ఉత్త సక్సెస్‌ కాదు.. గొప్ప సక్సెస్‌ కావచ్చని నిరూపించింది! | Prajakta Koli Becomes UNDP India First Youth Climate Champion | Sakshi
Sakshi News home page

ఉత్త సక్సెస్‌ కాదు.. గొప్ప సక్సెస్‌ కావచ్చని నిరూపించింది!

Published Sat, Jan 22 2022 6:43 PM | Last Updated on Sat, Jan 22 2022 6:53 PM

Prajakta Koli Becomes UNDP India First Youth Climate Champion - Sakshi

యూట్యూబ్‌లో అందరూ వీడియోలు చేస్తారు. కాని ప్రాజక్తా కోలి సరదా వీడియోలతో పాటు బాధ్యత కలిగిన వీడియోలు చేసేది. 
∙ఆడపిల్లల చదువు ∙బాడీ షేమింగ్‌ ∙మానసిక ఆరోగ్యం వీటి పట్ల చైతన్యం కలిగించే వీడియోలు పెద్ద హిట్‌.
65 లక్షల సబ్‌స్క్రయిబర్లు కలిగిన ఒక యువ యూట్యూబ్‌ స్టార్‌గా యువత మీద ఆమె ప్రభావాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించింది. 
యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యు.ఎన్‌.డి.పి)కి మన దేశ ‘తొలి యూత్‌ క్లయిమేట్‌ ఛాంపియన్‌’గా ఎంపిక చేసింది.
యువత బాధ్యత చూపితేమరింత గుర్తింపు తెచ్చే బాధ్యత వస్తుందనడానికి ప్రాజక్తా ఒక ఉదాహరణ. 

గలగలమని పొంగే మాట, నిశితమైన గమనింపు, భళ్లుమనే వ్యంగ్యం, లక్ష్యాన్ని చేరుకునే చురుకుదనం ఉంటే సక్సెస్‌ కావచ్చా? ఉత్త సక్సెస్‌ కాదు గొప్ప సక్సెస్‌ కావచ్చు అని ప్రాజక్తా కోలి నిరూపించింది. తన సరదా వీడియోలతో వ్యక్తుల ప్రవర్తనను, లోకం పోకడలను ఎత్తి చూపే ప్రాజక్తా తొలితరం యూట్యూబ్‌ స్టార్లలో అందరి కంటే అందనంత ఎత్తుకు చేరుకుంది. అందుకే ఐక్యరాజ్య సమితి తన ‘డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌’ కింద పర్యావరణ స్పృహ కలిగించే వివిధ దేశాల యూత్‌ క్లయిమెట్‌ ఛాంపియన్ల ఎంపికలో భాగంగా ప్రాజక్తాను మన దేశం నుంచి తొలిసారిగా ‘యూత్‌ క్లయిమేట్‌ ఛాంపియన్‌’గా ఎంపిక చేసింది. 28 ఏళ్ల ప్రాజక్తా ఇక మీదట మన దేశంలోని యువతలోనే కాదు అనేక దేశాల యువతలో కూడా పర్యావరణ స్పృహ కలిగించడానికి ఇప్పటికే ఐక్యరాజ్య సమితితో కలిసి పని చేస్తున్న లియొనార్డో డికాప్రియో వంటి హాలీవుడ్‌ స్టార్స్‌తో కలిసి పని చేయనుంది. ఒక భారతీయ యువతికి దక్కిన గొప్ప గుర్తింపు ఇది. ‘ఇది నాకు ఇష్టమైన పని. నేను బాగా పని చేయాలనుకుంటున్నాను’ అంది ప్రాజక్తా ఈ సందర్భంగా.

మనం మార్చగలం
‘ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను మనమే తెచ్చాం. మనమే వాటిని పరిష్కరించగలం. నా దృష్టిలో యువత ఈ విషయంలో మొదటి వరుస సైనికులుగా ఉండాలి. యువత తలుచుకుంటే సాధ్యం కానిది లేదు. పర్యావరణ విధ్వంసం వల్ల భవిష్యత్తులో మానవజాతే అంతరించి పోయే పరిస్థితులు వస్తాయి. అలా జరక్కుండా ఉండటానికి మన దేశంలో యువత చైతన్యవంతం కావాలి. అందుకు నేను పని చేస్తాను. అలాగే ప్రపంచ యువత ఆలోచనలను పంచుకుంటాను’ అంది ప్రాజక్తా. (చదవండి: ఆరోజు ఆమె ముందు రెండు మార్గాలు.. చదువు, చావు!)

థానే అమ్మాయి
ప్రాజక్తా మహరాష్ట్రలోని థానేలో పుట్టి పెరిగింది. ముంబైలో చదువుకుంది. తండ్రి మనోజ్‌ కోలీ చిన్న సైజు రియల్టర్‌. తల్లి అర్చన కోలి టీచర్‌. ఈమెకు నిషాంత్‌ అనే తమ్ముడు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ప్రాజక్తా ఉత్త వాగుడుకాయ. స్కూల్లో ప్రతి పోటీలో పాల్గొని మాట్లాడేది. ప్రైజులు కొట్టేది. తమ అమ్మాయి ఇంట్లో, క్లాస్‌రూమ్‌లో వొదిగి ఉండటానికి పుట్టలేదని, స్టేజ్‌ మీద జనాన్ని అలరించడానికి పుట్టిందని అర్థం చేసుకున్న తల్లిదండ్రులు ప్రాజక్తాను బాగా ప్రోత్సహించారు. ఆరవ తరగతిలోనే రేడియో జాకీ అవ్వాలనుకున్న ప్రాజక్తా కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ చేసి ముంబై ‘ఫీవర్‌’ రేడియోలో ఒక సంవత్సరం ఇన్‌టర్న్‌గా చేసింది. కాని ఆ ఉద్యోగం ఆమెకు సంతృప్తి ఇవ్వలేదు. అయితే ఆ సమయంలో గెస్ట్‌గా వచ్చిన హృతిక్‌ రోషన్‌తో ప్రాజక్తా చేసిన ఒక చిన్న వీడియో చూసిన డిజిటల్‌ కంటెంట్‌ ఎక్స్‌పర్ట్‌ సుదీప్‌ లహరీ ‘నీ మాటలో మంచి విరుపు ఉంది. ఇది యూట్యూబ్‌ యుగం. యూ ట్యూబ్‌ చానల్‌ మొదలెట్టు’ అని సలహా ఇచ్చాడు. అలా 2015లో ప్రాజక్తా మొదలెట్టిన యూట్యూబ్‌ చానల్‌ ‘మోస్ట్‌లీసేన్‌’.

మోస్ట్‌లీసేన్‌
‘మోస్ట్‌లీసేన్‌’ చానల్‌లో అన్నీ తానుగా ప్రాజక్తా వీడియోలు చేసి రిలీజ్‌ చేస్తుంది. అంటే వీడియోలో ఆమె ఒక్కతే రకరకాల పాత్రలుగా కనిపిస్తుంది. అందుకు ఆమె తాను గమనించిన మనుషుల ప్రవర్తనలను ముడి సరుకుగా చేసుకుంటుంది. ‘మనకు తెలిసిన 10 రకాల టీవీ ప్రేక్షకులు’, ‘పది రకాల విద్యార్థులు’, ‘వీరండీ మన ఇరుగు పొరుగు’, ‘మన అమ్మలు... వారి చాదస్తాలు’... ఇలా టాపిక్‌ తీసుకుని ఆ పాత్రలన్నీ తానే ధరిస్తుంది. ఈ వీడియోల్లో తమను తాము చూసుకున్న ప్రేక్షకులు వెంటనే సబ్‌స్క్రయిబర్లుగా మారారు. ఒక్క సంవత్సరంలోనే లక్ష మంది సబ్‌స్క్రయిబర్‌లను పొందింది ప్రాజక్తా. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 65 లక్షలకు చేరింది. వారంలో మూడు వీడియోలు ఆమె విడుదల చేస్తే యూట్యూబ్‌ ద్వారా బోలెడు ఆదాయం వచ్చి పడుతోంది.

మిషేల్‌ ఒబామాతో కాఫీ
ప్రాజక్తా కేవలం ఈ వీడియోలే కాదు. ఆమె స్త్రీల పక్షపాతి. అమ్మాయిలు బాగా చదవాలని దాదాపుగా అన్ని వీడియోల్లో చూపుతూ చెబుతూ ఉంటుంది. హేట్‌ టాక్, బాడీ షేమింగ్, సైబర్‌ బుల్లీయింగ్‌ తదితర దుర్లక్షణాల మీద కటువైన వ్యంగ్యంతో చేసిన వీడియోలు ఆమెకు గౌరవం తెచ్చి పెట్టాయి. ‘ఐ ప్లెడ్జెడ్‌ టు బి మీ’ అనే పేరుతో ఆమె చేసిన కాంపెయిన్‌ చాలామంది అమ్మాయిలకు ఆత్మవిశ్వాసం ఇచ్చింది. ఇవన్నీ ఆమెకు అవార్డులు, పెద్ద పెద్ద సంస్థల సోషల్‌ కాంపెయిన్‌లో భాగస్వామ్యాలు తెచ్చి పెట్టాయి. న్యూఢిల్లీలో ఆమె మిషేల్‌ ఒబామాతో కాఫీ తాగి కబుర్లు చెప్పే స్థాయికి ఎదిగింది. అంతే కాదు యూట్యూబ్‌ సిఇఓ సుజేన్‌ వూను ఇంటర్వ్యూ చేయగలిగే ఏకైక భారతీయ యూట్యూబర్‌గా ఎదిగింది. ఇవన్నీ ఆమె తన ఆకర్షణీయమైన మాటతోనే సాధించింది.

యువత తన కెరీర్‌ కోసం కష్టపడాలి. తప్పదు. దాంతో పాటు సామాజిక బాధ్యత చూపిస్తే ప్రాజక్తాలా గొప్ప గొప్ప బాధ్యతలు వరిస్తాయి. జీవితంలో సక్సెస్‌ను అలా కదా చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement