Inter Caste Marriages
-
మాంసం ముట్టకూడదు.. మద్యం సేవించ కూడదు.. మార్పు మంచిదే..
మాంసం ముట్టకూడదు.. మద్యం సేవించ కూడదన్నది ఆ ఊరివాళ్ల ఆచారం. అలాంటి ఆచారాన్ని పాటించే వారితోనే పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవాలని పూర్వమే నిర్ణయించారు. దానినే ఆచారంగా.. కట్టుబాటుగా నిన్నమొన్నటి వరకు పాటిస్తూ వచ్చారు. తమ కులం వారు తగినంత మంది లేకపోవడం.. దూర ప్రాంతాల్లో అదే కులానికి చెందిన వ్యక్తులు ఉన్నప్పటికీ వారు మాంసం, మద్యం ముట్టుకుని ఉంటారేమోననే భయం వారిని మేనరిక వివాహాల చట్రంలోకి నెట్టేసింది. ఫలితంగా ఉన్న ఊళ్లోనే దశాబ్దాలుగా మేనరికం వివాహాలు చేసుకుంటున్నారు. ఇదే భావితరాలకు శాపంగా పరిణమించింది. ఇప్పుడా గ్రామంలోని యువతరం మారుతోంది.. తమ కులస్తుల బతుకులను మార్చేందుకు కృషి చేస్తోంది. సాక్షి ప్రతినిధి, కడప: ఆ ఊరి పేరు మడూరు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలోని తొండూరు మండలంలో ఉంది. గ్రామంలో 200 గడపలు ఉండగా.. 1,200 మందికి పైగా జనాభా ఉంది. అంతా సాతాని (బీసీ–డీ) కుటుంబాల వారే. అక్కడ ఒక్కరు కూడా మాంసం ముట్టరు. మద్యం సేవించరు. అది పూర్వం నుంచీ వస్తున్న ఆచారం. కట్టుబాటు తప్పితే కుటుంబం అభివృద్ధి చెందదనేది వారి భయం. ఇప్పటికీ గ్రామంలోకి మాంసాన్ని అనుమతించరు. మద్యాన్ని కూడా సేవించరు. మాంసం తినే ఇతర సామాజిక వర్గాల వారు గ్రామంలోకి వచ్చినా.. వారిని ఇంట్లోకి రానివ్వరు. మంచాలపై కూర్చోనివ్వరు. బయట నుంచే మాట్లాడి పంపేస్తారు. తమ జీవిత భాగస్వాములుగా వచ్చేవారు.. వారి కుటుంబాలు కూడా మద్యం, మాంసాన్ని ముట్టకూడదన్నది వారి నియమం. సాతాని కులస్తులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా తగినంత మంది లేకపోవడం.. ఒకవేళ ఉన్నా బయటి ప్రాంతాల వారైతే మాంసం ముట్టుకుని ఉంటారేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. దీంతో ఉన్న ఊళ్లోనే దశాబ్దాల తరబడి మేనరికం వివాహాలు చేసుకుంటున్నారు. ఇదే భావితరాలకు శాపంగా మారింది. మేనరికాల వల్ల బిడ్డలు బుద్ధి మాంద్యం, అంధత్వం, ఇతర వైకల్యాలతో పుడుతున్నారు. గ్రామంలో ప్రతి ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు ఏదో ఒక వైకల్యంతో బాధపడుతున్నవారే. ఎవరెన్ని చెప్పినా.. మేనరికం వల్లే బిడ్డలు వైకల్యం బారినపడుతున్నారని వైద్య, ఆరోగ్య సిబ్బంది ఎన్నిసార్లు చెప్పినా గ్రామస్తులెవరూ వినిపించుకోలేదు. ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినా పెడచెవిన పెడుతూ వచ్చారు. దీంతో ఆ కుటుంబాల్లో పుట్టిన బిడ్డల జీవితాలు బుగ్గి పాలయ్యాయి. కొందరు మంచానికే పరిమితం కాగా.. మరికొందరు ఏ పనీ చేయలేక జీవచ్ఛవాలుగా మారారు. చూపు కోల్పోయినవారు కొందరైతే.. మాట్లాడలేని.. మాటలు వినలేని వారు ఇంకొందరు. పులివెందుల, కడప, కర్నూలు, అనంతపురం, హైదరాబాద్, చెన్నై ప్రాంతాల్లోని ఎన్ని ఆస్పత్రులు తిరిగినా.. ఎంత సొమ్ము వెచ్చించినా వారి సమస్యలు నయం కాలేదు. ఓ ఇంట్లోఇద్దరు సోదరులు చనిపోగా.. మరో ఇంట్లో 22 ఏళ్ల వయసులో నిర్జీవంగా పడివున్న ప్రశాంత్.. ఇంకో కుటుంబంలో పుట్టుకతోనే చూపు కోల్పోయిన స్వర్ణలత.. వరలక్ష్మి, వెంకటశేషయ్య, మూగవారిగా బతుకీడుస్తున్న సంతోష్, కల్యాణి, వైకల్యంతో అవస్థలు పడుతూ బీటెక్ చదువుతున్న అరుణ్, పుట్టుకతోనే బుద్ధిమాంద్యంతో బతుకీడుస్తున్న ఐదేళ్ల ఐశ్వర్య, 26 ఏళ్ల వయసొచ్చినా చిన్నపిల్లాడిగానే కనిపించే సాయిరామ్ వంటి వారెందరో గ్రామంలో ఉన్నారు. వారిలో ఏ ఒక్కరిని చూసినా మనసు చెదిరిపోతుంది. గుండె తరుక్కుపోతుంది. ఇప్పుడిప్పుడే మార్పొస్తోంది నాలుగైదు సంవత్సరాలుగా మడూరు యువతలో మార్పు కనిపిస్తోంది. కొందరు చదువుకున్న యువకులు బయట ప్రాంతాల వారిని వివాహం చేసుకుంటున్నారు. మరికొందరు కులాంతర వివాహాల వైపు మొగ్గు చూపుతున్నారు. గ్రామానికి చెందిన వెంకట నారాయణ, పల్లె ఎద్దులకొండయ్య, పల్లె సూర్యనారాయణ, జి.రామానాయుడు, ఎ.రమేష్, పల్లె నవీన్, పల్లె శ్రేష్ట, ఎం.నాగలక్ష్మి తదితరులు ఉన్నత చదువులు చదివారు. వీరిలో కొందరు బయటి ప్రాంతాల వారిని వివాహం చేసుకున్నారు. తమ గ్రామానికి చెందిన కొందరు కులాంతర వివాహాలు సైతం చేసుకుంటున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎవరిపైనా ఆంక్షలు పెట్టడం లేదని బయటి ప్రాంతాల్లోని సాతాని కులస్తులను వివాహం చేసుకున్నా.. చివరకు కులాంతర వివాహాలు చేసుకున్నా అనుమతిస్తున్నామని మాజీ సర్పంచ్ ప్రకాశరావు చెప్పారు. నెల్లూరు నుంచి వచ్చా మాది నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం మిట్టపాలెం గ్రామం. తొండూరు మండలం మడూరు గ్రామానికి చెందిన శివగణేష్ నన్ను వివాహం చేసుకున్నారు. నేను దూర ప్రాంతం నుంచి వచ్చినా.. చాలా బాగా చూసుకుంటున్నారు. గతంలో మడూరు గ్రామంలోనే వివాహాలు చేసుకునే వారు. పుట్టిన పిల్లలు వైకల్యం బారిన పడుతుండటంతో బయటి ప్రాంతాల వారిని వివాహాలు చేసుకుంటున్నారు. – ఎస్.పవిత్ర, యువతి, మడూరు కలిసికట్టుగా ఉంటాం మేమంతా ఒకే కులస్తులం. అందరం కలిసికట్టుగా ఉంటాం. గతంలో అందరూ ఇక్కడి వారినే వివాహాలు చేసుకునేవారం. ఏదైనా సమస్య వచ్చినా ఓర్పుతో కలిసికట్టుగా కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకుంటాం. గతంలో మేనరిక వివాహాలు చేసుకోవడం వల్ల గ్రామంలో దాదాపు 50శాతం వైకల్యం ఉండేది. ఇప్పుడు దూర ప్రాంతాలైన నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు తదితర ప్రాంతాల వారిని వివాహాలు చేసుకోవడం వల్ల వైకల్యం తగ్గింది. – గోపాల్, సర్పంచ్, మడూరు -
కులాంతర వివాహాలు శాస్త్రబద్ధమే
భారతీయ సమాజంలో ఇప్పుడు కుల, మతాలకు అతీతంగా విందులూ, వినోదాల్లో పాల్గొనడం కొంతమేర పెరిగింది. అయినా వివాహ బంధాలతో కులాన్నీ, మతాన్నీ చెరిపి వేయలేకపోతున్నారు. ఇటువంటి వారందరిపైనా హిందూ పురాణాలు, ఇతిహాసాల ప్రభావం ఎక్కువ. అయితే ఈ గ్రంథాల్లోనే అనేకమంది రుషులు కులాంతర, జాత్యంతర వివాహాలు చేసుకున్నట్లు ఉన్నా... నిజ జీవితంలో మాత్రం కులాంతర వివాహాలకు అంగీకరించకపోవడం విడ్డూరం. పైగా కృష్ణుడు వంటి దేవుళ్లను చూపించి... దేవుళ్లకే కులం బాధ తప్పలేదు మనమెంత అని తప్పించుకుంటూ ఉంటారు. ఇది అన్యాయం. నిజానికి కులాంతర వివాహాలు అత్యంత శాస్త్రీయమైనవని శాస్త్రజ్ఞులు అంటున్నారు. దేశంలో కుల దురంహంకార జాడ్యం ప్రమాదకర సమస్యగా మారిందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రేమ వివాహాల విషయంలో విపరీతమైన వధ జరుగుతోంది. డా‘‘ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగంలో రూపొందించిన కుల నిర్మూలనా భావన ఆధిపత్య కులాలకు అర్థం కావడం లేదని చంద్ర చూడ్ ఆవేదన చెందారు. పవిత్ర హత్యల వెనక మతోన్మాద, కులో న్మాద భావనలున్నాయి. కులం... వర్ణ వ్యవస్థ నుండి జనించింది. వర్ణాలను కొందరు ఆధిపత్యం కోసం సృష్టించారు. తమ పిల్లలు అణగారిన వర్గాల నుండి వచ్చిన వారిని ప్రేమ వివాహాలు చేసుకోవడాన్ని వీళ్ళు తట్టుకోలేక పోతున్నారు. వర్ణాన్ని బట్టి కులాన్నో, జాతినో నిర్ణయించడం అశాస్త్రీయమైన విషయం. కుల వ్యవస్థ మీద అత్యంత పరిశోధనలు చేసిన జె.హెచ్. హట్టన్ ‘ది క్యాస్ట్ ఇన్ ఇండియా’లో క్యాస్ట్ గురించి ఈ విధంగా అన్నారు. ‘‘క్యాస్ట్ అను మాట, ‘కాస్ట’ అను పోర్చుగీసు శబ్దము నుండి వచ్చింది. ‘కాస్ట’ అను శబ్దము ‘చాలు’, ‘జాతి’, ‘రకము’ అను పదముల అర్థమును తెలుపును. ఆ భాషలో ‘హోమెండీ బోయ కాస్ట’ అను పద సమూహమునకు ‘మంచి కుటుంబములోని మనిషి’ లేక ‘కులీనుడు’ అని అర్థము’’. 1563లో గార్సియాడి ఓర్టా ‘‘తన తండ్రి నుండి ఎవడూ మారడు, చెప్పులు కుట్టు కులం వారంతా ఒకటే’’ అని రాసిన నాటి నుండి ఈ ‘కాస్ట’ మాటను మనమిప్పుడు గ్రహించిన పరిమితమైన ‘‘కులం (క్యాస్టు)’’ అర్థములో వాడుతున్నట్టు కనిపిస్తున్నది. కులాన్ని నిచ్చెనమెట్ల సమాజంగా రూపొందించారని అంబేడ్కర్ తన ‘కుల నిర్మూలన’ గ్రంథంలో పేర్కొన్నారు. ఒక కులం అబ్బాయి మరొక కులం అమ్మాయిని చేసుకోవటం సామాన్యమైన విషయం. లేని కులం కోసం ఉన్న బిడ్డల్ని చంపుకోవటం అమానుషమైన విషయం. అందుకే అంబేడ్కర్ ఇలా అన్నారు... ‘ఇండియాలో వివిధ కులాల మధ్య వర్ణాంతర వివాహాల ద్వారా జాతి మిశ్రణ, రక్త సమ్మేళన జరగనిస్తే వచ్చిన హాని ఏమున్నది? మృగాలకు, మనుష్యులకు మధ్య అనంతమైన భేదం ఉన్నది గనుక మృగాలు, మనుష్యులు రెండు భిన్న రకాల జాతులు సంతతకి చెంది ఉన్నట్లు విజ్ఞానశాస్త్రం అంగీకరించింది. జాతుల స్వచ్ఛతలో నమ్మకం ఉన్న శాస్త్రజ్ఞులు కూడ మనుషుల్లోని వివిధ జాతులు భిన్న రకాల జాతుల సంతతి అని అనడం లేదు. ‘‘వారంతా ఒకే సంతతికి చెందిన పలు జాతులు. సర్వజాతుల మానవులూ ఏక జీవాల సృష్టే కనుక ఆయా జాతుల మధ్య అంతః సంయోగం వల్ల కలిగే సంతానం మానవులదే కానీ గొడ్డుది కాజాలదు.’’ కులాంతర వివాహాలపై ద్వేషం పెరగడానికి కారణం మత మౌఢ్యం, కులతత్వం అని అంబేడ్కర్ ఈ విధంగా చెప్పాడు.. ‘మొత్తం భరత ఖండం అంతటా హిందువుల జీవిత విధానాన్ని చూస్తే వారి ఆచార వ్యవహారాలలో, ఆలోచనలో ఒక విధమైన పోలిక ఉంది కాబట్టి, ఈ ఏకత్వానికిది తార్కాణమని వాదిస్తారు. పోలికలున్న మాట నిజమే అయితే తత్కారణంగా హిందువులు ఒక సమాజంగా ఏర్పడి ఉన్నారని చెప్పే వాదాన్ని ఎవ్వరూ అంగీకరించరు. అలా అంగీకరించడం అంటే సమాజ నిర్మాణ ప్రాతిపదికల్ని అపార్థం చేసుకోవడమే. మానవులు భౌతికంగా దగ్గర దగ్గరగా నివసిస్తున్నంత మాత్రాన వారు ఒక సమాజంగా ఉన్నట్టు కాదు. మరొక విషయం ఏమిటంటే మానవులు ఒక సమాజంగా నిర్మాణం కావాలంటే ఆచార వ్యవహారాలలోను, సంప్రదాయాలలోను, విశ్వాసాలలోను, ఆలోచన లోను పోలికవుంటే చాలదు. ఏ వస్తువైనా ఇటుకల వలె భౌతికంగా ఒకరి చేతుల నుంచి మరొకరి చేతులలోకి పోవచ్చు. ఒక వర్గానికి చెందిన ఆచారాలు, సంప్రదాయాలు, నమ్మకాలు, భావాలు మరొక వర్గం వారిచే స్వీకరించబడవచ్చు. అప్పుడా రెండు వర్గాల మధ్య పోలిక కన్పించవచ్చు. సంస్కృతి అనేది ఎల్లప్పుడూ వికసిస్తూ విస్తరి స్తూనే ఉంటుంది.’’ కులాంతర వివాహాలది శాస్త్రీయ బంధమే అని మానవ పరిణామ శాస్త్రవాదులు నిరూపించారు. ఇప్పుడైతే జాత్యంతర వివాహాలు కూడా ముమ్మరంగానే జరుగుతున్నాయి. వాటిని అంగీకరిస్తున్నారు. కులాంతర వివాహాల్లోనూ అస్పృశ్యులుగా చెప్పబడుతున్న దళితుల వివాహాలనే ఎక్కువగా వ్యతిరేకిస్తున్నారు. కారణం వారి మనసుల్లో పేరుకు పోయిన దళిత వ్యతిరేక భావన. రిజర్వేషన్ల వల్ల విద్యావంతులు అవుతున్నారనే ద్వేషం కూడా ఉంది. నిజానికి దళితులు చేసుకునే వివాహాలన్నీ సక్సెస్ అవుతున్నాయి. కారణం వారిలో ప్రేమ, అభిమానం, ఆత్మీయత, అనురాగం, రక్షణ వంటి అంశాలు మిక్కుటముగా ఉండటమే. దళిత విద్యావంతులకు సామాన్యంగా కుల భేదాలు ఉండవు. వారు ప్రేమ వివాహాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే పగ, ద్వేషం, క్రౌర్యం, హింస, అవమానం, నిరాకరణ అమ్మాయి తల్లిదండ్రుల నుంచి వారికి ఎదురవుతున్నాయి. నిజానికి ప్రేమ వివాహాల్లో కట్నాలు ఉండవు. నిరాకరణ ఉండదు. యువతి యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది ఒక శాస్త్రీయమైన భావన. వీరు ఎవరి గ్రంథాలు అయితే చదివి ఈ కుల వర్ణ ద్వేష భావాలు పెంచుకున్నారో ఆ రుషులంతా కులాంతర వివాహాలు చేసుకున్నారు. హిందువుల సాహిత్యం నిండా కులాల చరిత్రను గురించి రాసి ఉంటుంది. అందులో ఒక కులాన్ని ఉత్తమ జన్మగాను, మరొక కులాన్ని నీచ జన్మగాను చిత్రించే యత్నం జరిగినట్టు కన్పిస్తున్నది. ఈ రకమైన సాహిత్యంలో ‘సహ్యాద్రి ఖండం’ అనేది పేరు పొందిన గ్రంథం. కులం అనేది ఒక సంస్కృతి కాదు, ఒక మతం కాదు, అది ఒక నమ్మకం. బాబాలు, యోగులు, స్వాములు, గురువులు వివిధ కులాల నుండి వచ్చి ఎలా బోధ చేయగలుగుతున్నారు. ఇదివరకు కొందరికి పరిమితమైన ఈ వేదాంత బోధ అందరికీ ఎలా సాధ్యమైంది. అలాగే వివాహం కూడా ఏ కులం వారైనా ఇంకొక కులం వారిని చేసు కోవచ్చు. మంచి సంతానం కనవచ్చు. ఈ కులాన్ని పోషించడానికీ హిందూమతం తన శక్తిని రంగరించి పోసింది. కరుణరసానికి పెట్టింది పేరైన రామాయణంలో శంబూకుడు ఈ కులం ముద్రతోనే చంపబడ్డాడు. ఇకపోతే భారతంలో ద్రోణుడు ఏకలవ్యుని విద్యా సంపత్తిని కులం పేరుతో అనర్హుడుగా ప్రకటించి దోచుకున్నాడు. కాని ధర్మశాస్త్రం ప్రకారం ద్రోణుడు ఉత్తమ బ్రాహ్మణుడై కూడా తన విద్యను పొట్ట కూటికి అమ్ముకున్నాడు. కులగోత్రాలు లేని పాండవులకు విద్య చెప్పడంలో లేని ధర్మ ప్రసక్తి ఏకలవ్యునికి విద్య చెప్పడంలో ఎందుకు వచ్చిందో అర్థం కాదు. అయితే ఈ పురాణాలు బహుముఖాలుగా ప్రచారమై, పురాణ పురుషులకే, కులధర్మం తప్పలేదు, మనమెంత? అనే భావానికి సమాజాన్ని తీసుకొచ్చాయి. గీతను ప్రవచించి కులాన్ని మానవ ధర్మంగా నిర్దేశించిన కృష్ణుడు కులం పేరుతో రాజసూయయాగంలో శిశుపాలుని చేత నిలవేయబడ్డాడు. హరిశ్చంద్రుడు కులం కోసం రాజ్యాన్ని, భార్యని, కుమారుని చివరకు తన్నుతాను అమ్ముకున్నాడు. అయితే ఇవన్నీ పురాణ గాథలే. ఇవన్నీ సత్యాలు కావు. కాని భారతీయ హృదయ పేటికల మీద ముద్రవేయబడ్డ వాళ్ళు వీళ్ళే కదా! నిజానికి కులాంతర వివాహమే శాస్త్రీయ బంధం. కులం పెళ్లిలో అశాస్త్రీయత ఎక్కువ వుంది. పిల్లలు సరిగా పుట్టరు. మేధలో కూడా తేడా వస్తుంది. జీన్స్ మారితేనే శాస్త్రీయ బంధం రూపొందుతుంది. ఇప్పుడు యువత ఎక్కువ మంది కులాంతర సంస్కృతి జీవనం వైపు, బంధం వైపు నడవడం భారత రాజ్యాంగబద్ధ జీవన విధానానికి ఆయువు పోసినట్టే. భారత రాజ్యాంగ ఆచరణే జీవన సాఫల్యం. చరిత్రతో నడవడం కాదు, చరిత్రను మారుద్దాం. (చదవండి: అంబేడ్కర్ చూపుతోనే సోషలిజం!) - డాక్టర్ త్తి పద్మారావు దళిత ఉద్యమ నేత -
కుల, మతాంతర వివాహాలు.. ‘పిల్లలకంటే కులమే ఎక్కువైంది’
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: కుల, మతాంతర వివాహం చేసుకున్న వారికి రక్షణ లేకుండా పోయిందని, తల్లిదండ్రులే పిల్లలను చంపేస్తున్నారని, వారికి పిల్లల కంటే కులమే ఎక్కువైందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి ఆవేదన వ్యక్తం చేశారు. సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో మహిళా, ట్రాన్స్‌జెండర్ సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో ‘కుల, మతాంతర వివా హాలు–హత్యా రాజకీయాలు’ అనే అంశంపై శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం జరి గింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న జస్టిస్ రాధారాణి మాట్లాడుతూ.. సమాజంలో రోజు రోజుకు కులతత్వం పెరిగి పోతోందన్నారు. కుల, మతాంతర వివాహా లు చేసుకున్న వారిని హత్య చేస్తున్న నింది తులను చట్టప్రకారం శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా త్వరిత గతిన శిక్ష పడాలని అందరు కోరుకుంటు న్నప్పటికీ అందుకు సరిపడా న్యాయమూ ర్తులు లేరని ఆమె చెప్పారు. ప్రజల ప్రాథ«మిక హక్కులను కాపాడాల్సిన, ప్రేమ వివాహం చేసుకున్న వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్య త ప్రభుత్వంపై ఉందన్నారు. బాధితురాలు అవంతిక మాట్లాడుతూ ‘కుల, మతాంతర వివాహాలు చేసుకుంటే... బతికే హక్కు లేదా?’ అని ప్రశ్నించారు. ఆరు నెలలుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నా ఇంత వరకు శిక్ష పడలేదని, ముందుగా న్యాయ వ్యవస్థలో మార్పు రావాలని ఆమె అన్నారు. పీవోడ బ్ల్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు‡ రమా మెల్కొటే, పద్మజాషా పాల్గొన్నారు. -
‘ప్రేమ పెళ్లి’కి ప్రోత్సాహం
భద్రాచలంఅర్బన్: ఈ రోజుల్లో ప్రేమ పెళ్లిళ్లు సాధారణం అయ్యాయి. ఇందులో కులాంతర వివాహాలే ఎక్కువగా ఉంటున్నాయి. చాలా మంది తల్లిదండ్రులు ఈ పెళ్లిళ్లను అంగీకరించకపోవడంతో ఇల్లు వదిలి బయట జీవిస్తున్న జంటలే అధికం. అలాంటి వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. కుల రహిత సమాజాన్ని నిర్మించేందుకు ఇలాంటి పెళ్లిళ్లను ప్రోత్సహిస్తోంది. అయితే దంపతుల్లో ఒకరు తప్పకుండా దళితులై ఉండాలి. అలా చేసుకున్న వారికి రూ.2.50 లక్షల నగదు అందిస్తోంది. గతంలోరూ.50 వేల సాయం అందించేవారు. గత నవంబర్‌లో ప్రభుత్వం ఈ మొత్తాన్ని పెంచింది. అయితే జిల్లాలో ఇలాంటి వివాహాలు చేసుకున్న వారు చాలా మంది ఉన్నా.. దీని గురించి తెలియక దరఖాస్తు చేసుకోవడం లేదు.ఈ పథకం 1980 నుంచే అమల్లో ఉంది. నాడు కులాంతర వివాహం చేసుకున్న జంటలకు రూ. 3,000 అందించేవారు. 1993లో రూ.10 వేలకు పెంచారు. 2011లో రూ.50 వేలు చేశారు. గత నవంబర్ నుంచి రూ. 2.50 లక్షలు అందిస్తున్నారు. పెళ్లయిన మూడేళ్ల తర్వాత ఈ మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేస్తారు. ప్రభుత్వ సాయాన్ని రూ.50 వేలకు పెంచిన తర్వాత జిల్లాలో 84 జంటలు దరఖాస్తు చేసుకోగా, 73 జంటలకు సాయం అందింది. ఇంకా 11 జంటలకు రావాల్సి ఉంది. ప్రభుత్వ సాయం రూ. 2.50 లక్షలకు పెంచిన తర్వాత 15 దరఖాస్తులు రాగా, 2 జంటలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయి. కులాంతర వివాహం చేసుకున్న జంటకు బాండ్ అందజేస్తున్న ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ (ఫైల్) దరఖాస్తు చేయడం ఎలా..? ఈ పథకం కోసం దంపతులు తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలి. వధూవరుల ఫొటోలు, ఇద్దరి కుల, ఆదాయ, వయస్సు, వివాహ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంక్ జాయింట్ అకౌంట్, వివాహానికి సాక్షులుగా ఉన్నవారి వివరాలను జతచేస్తూ ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. ఆ తర్వాతే అదే దరఖాస్తును జిల్లా కేంద్రంలోని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యాలయంలో అందించాలి. అధికారులు వాటిని పరిశీలించి అర్హులైన జంటలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. అనంతరం లబ్ధిదారులకు రూ. 2.50 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ అందిస్తారు. మూడేళ్ల తర్వాత డబ్బులు చేతికొస్తాయి. అవగాహన కల్పిస్తున్నాం కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం అందించే ప్రోత్సాహకం గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం. ఈ మొత్తాన్ని రూ.2.50 లక్షలకు పెంచిన తర్వాత రాష్ట్రంలో మొదట లబ్ధి పొందిన జంట మన జిల్లావారే. గత నవంబర్ నుంచి ఇప్పటివరకు మొత్తం 15 దరఖాస్తులు వచ్చాయి. అందులో రెండు జంటలకు ప్రోత్సాహక ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు అందించాం. మూడేళ్ల తర్వాత నగదు తీసుకోవచ్చు.– వెంకటేష్, జిల్లా షెడ్యూల్డ్ కులాలఅభివృద్ధి అధికారి. -
కులాంతర వివాహాలు చేసుకునే వారికి గుడ్‌న్యూస్
ప్రభుత్వం కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తోంది. కుల రహిత సమాజాన్ని నిర్మించడంతోపాటు అంతరాలను చెరిపేయాలనే లక్ష్యంతో కులాంతర పెళ్లిళ్లు చేసుకున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ప్రస్తుత సమాజంలో యువతీ యువకుల కులాంతర వివాహ నిర్ణయానికి తల్లిదండ్రులు అడ్డు చెప్పకపోవడం, ప్రభుత్వం కూడా వీటిని మరింతగా పెంచాలనే ఉద్దేశంతో ప్రోత్సాహక నగదును రూ.50వేల నుంచి రూ.2.50లక్షలకు పెంచింది. దీంతోపాటు ప్రోత్సాహకాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. – సాక్షిప్రతినిధి, ఖమ్మం సాక్షి, ఖమ్మం : జిల్లాలో కులాంతర వివాహాలు సాధారణమయ్యాయి. గతంలో కులం ఒకటే అయినా శాఖ భేదాలతో పెద్దలు సంబంధాలు కుదుర్చుకునేవారు కాదు. తమ శాఖకు చెందిన వారినే పెళ్లి చేసుకోవాలనే పట్టింపు ఉండేది. మారుతున్న పరిస్థితుల్లో అలాంటి పట్టింపులన్నీ పట్టు విడుస్తున్నాయి. కులం, శాఖ భేదమే లేకుండా యువతీ యువకులు కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు. అభిరుచులు, అభిప్రాయాలు కలిసినట్లయితే పెద్దలను ఒప్పించి మరీ మనువాడుతున్నారు. పెద్దలు కాదన్న పక్షంలో పోలీసులను ఆశ్రయించి పెళ్లి చేసుకుంటున్నారు. (మీ అమ్మాయి అలాంటి అమ్మాయి..) రూ.50వేల నుంచి రూ.2.50లక్షలకు.. కులాంతర వివాహం చేసుకున్న జంటలను కొన్ని కుటుంబాలు మొదట్లో ఆదరించకపోయినా ఆ తర్వాత దగ్గరకు తీస్తున్నాయి. మరికొన్ని జంటలను దూరంగా పెడుతుండటంతో కుటుంబ పోషణ కొంత భారంగా మారే అవకాశం ఉంటోంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం కులాంతర వివాహం చేసుకున్నజంటలకు నగదు ప్రోత్సాహం అందిస్తూ వస్తోంది. అయితే ఆ ప్రోత్సాహం కల్యాణలక్ష్మి పథకం కన్నా తక్కువగా ఉండటంతో కులాంతర పెళ్లిళ్లు చేసుకున్న జంటలు ఇబ్బంది పడుతున్నాయి. దీంతో మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆ మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2011 వరకు కులాంతర వివాహం చేసుకున్న జంటకు ప్రోత్సాహకం రూ.10వేలు ఇచ్చిన ప్రభుత్వం 2012 నుంచి రూ.50వేల చొప్పున అందజేస్తోంది. (బుల్లెట్‌పై వంటలు.. రుచి చూడాల్సిందే!) ప్రోత్సాహకాలు ఇలా.. కులాంతర వివాహాలు చేసుకుంటున్న యువతకు ప్రభుత్వం అండగా నిలబడి ప్రోత్సాహకాలు అందిస్తోంది. వేర్వేరు కులాలకు చెందిన యువతీ యువకులు పెళ్లి చేసుకుంటే వారి వివాహానికి సంబంధించిన ఆధారాలతో జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకుల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. పూర్తి ఆధారాలనుబట్టి అధికారులు విచారణ చేసి ప్రోత్సాహకాలకు అర్హులుగా గుర్తించి ప్రభుత్వానికి నివేదిస్తారు. తర్వాత జంటలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. (నాన్నా మళ్లీ వస్తా..) దరఖాస్తుకు అవసరమైనవి ఇవీ.. ► వివాహం చేసుకున్న జంట ఫొటోలు మూడు ►తహసీల్దార్ జారీ చేసిన ఇద్దరి కుల ధ్రువీకరణ పత్రాలు ►వయసు ధ్రువీకరణ కోసం విద్యా సంస్థల నుంచి ఇచ్చిన టీసీ, పదో తరగతి మార్కుల మెమో ►వివాహం చేయించిన అధికారి ద్వారా పొందిన వివాహ ధ్రువీకరణ పత్రం ►గెజిటెడ్ అధికారి ద్వారా పొందిన ఫస్ట్ మ్యారేజి సర్టిఫికెట్ ►వివాహం చేసుకున్న జంట కలిపి తీసిన బ్యాంక్ అకౌంట్ వివరాలు ►వివాహానికి సాక్షులుగా ఉన్న వారి వివరాలు ► ఆదాయ ధ్రువీకరణ పత్రం ► ఆధార్ కార్డు ►రేషన్ కార్డు ప్రోత్సాహకాలను పెంచిన ప్రభుత్వం.. కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను పెంచింది. గతంలో రూ.50వేల ప్రోత్సాహకం అందిస్తుండగా, రూ.2.50లక్షలకు పెంచుతూ నిర్ణయించింది. కులాంతర వివాహాల ప్రోత్సాహకాలపై యువతకు అవగాహన కల్పిస్తున్నాం. పెళ్లి చేసుకుని ప్రోత్సాహకాల కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే వాటిని పరిశీలిస్తున్నాం. అర్హులైన జంటలను గుర్తించి తక్షణమే ప్రభుత్వానికి నివేదికలు అందించి ప్రోత్సాహకాలు మంజూరయ్యేలా చూస్తున్నాం. జంటలు దరఖాస్తుకు జతపరిచిన బ్యాంక్ అకౌంట్ నంబర్‌కు ఆన్లైన్ ద్వారా నిధులను జమ చేస్తున్నాం. – కె.సత్యనారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు -
మీ అమ్మాయి అలాంటి అమ్మాయి..
అమ్మాయికి 29 ఏళ్లు వచ్చాయి.ఉద్యోగం చేస్తోంది.చాలా సంబంధాలు వస్తున్నాయి.కాని చేసుకోను అంటోంది?ఎందుకు అని అడిగితేమూడు కారణాలు చెబుతోంది.ఏమిటి ఆ కారణాలు?అసలు కారణం ఎక్కడ దాగుంది? ప్యాంట్ వేసుకుంటే ప్రవల్లిక చక్కగా కనిపిస్తుందని ఆమె ఆఫీస్‌లో ఫిమేల్ కలీగ్స్ అంటారు. ప్రవల్లిక కొంచెం పొడగరి. జుట్టు కూడా పొడవుగా ఉంటుంది. నడుస్తూ ఉంటే చూడబుద్ధేసేలా ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో మూడు షిఫ్ట్‌లలో డ్యూటీ ఉంటుంది. ఏ షిఫ్ట్ డ్యూటీలో అయినా ప్రవల్లిక అలసట కనపడనివ్వక తాజాగా ఉంటుంది. అలాంటి ప్రవల్లికను పెళ్లి చేసుకోవాలని ఎవరికి ఉండదు? కాని ఆ అమ్మాయి మాత్రం పెళ్లికి దూరం.పెళ్లా? నాకా? అని నవ్వేస్తుంది. ప్రవల్లిక వాళ్ల ఇల్లు గచ్చిబౌలిలో ఉంటుంది. ప్రవల్లిక తర్వాత ఇద్దరు ఆడపిల్లలు. ఒక అమ్మాయి పి.జి. చేస్తోంది. ఒక అమ్మాయి బి.టెక్ చేస్తోంది. ముగ్గురు ఆడపిల్లలు ఇంట్లో కళకళలాడుతూ ఉంటారు. తండ్రి లెక్చరర్. తల్లి గృహిణి. ముగ్గురి పెళ్లిళ్ల కోసం ప్రత్యేకంగా సేవింగ్స్ చేసి ఉన్నారు. కాని ప్రవల్లిక వైఖరి వాళ్లకు అర్థం కాకుండా ఉంది. ‘పెళ్లి చేసుకోవే’ అని తల్లి అడిగితే–‘అదేంటమ్మా.. అలా అంటావ్. ఇంటికి పెద్ద కూతురిని. నిన్నూ నాన్నను చూసుకోవాల్సిన దాన్ని. నాకు పెళ్లి వద్దు... ఏమీ వద్దు’ అని అంటుంది.మరోసారి నాన్న అడుగుతాడు– ‘ఏమ్మా.. పెళ్లి చేసుకోవా? మా కొలిగ్ వాళ్ల అబ్బాయి ఉన్నాడు’ అనంటే ‘ఏం పెళ్లిలే నాన్నా... ఎన్ని చూడటం లేదు. ఏవీ సజావుగా సాగడం లేదు. అన్నీ ఏవో ఒక కంప్లయింట్లలో నడుస్తున్నాయి. ఆ కంప్లయింట్లలో నన్నూ పడమంటావా?’ అంటుంది. ఇంకోసారి ఇద్దరు చెల్లెళ్లు అడుగుతారు ‘పెళ్లి చేసుకో అక్కా’ అని.అప్పుడేమో ‘మగాళ్లు సరిగ్గా ఉంటే కదా చేసుకోవడానికి. వాళ్లు శరీరానికి ఇంపార్టెన్స్ ఇస్తారు తప్ప మనసుకు కాదు. స్త్రీ మనసుకు విలువ ఇచ్చే రోజులు వచ్చినప్పుడు చేసుకుంటాను’ అంటుంది.తల్లిదండ్రులకు ఇదంతా వొత్తిడిగా ఉంది. ఇంట్లో పెద్దమ్మాయికి పెళ్లయితేనే తర్వాతి ఇద్దరూ కదులుతారు. కాని ఈ అమ్మాయి ఇలా అంటోంది. ఇప్పుడెలా? రోజులు గడిచే కొద్దీ ప్రవల్లికలో హుషారు పోతోంది. ఆ మెరుపు పోతోంది. నవ్వు పోతోంది. మూడీగా మారిపోతోంది. ఏమిటో.. ఏమయ్యిందో... ఇంట్లో వాళ్లకు అర్థం కావడం లేదు. పెళ్లి గురించి వొత్తిడి తెస్తున్నందుకు ఇలా చేస్తున్నదా? అని వారికి సందేహం వచ్చింది. తల్లిదండ్రులు ఇద్దరూ సంప్రదించుకుని ఆమెతో ‘సరేలేమ్మా... నీకు పెళ్లి ఇష్టం లేకపోతే మానెయ్’ అన్నారు.‘అంటే నేను పెళ్లే లేకుండా బతకమంటారా?’ అని భోరున ఏడ్వడం మొదలుపెట్టింది.దాంతో ఇంకా తికమకపడిపోయారు తల్లిదండ్రులు.ప్రవల్లిక ఏదో సమస్యతో బాధపడుతోంది. ఏంటా సమస్య అని సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు. ముందు ప్రవల్లిక సైకియాట్రిస్ట్ దగ్గర ఏమీ ఓపెన్ కాలేదు. ఆ తర్వాత మెల్లగా తన గురించి చెప్పడం మొదలెట్టింది. ‘సార్. మాకు అన్నం నీళ్లు లేకపోయినా పర్వాలేదు.. కులం ఉండాలి. మా నాన్న, అమ్మ ఎప్పుడూ కులం గురించే మాట్లాడుతుంటారు. చిన్నప్పటి నుంచి కులం గొప్పతనం చెబుతుంటారు. ఆ కులంలో పుట్టినప్పుడు ఆ కులాన్ని గౌరవించకుండా ఎలా ఉంటాం. అంతమాత్రాన ఇతర కులాలతో మనకు స్నేహం అక్కర్లేదా? అదొక్కటే కాదు.. ప్రేమలు, వేరెవరో ప్రేమించి చేసుకోవడం ఇవి చాలా తప్పు అని, ప్రమాదం అని పదే పదే చెబుతూ పెంచారు. మా బంధువుల్లో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చాలా చూశాను. అందరూ సఫర్ అవుతున్నారు. అలాగని ప్రేమ పెళ్లిళ్లు గొప్పవని కాదు. కాని కనీసం ఎంతో కొంత మన ఎంపిక ఉంటే బాగుంటుంది కదా. మా ఆఫీస్‌లో ఒకతను చాలా మంచివాడు. కష్టపడి పైకి వచ్చాడు. నేనంటే ఇష్టం ప్రదర్శిస్తుంటాడు. కాని ఆ సంగతి తెలియనట్టే నేనుంటాను. ఎందుకంటే అతడిది వేరే కులం. వేరే కులం కుర్రాడితో పెళ్లి మా ఇంట్లో సాధ్యం కాదు. కాని అతడు ప్రేమిస్తున్న సంగతి నాకు తెలుసు. ఆ మాట నాతో చెప్పనంత వరకూ నేను బాగానే ఉన్నాను. కాని మొన్న చెప్పి, పెళ్లి చేసుకుందాం అన్నాడు. అప్పటి నుంచి నాకు డిప్రెషన్ మొదలైంది. నేను నో చెప్తే అతడు వేరొకరిని పెళ్లి చేసుకుంటాడు. ఎస్ చెప్తే ఇంట్లో ఇబ్బందులొస్తాయి. అందుకే నాకు డిప్రెషన్ వచ్చేసింది’ అంది ప్రవల్లిక. సైకియాట్రిస్ట్‌కు సమస్య అర్థమైంది.‘నీకు అతన్ని పెళ్లి చేసుకోవాలని ఉందా?’ అని అడిగాడు.‘ఉంది’ అందా అమ్మాయి.‘చేసుకుంటావా?’‘కాని మా అమ్మా నాన్నలను వొదులుకోలేను’‘నేను వాళ్లతో మాట్లాడతాను’ అన్నాడు సైకియాట్రిస్ట్. ‘మీ అమ్మాయి అంటే మీకు ఎక్కువ ఇష్టమా... మీ కులం అంటే మీకు ఎక్కువ ఇష్టమా?’ అడిగాడు సైకియాట్రిస్ట్ ప్రవల్లిక తల్లిదండ్రులను.వాళ్లిద్దరూ ముఖం ముఖం చూసుకున్నారు.‘మా అమ్మాయే ఇష్టం’ అన్నారు. ‘కాని మీ అమ్మాయికి మీకు మీ కులమే ఇష్టం అనే భావన ఉంది. చూడండి... ప్రతి కులానికి మన సొసైటీలో ఒక స్థానం ఉంది. సంస్కృతి ఉంది. ఎవరి కులాలను వారు గౌరవించుకుంటారు. కాని మన కులాన్ని, కుటుంబ సంప్రదాయాన్ని గౌరవించే ఎదుటి కులాలు కూడా ఉంటాయి. ఎదుటి కులాల మనుషులు మనతో, మనం ఎదుటి కులాల మనుషులతో పరస్పర అంగీకారంతో సంబంధాలు కలుపుకోకపోతే సమాజం నడుస్తుందా? మీ అమ్మాయి వేరే కులం అబ్బాయిని ప్రేమించింది. కాని మీరేమనుకుంటారోనని లోలోపల కుమిలిపోతోంది. చాలామంది అమ్మాయిలు తల్లిదండ్రులు ఎవరిని తెస్తే వారిని చేసుకోవచ్చు. కాని కొందరు అంత సులువుగా స్పందించరు. మీ అమ్మాయి అలాంటి అమ్మాయి. ఎంతో నచ్చితే తప్ప పెళ్లి దాకా రాదు. ఆ అబ్బాయి యోగ్యుడు. 29 ఏళ్ల అమ్మాయి అతనితో వెళ్లి పెళ్లి చేసుకోవచ్చు. కాని మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉండటం వల్లే మీ అంగీకారంతో చేసుకోవాలనుకుంటోంది’ అని ఆగాడు సైకియాట్రిస్ట్. ప్రవల్లిక తల్లిదండ్రులకు తమ తప్పు అర్థమైంది. ‘సార్... ఏదో అందరిలాగా ఆలోచించాముగాని అమ్మాయి జీవితమే నాశనమవుతుందంటే కులాన్ని పట్టుకు ఊగులాడతామా? మా అమ్మాయి కోరిన అబ్బాయికే ఇచ్చి చేస్తాము సార్’ అన్నారు. ఆ తర్వాత ప్రవల్లిక పెళ్లయిపోయింది.వారిది పెద్దలు కూడా ఆనందించే ప్రేమ వివాహం అయ్యింది. – కథనం: సాక్షి ఫ్యామిలీఇన్‌పుట్స్ డాక్టర్ కల్యాణచక్రవర్తి సైకియాట్రిస్ట్ -
ఆదర్శ వివాహాలకు నజరానా పెంపు
సాక్షి, తాండూరు(రంగారెడ్డి) : కులాంతర వివాహాలకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తోంది. ఎస్సీలకు చెందిన యువతీ, యువకులను వివాహం చేసుకున్న వారికి నజరానా పెంచింది. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. జిల్లాలో ఎస్సీ కులాంతర వివాహాల ప్రోత్సాహకాల అమలు బాధ్యతలను జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారులకు అప్పగించారు. గతంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రూ.50 వేల ప్రోత్సాహకం అందేది. ప్రస్తుతం రూ.2.50 లక్షలకు పెంచారు. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలు సమాజంలో పరిమాణాలను దీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎస్సీలకు బాసటగా నిలుస్తోంది. జంటకు రూ.2.50లక్షల ప్రోత్సాహక అవార్డును అందించనున్నారు. ఇందుకు సంబంధిత శాఖ అధికారులు మార్గదర్శకాలను జారీ చేశారు. కులాంతర వివాహం చేసుకున్న జంటలు ప్రోత్సాహకం పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ ఈ పీఏఎస్ఎస్.సీజీజీ జీఓవీ.ఇన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అర్హతలివీ.. ► ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వధువు, లేదా వరుడు కులాంతర వివాహం చేసుకొని ఉండాలి. ► వధువు, వరుడు రూ.2లక్షలలోపు ఆదాయం కలిగి ఉండాలి. ► గత అక్టోబర్ 30 తర్వాత చేసుకున్న కులాంతర వివాహాలకు ఈ ఇన్సెంటివ్ అవార్డును అందించనున్నారు. కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు.. ► కులాంతర వివాహ ప్రోత్సాహక అవార్డుకు ధ్రువీకరణ పత్రాలు తప్పని సరిగా జతపర్చాలి. ఇద్దరికీ సంబంధించిన ఆధార్‌కార్డులు జత చేయాలి. ► వధూవరులు బ్యాంకులో జాయింట్ అకౌంట్ కలిగి ఉండాలి. ► వధూవరుల కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఉండాలి. ► వివాహం జరిగినట్లు రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రాలు ఉండాలి. ► కులాంతర వివాహం చేసుకున్నట్లు సాక్షుల ఆధార్ కార్డులు సైతం జత చేయాలి. ► వధూవరుల పూర్తి చిరునామాను పొందు పర్చాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి వికారాబాద్ జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన యువతి యువకులు కులాంతర వివాహం చేసుకుంటే ప్రభుత్వం నుంచి రూ.2.50లక్షల ప్రోత్సాహక అవార్డు అందుతుంది. గత అక్టోబర్ 30 తర్వాత వివాహం చేసుకున్న జంటలు అర్హులు. వివాహ రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రంతో పాటు కుల, ఆదాయ పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. విచారణ చేసిన అనంతరం నజరానాను వారి జాయింట్ అకౌంట్లో జమ చేస్తాం. – విజయలక్ష్మి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి, వికారాబాద్ జిల్లా -
ప్రేమ వివాహం.. అల్లుడిపై దాడి చేసిన మామ
సాక్షి, ఆసిఫాబాద్: జిల్లాలో పరువు హత్య కలకలం సృష్టించింది. కుమార్తె వేరే కులం వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకోవడాన్ని తట్టుకోలేకపోయిన ఓ తండ్రి.. అల్లుడిని హత్య చేసేందుకు కత్తితో దాడి చేశాడు. వివరాలు.. తిర్యాని మండలం నాయకపు గూడాకు చెందిన నవీన్, కావ్యలకు మూడు నెలల క్రితం ప్రేమ వివాహం జరిగింది. అయితే ఇది కులాంతర వివాహం కావడంతో కావ్య తండ్రి వీరి వివాహాన్ని అంగీకరించలేదు. అంతేకక అల్లునిపై కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం కావ్య తండ్రి, నవీన్‌పై కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న నవీన్‌ను గమనించిన స్థానికులు తిర్యాని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. కావ్య తండ్రి కోసం గాలిస్తున్నారు. -
పెళ్లిళ్లను కాటేస్తున్న కుల తేడాలు
సాక్షి, న్యూఢిల్లీ : ‘కులాంతర వివాహాన్ని, అందులోను దళితుడిని పెళ్లి చేసుకున్నందుకు నన్ను, నా భర్త అజితేష్ కుమార్‌ను నా తండ్రి చంపాలనుకుంటున్నారు. నా తండ్రి నుంచి మమ్మల్ని కాపాడండి!’ అంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజేష్ మిశ్రా కూతరు సాక్షి మిశ్రా ఓ వీడియో ద్వారా అప్పీల్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెల్సిందే. ఇలా ఆమె పిలుపునివ్వడం కొత్త కావచ్చేమోగానీ, కులాంతర వివాహాల కారణంగా ‘పరువు’ పేరిట హత్యలు కొనసాగడం మన భారత దేశంలో ఏమాత్రం కొత్త కాదు. చదవండి: ‘వాళ్లు మమ్మల్ని కచ్చితంగా చంపేస్తారు’ గుజరాత్లో అగ్రవర్ణానికి చెందిన అమ్మాయిని చేసుకున్నందుకు ఓ దళితుడిపై సోమవారం అత్తింటివారు దాడి చేసి హత్య చేశారు. తమిళనాడులో కులాంతర వివాహం చేసుకున్నందుకు ఓ గర్భవతి, ఆమె భర్తను గురువారం నరికి చంపేశారు. ఒకే కులానికి చెందిన వారిని పెళ్లి చేసుకోకపోవడం ఈ ఆధునిక సమాజంలో కూడా నేరంగా పరిగణిస్తున్నారు. ఈ కారణంగా తమ కడుపు చించుకు పుట్టిన బిడ్డల్నే తల్లిదండ్రులు అన్యాయంగా కడతేరుస్తున్నారు. భారత ఉప ఖండంలో 2000 నుంచి 3000 సంవత్సరాల మధ్య కాలంలోనే కుల వ్యవస్థ వేళ్లూనుకుంది. ఒక్క భారత దేశంలోనే జన్యుపరంగానే నాలుగు వేల కులాలు ఉన్నాయి. ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో మార్పులు చోటుచేసుకున్న నేటి ఆధునిక రోజుల్లో కూడా కుల వ్యవస్థను దెబ్బతీయలేక పోతున్నామని ఢిల్లీలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన త్రిదీప్ రే, ఆర్కా రాయ్ చౌధురి, కోమల్ సహాయి కులాంతర వివాహాలపై నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. గ్రామీణ ప్రాంతాలకన్నా పట్టణ ప్రాంతాల్లో కులాంతర వివాహాలు జరగడం కొంత ఆశ్చర్యంగా ఉంది. పారిశ్రామీకరణ పెరిగినప్పటికీ కుల వ్యవస్థలోగానీ, అంతర్ కుల వివాహాల్లోను పెద్దగా మార్పులు రావడం లేదని కుముదిని దాస్, కైలాస్ చంద్ర దాస్, తరుణ్ కుమార్ రాయ్, ప్రదీప్ కుమార్ త్రిపాఠిలు నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. చదవండి: ఏజ్ గ్యాప్, ఇన్‌కం కారణంగానే.. పారిశ్రామికంగా తమిళనాడు ఎంతో పారిశ్రామికంగా అభివద్ధి చెందినప్పటికీ అంతర్ కుల వివాహాలు 87 శాతం. ఇది దేశంలోనే ఎక్కువ. ఇప్పటికీ దేశంలో కులంతర వివాహాలు కేవలం 5.8 శాతమే. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 2001 నుంచి 2011 మధ్య ప్రతి 20 వివాహాల్లో 19 వివాహాలు ఒకే కులాల మధ్య జరిగాయి. జీవన ప్రమాణాల విషయంలోను కులాల మధ్య ఎంతో తేడా ఉంది. అగ్రకుల బాలుడికన్నా దళిత బాలుడు ఏడాదిలో మరణించే అవకాశం 42 శాతం ఎక్కువ కాగా, అగ్రకుల మహిళ సగటు జీవన ప్రమాణం 59.5 సంవత్సరాలుకాగా, దళిత మహిళా జీవించే ఆయు ప్రమాణం 39.5 సంవత్సరాలు మాత్రమే. భారత దేశం సాంకేతికంగా ఎంతో అభివద్ది చెందిందనడానికి తమకు వాటిల్లనున్న ముప్పు గురించి సాక్షి మిశ్రా దంపతులు తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే నిదర్శనం. అయినప్పటికీ కుల వ్యవస్థతో ఉన్న ముప్పు ఇప్పట్లో పోయేలా లేదు. అప్పటి వరకు కులాంతర వివాహాలు చేసుకున్న శాక్షి మిశ్రా లాంటి వాళ్లు తల్లిదండ్రులకు దొరకనంత దూరంగా పారిపోవాల్సిందే! -
నాన్నను మా అమ్మ ‘... మనిషి’ అని కులం పేరుతో తిట్టేది!
అయితే ఈ కథనం.. కులాంతర వివాహాల గురించి కాదు. పరువు హత్యలు జరిగినప్పుడు కులపట్టింపులపై జర్నలిస్టులు సంధించే ప్రశ్నల గురించి! ‘ఈ ధోరణి సరికాదు’ అని ఒక వెబ్‌సైట్‌కు రాస్తూ, తన తల్లిదండ్రుల జీవితాల్ని సమాజం ముందు పరిచారు ఆ అజ్ఞాత మహిళా జర్నలిస్టు. ‘‘మా తల్లిదండ్రులది ప్రేమ వివాహం. మా అమ్మ సంప్రదాయ నేత పనివారి కుటుంబంలో పుట్టింది. మా తాతయ్య దర్జీగా పనిచేసేవాడు. పేదరికం గురించి ఏమాత్రం ఆలోచించకుండా, మా అమ్మని 1970 ప్రాంతంలో చదువుల కోసం మద్రాసు విశ్వవిద్యాలయానికి పంపాడు. అమ్మ బాగా చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించి తన ఆరుగురు తోబుట్టువులకు అండగా ఉంటుందని భావించాడు తాతయ్య. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే బాగానే ఉంటుంది. అక్కడ చదువుకునే రోజుల్లోనే అమ్మకి మా నాన్నతో పరిచయం ఏర్పడింది. నాన్న దళిత కుటుంబానికి చెందినవాడు. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు, వివాహం చేసుకుందామనుకున్నారు. అగ్ర వర్ణంలో పుట్టిన అమ్మాయి, దళిత అబ్బాయిని వివాహం చేసుకోవడమేంటని అమ్మ తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పారు. మరోవైపు నాన్న దళితుడనే కారణంగా లిటరేచర్‌లో పి.హెచ్.డి. చేసే అవకాశం రాలేదు. ఒకవేళ నాన్న భయపడి తన గ్రామానికి Ðð ళ్లిపోతే, అక్కడ సైకిల్ రిపేర్ చేసుకుంటూ జీవనం సాగించవలసి వచ్చేది. ఇద్దరూ ధైర్యం చేశారు. బెంగళూరులో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ ఒకే కాలేజీలో పార్ట్ టైమ్ జాబ్ చేయడం ప్రారంభించారు. నాన్నపై ఒత్తిడి తెచ్చారు వివాహం జరిగిన కొన్ని నెలల తరవాత, ఇరు కుటుంబాల వారు అమ్మనాన్నలను చూడటానికి వచ్చారు. నాన్న దళితుడు కావడంతో, తాతయ్య వాళ్లు నాన్నకి గౌరవం ఇవ్వకపోగా, అమ్మని చదివించడానికి అయిన ఖర్చు ఇవ్వమని ఒత్తిడి చేశారు. అమ్మకు ఒక బిడ్డ పుట్టి, రెండవసారి గర్భవతిగా ఉన్న సమయంలో, అమ్మ తోబుట్టువులు వచ్చి, డబ్బు కోసం ఒత్తిడి చేశారు. రెండుకుటుంబాలను పోషించడం కష్టం కావడంతో, ప్రసవించిన ఏడో రోజు నుంచి అమ్మ మమ్మల్ని ఇంట్లోనే ఉంచి ఉద్యోగానికి వెళ్లడం ప్రారంభించింది. నేను పడుకున్న మంచం మీద నల్లులు కూడా ఉన్నాయి. నా పరిస్థితి చూసి అమ్మమ్మ వాళ్లు నన్ను వాళ్లతో తీసుకువెళ్లారు. నేను పుట్టిన రెండు సంవత్సరాలకి, అమ్మనాన్నలు మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. దాంతో మళ్లీ అమ్మ దగ్గరకు వచ్చేశాను. మా ఆర్థిక పరిస్థితితో బాటు, అమ్మ వాళ్లకి మా బాధ్యతలు కూడా పెరిగాయి. అమ్మ వాళ్ల పుట్టింటివారిని, నాన్న వాళ్ల పుట్టింటివారినీ ఇద్దరినీ చూసుకునే బాధ్యత మరింత పెరిగింది. మా నాన్న తాను ఎందుకు డబ్బులు పంపలేకపోయాననే విషయం గురించి చెప్పబోతుంటే, ‘నువ్వు దళితుడివి. నీ మాటలు వినవలసిన అవసరం మాకు లేదు’ అని కఠినంగా మాట్లాడేవారు తాతయ్య. మా అమ్మ తన సోదరులకు, భర్తకు మధ్య నలిగిపోయేది. వారిని వెనకేసుకొస్తే నాన్నకి కోపం వచ్చేది. అమ్మానాన్నకు గొడవలు ఎక్కువైపోయాయి. అమ్మ విడిపోయింది అమ్మ తాను విడిగా ఉండటానికి నిశ్చయించుకుంది. అప్పటికి నా వయసు పది సంవత్సరాలు. నేను, మా అన్నయ్య ఇద్దరం నాన్నతోనే కలిసి ఉన్నాం. రానురాను బంధువుల రాకపోకలు తగ్గిపోయాయి. మా సెలవులన్నీ ఇంటికే పరిమితమైపోయాయి. ఏ పండుగను బంధువులతో జరుపుకునే అవకాశం లేకపోయింది. కేవలం చావుల సమయంలో మాత్రమే బంధువులు వస్తున్నారు. ప్రపంచం చాలా ఇరుకుగా కనిపించింది. మా అమ్మ తన ఒంటరి జీవితాన్ని దుర్భరంగా గడుపుతోంది. మా నాన్న ఎక్కడికైనా వెళ్లినప్పుడు అమ్మ ఇంటికి వచ్చి మమ్మల్ని పలకరించి వెళ్లేది. కొన్ని సంవత్సరాల తరవాత అమ్మనాన్నలు విడాకులు తీసుకున్నారు. వారిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి బంధువులు ప్రయత్నించలేదు. ఇద్దరినీ కలపడానికి ఎవరూ లేకపోవడంతో వారి బంధం కూలిపోయింది. మా అమ్మనాన్నల మధ్యన వచ్చిన గొడవల కారణంగా, మా అమ్మ మా నాన్నను ‘... మనిషి’ అని కులం పేరుతో తిడుతుండేది. మా నాన్న బాధతో, ‘నేను బతికున్నంత కాలం ఈ మాటలు వింటూ ఉండవలసిందే’ అనేవారు. తల్లిదండ్రుల గొడవలు పిల్లల మీద ప్రభావం చూపుతాయి. నా మనసులోని భావాలను ఎవరితోనూ పంచుకోలేకపోయాను. కులం నన్ను కూడా వెంటాడుతూనే ఉంది. నా కులం గురించి చెప్పగానే, అవతలి వారు విధించే నిబంధనలు వినడానికి నేను సిద్ధంగా లేను. దళితులను కులాంతర వివాహం చేసుకుంటే, బంధువుల నుంచి తెగదెంపులు ఎదుర్కోక తప్పడం లేదు. మనలో మతసహనం లోపిస్తోందనడానికి ఇటువంటి ఉదాహరణలు ఎన్నెన్నో. ఏటా జరిగే ఉత్సవాలకు కూడా దళితులను గుడి వెలుపల నుంచి మాత్రమే పూజలు చేసుకోవడానికి అనుమతిస్తున్నారు. గ్రామాలలో ఈ విషయంలో ఇంతవరకు మార్పు రాలేదు. ఇంకా ప్రమాదం ఏమిటంటే.. హింస జరిగినప్పుడు మాత్రమే మతసహనం గురించి ప్రస్తావిస్తున్నారు. మిగతా సమయాల్లో కులరహిత సమాజం వైపుగా చైతన్యం తెచ్చే ప్రయత్నాలను మనమెందుకు చెయ్యం? అనిపిస్తుంది’’ అని ఆ జర్నలిస్టు ఆలోచన రేపారు. ‘పరువు కోసం’ అని రాయకండి గతేడాది నవంబర్ పదహారు తమిళనాడు ప్రజలకి కాళరాత్రిని మిగిల్చింది. ‘గజ’ తుపాను బీభత్సం సృష్టించింది. ఆ తుపానులో కొట్టుకొచ్చిన రెండు మానవ దేహాల ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఒక యువ జంటను చంపేసి, కావేరీ నదిలోకి విసిరేశారు. వారివే ఆ మృతదేహాలు. ఆ అమ్మాయి వెనుకబడిన కుటుంబంలో పుట్టింది. అబ్బాయి దళితకులానికి చెందినవాడు. వారిలో ఈ దళితుడు అణగారిన వర్గానికి చెందినవాడి కింద లెక్క. సంప్రదాయాన్ని మైలపరచినందుకుగాను అమ్మాయి కుటుంబీకులు ఆ జంటను దారుణంగా హత్య చేశారు. దక్షిణ భారతదేశంలో ఇటీవల పరువు కోసం జరిగిన వరుస హత్యలలో ఇది మూడో హత్య. ఇటువంటి హత్యలు జరిగినప్పుడు, జర్నలిస్టులు ఆ ప్రాంతానికి చేరుకుని, ఆయా కుటుంబాల వారిని ప్రశ్నించి, కేసు పూర్వాపరాలు తెలుసుకుంటారు. ప్రతి కేసులోనూ ‘పరువు కోసం యువజంట దారుణ హత్య’ అనే రాస్తారు. నిత్యజీవితంలో కులం గురించి మరచిపోలేమా అనేది పక్కన పెడితే, వీటిపై ప్రత్యేక వార్తా కథనాలు ఇచ్చేటప్పుడు జర్నలిస్టులు ‘పరువు కోసం’ అంటూ తీర్పులు ఇచ్చేయకుండా.. సామాజిక ధోరణులను మలిచేలా సమస్య మూలాల్ని విశ్లేషించాలని ‘స్క్రాల్.ఇన్’లో వ్యాసం రాసిన ఆ పాత్రికేయురాలు కోరుతున్నారు. – జయంతి (‘స్క్రాల్.ఇన్’ ఆధారంగా) -
తల్లి చదివితేనే పిల్లాడికి పెళ్లి..!
2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో కులాంతర వివాహాలు 5.82 శాతం మాత్రమే. అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం గత నలభయ్యేళ్ళుగా కులాంతర వివాహాల శాతం అదేమాదిరిగా కొనసాగడం. భారత దేశ వివాహ వ్యవస్థలో కుటుంబ నిర్ణయాలే ప్రధానం. మనదేశంలో జరుగుతోన్న పెళ్ళిళ్లలో వ్యక్తిగత ఇష్టాయిష్టాలకంటే కుటుంబ నిర్ణయాలకే ప్రాధాన్యత ఎక్కువ. 2011 లెక్కల ప్రకారమే మన దేశంలో 73 శాతం పెళ్ళిళ్ళు పెద్దలు కుదిర్చినవే. వీరిలో అతి కొద్దిమందికి మాత్రమే తాము చేసుకోబోయే వారితో కనీస పరిచయం ఉంటోంది. 63 శాతం మంది పెళ్లి రోజు వరకూ ఒకరినొకరు చూసుకోనివారే ఉన్నారు. అయితే తాజా అధ్యయనం మాత్రం తల్లి చదువు కులాంతర వివాహాలకు ఊతమిస్తోందని తేల్చి చెప్పింది. తల్లి చదువు కులాంతర వివాహాలకు ప్రోత్సాహం... భారత్‌లో కులాంతర వివాహాలను అమితంగా ప్రభావితం చేస్తోన్న అంశం చదువేనని తాజా అధ్యయనం తేల్చి చెప్పింది. అయితే కులాంతర వివాహాల సానుకూలతను సృష్టిస్తోంది పెళ్ళికొడుకు చదువో, పెళ్ళికూతురు చదువో అనుకుంటే పొరబడ్డట్టే. పెళ్ళి కుమారుడి తల్లి విద్యావంతురాలైతే కులాంతర వివాహాలకు కుటుంబాల్లో సానుకూలత ఏర్పడుతున్నట్టు ఢిల్లీకి చెందిన ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ తాజా అధ్యయనం తేల్చి చెప్పింది. 2011-12 ఇండియన్ హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే-2 గణాంకాల ఆధారంగా 2017లో చేసిన ఈ అధ్యయనం మనదేశంలోని కులవ్యవస్థ కు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తెచ్చింది. అందులో వరుడి తల్లి విద్యాస్థితి కులాంతర వివాహాలపై ప్రభావితం చూపుతోందని వెల్లడించింది. అందుకు కారణం కుటుంబ బాధ్యతలు మోస్తోన్న చదువుకున్న తల్లులు కులాల కట్టుబాట్ల విషయంలో మరింత చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నట్టు ఈ అధ్యయన వెల్లడించింది. వరుడి తల్లి విద్యాధికురాలైతే కులాంతర వివాహాల్లో దేశం పదేళ్ళ ముందుంటుందని ఈ సర్వే తేల్చింది. పెళ్ళికొడుకు తల్లి చదువుకున్న కుటుంబాల్లో 1.8 శాతం కులాంతర వివాహాలు జరిగినట్టు వెల్లడయ్యింది. అయితే పెళ్ళి కూతురి తల్లి చదువు కులాంతర వివాహాలను ప్రభావితం చేయడం లేదన్నది గమనార్హం. కుటుంబాల మధ్యనా, దగ్గరి బంధువుల మధ్యనా, సంబంధీకుల మధ్య వివాహాల్లో మన దేశానికీ ఇతర దేశాలకీ పోలిక లేదని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. దీనికి కారణం మనదేశంలో కుటుంబ వ్యవస్థ పునాదులు బలీయమైనవి కావడమేననీ, కుటుంబాల్లో వ్యక్తిగత స్వేచ్ఛకు అంత ప్రాధాన్యత లేకపోవడం కూడా ప్రధాన కారణంగా ఈ సర్వే వెల్లడించింది. సహజంగా పారిశ్రామికీకరణ, విద్యాభివృద్ధీ, పట్టణీకరణ, సామాజిక చైతన్యం వల్ల దగ్గరి సంబంధాల వివాహాలు తగ్గి, కులాంతర, వర్గాంతర వివాహాలు పెరుగుతాయని భావిస్తారు. కానీ వీటన్నింటిలో అభివృద్ధి కనబడుతున్నా 1970 నుంచి 2012 వరకు సుదీర్ఘకాలంలో కులాంతర వివాహాలు మాత్రం పెరగకపోవడాన్ని బట్టి మోడర్నైజేషన్ థియరీ తప్పని తేలింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలకంటే మెట్రోపాలిటన్ సిటీస్‌లో కులాంతర వివాహాలు తక్కువని కూడా స్పష్టమైంది. పెళ్ళి కొడుకు, పెళ్ళికూతురి తరఫు ఆర్థిక స్థోమత సైతం కులాంతర వివాహాలను ప్రభావితం చేయడంలేదు. పైగా ఆర్థిక స్థోమత పెరిగే కొద్దీ కులాంతర వివాహాలు తగ్గుతున్నాయి. దళితుల్లో ఆర్థిక స్థోమత పెరిగే కొద్దీ కులాంతర వివాహాలు పెరుగుతున్నాయి. అగ్రకులాల్లో ఆర్థిక స్థోమత పెరిగే కొద్దీ కులాంతర వివాహాలు తగ్గుతున్నట్టు అధ్యయనం తేల్చి చెప్పింది. -
ఆలోచనలు మారి..అంతరాలు తగ్గి..
సాక్షి, హైదరాబాద్ : ఆలోచనలు మారుతున్నాయి. అంతరాలు తగ్గుతున్నాయి. ఒకప్పుడు పెళ్లికి ప్రధానంగా పరిగణించే కులం ఇప్పుడు పెద్దగా ప్రభావం చూపడంలేదు. సాంకేతిక పరిజ్ఞానం పరుగులు పెడు తున్న ఈ తరుణంలో సామాజికంగా వస్తున్న మార్పులు పెళ్లి సంబంధాలపై ప్రభావాన్ని చూపుతున్నాయి. కులాగోత్రాలు చూసి బంధాలు కలుపుకోవడం కన్నా వృత్తులు, ఆర్థిక అంశాలే ప్రధానమవుతు న్నాయి. మారుతున్న పని విధానంతో ప్రేమ పెళ్లిళ్లు సహజమవుతున్నాయి. దీంతో కులాంతర పెళ్లిళ్ల సం ఖ్య పెరుగుతోంది. గతంలో నూటికొకటి వంతున జరిగే కులాంతర వివాహాలు... ఇప్పుడు 8కి పెరిగాయని ఓ సంస్థ నిర్వహించిన పరిశీలనలో తేలింది. మూడు రెట్లు పెరిగిన వివాహాలు... రాష్ట్రంలో గత పదేళ్ల క్రితం నాటితో పోలిస్తే కులాంతర వివాహాల సంఖ్య మూడు రెట్లు పెరిగినట్లు పెళ్లి సంబంధాలు కుదిర్చే ఓ సంస్థ నిర్వహించిన పరిశీలనలో వెల్లడైంది. ప్రతీ వంద పెళ్లిళ్లలో ఎనిమిది కులాంతర వివాహాలు జరుగుతున్నట్లు ఈ ఏడాది జనవరిలో జరిపిన ఓ పరిశీలనలో గుర్తించారు. ఇందులో పావు వంతు ఒకే సామాజిక వర్గానికి చెందినవే. కులాంతర వివాహాల్లో ఎస్సీ, ఎస్టీల సంఖ్య అధికంగానే ఉంటోంది. గత నాలుగేళ్ల గణాంకాలు పరిశీలిస్తే కులాంతర వివాహాలు చేసుకుంటున్న ఎస్సీల సంఖ్య 2వేల వరకు ఉంది. ఈ గణాంకాలు అధికారికమే అయినప్పటికీ... వీటి సంఖ్య రెట్టింపు ఉంటుందని, ఎస్టీల్లో మాత్రం ఈ సంఖ్య తక్కువగా ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. కేంద్రం నుంచి భారీ ప్రోత్సాహకం... కులాంతర వివాహాలు చేసుకున్న దళిత, గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాన్ని ఇస్తోంది. పెళ్లి చేసుకున్న వారిలో ఒకరు ఎస్సీ లేదా ఎస్టీ అయితే ఆ జంటకు గతంలో రూ.50వేలు ఇచ్చేది. తాజాగా ఈ ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం 2018–19 సంవత్సరం నుంచి రూ.2.5లక్షలకు పెంచింది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాలి. ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలి. మరోవైపు పేదింటిలో ఆడపిల్లల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో కళ్యాణలక్ష్మి పథకాన్ని రాష్ట్రం అమలు చేస్తోంది. ఈ పథకం కింద రూ.1,00,116 ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ పథకం కులాలతో సంబంధం లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారికి కూడా అమలు చేస్తోంది. కులాంతర వివాహాలు చేసుకున్న ఎస్సీ, ఎస్టీలకు మాత్రం ఈ రెండు పథకాలతోనూ లబ్ధి చేకూరనుంది. -
కులాంతర వివాహాల రక్షణకు కొత్త చట్టం
సాక్షి, ముంబై: కులాంతర వివాహాలను ప్రోత్సహించే విధంగా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న దంపతులపై జరుగుతున్న దాడులను, పరువు హత్యలను అరికట్టేందుకు కొత్త చట్టాన్ని రూపకల్పన చేయాలని దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం భావిస్తోంది. దంపతులకు రక్షణ కల్పించి, ప్రోత్సాహకాలు అందించే విధంగా చట్టాన్ని తీసుకొస్తున్నట్లు రాష్ట్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రాజ్‌కుమార్ బడోల్ తెలిపారు. కులాంతర వివాహాలు చేసుకున్న దంపతుల పిల్లలకు రిజర్వేషన్లు, ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం ఎన్నో రాయితీలు కల్పిస్తోందని, ఢిల్లీలోని అంబేడ్కర్ ఫౌండేషన్ 2.5 లక్షల నగదు అందిస్తోందని తెలియజేశారు. మరో రెండు నెలల్లో చట్టం ముసాయిదాను సిద్ధం చేస్తామని కమిటీ చైర్మన్ సీఎస్ తూల్ ప్రకటించారు. దేశంలో కులాంతర వివాహాం చేసుకున్న జంటలపై దాడులు జరగకుండా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సీఎస్ తూల్ అభిప్రాయపడ్డారు. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ ప్రకారం పరువు హత్యల్లో మహారాష్ట్ర, దేశంలో నాలుగో స్థానంలో ఉంది. 2016 లో జరిపిన సర్వేలో మహారాష్ట్రలో 69 కేసులు నమోదు కాగా, ఎనిమిది మందిని పరువు హత్య పేరుతో హతమార్చినట్లు నేషనల్ క్రైమ్ బ్యూరో గుర్తించింది. -
జాతకం కాదు... జన్యుక్రమం చూడండి
- ఒకే కులంలో పెళ్లిచేసుకునేవారి పిల్లలకు కొన్ని రకాల జన్యు వ్యాధులు వచ్చే అవకాశం - సీసీఎంబీ పరిశోధనలో వెల్లడి - కులాంతర వివాహాలు కొంత బెటర్ అంటున్న శాస్త్రవేత్తలు సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు మేనరికం పెళ్లిళ్లు వద్దని చెప్పిన శాస్త్రవేత్తలు.. ఇప్పుడు ఒకే కులంలో పెళ్లిళ్ల విషయంలోనూ జాగ్రత్తలు అవసరమని హెచ్చరిస్తున్నారు. భారత్‌తో పాటు దక్షిణాసియా దేశాల్లోని వేర్వేరు జన సమూహాల్లో అరుదైన కొన్ని జన్యు వ్యాధు లు ఉన్నాయని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలి క్యులర్ బయాలజీ (సీసీఎంబీ) అధ్యయనంలో తేలింది. ఇందుకు ఒకే కులానికి చెందిన వారితో పెళ్లి చేసుకోవడంతో వారి పిల్లలకు ఈ వ్యాధులు వచ్చే అవ కాశం ఉందని స్పష్టం చేసింది. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లోని దాదాపు 2,800 మంది జన్యువులను విశ్లేషించడం ద్వారా ఈ అంచనాకొచ్చినట్లు సీసీఎంబీ శాస్త్రవేత్త కె.తంగరాజ్ మంగళవారం తెలిపారు. పరిశోధన వివరాలు ఇలా ఉన్నాయి.. దక్షిణాసియాలో దాదాపు 5,000 వరకు ప్రత్యేక జనసమూహాలు ఉన్నాయి. వీరిలో చాలామంది కులాంతర వివాహాలు చేసుకోరు. వీరిలో కొన్ని అరుదైన జన్యువ్యాధులు ఉన్నట్లు స్పష్టమైంది. ఉదాహరణకు ఒక సామాజిక వర్గానికి చెందిన వారికి శస్త్రచికిత్సల సమయంలో ఇచ్చే మత్తు మందు పనిచేయదు. కోస్తా ప్రాంతానికి చెందిన ఓ వర్గ ప్రజలకు గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే ఇంకో కులం ప్రజల్లో మోకాళ్ల నొప్పులు (ఆర్థరైటిస్) సమస్యలు ఎక్కువ. అయితే వీటికి కారణాలు తెలుసుకునేందుకు సీసీఎంబీ నేతృత్వంలో పలు అంతర్జాతీయ సంస్థలు ఓ పరిశోధనను చేపట్టాయి. ఇందులో భాగంగా దక్షిణా సియాలోని దాదాపు 275 భిన్న ప్రాంతాలకు చెందిన 2,800 మంది జన్యుక్రమాన్ని విశ్లేషించారు. వీరందరిలో దాదాపు వంద తరాలుగా వారసత్వంగా వస్తున్న ఓ డీఎన్ఏ భాగాలను గుర్తించారు. ఈ డీఎన్ఏ భాగాన్ని ఐడెంటిటీ బై డీసెంట్ అని పిలుస్తారు. వీరిలో దాదాపు 81 వర్గాల ప్రజల్లోని జన్యువులో కొన్ని వ్యాధులకు సంబంధించిన మార్పులను గుర్తించారు. ఇందులో భిన్న కులాల, మతాల, భాషలు మాట్లాడే వారు ఉన్నారు. ఈ మార్పులు ఉన్న వ్యక్తులు ఇద్దరు వివాహం చేసు కుంటే.. వ్యాధికారక జన్యుమార్పులు పిల్లలకూ సంక్రమించే అవకాశం ఉంటుంది. కులాంతర వివాహాలు అతితక్కువ కావడం వల్ల ఈ వ్యాధికారక జన్యుమార్పులు ఒక్క కులానికే పరిమితమైపోయాయి. కులాంతర వివాహాల వల్ల జన్యుమార్పిడిల ప్రభావం కొంత తగ్గే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జన్యుపరీక్షలు కావాలి.. ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టాలంటే పెళ్లి చేసుకోవాలనుకునేవారు జాతకాలకు బదులు జన్యు క్రమాలను పరీక్షించుకోవాలని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా చెప్పారు. యూదులు జన్యు పరీక్షల తర్వాతే పెళ్లి చేసుకుంటారని చెప్పారు. డోర్ యషోరిమ్ అనే వెబ్సైట్ యూదుల జన్యుక్రమాన్ని విశ్లేషించి ఆ సమాచారాన్ని రహస్యంగా ఉంచుతుందని.. వివాహం చేసుకోవాలనుకున్నవారు సంప్రదించినప్పుడు ఇద్దరిలోనూ వ్యాధికారకమార్పులు ఉన్నాయా లేదా అని గుర్తిస్తుందన్నారు. దక్షిణాసియా ప్రాంత ప్రజల కూ ఇలాంటి సౌకర్యం అందు బాటులోకి వస్తే తర్వాతి తరాలు మరింత ఆరోగ్యంగా ఉంటాయని చెప్పారు. -
కులాంతర పెళ్లిళ్ల కోసం సీఎంలందరికీ లేఖలు: కేంద్రమంత్రి
లక్నో: కులాంతర వివాహాలను ప్రోత్సహించడం ద్వారా సమాజం మొత్తం కలిసుండేలా చేయొచ్చని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే అన్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని అన్నారు. ఇటీవల కాలంలో దళితులపై దాడులు పెరుగుతుండటం, కులపరమైన ఘర్షణలు పెరుగుతుండటం నేపథ్యంలో స్పందించిన ఆయన దళితులపై దాడులు తగ్గించేందుకు కులాంతర వివాహాలే పరిష్కారం అన్నారు. ఈ విషయంలో తాను అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తానని చెప్పారు. ఆదివారం ఆయన గుర్గావ్లో మీడియాతో మాట్లాడుతూ దళితులపై నానాటికి దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారం కులాంతర వివాహాలే అని చెప్పారు. 'దళితులపై దాడులు తగ్గించేందుకు కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్లో రూ.25కోట్లు కేటాయించాలని కోరుతున్నాను. అలాగే, ఇంటర్ క్యాస్ట్ మేరేజ్ చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వాలు రూ.5లక్షల ఆర్థిక సహాయంతో అందజేయడంతోపాటు ఆ ఇద్దరిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. దీని ద్వారా కులాల పేరిట పెరుగుతున్న అంతరాలకు బదులు కలిసే ఉంటారు' అని చెప్పారు. దళితులపై దాడులు ఎక్కువగా బిహార్, రాజస్థాన్‌లో జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రెండున్నర లక్షల ఆర్థిక సహాయం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రూ.50 వేల నుంచి రెండు లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తున్నాయి. -
కులాంతర వివాహాల్లో మిజోరం ఫస్ట్
న్యూఢిల్లీ: భారతదేశంలో కులాంతర వివాహాలను అనుమతిస్తూ 50 ఏళ్ల క్రితమే చట్టం తీసుకొచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో కులాంతర వివాహాలు జరగడం లేదు. దేశవ్యాప్తంగా 95 శాతం మంది ఇప్పుటికీ అదే కులం వారిని పెళ్లి చేసుకుంటున్నారు. ఆశ్చర్యంగా 87శాతం మంది క్రైస్తవులుగల మిజోరంలో 55 శాతం మంది కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు. ఆ తర్వాత మేఘాలయలో 46 శాతం, సిక్కింలో 37 శాతం మంది కులాంతర వివాహాలను చేసుకుంటున్నారు. ఆ తర్వాత కాశ్మీర్లో 35 శాతం మంది, గుజరాత్లో 13 శాతం మంది కులాంతర వివాహాలను చేసుకుంటున్నారు. ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందిన వారు కులాంతర వివాహాలు ఎక్కువగా చేసుకుంటారంటూ ఇంతకాలం మనం భావిస్తున్న దృక్పథం తప్పని ఈ గణాంకాలతో స్పష్టమవుతోంది. వివిధ సర్వేలు వెల్లడించిన ఈ గణాంకాలను మేరీలాండ్ యూనివర్శిటీ క్రోడీకరించి ఈ అంశాలను తెలియజేసింది. ఒకే కులం మధ్య జరుగుతున్న పెళ్లిళ్లలో దేశంలోనే మధ్య ప్రదేశ్ ముందుంది. ఆ రాష్ట్రంలో 99 శాతం మంది అదే కులం వారిని పెళ్లి చేసుకుంటున్నారు. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లో, చత్తీస్‌గఢ్, గోవా రాష్ట్రాల్లో 98 శాతం మంది, పంజాబ్‌లో 97 శాతం మంది అదే కులస్థులను పెళ్లి చేసుకుంటున్నారు. కులాంతర వివాహాలను అనుమతిస్తూ దేశంలో చట్టం తీసుకొచ్చినప్పుడు ఒకే కులం మధ్య పెళ్లిళ్లు 98 శాతం ఉండగా, ఇప్పుడది 95 శాతానికి పడిపోయింది. కులాంతర వివాహాలు వేగం పుంజుకోనప్పటికీ కొత్త పురోగతి మాత్రం ఉందని సామాజిక శాస్త్రవేత్తలు అంటున్నారు. -
దాంపత్య బంధానికి బలం
లక్షలకు లక్షలు కట్నాలు ఇచ్చి పెళ్లి చేస్తే నెలైనా గడవక ముందే వేధింపులు మొదలవుతాయి... గొప్ప ఇంటి సంబంధమని అమెరికా అబ్బాయికి అమ్మాయినిస్తే అక్కడ అవమానాలు, హింసలూ ఎదురవుతాయి. వందల ఇళ్లల్లో ఈ సమస్యలు ఉంటే బయటకు వచ్చేవి మాత్రం కొన్నే. మిగతా చోట్ల ఆడబిడ్డలు కన్నీళ్లను దిగమింగుకుని బతికేస్తున్నారు. ఇలాంటి సమస్యలకు చట్టబద్ధంగా పరిష్కార మార్గం వెతకాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరని నిపుణులు అంటున్నారు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకునే వారు ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌ను కూడా పూర్తి చేసుకుంటే భవిష్యత్‌లో ఎన్నో సమస్యలకు ఇది సమాధానం చెబుతుందని వారంటున్నారు. గొడవల్లోనే కాదు... విదేశీ ప్రయాణాలకు, సంక్షేమ పథకాలకు కూడా ఇది ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు. - సంతకవిటి * వివాహ రిజిస్ట్రేషన్లతో ప్రయోజనాలెన్నో * రిజిస్ట్రేషన్‌పై అవగాహన తప్పనిసరి మూడుముళ్లు వేసిన తర్వాత భార్యాభర్తలు ఒక్కటైపోవడం, మంత్రాల సాక్షిగా ఒక్కటి గా బతకడం భారతీయ వివాహ వ్యవస్థ గొప్పదనం. అయితే ఆ బంధాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే భవిష్యత్ అవసరాలకు పనికొస్తుందని పెద్దలంటున్నారు. 2002 చట్టం ప్రకారం ప్రభుత్వం వివాహాన్ని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలనే నిబంధనను తీసుకొచ్చింది. కానీ దీన్ని చాలా మంది పట్టించుకోవడం లేదు. రిజిస్ట్రేసన్ ఎందుకు చేయించుకోవాలనే విషయం కూడా చాలా మందికి తెలీదంటే అతిశయోక్తి కాదు. వివాహాన్ని ఎలా రిజిష్టర్ చేసుకోవాలి? ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి? దీని వల్ల ప్రయోజనం ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. గృహహింసతో పాటు వరకట్న వేధింపులు, చిన్నచిన్న కారణాలుతో విడిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అనంతరం వీరితో పాటు వీరి పిల్లల భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుంది. ప్రేమ వివాహాలు, పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న వారి ఇళ్లలో ఈ సమస్య ఎక్కువ. ఇలాంటి పరిస్తితుల్లో వివాహ రిజిస్ట్రేషన్ అనేది ఒక ఆయుధంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వలన ఎన్నో సమస్యలకు పుల్‌స్టాప్ పెట్టవచ్చు. * విదేశాల్లో ఉన్నవారు ఇక్కడ అమ్మాయిని, అబ్బాయిని వివాహం చేసుకున్న తర్వాత తమ తో పాటు ఆ వ్యక్తిని కూడా తీసుకెళ్లాలంటే ఆ పెళ్లికి సంబంధించిన రిజిస్ట్రేషన్ తప్పనిసరి. * ప్రస్తుతం రాష్ట్రంలో పలు పథకాలు అమలవుతున్నాయి. ఈ పథకాలకు సంబందించి అర్హతలుగా భార్య భర్తలకు సంబంధించి వివాహ రిజి స్ట్రేషన్ ద్రువీకరణ పత్రాలు ప్రభుత్వం తప్పనిసరిచేసింది. * వికలాంగులు-సకలాంగులు స్కీం, ఇంటర్ కేస్ట్ వివాహాలకుసంబంధించి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందాలంటే వివాహాలు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. * జిల్లాలో ఎన్నో వివాహాలు జరుగుతున్నా వాటిలో నమోదు కానివే ఎక్కువగా ఉన్నాయి. ప్రేమ వివాహాలు ఏవో గుడులు, గోపురాల వద్ద జరుగుతుండగా, పెద్దలు కుదిర్చిన వివాహాలు ఇళ్ల వద్ద జరుగుతున్నా రిజిస్ట్రేషన్లు మాత్రం ఉం డడంలేదు. ఇవి తప్పనిసరిగా రిజిస్టర్ కావాలి. * 2002 వివాహ చట్టం ప్రకారం ప్రతి కల్యా ణ మండపాల్లో వివాహం జరిగితే అక్కడ కల్యాణ మండపం నిర్వాహకులు సమక్షంలోనే రిజిస్ట్రేషన్లు చేయించాలి. * ముందుగా అందుకు సంబంధించిన వివా హ రిజిస్ట్రేషన్ దరఖాస్తును వధువు, వరుడు చూపించాలి. వీరు అలా చేయకుంటే వివాహాలు ఈ కల్యాణ మండపాల్లో చేయించుకునేందుకు అవకాశం లేదు. * అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి నోటీసులు అందకపోవడంతో రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. భిన్నమతస్తుల వివాహానికి ఒక్క రోజులో ధ్రువీకరణ పత్రం హిందూ సంప్రదాయం ప్రకారం భారత ప్రభుత్వం కూడా వివాహాలు రిజిస్ట్రేషన్‌ను వేగవంతం చేసేందుకు పలు సూచనలు, సలహాల ను రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అందిస్తుంది. ఐతే రెండు భిన్న మతస్తులు వారు వివాహాలు చేయించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఒక్క రోజులోనే రిజిష్టర్ కార్యాలయం వద్ద ద్రువీకరణ పత్రాలును అందిస్తుంది. న్యాయస్థానం ఏం చెబుతోంది..? 1872లో ఉన్న పాత వివాహ చట్టాన్ని మార్పు చేసి 1964లో నూతన వివాహ చట్టాన్ని ప్రభుత్వం అమలుచేస్తుంది. 1969లో ఈ చట్టాన్ని మళ్లీ సవరణ చేసి జనన, మరణాలతో పాటు వివాహాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయించాలని ప్రభుత్వం చట్టం చేసింది. ఈ నేపథ్యంలో 2006లో సుప్రీంకోర్టు కూడా మార్గదర్శకాలను విడుదల చేసింది. సరైన మార్గదర్శకాలు, అవగాహన లేకపోవడంతో 99 శాతం మేర వివాహాలు రిజిస్ట్రేషన్ కావడంలేదు. దరఖాస్తు చేసుకోవాలి..? వివాహాలు చేసుకున్న వారు రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం. పదో తరగతి దాటి చదువుకున్న వారు తమ పదోతరగతి మార్కుల జాబితాను, నివాస స్థలానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, రేషన్, ఆధార్ కార్డుల జిరాక్సులతో పాటు పెళ్లిలో తాళి కట్టిన ఫొటోలు, కుటుంబ పెద్దలు లేదా వివాహ పెద్దలతో కూడిన ఫొటోలుతో రిజిస్ట్రేషన్ కార్యాల యానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. అక్కడ వా రు పరిశీలనల అనంతరం రిజిస్ట్రేషన్ చేస్తారు. ఉపయోగాలు ఇవే... * రిజిస్ట్రేషన్‌తో ఆ వివాహానికి చట్టబద్ధత ఏర్పడుతుంది. * వరుడు కంటే వధువుకు ఎక్కువ ఉపయోగం, సెక్యూరిటీ ఉంటుది. * ప్రభుత్వం ప్రోత్సాహక పథకాలకు, ఇతర కుటుంబ లబ్ధి పథకాలకు ఉపయోగపడుతుంది. * విదేశాలకు వెళ్లేందుకు ఉపయోగపడుతుంది. * రెండో వివాహాన్ని అడ్డుకుంటుంది. * అమ్మాయిలను మోసగించేందుకు వీలు లేకుండా చేస్తుంది.