2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో కులాంతర వివాహాలు 5.82 శాతం మాత్రమే. అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం గత నలభయ్యేళ్ళుగా కులాంతర వివాహాల శాతం అదేమాదిరిగా కొనసాగడం. భారత దేశ వివాహ వ్యవస్థలో కుటుంబ నిర్ణయాలే ప్రధానం. మనదేశంలో జరుగుతోన్న పెళ్ళిళ్లలో వ్యక్తిగత ఇష్టాయిష్టాలకంటే కుటుంబ నిర్ణయాలకే ప్రాధాన్యత ఎక్కువ. 2011 లెక్కల ప్రకారమే మన దేశంలో 73 శాతం పెళ్ళిళ్ళు పెద్దలు కుదిర్చినవే. వీరిలో అతి కొద్దిమందికి మాత్రమే తాము చేసుకోబోయే వారితో కనీస పరిచయం ఉంటోంది. 63 శాతం మంది పెళ్లి రోజు వరకూ ఒకరినొకరు చూసుకోనివారే ఉన్నారు. అయితే తాజా అధ్యయనం మాత్రం తల్లి చదువు కులాంతర వివాహాలకు ఊతమిస్తోందని తేల్చి చెప్పింది.
తల్లి చదువు కులాంతర వివాహాలకు ప్రోత్సాహం...
భారత్‌లో కులాంతర వివాహాలను అమితంగా ప్రభావితం చేస్తోన్న అంశం చదువేనని తాజా అధ్యయనం తేల్చి చెప్పింది. అయితే కులాంతర వివాహాల సానుకూలతను సృష్టిస్తోంది పెళ్ళికొడుకు చదువో, పెళ్ళికూతురు చదువో అనుకుంటే పొరబడ్డట్టే. పెళ్ళి కుమారుడి తల్లి విద్యావంతురాలైతే కులాంతర వివాహాలకు కుటుంబాల్లో సానుకూలత ఏర్పడుతున్నట్టు ఢిల్లీకి చెందిన ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ తాజా అధ్యయనం తేల్చి చెప్పింది. 2011-12 ఇండియన్ హ్యూమన్ డెవలప్‌మెంట్ సర్వే-2 గణాంకాల ఆధారంగా 2017లో చేసిన ఈ అధ్యయనం మనదేశంలోని కులవ్యవస్థ కు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తెచ్చింది. అందులో వరుడి తల్లి విద్యాస్థితి కులాంతర వివాహాలపై ప్రభావితం చూపుతోందని వెల్లడించింది. అందుకు కారణం కుటుంబ బాధ్యతలు మోస్తోన్న చదువుకున్న తల్లులు కులాల కట్టుబాట్ల విషయంలో మరింత చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నట్టు ఈ అధ్యయన వెల్లడించింది.
వరుడి తల్లి విద్యాధికురాలైతే కులాంతర వివాహాల్లో దేశం పదేళ్ళ ముందుంటుందని ఈ సర్వే తేల్చింది. పెళ్ళికొడుకు తల్లి చదువుకున్న కుటుంబాల్లో 1.8 శాతం కులాంతర వివాహాలు జరిగినట్టు వెల్లడయ్యింది. అయితే పెళ్ళి కూతురి తల్లి చదువు కులాంతర వివాహాలను ప్రభావితం చేయడం లేదన్నది గమనార్హం.
కుటుంబాల మధ్యనా, దగ్గరి బంధువుల మధ్యనా, సంబంధీకుల మధ్య వివాహాల్లో మన దేశానికీ ఇతర దేశాలకీ పోలిక లేదని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. దీనికి కారణం మనదేశంలో కుటుంబ వ్యవస్థ పునాదులు బలీయమైనవి కావడమేననీ, కుటుంబాల్లో వ్యక్తిగత స్వేచ్ఛకు అంత ప్రాధాన్యత లేకపోవడం కూడా ప్రధాన కారణంగా ఈ సర్వే వెల్లడించింది.
సహజంగా పారిశ్రామికీకరణ, విద్యాభివృద్ధీ, పట్టణీకరణ, సామాజిక చైతన్యం వల్ల దగ్గరి సంబంధాల వివాహాలు తగ్గి, కులాంతర, వర్గాంతర వివాహాలు పెరుగుతాయని భావిస్తారు. కానీ వీటన్నింటిలో అభివృద్ధి కనబడుతున్నా 1970 నుంచి 2012 వరకు సుదీర్ఘకాలంలో కులాంతర వివాహాలు మాత్రం పెరగకపోవడాన్ని బట్టి మోడర్నైజేషన్ థియరీ తప్పని తేలింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలకంటే మెట్రోపాలిటన్ సిటీస్‌లో కులాంతర వివాహాలు తక్కువని కూడా స్పష్టమైంది.
పెళ్ళి కొడుకు, పెళ్ళికూతురి తరఫు ఆర్థిక స్థోమత సైతం కులాంతర వివాహాలను ప్రభావితం చేయడంలేదు. పైగా ఆర్థిక స్థోమత పెరిగే కొద్దీ కులాంతర వివాహాలు తగ్గుతున్నాయి. దళితుల్లో ఆర్థిక స్థోమత పెరిగే కొద్దీ కులాంతర వివాహాలు పెరుగుతున్నాయి. అగ్రకులాల్లో ఆర్థిక స్థోమత పెరిగే కొద్దీ కులాంతర వివాహాలు తగ్గుతున్నట్టు అధ్యయనం తేల్చి చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment