవవైవిధ్య నిరంతరత కోసం సమిష్టిగా కృషి చేస్తున్న సంఘాలకు ఈక్వేటర్ అవార్డులను ప్రదానం చేస్తుంది. ఈ ఏడాది 127 దేశాల నుంచి 847 నామినేషన్లు వచ్చాయి. ఎంపికైన 20 అవార్డుల్లో ఒకటి మన తెలుగు వాళ్లది. తెలుగు వాళ్లు ఈ అవార్డు అందుకోవడం ఇదే మొదటిసారి. మెదక్ జిల్లా జహీరాబాద్ మండలానికి చెందిన గ్రామీణ మహిళల సంయుక్త కృషే ఈ అవార్డును తెచ్చి పెట్టింది. ఐక్యరాజ్య సమితి గడచిన 17 ఏళ్లుగా ఈ అవార్డులిస్తోంది. మనదేశం ఇంతకుముందు తొమ్మిది ఈక్వేటర్ అవార్డులు అందుకున్నది. ఇది పదవ అవార్డు. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో సమష్టిగా కృషి చేసిన స్వయం సహాయక బృందాల మహిళలు 2019 అవార్డుకు ఎంపికయ్యారు. వారికి ఈ ఏడాది సెప్టెంబర్‌లో న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో బహుమతి ప్రదానం చేస్తారు. పురస్కారంలో జ్ఞాపికతోపాటు పదివేల డాలర్ల (సుమారుగా ఏడు లక్షల రూపాయలు) నగదు బహుమతి అందచేస్తారు. -
యూఎన్డీపీ అంబాసిడర్‌గా పద్మాలక్ష్మి
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) తన నూతన గుడ్‌విల్ అంబాసిడర్‌గా పద్మాలక్ష్మిని నియమించింది. టెలివిజన్ రంగానికి చెందిన భారత సంతతి అమెరికన్, ప్రముఖ ఆహార నిపుణురాలైన పద్మాలక్ష్మిని అంబాసిడర్‌గా నియమిస్తున్నుట్లు యూఎన్డీపీ ప్రకటించింది. గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమితురాలైన ఆమె అసమానతలను రూపుమాపడం, వివక్షను తొలగించడం, సాధికారత వంటి లక్ష్యాలను సాధించడానికి పాటుపడాల్సి ఉంటుంది. ‘ప్రపంచంలోని అనేక మంది మహిళలు, బాలికలు ఎన్నో వివక్షలను, అత్యంత క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్నారన్న సంగతి మనం మరచిపోకూడదు. ప్రధానంగా అసమానతపై దృష్టి సారిస్తా’ అని ఈ సందర్భంగా పద్మాలక్ష్మీ అన్నారు. -
'ఆమె'కు అక్కడా అసమానతే..!
ఆకాశంలో సగం అంటున్న ఆధునిక సమాజంలోనూ.. మహిళలు అన్నింటా వెనుకబడే ఉంటున్నారంటున్నాయి తాజా నివేదికలు. ముఖ్యంగా భారతదేశంలో పనిలో, ఇతర చెల్లింపుల విషయంలోనే కాక... కనీస అవసరాలుగా మారిపోయిన బ్యాంకు ఖాతా, ఇటర్నెట్ వాడకం విషయంలోనూ మహిళలపై తీవ్ర అసమానతలు పెరిగిపోయినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. 2015 యునైటెడ్ నేషన్స్ డెవలప్ మెంట్ ప్రొగ్రాం (UNDP) మానవాభివృద్ధి నివేదిక ప్రకారం లింగ అసమానతలు.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ కలతచెందే విధంగా ఉండటం శోనీయమని, ముఖ్యంగా ఇండియాలో ఈ శాతం మరీ ఎక్కువగా ఉందని చెప్తున్నాయి. భారతదేశంలో ఎనభై శాతం మంది మహిళలకు కనీసం బ్యాంకు ఖాతాలు లేకపోవడం అసమానతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. మొత్తం ప్రపంచంలో 42 శాతం వరకూ మహిళలకు బ్యాంకు ఖాతాలు లేకపోగా.. అది భారత్ లో మరీ ఎక్కువ ఉన్నట్లుగా తాజా లెక్కలు చెప్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ఇండియా, మెక్సికో, పాకిస్థాన్, యుగాండా సహా మొత్తం 38 దేశాల్లో ఎనభైశాతం కన్నా ఎక్కువ మంది మహిళలకు బ్యాంకు ఖాతాలు లేకపోగా... దీనికి భిన్నంగా జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా దేశాల్లో 90 శాతం కన్నా ఎక్కువ మందికి ఖాతాలు కలిగి ఉండటం తీవ్ర వ్యత్యాసాన్ని తెలుపుతోంది. నిజానికి ఈ అసమానతలు కేవలం బ్యాంకు ఖాతాల్లోనే కాక, ఇంటర్నెట్ ఉపయోగించడంలోనూ కనిపిస్తున్నాయి. భారత దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల్లో పురుషుల శాతంతో పోలిస్తే మహిళల శాతం తీవ్ర నిరాశాజనకంగానే ఉన్నట్లు తెలుస్తోంది. 2013 లెక్కల ప్రకారం పురుషులు 61శాతం మంది ఇంటర్నెట్ వినియోగదారులుంటే, స్త్రీలు 39 శాతం మాత్రమే ఉన్నట్లు రిపోర్టులు చెప్తున్నాయి. ఇతర దేశాల్లోని నివేదికలతో సరిపోల్చి చూసినప్పుడు చైనాలో మహిళలు 44శాతం, పురుషులు 56శాతం... టర్కీలో మహిళలు 44శాతం, పురుషులు 64శాతం వంటి కొద్ది మాత్రపు తేడాతోనే ఉండగా... భారతదేశం మాత్రం ఈ విషయంలో అత్యంత అధికస్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే భారత్, చైనాల మూలాలు క్షీణిస్తున్నట్లుగా 2014 నివేదికలు చెప్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే పురుషులకన్నా..ప్రపంచ వ్యాప్తంగా మహిళా భాగస్వామ్యం తీవ్రంగా పడిపోయినట్లు నివేదికలు నిరూపిస్తున్నాయి. 1990 లో 35 శాతం ఉన్నమహిళా భాగస్వామ్యం... 2013 నాటికి 27కు తగ్గిపోయింది. అదే చైనాలో 1990లో 73 శాతం ఉండగా... 2013 నాటికి 64 కు పడిపోయింది. ఇప్పటికైనా భారత ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉన్నట్లు తాజా నివేదికలు హెచ్చరిస్తున్నాయి. -
రెమిటెన్సులలో భారత్ అగ్రస్థానం
యూఎన్డీపీ నివేదిక న్యూఢిల్లీ: భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ ఏడాది రెమిటెన్సెస్ (ప్రవాస భారతీయులు ఇండియాకు పంపిస్తున్న డబ్బు) జోరుగా వస్తాయని తాజాగా ఒక నివేదిక వెల్లడించింది. 2014లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు 43,600 కోట్ల డాలర్ల రెమిటెన్సెస్ వచ్చాయని యునెటైట్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(యూఎన్డీపీ) తాజా నివేదిక పేర్కొంది. ఈ రెమిటెన్సెస్ ఈ ఏడాది 44,000 కోట్ల డాలర్లకు చేరతాయని వివరించింది. ఈ నివేదిక వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు.., 2014లో భారత్‌కు 7,000 కోట్ల డాలర్లు (భారత జీడీపీలో ఇది 4%)రెమిటెన్సెస్ వచ్చాయి. ఆ ఏడాది అధిక రెమిటెన్సెస్ వచ్చిన దేశంగా భారత్ గుర్తింపు పొందింది. ఆ తర్వాతి స్థానాల్లో చైనా(6,400 కోట్ల డాలర్లు, జీడీపీలో 1 శాతం కంటే తక్కువ),ఫిలిప్పైన్స్ (2,800 కోట్ల డాలర్లు, 10 శాతం జీడీపీ),మెక్సికో (2,500 కోట్ల డాలర్లు, 2 శాతం)నిలిచాయి. * అంతర్జాతీయంగా రెమిటెన్సెస్ మొత్తం గత ఏడాది అధికారిక అంచనాల ప్రకారం 58,300 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. ఈ రెమిటెన్సెస్ 2015లో 58,600 కోట్ల డాలర్లకు పెరగవచ్చు. * పలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు విదేశీ మార క ద్రవ్య నిధులకు మూలం ఈ రెమిటెన్సెస్లే. * విదేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, శ్రామికుల పని, వారు పంపిస్తున్న రెమిటెన్సెస్ ఇరు దేశాల్లో వృద్ధికి ఇతోధికంగా తోడ్పడుతున్నాయి. -
మానవ పురోగతికి మార్గదర్శకాలు
యూఎన్డీపీ మానవాభివృద్ధి నివేదిక-2014 తీవ్ర పేదరికం, కనీస అవసరాలకు కూడా నోచుకోని ప్రజల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను స్పష్టం చేసింది. దీంతో పాటు ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న ఆటంకాల నుంచి బయటపడి, తిరిగి పటిష్టమైన పురోగతి సాధించేందుకు అవసరమైన ప్రతిపాదనలు అందించింది. మొత్తంమీద ఈ నివేదిక బలమైన ఉమ్మడి కృషికి పిలుపునిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా సహకారం, అడ్డంకులను అధిగమించడానికి అవసరమైన దృఢ సంకల్పం ఆవశ్యకతను నివేదిక స్పష్టం చేసింది. వివిధ దేశాల్లో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా అమలుచేస్తున్న జాతీయ కార్యక్రమాలకు మద్దతును పెంచడంతో పాటు సరళీకరణ విధానాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. 2015 తర్వాత రూపొందించే అభివృద్ధి అజెండాలో పొందుపరచే విధంగా అంతర్జాతీయ సాంఘిక భద్రత విషయంలో అంతర్జాతీయ సమ్మతి ఆవశ్యకతను కూడా నివేదిక స్పష్టం చేసింది. పేదరికం-సమస్యలు: ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల మంది (వీరిలో ఎక్కువ మంది అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన వారు) ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆరోగ్యం, విద్య, కనీస జీవన ప్రమాణాలకు నోచుకోని ప్రజలు 150 కోట్లకు చేరుకున్నారు. దాదాపు 80 కోట్ల మంది పేదరిక రేఖ అంచున ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అనేక ప్రాంతాల్లో అసమానతలు కొంతమేర తగ్గినట్లు తెలిపింది. మరోవైపు విద్యారంగంలో ఇంకా అధిక అసమానతలు ఉన్నట్లు స్పష్టం చేసింది. పాతతరం ప్రజలు నిరక్ష్యరాస్యతతో ఇబ్బందిపడుతుండగా, ప్రాథమిక విద్య నుంచి మాధ్యమిక విద్యను అభ్యసించే క్రమంలో యువత సమస్యలు ఎదుర్కొంటోంది. విద్యారంగంలో దక్షిణాసియా, అరబ్ దేశాలతో పాటు సబ్ సహారా ఆఫ్రికా దేశాల్లో అసమానతలు ఎక్కువగా ఉన్నట్లు మానవాభివృద్ధి నివేదిక వెల్లడించింది. 2014 ముందు వెలువడిన మానవాభివృద్ధి నివేదికల ద్వారా అనేక దేశాల్లో ఎక్కువ మంది ప్రజల్లో మానవాభివృద్ధిలో ప్రగతి కనిపించినట్లు వెల్లడికాగా, ప్రస్తుత నివేదిక మాత్రం ప్రపంచ వ్యాప్తంగా జీవన ప్రమాణం, వ్యక్తిగత భద్రత, పర్యావరణం, ప్రపంచ రాజకీయాల్లో అనిశ్చిత వాతావరణం నెలకొన్నట్లు అభిప్రాయపడింది. ఆఫ్రికా దేశాలు- మానవాభివృద్ధి: ఆఫ్రికాలో సంక్షోభాలను నివారిస్తూ సమాజంలో నిర్లక్ష్యానికి గురవుతున్న ప్రజలకు రక్షణ కల్పించడం అనేది సుస్థిర, సమ్మిళిత వృద్ధికి ముఖ్య సాధనంగా నివేదిక పేర్కొంది. సబ్ సహారా ఆఫ్రికాలోని దేశాలు ప్రజల కనీస అవసరాలపై దృష్టిసారించాలి. 2000-13 మధ్య ఆదాయం, విద్య, ఆరోగ్యం తదితర అంశాల్లో సబ్ సహారా ఆఫ్రికా ప్రగతి సాధించింది. ఈ కాలంలో అధిక ప్రగతికి సంబంధించి సబ్ సహారా ఆఫ్రికా మానవాభివృద్ధి సూచీలో రెండో స్థానం పొందింది. రువాండా, ఇథియోపియా వేగవంతమైన వృద్ధి సాధించగా, తదుపరి స్థానాల్లో అంగోలా, బురిండి, మాలి, మొజాంబిక్, యునెటైడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా, జాంబియా ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజల్లో 58.50 కోట్ల మంది (మొత్తం జనాభాలో 72 శాతం) బహుమితీయ (మల్టీ డైమన్షనల్) పేదరికం లేదా తిరిగి పేదరిక రేఖ దిగువకు చేరడానికి అవకాశం ఉన్నవారుగా పేర్కొంది. వీరికి రాజకీయాల్లో భాగస్వామ్యం కాగల సామర్థ్యం పరిమితంగా ఉండటం వల్ల జీవన ప్రమాణ స్థాయిని మెరుగుపరచుకోలేకపోతున్నారు. ఈ ప్రాంతం ఆరోగ్యానికి సంబంధించి ప్రపంచంలో అధిక అసమానతలున్న ప్రాంతమని నివేదిక స్పష్టం చేసింది. ఆదాయం, విద్య, పునరుత్పాదక ఆరోగ్య సేవల అందుబాటు విషయంలో లింగ సంబంధ అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంత దేశాలు చిన్నారులకు తగిన సేవలు, యువతకు ఉపాధి, వృద్ధులకు చేయూత అందించే విధంగా విధానాలు రూపొందించుకోవాలి. ఆర్థిక వ్యవస్థల్లో సంభవించే విపత్తులను నివారిస్తూ ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించినప్పుడే పేదరికం తగ్గి పురోగతి సాధ్యమవుతుందని నివేదిక స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలోని దేశాలు అన్ని రకాల సవాళ్లను అధిగమించాలంటే వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థల నుంచి పారిశ్రామిక, సేవల ఆధారిత వ్యవస్థలుగా రూపాంతరం చెందాల్సిన అవసరముంది. ‘నిర్లక్ష్యం’పై పోరాటం: అధిక పేదరికంతో కనీస అవసరాలకు నోచుకోలేని ప్రజలను తీవ్ర నిర్లక్ష్యానికి గురైన వారిగా పేర్కొనవచ్చు. ఈ పరిస్థితిని విధానాలు, సాంఘిక నియమావళిలో మార్పు ద్వారా తగ్గించనట్లయితే మానవాభివృద్ధి కుంటుపడుతుంది. ప్రభుత్వాలు సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వర్గాల ప్రజలకు అనుకూలమైన విధానాలను, సంస్థాపర సంస్కరణలను అమలు చేయాలి. ప్రపంచ జనాభాలో 80 శాతం మంది ప్రజలకు సమగ్ర సాంఘిక రక్షణ లేదు. దాదాపు 12 శాతం మంది ప్రజలు దీర్ఘకాలంగా ఆకలితో అలమటిస్తున్నారు. ప్రపంచంలోని మొత్తం శ్రామికుల్లో సగం మందికిపైగా అసంఘటిత రంగంపై ఆధారపడి, ఉపాధిపరంగా అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో పరిమిత సామర్థ్యం కలిగిన ప్రజల్లో జీవన ప్రమాణ స్థాయి కుంటుపడింది. అనేక సాంఘికపరమైన అడ్డంకుల వల్ల వారికి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే సార్వత్రిక ప్రమాణాలు రూపొందించుకోవాలి. ఇవి వివక్ష, అసమానతలను తగ్గించేందుకు ఉపయోగపడతాయని నివేదిక పేర్కొంది. పురోగతి దిశగా పయనించాలంటే: సమాజంలోని ప్రజల స్వేచ్ఛకు ఆటంకం కలిగించే అన్ని అడ్డంకులను తొలగించినప్పుడే మానవాభివృద్ధి సాధ్యం. ఆయా అడ్డంకులను ఎదుర్కొనే సామర్థ్యం వారిలో పెంపొందించాలి. దీనికి అవసరమైన చర్యలను నివేదిక సూచించింది. పటిష్ట సాంఘిక భద్రతను పెంపొందిస్తే వ్యక్తుల్లో విపత్తులు, అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొని, పురోగతి సాధించే సామర్థ్యం పెరుగుతుంది. కరువు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో స్వల్పకాల అత్యవసర పరిస్థితిలో భాగంగా సాంఘిక భద్రతా కార్యక్రమాలను అమలు చేసేందుకు పంపిణీ నెట్వర్క్, యంత్రాంగాన్ని ఉపయోగించుకోవాలి. సాంఘిక భద్రత.. ఉత్పత్తిలో ఒడిదుడుకులను తగ్గించడంతో పాటు వ్యయార్హ ఆదాయాలలోని ఒడిదుడుకులను తగ్గిస్తుంది. ప్రజా భాగస్వామ్య పాలన: ప్రజలు ప్రత్యక్షంగా వివిధ కార్యకలాపాల్లో పాల్గొన్నప్పుడు పాలన మెరుగవుతుంది. ప్రజలతో దగ్గరి సంబంధం ఉన్నప్పుడు ప్రభుత్వం.. ప్రజా సమస్యలపై అవగాహన ఏర్పడి, విధానపరమైన జోక్యానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ప్రభుత్వ వనరులు సమర్ధంగా వినియోగమవుతాయని నివేదిక అభిప్రాయపడింది. స్వేచ్ఛ, భద్రత, తమ అభిప్రాయాలను నిస్సంకోచంగా వెల్లడించగలిగే పరిస్థితి ఉంటే అభిలషణీయ నిర్ణయాలు తీసుకునే అవకాశం ప్రభుత్వాలకుంటుంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలు.. వాతావరణంలో మార్పులు, ఆర్థిక సంక్షోభం, సామాజిక అశాంతి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వీటిని అధిగమించాలంటే విధానాల్లో మార్పులతోపాటు విత్త యంత్రాంగం, సంస్థలు తగిన ద్రవ్యత్వాన్ని కలిగి ఉండేలా సిఫార్సులు అవసరం. తద్వారా విత్త వనరుల ప్రవాహంలో ఒడిదుడుకులు తగ్గుతాయి. వ్యవసాయం, సేవల వాణిజ్యానికి సంబంధించిన మార్గదర్శకాల సమీక్ష జరగాలి. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను దేశాలు మెరుగుపరచుకోవాలి. వాతావరణ మార్పులు ప్రపంచ అభివృద్ధి అజెండాకు ముఖ్యమైన సవాలుగా పరిణమించింది. దీనికి సంబంధించి సత్వర చర్యలు అవసరం. సంపూర్ణ ఉద్యోగిత: 50, 60వ దశకంలో స్థూల ఆర్థిక విధానాల లక్ష్యాలకు సంపూర్ణ ఉద్యోగిత కేంద్ర బిందువుగా ఉండేది. 1973, 1979లలో చమురు సంక్షోభం నేపథ్యంలో అవలంబించిన స్థిరీకరణ విధానాల్లో భాగంగా ఇది ప్రాధాన్యం కోల్పోయింది. ప్రస్తుతం తిరిగి దీనికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆర్థిక వ్యవస్థ పురోగతికి మార్గం సుగమం చేయాలని నివేదిక పేర్కొంది. అధిక ఉపాధి కల్పన వల్ల ప్రభుత్వానికి పన్ను రాబడి పెరుగుతుంది. సాంఘిక ప్రయోజనం సాధించే సంపూర్ణ ఉద్యోగితకు ప్రపంచ దేశాలు ప్రాధాన్యమివ్వాలి. దీర్ఘకాల నిరుద్యోగం వల్ల ప్రజల్లో ఆరోగ్య ప్రమాణాలు క్షీణించడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు కుంటుపడతాయని నివేదిక పేర్కొంది. ఉపాధి కల్పన ద్వారా సాంఘిక స్థిరత్వం, ఒకే లక్ష్యంతో పనిచేసే సమాజం ఏర్పడుతుంది. మానవాభివృద్ధి నివేదిక- ప్రగతి: 2013 దత్తాంశాల ఆధారంగా రూపొందిన మానవాభివృద్ధి నివేదిక-2014.. 187 దేశాల మానవాభివృద్ధి సూచీని రూపొందించింది. నివేదిక.. దేశాలను అత్యధిక మానవాభివృద్ధి (49 దేశాలు), అధిక మానవాభివృద్ధి (53), మధ్యస్థ మానవాభివృద్ధి (42), అల్ప మానవాభివృద్ధి చెందిన దేశాలు (43)గా వర్గీకరించింది. మానవాభివృద్ధి సూచీలో నార్వే ప్రథమ స్థానం, ఆస్ట్రేలియా ద్వితీయ స్థానం, స్విట్జర్లాండ్ తృతీయ స్థానం పొందాయి. భారత్ 135వ స్థానంలో నిలవగా, చైనా 91వ స్థానంలో, నేపాల్ 145వ స్థానంలో, పాకిస్థాన్ 146వ స్థానంలో నిలిచాయి. నైజర్ చిట్టచివర 187వ స్థానం పొందింది. భారత్ ప్రగతి: భారత్ మానవాభివృద్ధి సూచీ విలువ 0.586. 187 దేశాల జాబితాలో 135వ స్థానం. గతం కంటే ఒక స్థానం మెరుగుపడిందిఅసమానతలను సర్దుబాటు చేసిన మానవాభివృద్ధి సూచీ విలువ 0.418. కాగా ఈ సూచీకి సంబంధించిన స్థానం, హెచ్‌డీఐకి సంబంధించిన స్థానంలో తేడా శూన్యం.లింగ సంబంధిత అసమానతల సూచీకి సంబంధించి భారత్ విలువ 0.563. కాగా ఈ సూచీకి సంబంధించిన భారత్ స్థానం 127.లింగ సంబంధిత అభివృద్ధి సూచీకి సంబంధించి భారత్ విలువ 0.828. కాగా ఈ సూచీకి సంబం బహుమితీయ పేదరిక సూచీకి సంబంధించి భారత్ విలువ 0.282. భారత్ వెనుకబాటుకు కారణం: యూఎన్డీపీ వివిధ సూచీలు రూపొందించడానికి పరిగణనలోకి తీసుకునే సూచికల్లో (ఐఛీజీఛిౌ్చ్టటట) భారత్ ప్రగతి సంతృప్తికరంగా లేదు. మానవాభివృద్ధి సూచీ రూపొందించడానికి ఉపయోగించే సూచికల ప్రగతిని పరిశీలిస్తే ఆయుర్దాయం 66.4 ఏళ్లు, తలసరి స్థూల జాతీయోత్పత్తి (కొనుగోలు శక్తి సామ్యం ఆధారంగా) 5,150 డాలర్లు. 25 లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారు విద్యను అభ్యసించిన సంవత్సరాల సరాసరి (మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్) 4.4 ఏళ్లుగా నమోదైంది. ప్రపంచంలోని అనేక దేశాలతో పోల్చినప్పుడు ఈ సూచికల ప్రగతి సంతృప్తికరంగా లేదు. లింగ సంబంధిత అసమానతల సూచీకి సంబంధించిన సూచికల ప్రగతిని పరిశీలించినప్పుడు ప్రసూతి మరణాల రేటు ప్రతి లక్ష జననాలకు 200 ఉంది. పార్లమెంటులో మొత్తం సభ్యుల్లో మహిళల వాటా 10.9 శాతంగా ఉంది. లింగ సంబంధిత అభివృద్ధి (జీడీఐ) సూచికలను పరిశీలిస్తే మహిళలలో ఆయుర్దాయం 68.3 ఏళ్లు, పురుషుల్లో ఆయుర్దాయం 64.7 ఏళ్లు, అంచనా వేసిన తలసరి స్థూలజాతీయోత్పత్తి మహిళల్లో రూ.2,277గా, పురుషుల్లో రూ.7,833గా నమోదైంది. బహుమితీయ పేదరిక సూచీ రూపొందించడానికి వినియోగించిన సూచికల ప్రగతిని పరిశీలిస్తే బహుమితీయ పేదరికానికి దగ్గరగా ఉన్న జనాభా 18.2 శాతం, తీవ్ర పేదరికంలో ఉన్న జనాభా 27.8 శాతం, జాతీయ పేదరిక రేఖ 21.9 శాతంగా నమోదైంది. -
మానవాభివృద్ధి సూచీలో 135వ స్థానంలో భారత్
మానవ ప్రమాణాల్లో గతం కన్నా కాస్త మెరుగని యూఎన్డీపీ వ్యాఖ్య బ్రిక్స్ దేశాల్లో అట్టడుగున ఇండియా న్యూఢిల్లీ: మానవాభివృద్ధి సూచిక(హెచ్‌డీఐ)లో భారత్ 135వ స్థానంలో నిలిచింది. ఐక్యరాజ్యసమితికి చెందిన యునెటైడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(యూఎన్డీపీ) గురువారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2013 సంవత్సరానికి గానూ మొత్తం 187 దేశాల్లో భారత్ 135వ స్థానం సాధించింది. అంతకుముందు సంవత్సరం 136వ స్థానం సాధించిన భారత్.. ప్రజల జీవన ప్రమాణాల్లో కాస్త మెరుగుదలను సాధించి 135వ స్థానానికి చేరిందని యూఎన్డీపీ పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. హెచ్డీఐలో 0.586 (0-1 సూచీలో) విలువతో ‘సాధారణ అభివృద్ధి’ని చూపే కేటగిరీ లో భారత్ నిలిచింది. 1980 నుంచి 2013 మధ్య భారతహెచ్డీఐ విలువ 0.369 నుంచి 0.586కు పెరిగింది. 2013లో హెచ్‌డీఐ సూచీలో తొలి మూడు స్థానాల్లో నార్వే(0.944), ఆస్ట్రేలియా(0.933), స్విట్జర్లాండ్(0.917)లు ఉండగా.. ఆరోగ్యకరమైన, దీర్ఘ ఆయుఃప్రమాణం; జ్ఞాన సముపార్జనకు అవకాశాలు; మెరుగైన జీవన ప్రమాణం.. ఈ మూడు కీలకాంశాల్లో ఆయా దేశాల దీర్ఘకాలిక అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుని యూఎన్డీపీ మానవాభివృద్ధి సూచికను రూపొందిస్తుంది. నివేదికలోని ఇతర వివరాలు.. * భారత్ సహా బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలేవీ అధికఅభివృద్ధి సాధించిన దేశాల జాబితాలో లేవు. బ్రిక్స్ దేశాల్లో కూడా భారత్ చివరన ఉంది. బ్రిక్స్దేశాల్లో రష్యా 57వ ర్యాంక్‌తో తొలిస్థానంలో ఉంది. బ్రెజిల్ 79, చైనా 91లో ఉన్నాయి. * కొన్ని దేశాలు మినహా దాదాపు అన్ని దేశాలు గత సంవత్సర ర్యాంకుల వద్దే నిలిచాయి. * భారత్‌లో 1980 - 2013 మధ్య జనన సమయంలో ఆయుఃప్రమాణం 11 ఏళ్లు పెరిగింది. * సాధారణ అభివృద్ధి కేటగిరీలో ఉన్న దేశాల సగటు కూడా భారత్ కన్నా ఎక్కువగా 0.614గా ఉంది. దక్షిణాసియా దేశాల సగటైన 0.588 కన్నా కూడా భారత్ హెచ్‌డీఐ విలువ తక్కువగానే ఉండటం గమనార్హం. * మన పొరుగుదేశాల్లో మనకన్నా తక్కువగా పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు వరుసగా 142, 146 స్థానాల్లో ఉన్నాయి. * లింగ అసమానత సూచీలో(జీఐఐ)నూ భారత్ దిగువలోనే ఉండిపోయింది. జీఐఐని పరిగణనలోకి తీసుకున్న 152 దేశాలకుగానూ 127వ స్థానంలో భారత్ నిలిచింది. * కొత్తగా ప్రారంభించిన ‘స్త్రీ- పురుష అభివృద్ధి(జీడీఐ)’ సూచీలో భారత్‌లోని మహిళల విలువ 0.519 కాగా, పురుషుల విలువ 0.627గా ఉంది. దేశంలోని స్త్రీ, పురుష నిష్పత్తిని తెలిపే సూచీ ఇది.