
క్రమపద్ధతి లేని ఉష్ణోగ్రత, వర్షపాతాల రూపంలో వాతావరణ మార్పు పరిణామాలు అనుభవిస్తున్నాం. ఒక శతాబ్దానికి పైగా, మండుతున్న శిలాజ ఇంధనాలు, అసమానమైన, నిలకడలేని శక్తి, భూవినియోగాల వలన, యావత్ ప్రపంచం మితిమీరి వేడెక్కడానికి దారితీసిందని, వాతావరణ మార్పును పరిశీలించడానికి నియమింపబడిన ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ తన నివేదికలో నిర్ధారించింది. పర్యావరణాన్ని రక్షించడానికి సమగ్రమైన ప్రతిస్పందన, ప్రతి ఒక్కరికీ దానిని రక్షించాలనే భావన అనివార్యం. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ విపరీత పర్యావరణ సవాలును ఎలా ఎదుర్కోవాలనే విషయమై సతమతమవుతున్నాయి. పర్యావరణ రక్షణకు ఉపయోగపడే స్థిరమైన జీవనశైలి, ప్రతి వ్యక్తి తీసుకునే చర్యలు పెద్ద మార్పును తేగలవు.
గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడా నికి తక్షణ, నిశ్చయాత్మకమైన ప్రయత్నాల అవసరం ఎంతైనా ఉంది. దీనికి గాను వాతావరణ నిపుణులు, సర ఫరా, వినియోగ ప్రవర్తన వైపు పరిష్కారాలు ప్రతిపాదించారు.ఇందులో ఉద్గారాలు, వాటి నిర్వహణ, సాంకేతిక ఎంపికలు, జీవనశైలి మొదలైన వాటిని లక్ష్యంగా చేసుకుని, పరిష్కారాలు సూచించారు. వినియోగ నిర్వహణ అనునది, ఉత్పత్తి వ్యవస్థల నుండి వచ్చే ప్రతి కూల పర్యావరణ ప్రభావాలను తగ్గించడం కొరకే గానీ, నాణ్యమైన జీవితం కోల్పోవడానికి కాదనీ వక్కాణించారు. ఈ ప్రయత్నంలో, వ్యక్తిగత ప్రవర్తన ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
మన దేశంలోని నీతి ఆయోగ్, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యూఎన్‌డీపీ) వారిచే సంయుక్తంగా ఒక కార్యాచరణ నివేదిక 2023లో విడుదల అయింది. భారతదేశంతో సహా అనేక దేశాలలో నిర్వహించిన అధ్య యనాల ఫలితాలను క్రోఢీకరించి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఉపయోగపడే ఏడు ముఖ్యమైన అంశాలు ఈ నివేదికలో పొందుపర చారు. వీటిలో నీటి పొదుపు, వ్యర్థాల నిర్వహణ, సుస్థిరమైన ఆహార వ్యవస్థ, ఇంధన సంరక్షణ, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, స్థిరమైన జీవన శైలి, ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ ఉన్నాయి. అన్ని అధ్యయనాలు భారతదేశంలో జరగనప్పటికీ, ఫలితాలు మాత్రం పర్యావరణాన్ని పరిరక్షించడానికి మనకు కూడా వర్తిస్తాయి.
ఆహార రంగం
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆహారాన్ని సక్రమంగా వినిగించు కొని, పంట నుండి వినియోగం వరకు వృథాను తగ్గించాలి. మొక్కల ఆధారిత ఆహారాలను ఎక్కువగా తిని, జంతు ఆధారిత ఉత్పత్తులను తక్కువగా తినడం అలవాటు చేసుకోవాలి. ‘ఆహారాన్ని ప్రేమించు – వ్యర్థాలను ద్వేషించు’ అను నినాదం, ఆహార వృథాను తగ్గించడానికి ఉపయోగపడటంతోపాటు, ఆహారం తయారీ యజమానులలోను, చిల్లర వ్యాపారులలోను, వినియోగదారులలోను గణనీయమైన సాను కూల ఫలితాలను అందించింది. గృహ స్థాయిలో వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించడం వల్ల కంపోస్ట్ తయారీకి దారితీసి, నేల సారాన్ని పెంపొందించడంలో సహాయపడింది. స్థానికంగా పండించిన, కాలానుగుణమైన, ప్రకృతి మరియు సేంద్రీయ పద్ధతిలో పండించిన ఆహారాన్ని వినియోగిస్తున్నవారు, శాకాహారులు, యితర వ్యక్తు లతో పోలిస్తే, తక్కువ తలసరి ప్రతికూల పర్యావరణ ప్రభావాన్ని కలిగిస్తున్నారని ఫలితాలు చూపించాయి.
వ్యవసాయం, భూమి నిర్వహణ పద్ధతులు
ఉత్పాదకతను పెంచడానికి పచ్చిక బయళ్లలో చెట్లను పెంచడం, వార్షిక పంటలతోపాటు చెట్లను పెంచడం, ప్రకృతి వ్యవసాయం పాటించడం, అనగా కంపోస్ట్ ఎరువు వాడకం, కలుపు అణచివేసే కవరు పంటలు వేయడం, రసాయన ఎరువుల వాడకం నిషేధించడం, యితర సహజ/సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు పాటించడం, సారం క్షీణించిన వ్యవసాయ భూమిని పునరుద్ధరించడం,పంట మార్పిడి చేయడం, పంట వేయడానికి నేలను తక్కువసార్లు దున్నడం, డ్రిప్ లేదా స్ప్రింక్లర్ పద్ధతుల ద్వారా పంటలకిచ్చే నీటి విని యోగాన్ని, వృథాను బాగా తగ్గించడం లాంటివన్నీ పర్యావరణ పరిరక్షణకు దారి తీస్తాయి.
నీటికి సంబంధించిన లెక్కలు, తనిఖీ ప్రయోగం విజయవంతమైన వ్యూహంగా నిరూపితమైంది. నీటి విని యోగదారుల సంఘాలను ఏర్పాటు జేసుకోవడం, నీటి సంరక్షణ, వాతావరణ అంచనా కోసం అందుబాటులో ఉన్న సాంకేతికతను స్వీకరించడం వలన నీటి నిల్వను, వినియోగాన్ని మెరుగుపరచు కోవచ్చని ధ్రువీకరించడమై నది. ఆంధ్రప్రదేశ్‌లో, సహజ వ్యవసా యంతో బాటు, రుతుపవనా లకు ముందు అనగా వేసవి కాలంలో పంట వేయడం, స్థిరమైన వ్యవసాయం వైపు ప్రోత్సహించడం దీనికి ఒక ఉత్తమ ఉదాహరణ. ఈ పద్ధతులు నీటి సంరక్షణకు తోడ్పడుతూ, నేల నాణ్యతను సైతం మెరుగుపరుస్తున్నాయి. దీనికితోడు, రసాయన రహిత ఆహార ధాన్యాలను అందిస్తూ, భూమిలో 365 రోజుల పచ్చ దనాన్ని, చల్లటి వాతా వరణాన్ని యిస్తున్నాయి.
రవాణా
కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో రవాణా కీలక పాత్ర వహిస్తు న్నది. పట్టణాలు, నగరాల్లో ప్రయాణించడానికి, ప్రజలు వ్యక్తిగత వాహనాలను ఉపయోగించకుండా ప్రజా రవాణాను ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. బ్యాటరీతో నడిచే వాహనాలను ఉప యోగించడం, గమ్యస్థానాలు చేరుకోడానికి సైకిలు ఉపయోగించడం, సాధ్యమైన చోటల్లా నడవడం, ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది కలిసి వాహనాల్లో వెళ్ళడం, కార్‌పూలింగ్ పద్ధతులను పాటించడం, భౌతిక ఉనికికి బదులుగా వీడియో సాంకేతికతలను ఉపయోగించి టెలిప్రెసెన్స్‌ను పెంపొందించి రవాణా ఖర్చు తగ్గించడం వంటి చర్యలన్నీ కాలుష్యాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. రవాణాలో రద్దీని, ఖర్చును తగ్గించడానికి, సమర్థవంతమైన ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం సహాయపడుతున్నది.
శక్తి సంబంధిత పదార్థాలు
శక్తి వినియోగంలో, పొదుపు ప్రవర్తన పెద్ద సవాలుగా మారింది. భవనం పైకప్పులో సోలార్‌ను అమర్చడం, వేడి నీటి కోసం సోలార్ హీటర్లను అమర్చుకోవడం, ఇంట్లో వెలుతురు, వంట కోసం బయో గ్యాస్ ఏర్పాటు చేసుకోవడం, ఎల్‌ఈడీ బల్బులు ఉపయోగించడం, ఇంధన సమర్థవంతమైన వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలను వాడటం, పైకప్పులో తోటలను పెంచడం పర్యావరణ పరిరక్షణకు గణ నీయంగా దోహదపడతాయి. వంటకు మెరుగైన స్టవ్‌లు (పొయ్యిలు) వాడితే, పొగ స్థాయిలను 55 శాతం వరకు తగ్గించాయని మన దేశంలో చేసిన ప్రయోగాలు నిరూపించాయి.
అవసరమైన వ్యూహాలు
మీడియా ప్రసారాలు, ప్రకటనలు, వార్తాపత్రికలలో కథనాలు అవగాహన స్థాయిని పెంచడంలో సహాయపడతాయి. పర్యావరణ అనుకూల పద్ధతులను పాటిస్తున్న వినియోగదారులను, ప్రభుత్వాలు తగు రీతిలో ప్రోత్సహించి, ప్రశంసిస్తే ఇతరులు కూడా అనుసరిస్తారని పరిశోధనలలో తేలింది. వినియోగదారుల నిర్ణయం ప్రభావితం చేయ డానికి, వస్తువులపై ‘పర్యావరణ అనుకూలమైనది’ అని ముద్రించాలి. వ్యర్థాలు, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, ఆరోగ్యకరమైన జీవనము నకు, స్థిరమైన ఆహార పద్ధతులను స్వీకరించడానికి దోహదపడుతుంది.
పల్చటి ప్లాస్టిక్ కలిగించే ప్రతికూల ప్రభావాలను పాఠశాల పిల్లలకు తెలియబరిచాక, వారిలో గణనీయమైన మార్పు వచ్చింది. ధూమపానం చేసేవారు, తమ సిగరెట్ పీకలను నిర్ణీత ప్రదేశంలో పడ వేసేలా అవగాహన కల్పించాలి. సిగరెట్ పీకలు పర్యావరణంలోకి హానికరమైన రసాయనాలను వెదజల్లి, మైక్రోప్లాస్టిక్‌లుగా విడ దీయడం వల్ల పర్యావరణం కలుషితమవుతున్నది. కుళాయిలలో నీటి ప్రవాహాన్ని తగ్గించడం, నీటి లీకేజీలను ఆపడం, పళ్ళు తోముకునే టప్పుడు కుళాయిని ఆపివేయడం వంటి చర్యల ద్వారా గృహాలలో నీటి ఆదా చేయవచ్చని అధ్యయనాలు వెల్లడించాయి.
వ్యర్థాలను తగ్గించడానికి, చిన్న చిన్న మోతాదులలో వస్తువులను ప్యాకేజి చేయడం, ఒకసారి ఉపయోగించి పారవేయకుండా తిరిగి వాడటం అత్యంత ప్రభావవంతమైన మార్గాలు. సూట్‌కేసులు, ప్రింటర్లు, బూట్లు, వాషింగ్ మెషీన్‌లు సుదీర్ఘ కాలం ఉండేవి కొనుగోలు చేయ డానికి వినియోగదారులు ఇష్టపడతారు, కాబట్టి వీటి జీవితకాలాన్ని ప్రముఖంగా కనబడేటట్లు ముద్రించాలి. తద్వారా వీటి వ్యర్థాలను తగ్గించవచ్చు. మొబైల్, టెలివిజన్, కంప్యూటర్ తయారీదారులు, వాటి వ్యర్థాలను రీసైకిల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి.
పైన చెప్పినట్లుగా, వ్యక్తిగత స్థాయిలో ప్రవర్తన మార్పులు వచ్చి నచో, కచ్చితంగా పర్యావరణాన్ని రక్షించవచ్చు.
డా‘‘ పి. పృథ్వీకర్ రెడ్డి
వ్యాసకర్త హైదరాబాద్‌లోని ‘సెస్’(సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్) సీనియర్ పరిశోధకుడు ‘ prudhvikar@cess.ac.in