కోవిడ్‌ను మించే భూతం... భూతాపం | Sakshi Guest Column Global Warming is more danger than Covid | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ను మించే భూతం... భూతాపం

Published Tue, Oct 8 2024 4:17 AM | Last Updated on Tue, Oct 8 2024 4:17 AM

Sakshi Guest Column Global Warming is more danger than Covid

విశ్లేషణ

రెండేళ్ల పాటు కరోనా వైరస్‌ ప్రపంచ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేసింది. కోవిడ్‌ కల్లోలం సృష్టించిన నష్టం ఈ శతాబ్దంలోనే కాక, మానవ చరిత్ర లోనే ఓ పెనువిషాదం. ఆ పీడకల నుంచి తేరుకొని ఆర్థిక స్థిరత్వం దిశగా అడుగులు వేస్తున్న ప్రపంచానికి మరో పెద్ద సవాలు... ‘గ్లోబల్‌ వార్మింగ్‌’. ఫలితంగా తీవ్రమైన ఎండలు, అంతలోనే వరదలు... మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పెరిగే భూతాపం వ్యవసాయ రంగానికి ప్రథమ శత్రువు. వాతా వరణ మార్పుల వల్ల ఒక్క భారతదేశంలోనే వ్యవసాయ దిగుబడుల్లో ప్రతి యేటా రమారమి 30% క్షీణత నమోదవుతోంది. వాతావరణం మార్పులతో ఎదురవుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొని స్థిరత్వం వైపు ముందుకు సాగాలంటే... అందుకు అనుగుణమైన విధానాలను ప్రభుత్వాలు అనుసరించాలి.

భూతాపం వల్ల సప్త సముద్రాలు వేడెక్కి పోతున్నాయి. మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. 1950 నాటికి హిమాలయాలపై ఘనీభవించిన మంచు నేటికి చాలావరకు కనుమరుగైంది. అంటార్కిటికా సముద్రంలోని మంచు పరిణామం కనిష్ఠ స్థాయికి పడిపోయింది. భారత్‌తో సహా అనేక దేశాలలో శీతాకాలం క్రమంగా ఎండా కాలంగా మారిపోతోంది. మరికొన్ని చోట్ల సముద్ర మట్టాలు పెరిగి సముద్రాలు ముందుకు చొచ్చుకొచ్చి అనేక ద్వీపాలను కబళించి వేస్తున్నాయి. 

వాతావరణ మార్పుల వల్ల మన దేశంలో అధికంగా నష్టపోతున్న రంగాలలో వ్యవసాయం, ఆరోగ్యం ముఖ్యమైనవి. ఒకవైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరుగుదలతో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ వంటి కొన్ని రంగాలు అభివృద్ధిలో అనూహ్యంగా ముందంజ వేస్తుండగా... మరో వైపు నిలకడైన వాతావరణ పరిస్థితులు లేక వ్యవసాయం, తదితర ఉత్పత్తి రంగాలలో భారీ క్షీణత కనిపిస్తోంది. ఈ వైరుధ్యం ప్రజల మధ్య అనేక అసమానతలకు దారితీస్తోంది. 

భారీ వర్షాలు, వరదలతో పేదల ఇళ్లు నేలమట్టం అవుతున్నాయి. ఎలాంటి మౌలిక వసతులకు నోచుకోకుండా లోతట్టు ప్రాంతాల్లో నివసించే పేదల జీవితాలు గాల్లో దీపంలా మారాయి. నివాసం ఉన్న చోట బతికే పరిస్థితి లేకపోవడం వల్ల మనుషులు వలసలు పోవాల్సిన దుఃస్థితి అనేక దేశాలలో నెలకొంది. మరోవైపు ఉష్ణోగ్రత పెరుగుదల, భారీ వర్షాల వల్ల అపసవ్య దిశలో సముద్రపు నీరు పొంగి పంట పొలాల్లోకి, నదీసంగమాల వద్ద నదుల్లోకి ప్రవహి స్తోంది. 

వాతావణ మార్పుల వల్ల జీవ వైవిధ్యం పూర్తిగా గాడి తప్పింది. మారిన వాతావరణ పరిస్థితులకు అలవాటు పడలేక మనుషు లతోపాటు మొక్కలు, జంతుజాలానికి తీవ్రమైన హాని కలుగుతోంది. అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం తాజా నివేదిక ప్రకారం, సుమారు 10 లక్షల వృక్ష, జంతుజాతులు అంతరించే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. 

గత 400 ఏళ్లల్లో 680 వెన్నెముక గలిగిన జాతులు నశించగా, కేవలం గత 2 దశాబ్దాలలోనే అంతకు రెట్టింపు జాతులు నశించాయి. కాలుష్యం, భూవినియోగంలో మార్పులు, వాతావరణంలో చోటుచేసుకుంటున్న అనూహ్య తేడాలు ఇందుకు కారణంగా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. 

భూతాపం, కాలుష్యం కారణంగా మనుషులలో వయస్సుతో సంబంధం లేకుండా అనేక రుగ్మతలు కనపడుతున్నాయి. కేవలం శ్వాస కోశ సంబంధిత వ్యాధులు, గుండె జబ్బులతోనే ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా 87 లక్షల ప్రజలు చనిపోతున్నారు. కాలుష్యం వల్ల అప్పుడే పుట్టిన పసికందులకు కూడా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.

ఒకప్పుడు అగ్ని పర్వతాలు బద్దలు కావడం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఆ తర్వాత పారిశ్రామిక విప్లవం వచ్చాక... బొగ్గు, చమురు, గ్యాస్‌ వంటి శిలాజల ఇంధనాలను మండించడం ఎక్కువయ్యాక వాతావరణంలో కార్బన్‌ డయాక్సైడ్, ఇంకా గ్రీన్‌ హౌజ్‌ వాయువుల కారణంగా కేవలం 150 సంవత్సరాలలో 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్‌ మేర భూతాపం పెరిగింది. సహజ వాయువు వెలికితీత, దాని వాడకం వల్ల బయటపడే మీథేన్‌ కారణంగా మరో 1 డిగ్రీ సెంటిగ్రేడ్‌ వేడిమి పెరిగే అవకాశం ఏర్పడింది.

పెరిగే భూతాపం వ్యవసాయ రంగానికి ప్రథమ శత్రువు. అధిక వర్షాలు, వరదల వల్ల చేతికొచ్చిన పంటల్లో ఉత్పత్తి తగ్గిపోతోంది. ఆహార భద్రతకు అన్ని చోట్లా ప్రమాదం ఏర్పడింది. ఫలితంగా, వ్యవసాయరంగంపై ఆధారపడిన రైతాంగం, అనుబంధ రంగాల కార్మికులకు ఆదాయాలు పడిపోయాయి. 

ఇప్పటికీ 60% ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని రక్షించు కోవాలంటే, అత్యవసర పర్యావరణ కార్యచరణతో ముందుకు సాగ వలసిందే! రుతుపవనాల గమనం, వాతావరణ వైవిధ్యం ఆధారంగా దేశాన్ని 7 జోన్లుగా వర్గీకరించుకొని అందుకు అనుగుణంగా పంటల సాగును నిర్వహిస్తూ వస్తున్న మన దేశంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతాంగానికి కోలుకోలేని దెబ్బ తగులుతోంది. 

పంటలు పుష్పించే కాలంలో విపరీతమైన ఎండలు కాయడం వల్ల విత్తనాలు బలహీనపడుతున్నాయి. ఇది దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపు తున్నది. ఒక అంచనా ప్రకారం వాతావరణ మార్పుల వల్ల ఒక్క భారతదేశంలోనే వ్యవసాయ దిగుబడుల్లో ప్రతియేటా రమారమి 30% క్షీణత నమోదవుతోంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల ధాన్యం, గోధుమ, పప్పుధాన్యాల్లో ఉండే ప్రొటీన్లు నశిస్తున్నాయి. దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తుల్లో పోషకాలు తగ్గిపోతున్నాయి. 

మరోవైపు అధిక ఉష్ణోగ్రతల కారణంగా దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడి పశువులకు అవసరమైన గ్రాసం అందడం లేదు. దాంతో, పశువుల ఎదుగుదల తగ్గి మాంసం ఉత్పత్తి పడిపోతోంది. పశువుల పునరుత్పత్తిపై ప్రతి కూల ప్రభావం చూపడమేకాక పాల దిగుబడి గణనీయంగా తగ్గింది. అధిక వర్షాలు, వరదల వల్ల కోళ్లు, గొర్రెలు, ఇతర పశువులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. 

ఈ యేడాది ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలోనే తెలుగు రాష్ట్రాల్లో రెండు పర్యాయాలు కురిసిన భారీ వర్షాలు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేశాయి. అధిక వర్షాలు, వరదల వల్ల పంట నష్టాలు జరుగు తున్నప్పుడు రైతాంగానికి ప్రభుత్వపరంగా అందుతున్న సాయం అరకొరగానే ఉంటోంది. 

వాతావరణ మార్పులను ముందుగానే అంచనా వేయలేని నేపథ్యంలో... పంటవేసి నష్టపోయే కంటే, పంట వేయకపోతేనే తక్కువ నష్టం అనే భావన చాలా ప్రాంతాల్లోని రైతాంగంలో బలంగా నాటుకుపోయింది. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో రైతులు క్రాప్‌ హాలీడే పాటిస్తున్నారు. ఇందువల్ల దేశ ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. 

భూతాపం తగ్గించడానికి ప్రపంచ దేశాలు ఇప్పటికే అనేక సదస్సులు నిర్వహించాయి, డిక్లరేషన్‌లపై సంతకాలు చేసి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రియో ఒప్పందం, కోపెన్‌హెగన్‌ సదస్సు, క్యోటో ఒప్పందం, కాప్‌ 21 పారిస్‌ ఒప్పందం... ఇలా అనేక విస్తృత వేదికలపై ప్రపంచ దేశాలు భూతాపం తగ్గించడానికి చేసిన ఉమ్మడి ప్రమాణాలు కాగితాలకే పరిమితం కావడం వల్ల ప్రపంచం ప్రమాదంలో పడింది.

అయితే, కొన్ని దేశాలు మాత్రం క్లీన్‌ ఎనర్జీ (స్వచ్ఛమైన ఇంధనం) వాడకం దిశగా ముందుకు సాగడం కొంతలో కొంత ఊరట. శిలాజ ఇంధనాల వాడకాన్ని పక్కనపెట్టి, సున్నా కాలుష్యం వెదజల్లే (నెట్‌ జీరో ఎమిషన్‌) టెక్నాలజీల వైపు పరుగులుపెడుతున్నాయి. 

ఎలక్ట్రిక్, బ్యాటరీ వాహనాల వినియోగాన్ని పెంచడం; మొక్కజొన్న, మరికొన్ని రకాల ఉత్పత్తుల నుంచి ఇంధనాన్ని తయారీ చేయడం; గాలి మరలు, సోలార్‌ ప్యానళ్ల నుంచి విద్యుత్‌ తయారు చేయడం మొదలైన కార్యక్రమాలను పెద్దఎత్తున చేపడుతున్నాయి. 

కొన్ని దేశాలు బయోఎనర్జీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ కాలుష్యాన్ని తగ్గిస్తు న్నాయి. భారత్‌లో కూడా ఎలక్ట్రిక్, బ్యాటరీ వాహనాల వాడకం మొద లైనప్పటికీ వాటి సంఖ్య స్వల్పం. అలాగే, సోలార్‌ ఎనర్జీని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని రాయితీలు ప్రకటించింది. 

వాతావరణం మార్పులతో ఎదురవుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొని స్థిరత్వం వైపు ముందుకు సాగాలంటే... అందుకు అనుగుణమైన విధానాలను ప్రభుత్వాలు అనుసరించాలి. జీవ వైవిధ్యాన్ని కాపాడుకునే విధంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలి. పౌర సమాజంలో చైతన్యాన్ని పెంచాలి. 

ముఖ్యంగా, ఈ అంశంపై వివిధ రాజకీయ పక్షాలలో ఏకాభిప్రాయం, మద్దతు అవసరం. అంతిమంగా పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టినట్లయితేనే ఫలితాలు అందుతాయి. లేకుంటే... కరోనాను మించిన భూతం అయిన భూతాపం వల్ల మరిన్ని కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి.

డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు 
వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement