భారతీయ సమాజంలో ఇప్పుడు కుల, మతాలకు అతీతంగా విందులూ, వినోదాల్లో పాల్గొనడం కొంతమేర పెరిగింది. అయినా వివాహ బంధాలతో కులాన్నీ, మతాన్నీ చెరిపి వేయలేకపోతున్నారు. ఇటువంటి వారందరిపైనా హిందూ పురాణాలు, ఇతిహాసాల ప్రభావం ఎక్కువ.
అయితే ఈ గ్రంథాల్లోనే అనేకమంది రుషులు కులాంతర, జాత్యంతర వివాహాలు చేసుకున్నట్లు ఉన్నా... నిజ జీవితంలో మాత్రం కులాంతర వివాహాలకు అంగీకరించకపోవడం విడ్డూరం. పైగా కృష్ణుడు వంటి దేవుళ్లను చూపించి... దేవుళ్లకే కులం బాధ తప్పలేదు మనమెంత అని తప్పించుకుంటూ ఉంటారు. ఇది అన్యాయం. నిజానికి కులాంతర వివాహాలు అత్యంత శాస్త్రీయమైనవని శాస్త్రజ్ఞులు అంటున్నారు.
దేశంలో కుల దురంహంకార జాడ్యం ప్రమాదకర సమస్యగా మారిందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రేమ వివాహాల విషయంలో విపరీతమైన వధ జరుగుతోంది. డా‘‘ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగంలో రూపొందించిన కుల నిర్మూలనా భావన ఆధిపత్య కులాలకు అర్థం కావడం లేదని చంద్ర చూడ్ ఆవేదన చెందారు. పవిత్ర హత్యల వెనక మతోన్మాద, కులో న్మాద భావనలున్నాయి. కులం... వర్ణ వ్యవస్థ నుండి జనించింది. వర్ణాలను కొందరు ఆధిపత్యం కోసం సృష్టించారు. తమ పిల్లలు అణగారిన వర్గాల నుండి వచ్చిన వారిని ప్రేమ వివాహాలు చేసుకోవడాన్ని వీళ్ళు తట్టుకోలేక పోతున్నారు.
వర్ణాన్ని బట్టి కులాన్నో, జాతినో నిర్ణయించడం అశాస్త్రీయమైన విషయం. కుల వ్యవస్థ మీద అత్యంత పరిశోధనలు చేసిన జె.హెచ్. హట్టన్ ‘ది క్యాస్ట్ ఇన్ ఇండియా’లో క్యాస్ట్ గురించి ఈ విధంగా అన్నారు. ‘‘క్యాస్ట్ అను మాట, ‘కాస్ట’ అను పోర్చుగీసు శబ్దము నుండి వచ్చింది. ‘కాస్ట’ అను శబ్దము ‘చాలు’, ‘జాతి’, ‘రకము’ అను పదముల అర్థమును తెలుపును. ఆ భాషలో ‘హోమెండీ బోయ కాస్ట’ అను పద సమూహమునకు ‘మంచి కుటుంబములోని మనిషి’ లేక ‘కులీనుడు’ అని అర్థము’’.
1563లో గార్సియాడి ఓర్టా ‘‘తన తండ్రి నుండి ఎవడూ మారడు, చెప్పులు కుట్టు కులం వారంతా ఒకటే’’ అని రాసిన నాటి నుండి ఈ ‘కాస్ట’ మాటను మనమిప్పుడు గ్రహించిన పరిమితమైన ‘‘కులం (క్యాస్టు)’’ అర్థములో వాడుతున్నట్టు కనిపిస్తున్నది. కులాన్ని నిచ్చెనమెట్ల సమాజంగా రూపొందించారని అంబేడ్కర్ తన ‘కుల నిర్మూలన’ గ్రంథంలో పేర్కొన్నారు. ఒక కులం అబ్బాయి మరొక కులం అమ్మాయిని చేసుకోవటం సామాన్యమైన విషయం. లేని కులం కోసం ఉన్న బిడ్డల్ని చంపుకోవటం అమానుషమైన విషయం.
అందుకే అంబేడ్కర్ ఇలా అన్నారు... ‘ఇండియాలో వివిధ కులాల మధ్య వర్ణాంతర వివాహాల ద్వారా జాతి మిశ్రణ, రక్త సమ్మేళన జరగనిస్తే వచ్చిన హాని ఏమున్నది? మృగాలకు, మనుష్యులకు మధ్య అనంతమైన భేదం ఉన్నది గనుక మృగాలు, మనుష్యులు రెండు భిన్న రకాల జాతులు సంతతకి చెంది ఉన్నట్లు విజ్ఞానశాస్త్రం అంగీకరించింది.
జాతుల స్వచ్ఛతలో నమ్మకం ఉన్న శాస్త్రజ్ఞులు కూడ మనుషుల్లోని వివిధ జాతులు భిన్న రకాల జాతుల సంతతి అని అనడం లేదు. ‘‘వారంతా ఒకే సంతతికి చెందిన పలు జాతులు. సర్వజాతుల మానవులూ ఏక జీవాల సృష్టే కనుక ఆయా జాతుల మధ్య అంతః సంయోగం వల్ల కలిగే సంతానం మానవులదే కానీ గొడ్డుది కాజాలదు.’’
కులాంతర వివాహాలపై ద్వేషం పెరగడానికి కారణం మత మౌఢ్యం, కులతత్వం అని అంబేడ్కర్ ఈ విధంగా చెప్పాడు.. ‘మొత్తం భరత ఖండం అంతటా హిందువుల జీవిత విధానాన్ని చూస్తే వారి ఆచార వ్యవహారాలలో, ఆలోచనలో ఒక విధమైన పోలిక ఉంది కాబట్టి, ఈ ఏకత్వానికిది తార్కాణమని వాదిస్తారు. పోలికలున్న మాట నిజమే అయితే తత్కారణంగా హిందువులు ఒక సమాజంగా ఏర్పడి ఉన్నారని చెప్పే వాదాన్ని ఎవ్వరూ అంగీకరించరు. అలా అంగీకరించడం అంటే సమాజ నిర్మాణ ప్రాతిపదికల్ని అపార్థం చేసుకోవడమే. మానవులు భౌతికంగా దగ్గర దగ్గరగా నివసిస్తున్నంత మాత్రాన వారు ఒక సమాజంగా ఉన్నట్టు కాదు.
మరొక విషయం ఏమిటంటే మానవులు ఒక సమాజంగా నిర్మాణం కావాలంటే ఆచార వ్యవహారాలలోను, సంప్రదాయాలలోను, విశ్వాసాలలోను, ఆలోచన లోను పోలికవుంటే చాలదు. ఏ వస్తువైనా ఇటుకల వలె భౌతికంగా ఒకరి చేతుల నుంచి మరొకరి చేతులలోకి పోవచ్చు. ఒక వర్గానికి చెందిన ఆచారాలు, సంప్రదాయాలు, నమ్మకాలు, భావాలు మరొక వర్గం వారిచే స్వీకరించబడవచ్చు. అప్పుడా రెండు వర్గాల మధ్య పోలిక కన్పించవచ్చు. సంస్కృతి అనేది ఎల్లప్పుడూ వికసిస్తూ విస్తరి స్తూనే ఉంటుంది.’’
కులాంతర వివాహాలది శాస్త్రీయ బంధమే అని మానవ పరిణామ శాస్త్రవాదులు నిరూపించారు. ఇప్పుడైతే జాత్యంతర వివాహాలు కూడా ముమ్మరంగానే జరుగుతున్నాయి. వాటిని అంగీకరిస్తున్నారు. కులాంతర వివాహాల్లోనూ అస్పృశ్యులుగా చెప్పబడుతున్న దళితుల వివాహాలనే ఎక్కువగా వ్యతిరేకిస్తున్నారు. కారణం వారి మనసుల్లో పేరుకు పోయిన దళిత వ్యతిరేక భావన. రిజర్వేషన్‌ల వల్ల విద్యావంతులు అవుతున్నారనే ద్వేషం కూడా ఉంది. నిజానికి దళితులు చేసుకునే వివాహాలన్నీ సక్సెస్ అవుతున్నాయి.
కారణం వారిలో ప్రేమ, అభిమానం, ఆత్మీయత, అనురాగం, రక్షణ వంటి అంశాలు మిక్కుటముగా ఉండటమే. దళిత విద్యావంతులకు సామాన్యంగా కుల భేదాలు ఉండవు. వారు ప్రేమ వివాహాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే పగ, ద్వేషం, క్రౌర్యం, హింస, అవమానం, నిరాకరణ అమ్మాయి తల్లిదండ్రుల నుంచి వారికి ఎదురవుతున్నాయి.
నిజానికి ప్రేమ వివాహాల్లో కట్నాలు ఉండవు. నిరాకరణ ఉండదు. యువతి యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది ఒక శాస్త్రీయమైన భావన. వీరు ఎవరి గ్రంథాలు అయితే చదివి ఈ కుల వర్ణ ద్వేష భావాలు పెంచుకున్నారో ఆ రుషులంతా కులాంతర వివాహాలు చేసుకున్నారు.
హిందువుల సాహిత్యం నిండా కులాల చరిత్రను గురించి రాసి ఉంటుంది. అందులో ఒక కులాన్ని ఉత్తమ జన్మగాను, మరొక కులాన్ని నీచ జన్మగాను చిత్రించే యత్నం జరిగినట్టు కన్పిస్తున్నది. ఈ రకమైన సాహిత్యంలో ‘సహ్యాద్రి ఖండం’ అనేది పేరు పొందిన గ్రంథం. కులం అనేది ఒక సంస్కృతి కాదు, ఒక మతం కాదు, అది ఒక నమ్మకం. బాబాలు, యోగులు, స్వాములు, గురువులు వివిధ కులాల నుండి వచ్చి ఎలా బోధ చేయగలుగుతున్నారు. ఇదివరకు కొందరికి పరిమితమైన ఈ వేదాంత బోధ అందరికీ ఎలా సాధ్యమైంది.
అలాగే వివాహం కూడా ఏ కులం వారైనా ఇంకొక కులం వారిని చేసు కోవచ్చు. మంచి సంతానం కనవచ్చు. ఈ కులాన్ని పోషించడానికీ హిందూమతం తన శక్తిని రంగరించి పోసింది. కరుణరసానికి పెట్టింది పేరైన రామాయణంలో శంబూకుడు ఈ కులం ముద్రతోనే చంపబడ్డాడు. ఇకపోతే భారతంలో ద్రోణుడు ఏకలవ్యుని విద్యా సంపత్తిని కులం పేరుతో అనర్హుడుగా ప్రకటించి దోచుకున్నాడు. కాని ధర్మశాస్త్రం ప్రకారం ద్రోణుడు ఉత్తమ బ్రాహ్మణుడై కూడా తన విద్యను పొట్ట కూటికి అమ్ముకున్నాడు. కులగోత్రాలు లేని పాండవులకు విద్య చెప్పడంలో లేని ధర్మ ప్రసక్తి ఏకలవ్యునికి విద్య చెప్పడంలో ఎందుకు వచ్చిందో అర్థం కాదు.
అయితే ఈ పురాణాలు బహుముఖాలుగా ప్రచారమై, పురాణ పురుషులకే, కులధర్మం తప్పలేదు, మనమెంత? అనే భావానికి సమాజాన్ని తీసుకొచ్చాయి. గీతను ప్రవచించి కులాన్ని మానవ ధర్మంగా నిర్దేశించిన కృష్ణుడు కులం పేరుతో రాజసూయయాగంలో శిశుపాలుని చేత నిలవేయబడ్డాడు. హరిశ్చంద్రుడు కులం కోసం రాజ్యాన్ని, భార్యని, కుమారుని చివరకు తన్నుతాను అమ్ముకున్నాడు. అయితే ఇవన్నీ పురాణ గాథలే.
ఇవన్నీ సత్యాలు కావు. కాని భారతీయ హృదయ పేటికల మీద ముద్రవేయబడ్డ వాళ్ళు వీళ్ళే కదా! నిజానికి కులాంతర వివాహమే శాస్త్రీయ బంధం. కులం పెళ్లిలో అశాస్త్రీయత ఎక్కువ వుంది. పిల్లలు సరిగా పుట్టరు. మేధలో కూడా తేడా వస్తుంది. జీన్స్ మారితేనే శాస్త్రీయ బంధం రూపొందుతుంది. ఇప్పుడు యువత ఎక్కువ మంది కులాంతర సంస్కృతి జీవనం వైపు, బంధం వైపు నడవడం భారత రాజ్యాంగబద్ధ జీవన విధానానికి ఆయువు పోసినట్టే. భారత రాజ్యాంగ ఆచరణే జీవన సాఫల్యం. చరిత్రతో నడవడం కాదు, చరిత్రను మారుద్దాం. (చదవండి: అంబేడ్కర్ చూపుతోనే సోషలిజం!)
- డాక్టర్ త్తి పద్మారావు
దళిత ఉద్యమ నేత
Comments
Please login to add a commentAdd a comment